కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్‌కు ప్రధాన చోదక శక్తిగా సేవా రంగాన్ని నిలబెట్టటంపై దృష్టి సారిస్తూ తగిన చర్యలను సిఫార్సు చేయడం కోసం ‘విద్య నుంచి ఉద్యోగం, వ్యవస్థాపకత’ అనే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. ఇది 2047 నాటికి ప్రపంచ సేవా రంగంలో 10 శాతం వాటాతో భారత్‌ను ప్రపంచ అగ్రగామి దేశంగా నిలబెడుతుంది. ఈ కమిటీ వృద్ధి, ఉపాధి, ఎగుమతుల సామర్థ్యాన్ని పెంపొందించే రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఏఐ వంటి వర్ధమాన సాంకేతికతలు ఉద్యోగాలు, నైపుణ్య అవసరాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేసి తగిన చర్యలను ప్రతిపాదిస్తుంది.

భారతీయ డిజైన్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ డిజైనర్ల కొరత ఉన్నందున దేశంలోని తూర్పు ప్రాంతంలో డిజైన్‌కు సంబంధించిన విద్య, అభివృద్ధిని ప్రోత్సహించడానికి పోటీ పద్ధతి ద్వారా కొత్త జాతీయ డిజైన్ సంస్థను (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్) ఏర్పాటు చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
ప్రధాన పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడార్ల సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌లను నిర్మించేందుకు పోటీ పద్ధతి ద్వారా రాష్ట్రాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఈ ప్రణాళికాబద్ధమైన విద్యా కేంద్రాలు బహుళ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్య కేంద్రాలు, నివాస సముదాయాలకు నిలయంగా ఉంటాయి.

ఉన్నత విద్యలోని స్టెమ్ సంస్థలలో సుదీర్ఘ అభ్యాసన సమయాలు, ప్రయోగశాల పనులు విద్యార్థినులకు కొన్ని సవాళ్లను కలిగిస్తున్నాయి. అందువల్ల వీజీఎఫ్, మూలధన మద్దతు ద్వారా ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది.
ఖగోళ భౌతికశాస్త్రం, ఖగోళ శాస్త్రాన్ని ప్రోత్సహించడానికి జాతీయ లార్జ్ సోలార్ టెలిస్కోప్, జాతీయ లార్జ్ ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, కాస్మోస్ 2 ప్లానిటోరియం అనే నాలుగు టెలిస్కోప్ మౌలిక సదుపాయ కేంద్రాలను ఏర్పాటు చేయటం లేదా ఆధునికీకరించటం చేస్తారు.