ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేలా 5 ప్రధాన ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటులో రాష్ట్రాలకు దోహదపడేలా పథకాన్ని ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026 - 27


· ప్రస్తుత జాతీయ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ కౌన్సిలును ఉన్నతీకరిస్తూ.. జాతీయ ఆతిథ్య సేవల సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన

· 12 వారాల ప్రామాణిక, అత్యున్నత స్థాయి శిక్షణ కోర్సు ద్వారా.. 20 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లోని 10,000 మంది పర్యాటక మార్గదర్శకులకు నైపుణ్య శిక్షణ కోసం ఓ ప్రయోగాత్మక పథకం ప్రతిపాదన

· 15 పురావస్తు ప్రదేశాల అభివృద్ధికి ప్రతిపాదన... ప్రత్యేక నడక మార్గాల ద్వారా తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల సందర్శనకు అవకాశం

· అరుణాచల ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి కోసం పథకాన్ని ప్రతిపాదించిన బడ్జెట్

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 12:46PM by PIB Hyderabad

‘‘వైద్య పర్యాటక సేవలకు నిలయంగా భారత్‌ను నిలపడం లక్ష్యంగా.. ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో అయిదు ప్రధాన ప్రాంతీయ వైద్య కేంద్రాలను నెలకొల్పడంలో రాష్ట్రాలకు చేయూతనిచ్చేలా ఒక పథకాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను’’ అని పార్లమెంటులో 2026-27 కేంద్ర బడ్జెటును సమర్పిస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.

 

వైద్య, విద్య, పరిశోధన సదుపాయాలతో.. సమీకృత ఆరోగ్య సముదాయాలుగా ఈ కేంద్రాలు సేవలందిస్తాయని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘ఆయుష్ కేంద్రాలు, వైద్య పర్యాటక సహాయ కేంద్రాలు, రోగనిర్ధారణ సదుపాయాలు, చికిత్సానంతర సంరక్షణ, పునరావాస సదుపాయాలు ఇందులో ఉంటాయి. వైద్యులు, వైద్య అనుబంధ రంగాల్లో నిపుణులు సహా అనేక ఉపాధి అవకాశాలు ఈ కేంద్రాల ద్వారా లభిస్తాయి” అని ఆమె వివరించారు.

 

పర్యాటకం

“ఉపాధి కల్పన, విదేశీ మారక నిల్వల ఆర్జన, స్థానిక ఆర్థిక వ్యవస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించగల సామర్థ్యం పర్యాటక రంగానికి ఉంది” అని ఆర్థిక మంత్రి చెప్పారు.

 

Para 90-89,71-65,55_Expanding Economy through Strengthening Tourism english 01.jpg

“ప్రస్తుతమున్న జాతీయ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ కౌన్సిల్‌ను ఉన్నతీకరిస్తూ.. జాతీయ ఆతిథ్య సేవల సంస్థ ఏర్పాటును నేను ప్రతిపాదిస్తున్నాను. విద్య సంస్థలు, సంబంధిత పరిశ్రమ, ప్రభుత్వం మధ్య వారధిగా ఇది పనిచేస్తుంది’’ అని ఆమె అన్నారు.

 

20 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లోని 10,000 మంది పర్యాటక మార్గదర్శకులకు నైపుణ్య శిక్షణ అందించడం కోసం ఓ ప్రయోగాత్మక పథకాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇందుకోసం ఒక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ భాగస్వామ్యంతో హైబ్రిడ్ విధానంలో 12 వారాల పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను వారికి అందిస్తారు.

 

‘‘సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ వైశిష్ట్యం కలిగిన అన్ని ప్రదేశాలను డిజిటల్ రూపంలో భద్రపరచడం లక్ష్యంగా జాతీయ పర్యాటక డిజిటల్ విజ్ఞాన గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం. ఇది స్థానిక పరిశోధకులు, చరిత్రకారులు, కంటెంట్ సృజనకారులు, సాంకేతిక భాగస్వాములకు ఉపాధి అవకాశాలను కల్పించే ఒక కొత్త వ్యవస్థను ఇది రూపొందిస్తుంది’’ అని కూడా ఆమె తెలిపారు.

 

‘‘ప్రపంచ స్థాయి ట్రెకింగ్, హైకింగ్ అనుభవాలను అందించగల సామర్థ్యం భారత్‌కు ఉంది. అవకాశాలను కలిగి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకునేలా... i) హిమాచల ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, తూర్పు కనుమల్లోని అరకు లోయ, పశ్చిమ కనుమల్లోని పొదిగై మలైలలో పర్వతారోహణ మార్గాలు, ii) ఒడిషా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్న 14 తీర ప్రాంతాల్లో ప్రధాన తాబేళ్ల ఆవాసాల వెంబడి పర్యాటక మార్గాలు, iii) ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పులికాట్ సరస్సు వెంబడి పక్షి వీక్షణ మార్గాలను పర్యావరణ హిత పద్ధతిలో మేం అభివృద్ధి చేస్తాం’’ అని ఆర్థిక మంత్రి చెప్పారు.

 

“గౌరవ ప్రధానమంత్రి దార్శనిక నేతృత్వంలో 2024లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్‌ను మేం ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తోంది. ఉమ్మడి వ్యూహాలు, సంరక్షణ వంటి అంశాలపై 95 దేశాల ప్రభుత్వాధినేతలు, మంత్రుల మధ్య ఈ సదస్సులో చర్చ జరుగుతుంది’’ అని కూడా ఆమె చెప్పారు.

 

వారసత్వం, సాంస్కృతిక పర్యాటకం

వారసత్వం, సాంస్కృతిక పర్యాటకం అంశంపై మాట్లాడుతూ.. ఉత్తేజకరమైన, ప్రయోగాత్మక సాంస్కృతిక పర్యాటక గమ్యస్థానాలుగా - లోథాల్, ధోలవీర, రాఖీగఢి, ఆదిచనల్లూర్, సారనాథ్, హస్తినాపూర్, లే ప్యాలెస్ సహా 15 పురావస్తు ప్రదేశాల అభివృద్ధిని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.

“ప్రత్యేక నడక మార్గాలను ఏర్పాటు చేసి తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తాం. సంరక్షణ శాలలు, అవగాహన కేంద్రాలు, పర్యాటక మార్గదర్శకులకు సహాయపడేలా ముగ్ధులను చేసే కథన నైపుణ్యాలను అందించడంతోపాటు సంబంధిత సాంకేతికతలనూ పరిచయం చేస్తాం’’ అని ఆమె చెప్పారు.

 Para 90-89,71-65,55_Expanding Economy through Strengthening Tourism english 02.jpg

పూర్వోదయ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతంపై ప్రత్యేక దృష్టి

పూర్వోదయపై మాట్లాడుతూ.. “దుర్గాపూర్ ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఒక సమీకృత తూర్పుతీర పారిశ్రామిక కారిడార్ అభివృద్ధినీ, 5 పూర్వోదయ రాష్ట్రాల్లో 5 పర్యాటక గమ్యస్థానాల ఏర్పాటునూ, అలాగే 4,000 ఇ-బస్సుల మంజూరునూ నేను ప్రతిపాదిస్తున్నాను” అని శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఈశాన్య ప్రాంతంలోని బౌద్ధ పర్యాటక ప్రాంతాలపై మాట్లాడుతూ... ఈశాన్య ప్రాంతం థేరవాద, 18 మహాయాన/ వజ్రయాన సంప్రదాయాల నాగరికతా సంగమమని ఆమె చెప్పారు.

అరుణాచల ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో బౌద్ధ పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి కోసం ఓ పథకాన్ని ప్రారంభించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆలయాలు, మఠాలు, యాత్రికుల కోసం అవగాహన కేంద్రాలు, అనుసంధానం, యాత్రా సేవలు ఈ పథకం పరిధిలో ఉంటాయి.  

 ***


(రిలీజ్ ఐడి: 2221532) సందర్శకుల సూచీ సంఖ్య : : 93