మంత్రిమండలి
azadi ka amrit mahotsav

మార్కెట్ ఆధారిత పట్టణ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ నిధికి కేబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 14 FEB 2026 1:09PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ లక్ష కోట్ల రూపాయల కేంద్ర సహాయం (సీఏ) తో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ను ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతాన్ని సీఏ కవర్ చేస్తుంది. మార్కెట్ ద్వారా కనీసం 50 శాతం ప్రాజెక్టు వ్యయం సేకరించనున్నారు. ఇది వచ్చే ఐదు సంవత్సరాల్లో పట్టణాభివృద్ధి రంగంలో మొత్తం రూ. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు వీలు కల్పిస్తుంది. గ్రాంట్ ఆధారిత ఫైనాన్సింగ్ నుంచి మార్కెట్-అనుసంధానిత, సంస్కరణ-ఆధారిత, ఫలితాల-ఆధారిత మౌలిక సదుపాయాల కల్పన వరకు భారత పట్టణాభివృద్ధి విధానంలోని నమూనా మార్పును ఇది సూచిస్తుంది.

మార్కెట్ ఫైనాన్స్, ప్రైవేట్ భాగస్వామ్యం, పౌర కేంద్రీకృత సంస్కరణలను ఉపయోగించి అధిక-నాణ్యత గల పట్టణ మౌలిక సదుపాయాలను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అందిస్తుంది. సమర్థంగా, ఉత్పాదకంగా, సమ్మిళితంగా, వాతావరణ ప్రభావాలను తట్టుకునేలా ఉండే నగరాలను నిర్మించడం... దేశ ఆర్థిక వృద్ధి తదుపరి దశకు కీలక చోదక శక్తిగా ఆ నగరాలను నిలపడం ఈ నిధి లక్ష్యం.

ఈ నిధి 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. అమలు వ్యవధిని 2033–34 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించవచ్చు. నగరాలను వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, నగరాల సృజనాత్మక పునరాభివృద్ధి, నీరు-పారిశుధ్యానికి సంబంధించిన ప్రతిపాదనలను అమలు చేయడానికి 2025–26 బడ్జెట్‌లో ప్రకటించిన ప్రభుత్వ దార్శనికతపై ఇది ప్రభావం చూపుతుంది.

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ముఖ్య లక్షణాలు:

           i.        ప్రాజెక్టు ఫైనాన్సింగ్‌లో కనీసం 50 శాతం మున్సిపల్ బాండ్లు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు (పీపీపీలు) సహా మార్కెట్ వనరుల ద్వారా సమీకరించాలి. మిగిలిన వాటాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు), పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీలు), ఇతర వనరులు అందించవచ్చు.

          ii.        అధిక ప్రభావం చూపే, సంస్కరణ-ఆధారిత ప్రతిపాదనలకు మద్దతును నిర్ధారిస్తూ... పారదర్శకమైన, పోటీతత్వ సవాలు విధానం ద్వారా ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు.

         iii.        పట్టణ పాలన, మార్కెట్-ఆర్థిక వ్యవస్థలు, కార్యాచరణ సామర్థ్యం, పట్టణ ప్రణాళిక అంతటా సంస్కరణలకు బలమైన ప్రాధాన్యం ఉంటుంది.

        iv.        నిర్మాణాత్మక రిస్క్-షేరింగ్ విధాన ప్రణాళికలు, సేవల పంపిణీ ప్రమాణాలను నిర్దేశించడం ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

         v.        రూ. 5,000 కోట్ల ప్రత్యేక కార్పస్ ... టయర్-II, టయర్-III నగరాలతో సహా 4223 నగరాల క్రెడిట్ యోగ్యతను పెంచుతుంది. ముఖ్యంగా మొదటిసారి మార్కెట్ ఫైనాన్స్‌ను పొందే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

        vi.        యూఎల్‌బీలను బ్యాంకింగ్ చేయగల ఆస్తి తరగతిగా నిలుపుతుంది.

చిన్న నగరాల కోసం క్రెడిట్ రీపేమెంట్ హామీ:  

ఈశాన్య ప్రాంతం, కొండ ప్రాంతాల్లోని అన్ని నగరాలు, యూఎల్‌బీలు... ఇతర రాష్ట్రాలు, యూటీల్లోని చిన్న యూఎల్‌బీలకు (1,00,000 లోపు జనాభా గలవి) మొదటిసారి మార్కెట్ ఫైనాన్స్‌ను సులభతరం చేయడం కోసం రూ. 5,000 కోట్ల క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ పథకాన్నీ ఆమోదించారు. ఈ పథకం మొదటిసారి రుణాలకు రూ.7 కోట్ల వరకు లేదా రుణ మొత్తంలో 70 శాతం వరకు (ఏది తక్కువైతే అది) రుణాలకు కేంద్రం హామీనిస్తుంది. మొదటి రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లించిన తర్వాత రూ. 7 కోట్లు లేదా రుణ మొత్తంలో 50 శాతం (ఏది తక్కువైతే అది) రుణానికి కేంద్రం హామీ ఉంటుంది. ఇది చిన్న నగరాల్లో మొదటిసారి కనీసం రూ. 20 కోట్ల ప్రాజెక్టులకు, తదుపరి రూ.28 కోట్ల వరకు విలువ గల ప్రాజెక్టులకు సమర్థంగా మద్దతునిస్తుంది.

సవాలు ఆధారిత ప్రాజెక్ట్ ఎంపిక:

ఈ నిధి కింద ప్రాజెక్టులను పరివర్తనాత్మక ప్రభావం, సుస్థిరత, సంస్కరణల ధోరణి సహా సవాలు-ఆధారిత విధానం ద్వారా ఎంపిక చేస్తారు. సంస్కరణలు, సాధించిన విజయాలు, సుస్ఫష్ట ఫలితాలతో నిధులను అనుసంధానిస్తారు. సంస్కరణల కొనసాగింపు మరిన్ని నిధుల విడుదలకు ముందస్తు అవసరం. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ పోర్టల్ ద్వారా ప్రాజెక్టులు, సంస్కరణల కాగిత రహిత పర్యవేక్షణ సులభతరం అవుతుంది.

ప్రాజెక్ట్ వర్టికల్స్:

నగరాలను వృద్ధి కేంద్రాలుగా అబివృద్ధి చేయడం, నగర ప్రాంతాల గుర్తింపు, ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలు, గ్రీన్‌ఫీల్డ్, సెమీ-గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధితో సహా సమీకృత ప్రాదేశిక ఆర్థిక-రవాణా ప్రణాళిక, ఆర్థిక-రవాణా కారిడార్‌ల వెంబడి అభివృద్ధి, పట్టణ రవాణా వ్యవస్థ, ఆర్థిక పోటీతత్వాన్ని పెంచడానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుగా ఉంటాయి.

కేంద్రీయ వ్యాపార జిల్లాలు, వారసత్వ కేంద్రాల పునరుద్ధరణ, బ్రౌన్‌ఫీల్డ్ పునరుద్ధరణ, రవాణా ఆధారిత అభివృద్ధి, వారసత్వ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, వాతావరణ విపత్తులను తట్టుకోగల సామర్థ్యం, విపత్తు నష్టాన్ని తగ్గించడం, ఈశాన్య, కొండ ప్రాంతాల్లో ఉన్న నగరాల్లో రద్దీని తగ్గించడానికి ప్రాంతీయ ప్రణాళికా కేంద్రాలను కవర్ చేస్తూ నగరాలను సృజనాత్మకంగా పునరాభివృద్ధి చేయడం.

నీరు, పారిశుధ్యం, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, తుఫాను నీటి వ్యవస్థల అప్‌గ్రేడ్, రూర్బన్ మౌలిక సదుపాయాలు, వాటర్ గ్రిడ్‌లు, ఇంటిగ్రేటెడ్ ఘన వ్యర్థాల నిర్వహణ, వారసత్వ వ్యర్థాల నివారణ సహా స్వచ్ఛతపై దృష్టి సారించడం.

కవరేజ్:

ఈ నిధి వీటిని కవర్ చేస్తుంది:

  • 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని నగరాలు (2025 అంచనాల ప్రకారం)
  • పైన కవర్ చేయని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
  • 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రధాన పారిశ్రామిక నగరాలు.

అదనంగా, కొండ ప్రాంతాలు గల రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని యూఎల్‌బీలు, 1 లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన చిన్న యూఎల్‌బీలు ఈ క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ పథకం కింద మద్దతు పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. సూత్రప్రాయంగా అన్ని నగరాలు యూసీఎఫ్ కిందకు వస్తాయి.

సంస్కరణ-అనుసంధాన నిధుల విధాన ప్రణాళిక:

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధుల కేటాయింపు సమగ్ర సంస్కరణల ఎజెండాకు అనుసంధానమై ఉంటుంది, ఇది వీటిని కవర్ చేస్తుంది:

  • పాలన, డిజిటల్ సంస్కరణలు
  • క్రెడిట్ యోగ్యత బలోపేతం కోసం మార్కెట్, ఆర్థిక సంస్కరణలు
  • మెరుగైన సేవల పంపిణీ, వినియోగ సామర్థ్యం కోసం కార్యాచరణ సంస్కరణలు
  • రవాణా ఆధారిత అభివృద్ధి, హరిత మౌలిక సదుపాయాలు సహా పట్టణ ప్రణాళిక, ప్రాదేశిక సంస్కరణలు
  • సునిర్వచిత కీలక పనితీరు సూచికలు (కేపీఐలు), తృతీయ పక్ష ధ్రువీకరణ, సుస్థిరమైన కార్యాచరణ, నిర్వహణ విధానాలతో ప్రాజెక్ట్-నిర్దిష్ట సంస్కరణలు.

ఫలితాల ఆధారితం:

           i.        ఆదాయ సమీకరణ, ప్రైవేట్ పెట్టుబడి, ఉపాధి కల్పన, మెరుగైన భద్రత, సమ్మిళితత్వం, సేవా సమానత్వం, పరిశుభ్రత సహా ఆర్థిక, సామాజిక, వాతావరణ రంగాల్లో పరివర్తనాత్మక ఫలితాలను అందించగల సామర్థ్యం ఆధారంగా ప్రాజెక్టులను మూల్యాంకనం చేస్తారు.

          ii.        పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, పట్టణ పాలనను బలోపేతం చేయడం, జాతీయాభివృద్ధి ప్రాధాన్యాలకు అనుగుణంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరాలను అభివృద్ధి చేయుటను ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2228214) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam