ఆర్థిక మంత్రిత్వ శాఖ
స్థిరమైన ఆర్థికవృద్ధి, సామర్థ్య నిర్మాణం, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే మూడు కర్తవ్యాలపై దృష్టి సారించిన కేంద్ర బడ్జెట్ 2026-27
బడ్జెట్ 2026-27 యువశక్తి ఆధారిత బడ్జెట్: ఆర్థిక మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 1:07PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-2027ను పార్లమెంటులో ప్రవేశపెడుతూ, వికసిత్ భారత్ దిశగా సంస్కరణ వేగాన్ని పెంచేందుకు మూడు కర్తవ్యాలను ప్రతిపాదించారు. ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించటం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటం, స్థిరత్వాన్ని కొనసాగించటం, ప్రపంచవ్యాప్త పరిస్థితులను తట్టుకోగలిగేలా స్థిరత్వాన్ని పెంపొందించటం మొదటి కర్తవ్యమని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, వారి సామర్థ్యాన్ని పెంపొందించటం ద్వారా భారత అభివృద్ధి పథంలో బలమైన భాగస్వాములుగా వారిని తీర్చిదిద్దటం రెండో కర్తవ్యం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం, సంఘం, ప్రాంతం, రంగానికి అవసరమైన వనరులు, సౌకర్యాలు, అవకాశాలు అందేలా చూడటం ద్వారా దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడటం మూడో కర్తవ్యమని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
త్రిముఖ విధానానికి అనుకూలమైన వ్యవస్థ అవసరమని ఆర్థిక మంత్రి అన్నారు. మొదటిది.. నిరంతరాయంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాగే నిర్మాణాత్మక సంస్కరణల వేగాన్ని కొనసాగించటం. రెండోది.. పొదుపును ప్రోత్సహించటానికి, పెట్టుబడులను సమర్థవంతంగా కేటాయించటానికి, నష్టాల నిర్వహణకు బలమైన, స్థిరమైన ఆర్థిక రంగం అత్యంత కీలకం. మూడోది.. ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతలు మెరుగైన పరిపాలనకు శక్తివంతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి.
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026లో గౌరవ ప్రధానమంత్రితో పంచుకున్న పలు వినూత్న ఆలోచనల స్ఫూర్తితో కర్తవ్యభవన్ లో తొలి బడ్జెట్ తయారైందని, ఇది యువశక్తి ఆధారిత బడ్జెట్ అని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
గడిచిన 12 ఏళ్లలో భారతదేశ ఆర్థిక గమనం.. స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ, నిరంతర వృద్ధి, నియంత్రిత ద్రవ్యోల్బణంతో సాగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో సంస్కరణలను అమలు చేస్తూ, ఆర్థిక జాగ్రత్తలను పాటిస్తూనే ప్రభుత్వ పెట్టుబడులకు పెద్దపీట వేసిందని ఆమె తెలిపారు. స్వావలంబన (ఆత్మనిర్భరత) ప్రధాన లక్ష్యంగా దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచటం, ఇంధన భద్రతను సాధించటం, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించినట్లు ఆమె తెలిపారు. పౌరుల అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచటం అందరికీ సేవలందించేలా సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యల వల్ల దేశం సుమారు 7% వృద్ధి రేటును సాధించింది. ఇది పేదరిక నిర్మూలనలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని ఆమె వివరించారు.
అంతర్జాతీయ వాణిజ్యం, వివిధ దేశాల మధ్య సంబంధాలు ప్రమాదంలో ఉన్నాయని.. వనరుల లభ్యత, సరఫరా వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కొత్త సాంకేతికతలు ఉత్పత్తి విధానాలను మారుస్తున్నాయని.. నీరు, ఇంధనం, కీలక ఖనిజాల అవసరాలను విపరీతంగా పెంచుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యం దిశగా భారతదేశం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో అభివృద్ధి ఆకాంక్షలు, సమ్మిళితత్వాన్ని సమతూకం చేస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ప్రపంచ మార్కెట్లతో భారత్ లోతైన సంబంధాలను కొనసాగించాలని, ఎగుమతులను పెంచుకోవాలని, స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించాలని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతున్న క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ భాగస్వాములైన ప్రజలందరికీ ఆర్థిక మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఆశయాన్ని విజయంగా, సామర్థ్యాన్ని ప్రావీణ్యత మార్చటమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పురోగతి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సంచార జాతులు, యువత, పేదలు, మహిళలందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఉపాధి కల్పన, ఉత్పాదకతను పెంచటం, వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలను చేపట్టిందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2025లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన తర్వాత ఇప్పటివరకు 350 సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటిలో జీఎస్టీ రేట్ల సరళీకరణ, సంస్కరించిన లేబర్ చట్టాలు, తప్పనిసరి నాణ్యతా నియంత్రణ ఆదేశాల హేతుబద్దీకరణ వంటివి ఉన్నాయి. సంస్కరణలకు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయటంతో పాటు నియంత్రణలను తొలగించేందుకు, నిబంధనల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేస్తుందని ఆమె చెప్పారు. సంస్కరణల వేగం సరైన దిశలో సాగుతుందని, నిర్దేశించుకున్న కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ఈ వేగాన్ని కొనసాగిస్తామని ఆమె తెలిపారు.
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటానికి, సుస్థిరం చేయటానికి మొదటి కర్తవ్యంలో భాగంగా, శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆరు రంగాల్లో కీలక ప్రతిపాదనలు చేశారు. i) 7 వ్యూహాత్మక, ప్రాముఖ్యత గల రంగాల్లో తయారీని విస్తరించటం. ii) పాత పారిశ్రామిక రంగాలకు పునరుజ్జీవం పోయటం. iii) ఛాంపియన్ ఎంఎస్ఎంఈలను సృష్టించటం. iv) మౌలిక సదుపాయాలకు బలమైన ప్రోత్సాహాన్ని అందించటం. v) దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించటం vi) నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి.
రెండో కర్తవ్యం.. ఆకాంక్షలను నెరవేర్చి, సామార్థ్యాన్ని పెంపొందించటమని ఆర్థిక మంత్రి తెలిపారు. పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల దాదాపు 25 కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. యువ భారత్ ఆకాంక్షలను నెరవేర్చేందుకు సేవా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ‘ఎడ్యూకేషన్ టు ఎంప్లాయిమెంట్, ఎంటర్ప్రైజ్’ అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సేవారంగం కీలకంగా మారనుందన్నారు. వృద్ధి, ఉపాధి, ఎగుమతుల సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచటానికి ప్రాధాన్యతా రంగాలను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఉద్యోగాలు, నైపుణ్యాలపై ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు చూపే ప్రభావాన్ని అంచనా వేసి, తగిన సూచనలు చేస్తుందని, 2047 నాటికి సేవారంగంలో అంతర్జాతీయంగా 10% వాటాతో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెడతామని ఆమె పేర్కొన్నారు.
శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన మూడో కర్తవ్యం.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యానికి అనుగుణంగా పలు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏ) ఉత్పాదకతను పెంచటం, వ్యాపార తత్వాన్ని ప్రోత్సహించటం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచటం. చిన్న, సన్నకారు రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపటం. బీ) ఉపాధి అవకాశాలు, శిక్షణ, నాణ్యమైన సహాయక పరికరాలను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా దివ్యాంగులకు చేయూతనందించటం. సీ) సమాజంలోని అణగారిన, బలహీన వర్గాలకు మానసిక ఆరోగ్యం, ట్రామా కేర్ సేవలు సులభంగా అందేలా చూడటం. డీ) అభివృద్ధి, ఉపాధి అవకాశాలను వేగవంతం చేయటానికి పూర్వోదయ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించటం.
***
(రిలీజ్ ఐడి: 2221681)
సందర్శకుల సూచీ సంఖ్య : : 159
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam