ఆర్థిక మంత్రిత్వ శాఖ
గరిష్ఠ పరిమితికి చేరుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్ష: ఆర్థిక సర్వే
వికసిత్ భారత్-2047 దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధిని మెరుగుపరిచేందుకు
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో చేపట్టిన సమగ్ర సంస్కరణే వీబీ- జీ రామ్ జీ
ఎఫ్‌వై14 నుంచి ఎఫ్‌వై 25 మధ్య 48% నుంచి 58.1%కి పెరిగిన మహిళల భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
29 JAN 2026 1:59PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మాలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం, రెండు దశాబ్దాలుగా గ్రామీణ ఉపాధి భారతదేశ సామాజిక భద్రతా వ్యవస్థలో కీలకంగా నిలిచింది.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్-2005 ప్రారంభమైనప్పటి నుంచి గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పాటు పని ఉండేలా చూస్తూ, వేతనంతో కూడిన ఉపాధిని కల్పించటం, గ్రామీణుల ఆదాయాన్ని స్థిరంగా ఉంచటం, ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించింది. మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న ఆదాయాలు, మెరుగైన రవాణా సౌకర్యాలు, విస్తృతమైన డిజిటల్ వినియోగం, వైవిధ్యభరితమైన జీవనోపాధి మార్గాలు గ్రామీణ ఉపాధి అవసరాలను మార్చాయి. ఒకవైపు ఈ కార్యక్రమం సాధించిన విజయాలను స్పష్టం చేస్తూనే, మరోవైపు దాని రూపకల్పన, లక్ష్యాలను పునః సమీక్షించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది.
కొన్నేళ్లుగా పథకం అమలులో పాలనాపరమైన, సాంకేతిక పరమైన సంస్కరణల వల్ల భాగస్వామ్యం, పారదర్శకత, డిజిటల్ పాలనలో గణనీయమైన మెరుగుదల నమోదైంది. గ్రామీణ ఉపాధిలో ఎఫ్‌వై14 నుంచి ఎఫ్‌వై 25 మధ్య 48% నుంచి 58.1%కి మహిళల భాగస్వామ్యం పెరిగింది. ఆధార్ సీడింగ్ ప్రక్రియ వేగవంతమవటంతో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ విస్తృతమైంది. దీంతో ఎలక్ట్రానిక్ చెల్లింపులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పనుల పర్యవేక్షణ మెరుగుపడింది. జియో-ట్యాగింగ్ ద్వారా ఆస్తులను గుర్తించడం, కుటుంబ స్థాయిలో వ్యక్తిగత ఆస్తుల కల్పన వాటా కూడా పెరిగింది. పరిమిత వనరులున్నప్పటికీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
ఈ విజయాలతో పాటు కొన్ని నిర్మాణాత్మక లోపాలు కొనసాగాయి. పలు రాష్ట్రాల్లో జరిగిన పర్యవేక్షణలో.. క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవటం, ఖర్చు చేసిన నిధులకు, జరిగిన పనికి పొంతన లేకపోవటం, శ్రమతో కూడిన పనుల్లో యంత్రాల ఉపయోగం, డిజిటల్ హాజరు విధానాన్ని పక్కదారి పట్టటం వంటి లోపాలు బయటపడ్డాయి. కాలక్రమేణా నిధుల దుర్వినియోగం పెరిగిపోయింది. కోవిడ్ అనంతరం స్వల్ప శాతం కుటుంబాలు మాత్రమే వంద పనిరోజులను పూర్తి చేసుకున్నాయి. పంపిణీ వ్యవస్థలు మెరుగుపడినప్పటికీ ఎంజీఎన్ఆర్ఈజీఏ గరిష్ఠ పరిమితికి చేరుకుందని, మారుతున్న గ్రామీణ పరిస్థితుల దృష్ట్యా ఈ పథకాన్ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్ గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం-2025ని వీబీ- జీ రామ్ జీ చట్టం -2025 అని కూడా పిలుస్తున్నారు. ఈ చట్టం, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ని సమూలంగా మార్చేసే సమగ్రమైన సంస్కరణ. వికసిత్ భారత్-2047 దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధిని మెరుగుపరటంతో పాటు జవాబుదారీతనాన్ని, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ భద్రతను బలోపేతం చేస్తుంది. వీబీ- జీ రామ్ జీ చట్టం -2025 భారతదేశ గ్రామీణ ఉపాధి విధానంలో విప్లవాత్మక మార్పును సూచిస్తుంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కాలక్రమేణా భాగస్వామ్యం, డిజిటలైజేషన్, పారదర్శకతలో గణనీయమైన విజయాలను సాధించినప్పటికీ, దీర్ఘకాలిక నిర్మాణాత్మక లోపాలు పథకం ప్రభావాన్ని పరిమితం చేశాయి. ఈ కొత్త చట్టం గత అభివృద్ధిని కొనసాగిస్తూనే, వాటిలోని లోపాలను సరిదిద్దితూ, మరింత ఆధునికంగా, జవాబుదారీతనంతో, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రూపొందించిన కొత్త వ్యవస్థను అందిస్తుంది.
వీబీ- జీ రామ్ జీ చట్టం -2025లోని కీలక అంశాలు:
వేతనం, సామాజిక భద్రతా చర్యలు:
ఈ చట్టం ప్రకారం, ప్రతి వారం లేదా పని పూర్తయిన 15 రోజుల్లోపు వేతనాలను చెల్లించాలి. సకాలంలో చెల్లింపు విధానం, కార్మికుల హక్కులను కాపాడటంతో పాటు గతంలో భాగస్వామ్యాన్ని దెబ్బతీసిన వేతన జాప్యాన్ని తగ్గిస్తుంది.
పటిష్ఠమైన పరిపాలన, సామర్థ్యం పెంపుదల:
వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ ఎంజీనరేగా పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్రను గుర్తిస్తూ, వీబీ జీ రామ్ జీ చట్టం పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలపరిచారు. మొత్తం వ్యయంలో పరిపాలనా ఖర్చుల పరిమితిని 6 నుంచి 9 శాతానికి పెంచటం వలన సిబ్బంది నియామకం, శిక్షణ, వేతనాలు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు మద్దతు లభిస్తుంది. వృత్తిపరమైన, పటిష్ఠమైన వ్యవస్థ దిశగా మళ్లుతున్న ఈ మార్పు.. ప్రణాళిక, అమలు, సేవలు అందించటాన్ని మెరుగుపరచటమే కాక, అన్ని స్థాయిల్లో జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
వికేంద్రీకృత ప్రణాళిక, స్థానిక సాధికారత:
వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వీబీ జీ రామ్ జీ ప్రణాళికను రూపొందిస్తారు. ఇవి పీఎం గతి శక్తి వంటి జాతీయ వ్యవస్థలతో భౌగోళికంగా అనుసంధానిస్తారు. జీపీలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తం వ్యయంలో సగ భాగం పనులను పంచాయతీలే అమలు చేస్తాయి. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, వనరులను కలిపి అమలు చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. భాగస్వామ్యంతో కూడిన ప్రణాళికా రూపకల్పనను ఈ విధానం ప్రోత్సహిస్తుంది. దీనివల్ల స్థిరమైన, స్థానిక అవసరాలకు తగిన అభివృద్ధి పనులు జరుగుతాయి.
ఆస్తులను సృష్టించటం, జాతీయ అభివృద్ధి ఏకీకరణ:
వీబీ జీ రామ్ జీ ద్వారా సృష్టించిన ఆస్తులను వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ లోకి చేరుస్తారు. ఇది సమగ్రమైన, సమన్వయంతో కూడిన అభివృద్ధి వ్యూహాన్ని నిర్ధారిస్తుంది. స్థానికంగా జరిగే పనులను దేశవ్యాప్త ప్రాధాన్యతలతో అనుసంధానించడం ద్వారా గ్రామీణ ప్రజల తక్షణ జీవనోపాధికి మద్దతివ్వడమే కాక, దీర్ఘకాలిక వ్యూహాత్మక మౌలిక సదుపాయాల లక్ష్యాలను సాధించేందుకు ఈ చట్టం దోహదపడుతుంది.
పారదర్శకత, జవాబుదారీతనం, పర్యవేక్షణ:
వ్యవస్థ అంతటా పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ఈ చట్టం పెంపొందిస్తుంది. ఫిర్యాదులపై దర్యాప్తు చేసే అధికారం, అవకతవకలు జరిగినప్పుడు నిధుల విడుదలను నిలిపివేసే అధికారం, దిద్దుబాటు చర్యలు చేపట్టే అధికారం కేంద్రానికి ఉంటుంది. రియల్ టైమ్ పర్యవేక్షణ, పనులకు సంబంధించి జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్, ఎంఐఎస్ డ్యాష్బోర్డ్లు, వారానికోసారి బహిరంగంగా వివరాలను వెల్లడించడం ద్వారా డిజిటల్ పాలనను బలోపేతం చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు కనీసం ఒకసారి సామాజిక తనిఖీని తప్పనిసరి చేశారు. పనుల బహిరంగ ప్రదర్శనలో, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో జీపీలు మరింత కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలు నిరంతర మార్గదర్శకత్వాన్ని, పర్యవేక్షణను, సమన్వయాన్ని అందిస్తాయి. బయోమెట్రిక్, ఏఐ ఆధారిత పర్యవేక్షణ ద్వారా అక్రమాలను ముందుగానే గుర్తించవచ్చు.
ఆర్థిక సుస్థిరత:
ఈ చట్ట ఆర్థిక నిర్మాణం.. రాష్ట్రాలపై అనవసర భారం పడకుండా నిధుల లభ్యతపై స్పష్టమైన భరోసానిస్తుంది. నిర్దేశిత నిధుల కేటాయింపులు, ఖర్చులను పంచుకునే పద్ధతులు, విపత్తుల సమయంలో అందించే అదనపు మద్దతు వంటివి స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అందిస్తాయి. పటిష్ఠమైన పర్యవేక్షణ, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థలు నిధుల దుర్వినియోగాన్ని తగ్గించి, ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రోత్సహిస్తాయి.
****
(రిలీజ్ ఐడి: 2221045)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36