సహకార మంత్రిత్వ శాఖ
సహకార ఆధారిత ట్యాక్సీ సేవ ‘భారత్ ట్యాక్సీ’ను అధికారికంగా ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అసంఘటిత రంగంలో పనిచేసేవారికి యాజమాన్య హక్కులు అందించే విధానాన్ని అభివృద్ధి చేసిన సహకార మంత్రిత్వ శాఖ
‘భారత్ ట్యాక్సీ’ ద్వారా ట్యాక్సీ రంగంలోకి ప్రవేశిస్తోంది సహకార విధానమే, ప్రభుత్వం కాదు
ప్రపంచంలోనే ప్రత్యేకమైన సహకారాత్మక సంస్థ ‘భారత్ ట్యాక్సీ’: ఇక్కడ సారథే ట్యాక్సీకి యజమాని
పెద్ద సంస్థల మాదిరిగా కమిషన్లు కత్తిరించి మూలధనం పెంచుకోవడం కాకుండా.. సారథుల ఆదాయాన్ని పెంపొదించడం, వారి లాభానికి వారిని యజమానులను చేయడమే లక్ష్యం
గతంలో ఇతరుల కోసం ట్యాక్సీ చక్రం తిరిగేది, ఇప్పడు ‘భారత్ ట్యాక్సీ’ మిమ్మల్నేయజమానిగా చేసి ఆదాయాన్నిస్తుంది
మహిళలకు గౌరవాన్ని, సారథీ దీదీలకు స్వావలంబనను అందించేందుకు ‘సారథీ దీదీ’ వసతిని భారత్ ట్యాక్సీ అందిస్తుంది
వచ్చే మూడేళ్లలో దేశమంతా అందుబాటులోకి రానున్న‘భారత్ ట్యాక్సీ’
యాజమాన్యం, భద్రతా కవరేజి, గౌరవం, లాభాల్లో సమాన వాటా అనే నాలుగు ప్రధాన సూత్రాలపై ‘భారత్ ట్యాక్సీ’ పని చేస్తుంది
‘భారత్ ట్యాక్సీ’ రాకతో అనేక పెద్ద సంస్థలు తమ కమిషన్లను తగ్గించడం మొదలుపెట్టాయి, డ్రైవర్లు, ప్రయాణికులకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి
ఉచిత చికిత్స కోసం రూ. 5లక్షల బీమా, తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీలు, గిగ్ వర్కర్లకు అందే పథకాలన్నీ ‘భారత్ ట్యాక్సీ’ సారథులకు అందుతాయి
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు, డీఎంఆర్‌సీ, ఏఏఐ, ఎస్‌బీఐ లాంటి 9 ప్రధాన సంస్థలతో అవగాహన ఒప్పందం
100 కార్లతో భారీ ర్యాలీ, 1200 సారథుల భాగస్వామ్యంతో భారత్ ట్యాక్సీ ప్రారంభాన్ని చరిత్రాత్మకం చేశాయి
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 8:01PM by PIB Hyderabad
దేశంలోనే మొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవలైన ‘భారత్ ట్యాక్సీ’ని ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రులు శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్, శ్రీ మురళీధర్ మొహోల్, సహకార శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భుటానీ, ఇతర విశిష్ట అతిథులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1,200 మందికి పైగా సారథులు (డ్రైవర్ మిత్రులు) ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది డ్రైవర్లకు భారత్ ట్యాక్సీ అందిస్తున్న సాధికారతకు, సహకార-యాజమాన్య ఆధారిత విధానానికి వారు అందిస్తున్న మద్దతును ప్రతిబింబిస్తుంది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అసంఘటిత రంగంలో పని చేసే వారి కోసం యాజమాన్య హక్కుల నమూనాను సహకార మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిందన్నారు. ట్యాక్సీ సారథుల సంక్షేమానికి అతి పెద్ద మాధ్యమంగా సహకార్ ట్యాక్సీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు మూడేళ్లలోనే విస్తరిస్తుందన్నారు. సహకార్ ట్యాక్సీ అంశాన్ని తాను తొలుత పార్లమెంటు ముందుకు తీసుకువచ్చినప్పుడు ట్యాక్సీ రంగంలోకి ప్రభుత్వం ఎందుకు వస్తోందని చాలా మంది ముఖ్యంగా ఈ సేవలతో అనుసంధానమై ఉన్న సంస్థలు ప్రశ్నించాయని శ్రీ షా తెలిపారు. వారికి సహకార్‌కీ, సర్కార్‌కీ మధ్య ఉన్న తేడా తెలియదని విమర్శించారు. ట్యాక్సీ రంగంలోకి ప్రవేశిస్తున్నది సహకార విధానమేనని, ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.
ఈ తరహా వ్యవస్థ ప్రపంచంలోనే మొదటిది కావచ్చని కేంద్ర సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఇక్కడ ట్యాక్సీ యజమాని ఒక వ్యక్తి లేదా సంస్థ కాదనీ, సారథులే అని వివరించారు. సహకార ట్యాక్సీతో అనుబంధం ఉన్న ప్రతి సోదరీసోదరుడే ఈ సహకార ట్యాక్సీ సొసైటీకి నిజమైన యజమానులని వెల్లడించారు. ఇలాంటి అనేక తరహా నమూనాలు గతంలో మన దేశంలో విజయవంతం అయ్యాయని కూడా శ్రీ షా చెప్పారు. అమూల్‌ను కేవలం 11 మంది పాడి రైతులు ప్రారంభించారు. ఇప్పుడు వట వృక్షంలా మారిన దీని పరిధిలో 36 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు. సుమారు ఒక లక్షా ఇరవై అయిదు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన వ్యాపారాన్ని ఈ మహిళా పాడి రైతులు చేస్తున్నారు. సాధారణ ప్రజలు యజమానులుగా మారినప్పుడు.. చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాలను తీసుకొస్తుందని ఈ నమూనా నిరూపిస్తోందన్నారు. పాలు అమ్మడం ద్వారా మహిళా పశు సంవర్ధకులకు ఏటా రూ.కోటి ఆదాయం చేకూరుతోందని, ఇదే సహకార విజయానికి ప్రతీకని చెప్పారు.
ప్రస్తుతం ట్యాక్సీ సారథులంతా ట్యాక్సీలను నడపడంలో నిమగ్నమై ఉన్నారని, సహకార్ ట్యాక్సీలో చేరిన అనంతరం కూడా అదే పని చేస్తారన్నారు. అయితే రెండింటికీ మధ్య ఓ ప్రధాన వ్యత్యాసం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు.. వారు నడిపే ట్యాక్సీ చక్రాలు ఇతరుల జేబులను నింపాయని, ఇప్పటి నుంచీ వచ్చే సంపాదన నేరుగా సారథులకు మాత్రమే చేరుతుందని వివరించారు. సహకార స్ఫూర్తి నుంచే ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని తెలిపారు. తక్కువ మూలధనం ఉన్నవారంతా ఒక చోట చేరి తమ శక్తిని ఏకీకృతం చేసినప్పుడు.. ఎంత పెద్ద కార్యమైనా సమష్టిగా పూర్తి చేయగలరని వెల్లడించారు. భారీ పెట్టుబడితో పనిచేసేవారు.. బృహత్ కార్యక్రమాలను ఒంటరిగా చేయగలరు కానీ లాభాలు కూడా కొందరికి మాత్రమే పరిమితమవుతాయన్నారు. ఈ రోజు మాట్లాడుకుంటున్న ఈ సహకార విధానం సరికొత్తదని, ప్రస్తుత సమయంలో అత్యంత విజయవంతంగా ప్రారంభమైందని శ్రీ షా తెలియజేశారు. ఇప్పుడు ఇతరుల ఆదాయం కోసం కాకుండా.. ట్యాక్సీ సారథుల సంక్షేమం కోసమే ట్యాక్సీలు నడుస్తాయని చెప్పారు.
భారత్‌లోని అమూల్, ఇఫ్కో, క్రిబ్కో లాంటి సంస్థలన్నీ అంతర్జాతీయ స్థాయి సహకార విధానంలోనే ఏర్పాటయ్యాయని కేంద్ర సహకార మంత్రి శ్రీ అమిత్ షా చెప్పారు. ఇవన్నీ స్వల్ప మూలధనంతోనే ప్రారంభమయ్యాయన్నారు. అదే విధంగా సహకార్ ట్యాక్సీకి కూడా పెట్టుబడిలో కూడా గరిష్ఠ మూలధన వాటా రూ.500 మాత్రమే అని వెల్లడించారు. ఈ 500 రూపాయలే.. సారథులకు యజమాని హోదాను అందిస్తున్నాయని చెప్పారు. ట్యాక్సీ సారథుల కృషికి, ఆత్మ గౌరవానికి, ఆర్థిక స్వాతంత్ర్యానికి ఈ చిన్న మొత్తమే పునాదిగా మారనుందని తెలిపారు.
ప్రతి అయిదేళ్లకు ఎన్నికలు జరిగిన తర్వాత, ట్యాక్సీ సారథులు ఎంపిక చేసిన ఇద్దరు ప్రతినిధులు బోర్డులో ఉంటారని శ్రీ అమిత్ షా చెప్పారు. వారు సారథుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఇదే సహకార వ్యవస్థల ఆత్మ, యాజమాన్య హక్కుల స్ఫూర్తి. మొత్తం లాభాల్లో 20 శాతం మాత్రమే సహకార్ ట్యాక్సీ తన వద్ద ఉంచుకుంటుందని చెప్పారు. అంటే ప్రతి 100 రూపాయల్లో 20 రూపాయలు మాత్రమే సహకార్ ట్యాక్సీ వద్ద ఉంటాయని, వాటికి కూడా సారథులే యజమానులుగా ఉంటారని స్పష్టం చేశారు. భారత్ ట్యాక్సీతో అనుసంధానమై ఉన్న సారథి ఖాతాకు ఈ మొత్తం లాభం చేరుతుందని శ్రీ షా వెల్లడించారు. భారత్ ట్యాక్సీ మూలధన ఖాతాలో మిగిలిన 20 రూపాయలకు సైతం సారథులే యజమానులుగా ఉంటారని ఆయన చెప్పారు.
నాలుగు చక్రాల ట్యాక్సీలు, త్రిచక్ర, ద్విచక్ర వాహనాలతో కలపి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు రకాల ట్యాక్సీ వాహనాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ.. భారత్ ట్యాక్సీని రూపొందించామని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి చెప్పారు. దేశంలో ఉన్న మాతృశక్తి భద్రతకు భారత్ ట్యాక్సీ అత్యున్నత ప్రాధాన్యమిస్తుందని సందేశమిచ్చారు. దీనికోసం సారథి దీదీ అనే ప్రత్యేక విధానానికి రూపకల్పన చేశామన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ‘సారథి దీదీ’ అనే ప్రత్యేక విండోను యాప్‌లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. దీని ద్వారా నమోదు చేసుకున్న మహిళలకు ‘సారథీ దీదీ’లు మాత్రమే ట్యాక్సీ సేవలు అందిస్తారని శ్రీ షా తెలియజేశారు. సారథి దీదీలు ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళలను తక్కువ ధరకే గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తారని శ్రీ షా వెల్లడించారు. ఈ సౌకర్యం మహిళలకు గొప్ప ఆచరణాత్మక ఉపశమనంగా మారుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో సారథి దీదీ ద్వారా దేశంలోని మాతృశక్తికి సురక్షితమైన, సరసమైన, గౌరవప్రదమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుందని తెలిపారు. ఇది సేవ మాత్రమే కాదు, మహిళలకు భద్రత, స్వావలంబన, గౌరవం అందించే దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు.
మొత్తం తొమ్మిది ప్రధాన సంస్థలతో భారత్ ట్యాక్సీ అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి చెప్పారు. వాటిలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఎయిర్పోర్టు అథారిటీ, ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్, భారతీయ స్టేట్ బ్యాంకు ఉన్నాయి. ఈ ఒప్పందాల ద్వారా భారత్ ట్యాక్సీ వినియోగదారులకు అదనపు సౌకర్యాలు లభిస్తాయి. అలాగే.. ఈ సంస్థలన్నీ భారత్ ట్యాక్సీ సేవలను సులభంగా పొందగలుగుతాయి. ఇప్పుడు ఈ సంస్థలు సహకార్ ట్యాక్సీ విజయంలో భాగస్వామ్యం పంచుకుంటాయని తెలిపారు. భారత్‌లోనే మొదటిసారిగా యాజమాన్య నమూనా ఆధారంగా తయారైన ఈ సరికొత్త ట్యాక్సీ విధానం ఈ రోజు ప్రారంభమైందని, ఇది సారథులకు యాజమాన్య హక్కుల స్ఫూర్తిని అందిస్తుందని వివరించారు. అంతేకాకుండా, ప్రయాణికులు, వివిధ సంస్థలకు నమ్మకమైన, సౌకర్యవంతమైన రవాణా విధానంగా మారుతుందన్నారు.
భారత్ ట్యాక్సీ నిర్ణయించిన నిర్ణీత రుసుము సారథిల ఖాతా నుంచి వేరుగా ఉంటుందని శ్రీ అమిత్ షా తెలియజేశారు. దీనిలో పాటుగా.. సారథుల చెమటోడ్చి సంపాదించిన ఆదాయం నుంచి ఒక్క శాతం కూడా కమిషన్‌గా భారత్ ట్యాక్సీ తీసుకోదని స్పష్టం చేశారు. దీనివల్ల వారి సంపద కూడా వేగంగా పెరుగుతుందని వెల్లడించారు. సంస్థ మూలధనాన్ని పెంచుకోవడం భారత్ ట్యాక్సీ ఉద్దేశం కాదని, దీనికి యజమానులుగా ఉన్న సారథీ సోదరులకు, సారథీ దీదీలకు లాభాన్ని, ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యమన్నారు. కస్టమర్ చేసే చెల్లింపు తక్షణమే, నేరుగా సారథి ఖాతాలోకి బదిలీ అవుతుందని శ్రీ షా చెప్పారు. దీని కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. సరైన విచారణ లేకుండా ఏ సారథి ఖాతానూ మూసివేయరు. అయితే, కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించడం, ట్యాక్సీ ప్రతిష్ఠను కాపాడటం, సేవా నాణ్యతపై దృష్టి సారించడం వంటి బాధ్యతలు కూడా సారథులపై ఉన్నాయని ఆయన చెప్పారు. ఫిర్యాదుల విచారణ కోసం పూర్తిస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేశామని, నిష్పక్షపాతమైన విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు బుకింగ్ ఫీజు, ప్లాట్‌ఫామ్ ఫీజు, భారీ కమిషన్ల వంటి పదాలు.. సంస్థల బ్యాలెన్స్ షీటును బాగా నింపాయని, సారథుల ఆదాయాన్ని తగ్గించేవని కేంద్ర సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. భారత్ ట్యాక్సీలో అలాంటి రుసుము లేదా కమిషన్ వసూలు చేసే వ్యవస్థ లేదని, ఇక్కడ సారథులే యజమానులని చెప్పారు. పాశ్చాత్య ధోరణితో ఉన్నవారికి ఈ ఆలోచన అర్థం కాదని, కానీ ఇదే సహకార వ్యవస్థ అసలైన బలం అని వివరించారు.
భారత్ ట్యాక్సీ ప్రారంభం.. సహకార రంగంలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. భారతదేశంలో సహకార ఉద్యమం గత 125 ఏళ్లుగా సాగుతోందని, ఇప్పుడు దీని పరిధిలోకి కొత్త రంగాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం సహకార మంత్రిత్వ శాఖ యాజమాన్య హక్కుల నమూనాను సిద్ధం చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో, మరో మూడు నుంచి నాలుగు రంగాల్లో కూడా ఈ నమూనాను ముందుకు తీసుకెళ్తామని, తద్వారా ఎవరి కష్టార్జితం వారికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత్ ట్యాక్సీకి నాలుగు మూల మంత్రాలు ఉన్నాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అన్నారు. అవి.. ఒకటి యాజమాన్యం, రెండోది భద్రత కవచం, మూడోది ఆత్మగౌరవం, నాలుగోది ‘‘ప్రతి ఒక్కరికీ చక్రం, ప్రతి ఒక్కరి ప్రగతి’’ అనేవేనని వివరించారు. ‘‘ప్రతి ఒక్కరికీ చక్రం, ప్రతి ఒక్కరి ప్రగతి’’ మంత్రం అందరికీ లాభాంశాలు సమంగా అందాలని సూచిస్తుందన్నారు. భారత్ ట్యాక్సీ రాబోయే కాలంలో ఎంతో విజయవంత ప్రయోగంగా రుజువు కానుందని ఆయన చెప్పారు. దీనిని 2025 జూన్ 6న ఏర్పాటు చేయగా, ఈ రోజు వాణిజ్య సరళిలో ప్రారంభించారని మంత్రి తెలిపారు. 8 నెలల్లో ఢిల్లీ, గుజరాత్‌లలో మరే ఇతర ట్యాక్సీ కంపెనీ కన్నా ఒక్క భారత్ ట్యాక్సీతోనే ఎక్కువ మంది సారథులూ, వినియోగదారులూ అనుబంధాన్ని పెంచుకున్నారన్నారు. ఇంత తక్కువ కాలంలో వేరే ఏ కంపెనీ కూడా ఇంత భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లను సాధించలేకపోయింది. రానున్న రోజుల్లో మన సారథి సోదరీ, సోదరులు బీమా, ప్రభుత్వ ఉపాధి పథకాలు, రుణాలు, సబ్సిడీలతో పాటు గిగ్ వర్కర్లకు సంబంధించిన ప్రభుత్వ స్కీముల ప్రయోజనాలు అన్నిటినీ పొందవచ్చని ఆయన అన్నారు. ప్రతి సారథీ పూర్తి ఆత్మగౌరవాన్నీ, భద్రతనీ, ఆర్థిక శక్తినీ పొందే దిశగా మేం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2020-21లో ఓ ముఖ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టారని శ్రీ అమిత్ షా అన్నారు. ‘2025-26 బడ్జెటులో దేశవ్యాప్తంగా ఒక కోటీ ఇరవై అయిదు లక్షల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న గిగ్ వర్కర్లను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలనూ, సౌకర్యాలనూ కల్పించింది. పింఛనును తగ్గించే వారికో, లేదా వర్కర్లుగా లాంఛనంగా గుర్తింపు ఉన్న, లేదా రిజిస్టరైన వారికే ఇదివరకు ‘ఈ-శ్రమ్’ పోర్టల్లో నమోదు చేసుకొనే హక్కు ఉండేది, ప్రస్తుతం ఈ పరిమితిని తొలగించడంతో దేశంలో ఒక కోటీ ఇరవై అయిదు లక్షల మంది గిగ్ వర్కర్లు ‘ఈ-శ్రమ్’ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ముగిశాక, వారు ఆటోమేటిగ్గా తమకూ, తమ కుటుంబానికీ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనలో భాగంగా అయిదు లక్షల రూపాయల వరకూ ఉచిత చికిత్స సౌకర్యానికి స్వతహాగా నోచుకుంటారు. వారు భారత్ ట్యాక్సీలో చేరడంతోనే, సారథులకు ఈ విధమైన ఉచిత వైద్య సదుపాయం అందడం మొదలవుతుంది. దీనికి అదనంగా, ‘ఈ-శ్రమ్’ పోర్టల్లో రిజిస్టరైన వర్కర్లకు అందుబాటులో ఉండే ఇతర అనేక సామాజిక భద్రత పథకాలు కూడా మీకు అందడం మొదలైపోతుంద‘ని ఆయన అన్నారు.
భారత్ ట్యాక్సీ మోడల్ సారథుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు, వారికి ఆత్మగౌరవాన్నీ, భద్రతనీ, యాజమాన్యాన్నీ కూడా నిర్ధారిస్తుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అన్నారు. ఎస్ఓఎస్ అలర్ట్ సదుపాయాన్ని భారత్ ట్యాక్సీ యాప్లో అందుబాటులోకి తీసుకువచ్చారనీ, అత్యవసర స్థితి ఎదురైతే దీంతో భద్రతనీ, సహాయాన్నీ పొందొచ్చని ఆయన తెలిపారు. ‘ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రస్తుతానికి ఎనిమిది హెల్ప్‌లైన్లని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కేంద్రాల విస్తృత నెట్‌వర్కును దేశమంతటా నెలకొల్పుతారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియనంతటినీ యాప్ ద్వారా, వెబ్‌సైట్ ద్వారా, ఇంకా టోల్-ఫ్రీ నంబరు ద్వారా.. మూడు స్థాయుల్లో నిర్వహిస్తారు. ప్రతి ఒక్క సమస్యనీ సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా మా ప్రతినిధులు సారథులతో క్రమం తప్పక సమావేశమవుతుంటారు కూడా. ఈ రోజు నుంచీ సారథులు దాగి ఉన్న చార్జీల (హిడెన్ చార్జెస్) నుంచి పూర్తిగా విముక్తిని పొందినట్లే’ అంటూ మంత్రి వివరించారు. ‘హిడెన్ చార్జీలను వసూలు చేయడం సారథులను ఒక రకంగా మోసం చేయడమే. టోల్, పార్కింగ్ చార్జీలతో పాటు ఇతర అన్ని అదనపు చార్జీల నుంచి కూడా సారథులకు స్వేచ్ఛ లభిస్తుంది. అంతేకాదు, హెల్ప్‌లైన్ వారంలో ప్రతి రోజూ ఎల్ల వేళలా సారథులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి దీనిని గుజరాత్, ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో కొన్ని నగరాల్లో మొదలుపెడుతున్నారు. అయితే వచ్చే మూడేళ్ల లోపు మనం దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి పెద్ద నగరం వరకూ చేరుకుంటామ’ని మంత్రి అన్నారు.
రాబోయే రోజుల్లో, మేం భారత్ ట్యాక్సీలో మరిన్ని కొత్త సేవల్ని కూడా చేర్చడంతో పాటు ఆ సేవల్ని ఎప్పటికప్పుడు విస్తరిస్తుంటామని కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. భారత్ ట్యాక్సీ సేవలు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఆరంభమవుతున్నాయని ఢిల్లీ-ఎన్‌సీఆర్లో సారథులకూ, వినియోగదారులకూ ఆయన తెలియజేశారు. ‘ఇది ఒక ట్యాక్సీ సర్వీసు మాత్రమే కాదు, సమృద్ధినీ, ఆత్మగౌరవాన్నీ, మన దేశంలోని కోట్లాది సారథులకు ఆర్థిక శక్తినీ పెంపొందించే ఒక శక్తిమంతమైన మాధ్యమంగా మారనుంది. ఇప్పటి వరకూ, ఢిల్లీ-ఎన్‌సీఆర్లో 2.5 లక్షల కన్నా ఎక్కువ మంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీలో చేరారు. 8.5 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ కుటుంబంలో భాగమయ్యారు. అనేక పెద్ద కంపెనీలతో మన ఒప్పందాలు చివరి దశకు చేరుకొన్నాయి‘ అని మంత్రి వివరించారు. భారత్ ట్యాక్సీకి ఉజ్వల భవిత ఉంటుందనే తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు.
అంతకు ముందు, భారత్ ట్యాక్సీ ప్రారంభానికి ప్రతీకాత్మకంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) నుంచి విజ్ఞాన్ భవన్ వరకూ 100 కార్లతో గొప్ప ర్యాలీని నిర్వహించారు. దేశంలోని ట్యాక్సీ సముదాయం ఐకమత్యాన్నీ, ఆత్మగౌరవాన్నీ, సామూహిక శక్తినీ ఈ ర్యాలీ బలంగా చాటింది.
విశిష్ట ప్రతిభను ప్రదర్శించిన అయిదుగురు అగ్రగామి సారథులను వారి ప్రశంసనీయ సేవకు గాను ఈ కార్యక్రమంలో సత్కరించారు. సహకార నమూనాలో డ్రైవర్ల యాజమాన్యం, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనేదే దీని ఉద్దేశంగా ఉంది. సన్మానించిన ఒక్కో సారథికీ వ్యక్తిగత ప్రమాద బీమా ధ్రువపత్రాల్నీ, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా రక్షణనీ అందించారు. ఇది డ్రైవర్ల సంక్షేమం, సామాజిక భద్రతల పట్ల భారత్ ట్యాక్సీకున్న నిబద్దతకు అద్దం పట్టింది.
కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి సమక్షంలో అగ్రగామి ప్రభుత్వ, ప్రయివేటు రంగ భాగస్వాములతో తొమ్మిది అవగాహన ఒప్పందాలను (ఎంఓయూలు) ఇచ్చి పుచ్చుకొన్నారు. నిర్వహణలో ఏకీకరణనీ, డిజిటల్ సామర్థ్యాన్నీ, సేవలలో నాణ్యతనీ బలోపేతం చేయాలన్నదే ఈ ఎంఓయూల ప్రధానోద్దేశం.
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు, సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ల మధ్య కుదిరిన ఎంఓయూలో భాగంగా భారత్ ట్యాక్సీ ఢిల్లీలో 21 స్థానాలలో నెలకొన్న 34 ప్రీపెయిడ్ ట్యాక్సీ బూత్‌లను డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహించేందుకు అనుమతినిస్తారు. దీంతో ప్రయాణికుల భద్రత, పారదర్శకత, సేవల నాణ్యత, డ్రైవరు ఆదాయం.. ఇవన్నీ ఇప్పటితో పోలిస్తే అధికం అవుతాయి. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల మద్దతుతో భారత్ ట్యాక్సీ ఒక జాయింట్ కమాండ్, కంట్రోల్ సెంటరును ఏర్పాటు చేసింది. దీనిలో వాస్తవ కాల ప్రాతిపదికన సవారీ పర్యవేక్షణ, ఎస్ఓఎస్ అలర్ట్, సత్వర అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాలు కలిసి ఉంటాయి. ఇవి అన్నీ కలిసి రహదారి భద్రతనీ, నియంత్రణ పరమైన నియమాల పాలననీ, ప్రయాణికులకు భద్రతనీ పెంపొందింపచేస్తాయి.
జాతీయ ఈ-పరిపాలన విభాగం (ఎన్ఈజీడీ), ఎంఈఐటీవైతో కుదిరిన ఎంఓయూలో భాగంగా డిజిటల్ ఇండియా ఫ్రేంవర్క్ పరిధిలో భారత్ ట్యాక్సీకి సంప్రదింపులు, సాంకేతికత పరమైన సహాయాన్ని అందిస్తారు. దీంతో ‘డిజిలాకర్’, ‘ఉమంగ్’, ‘ఏపీఐ సేతు’లతో ఏకీకరణకు మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా సారథులకు పేపర్‌లెస్ ఆన్‌బోర్డింగ్, ప్రభుత్వ సేవలను ఒకే చోట పొందే సౌలభ్యం, సురక్షితమైన ఇంటరాపరబుల్ కార్యకలాపాలు, నగదు రహిత చెల్లింపులు, కార్యకలాపాలను మెరుగ్గా నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యం.. వీటికి సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్‌సీ)తో కుదుర్చుకున్న భాగస్వామ్యంలో భాగంగా 10 ప్రధాన మెట్రో స్టేషన్లలో బైక్ ట్యాక్సీ, ఈ-ఆటోలు/సీఎన్‌జీ ఆటోలు, క్యాబుల రూపేణా చివరి స్థాయి వరకూ సంధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తారు. ఫలితంగా ప్రయాణికులకు ఒకే వేదికలో తమ పూర్తి ప్రయాణానికి పథకరచన చేసుకోవడమే కాక, చెల్లింపులను కూడా చేయగలిగే సౌలభ్యం ఏర్పడుతుంది. డ్రైవర్లకు ఎక్కువ ట్రిప్పులు లభించడమే కాకుండా వారు ఖాళీగా కూర్చొనే సమయం కూడా తగ్గుతుంది.
భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)తో కుదుర్చుకున్న ఎంఓయూ దేశమంతటా ఏఏఐ ఆధీనంలోని విమానాశ్రయాల్లో భారత్ ట్యాక్సీ కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన ఎంఓయూ. దీన్లో పికప్ జోన్లు, సైనేజీ అనుమతులు, ఖచ్చితమైన భద్రత, సేవల ప్రమాణాల్ని నిర్ధారించారు. వీటితో పూర్తి దేశంలో విమానాశ్రయాల కార్యకలాపాల నియంత్రణకు మార్గం సుగమమైంది.
ఢిల్లీ పర్యటన, రవాణా అభివృద్ధి కార్పొరేషన్ / ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ సర్వీసెస్ (ఈ సంస్థకు డీఏపీఎస్-జీఎమ్ఆర్ మద్దతుంది)తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఐజీఐ ఎయిర్‌పోర్ట్ టర్మినల్స్‌లో అనేక పార్కింగ్ స్థలాల్లో భారత్ ట్యాక్సీకి చెందిన తెల్ల రంగు క్యాబులకు సేవలను అందించేందుకు వెసులుబాటును ఇచ్చారు. డీఏపీఎస్ మొదటి సంవత్సరంలో ఒక్కో ట్రిప్పునకు రూ.245 పికప్ రుసుములో 20 శాతం రాయితీని ఇస్తుంది. ఇది భారత్ ట్యాక్సీకి చెందిన కాలీ పీలీ సేవలకు పూరకంగా ఉంటుంది. అంతేకాదు.. విమానాశ్రయ సవారీల సంఖ్యతో పాటు, ఆదాయంలో చెప్పుకోదగ్గ వృద్ది కూడా చోటు చేసుకోనుంది.
ఇఫ్‌కో టోకియోను భారత్ ట్యాక్సీకి బీమా భాగస్వామిగా తీసుకున్నారు. ఈ సంస్థ నామమాత్ర ధరలపై డ్రైవర్లకు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను అందిస్తుంది. దీంతో పాటు, డ్రైవర్లకు దీర్ఘకాలిక సంక్షేమం, బీమా పథకాల విషయంలో సలహాల్ని కూడా ఇస్తుంది.
పేటీఎమ్‌తో కుదిరిన ఎంఓయూలో భాగంగా, డిజిటల్ చెల్లింపులు, కో-బ్రాండెడ్ సేవలు, ఫిన్‌టెక్ అనుబంధిత సేవలకు మార్గం సుగమం కానుంది. దీన్లో పేమెంట్ గేట్‌వే ఏకీకరణ, పేటీఎమ్ అనుబంధ విస్తారిత వ్యవస్థను వినియోగించుకోవడం వంటి అంశాలు కూడా భాగంగా ఉన్నాయి. కుటుంబ కవరేజీ సహా డ్రైవర్లకు సామూహిక ఆరోగ్య బీమాను అందించడంలోనూ పేటీఎమ్ సహకారాన్ని అందిస్తోంది.
జీఎమ్ఆర్ తో ఏర్పరుచుకున్న భాగస్వామ్యం విమానాశ్రయ గతిశీలతా కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ, ఐజీఐ విమానాశ్రయ టర్మినల్స్ లో భారత్ ట్యాక్సీకి నియంత్రణపూర్వక లభ్యతనీ, సేవల విస్తరణకీ అదనపు బలాన్ని సమకూరుస్తుంది.
ఎస్‌బీఐతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి పథకాల్లో వాణిజ్య సరళికి చెందిన ప్రయాణికుల వాహనాలకు ప్రాధాన్య పద్దతిన ఆర్థిక సహాయాన్ని అందుబాటులోకి తెస్తారు. సహకార్ ట్యాక్సీ తన వంతుగా యోగ్యులైన డ్రైవర్లు, యజమానులను గుర్తించడంతో పాటు సహాయాన్ని అందిస్తుంది. ఎస్‌బీఐ తాను అమలుచేస్తున్న మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సత్వర పరిశీలనకు చొరవ తీసుకుంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2224898)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33