మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక అభివృద్ధి అంశంపై ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి కమిషన్ 64వ కార్యక్రమం అమెరికాలోని న్యూయార్క్‌లో గల ఐరాస ప్రధాన కేంద్రంలో నిర్వహణ..


హక్కులపై ఆధారపడిన, సమ్మిళితత్వం ప్రధానమైన, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న తన అభివృద్ధి ప్రక్రియను ఈ సమావేశంలో వివరించిన భారత్

‘‘కోపెన్‌హేగెన్ నుంచి దోహా వరకూ.. సామాజిక అభివృద్ధి సాధనకు రెండో ప్రపంచ శిఖరాగ్ర సదస్సు పరిణామాల్ని సద్వినియోగ పరుచుకోవడం: 2030, ఆ తరువాతా అమలుచేయాల్సిన జాతీయ కార్యాచరణకు నడుంబిగించడం’’ అంశంపై

మంత్రుల స్థాయి ఫోరంలో ప్రసంగించిన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2026 8:00AM by PIB Hyderabad

‘‘కోపెన్‌హేగెన్ నుంచి దోహా వరకూ.. సామాజిక అభివృద్ధి ప్రధానంగా నిర్వహించిన రెండో ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సు పరిణామాల సద్వినియోగం’’ అంశంపై ఐక్యరాజ్యసమితిలో చేపట్టిన చర్చా కార్యక్రమంలో భారత్ తన దృష్టికోణాన్ని వివరించింది. హక్కుల ఆధారిత, సమ్మిళిత, ప్రజా ప్రయోజనాలను కేంద్రస్థానంలో నిలిపిన అభివృద్ధి సరళిని ఈ సందర్భంగా భారత్ స్పష్టం చేసింది. భారత్ పక్షాన కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ఒక ప్రకటన చేస్తూ, 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను సాధించాలని దేశం సంకల్పాన్ని చెప్పుకొందనీ, దీన్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.

90a6c39fb9bb0ff8b25f2d0c3c770a38.jpg

అభివృద్ధి సాధన ప్రక్రియలో ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కోపెన్‌హేగన్ ప్రకటనలో పేర్కొన్న సంగతినీ, ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న స్థితిలోనూ ఇదే నిబద్దతను దోహా రాజకీయ ప్రకటన సందర్భంగా కూడా పునరుద్ఘాటించుకొన్న విషయాన్నీ మంత్రి గుర్తుచేశారు. ప్రజలందరికీ ఆత్మగౌరవం, సమానత్వం, అవకాశాల్ని నిర్ధారించడానికి ఏకోన్ముఖ ప్రభుత్వం, సంపూర్ణ సమాజ దృష్టికోణాలతో ‘‘సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్’’ పరిపాలనా సిద్ధాంతాన్ని భారత్ అనుసరిస్తోందని మంత్రి వివరించారు.
భారత్ సమకూరుస్తున్న విస్తృత సామాజిక పరిరక్షణ, వివిధ వర్గాలను ప్రధాన స్రవంతిలో సమ్మిళితం చేసేందుకు అమలు చేస్తున్న పథకాలను గురించి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ ప్రస్తావించారు:
• ఆరోగ్య భద్రత కార్యక్రమాల ప్రయోజనాలను ప్రస్తుతం 80 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజలు అందుకుంటున్నారు.
• ఆరోగ్యం, వెల్‌నెస్ సెంటర్ల విస్తృత నెట్‌వర్క్ అండతో 55 కోట్ల కన్నా ఎక్కువ మంది పౌరులు ఉచిత ఆరోగ్యసంరక్షణ సేవల ప్రయోజనాల్ని పొందుతున్నారు.
• పదహారు వేల ‘జన ఆరోగ్య కేంద్రాల’ను నిర్వహిస్తూ మందుల్నీ, వైద్య పరికరాల్నీ తక్కువ ధరలకు అందిస్తున్నారు.
• స్థానిక పరిపాలనలో 14.5 లక్షల కన్నా ఎక్కువ మంది ఎన్నికైన మహిళా ప్రతినిధులు పాలుపంచుకుంటున్నారు. ఇది క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యం పట్ల భారత్ నిబద్ధతను చాటిచెబుతోంది.
• ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’ వంటి ప్రధాన కార్యక్రమాలు బాలికలకు చదువుకొనే అవకాశాల్ని విస్తృతం చేయడమే కాకుండా వారి ఆర్థిక భద్రతకు కూడా దన్నుగా నిలుస్తున్నాయి.
• కార్మిక రంగ సంస్కరణలు సమాన వేతనం, సురక్షిత పని ప్రదేశాలకు పూచీపడడంతో పాటు, శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి.
• విస్తృత స్థాయిలో పూచీకత్తు అక్కర లేకుండా అందిస్తున్న రుణాలు.. లక్షల మంది మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు వీధుల్లో తిరుగుతూ విక్రయాలు నిర్వహించే వ్యాపారులు సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడానికి తోడ్పడ్డాయి.
• స్మైల్ వంటి లక్షిత పథకాలు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులూ, ఇతర బలహీన సమూహాల పునరావాసంతో పాటు సమాజంలో వారికీ సముచిత స్థానాన్ని కల్పించడంలోనూ సాయపడుతున్నాయి.
భారత్ అభివృద్ధి ప్రస్థానంలో.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాలు, పౌరుల భాగస్వామ్యం.. వీటిని ఏకీకరించామనీ, దీంతో పారదర్శకత్వాన్నీ, ప్రజల్లో చివరి అంచె వరకూ సేవల అందజేతనీ నిర్ధారించవచ్చనీ శ్రీమతి ఠాకూర్ స్పష్టం చేశారు.

భారత్ నాగరికతలో ఓ భాగమైన ‘‘వసుధైవ కుటుంబకమ్’’ ( ప్రపంచమంతా ఒకే కుటుంబం) సిద్ధాంతాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రపంచ భాగస్వామ్యాన్ని బలపరచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకు పోవడానికి భారత్ తన అభివృద్ధి ప్రయాణానుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు.
ఐరాస సభ్య దేశాల్లో చాలావరకూ దేశాలు కార్యక్రమంలో పాల్గొన్నాయి.
కార్యక్రమం ముగిసిన తరువాత, మంత్రి స్వీడన్ ప్రభుత్వంలో సామాజిక సేవల మంత్రి గౌరవ కామిలా వాల్టర్‌సన్ గ్రోన్‌వెల్‌తో కూడా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

873737dc500de1a0a6035c1a09debb58.jpg

 

***


(రిలీజ్ ఐడి: 2223102) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam