ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


ఒకప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితమైన భారత విమానయాన రంగంలో గత పదేళ్లలో మునుపెన్నడూ లేనంత మార్పు: ప్రధాని

ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత విమానయాన రంగం
ప్రభుత్వ దీర్ఘకాల దృష్టితోనే భారత విమానయాన రంగంలో వేగవంతమైన వృద్ధి: ప్రధాని

సామాన్య పౌరుడు కూడా విమానంలో సులభంగా ప్రయాణించాలనే లక్ష్యంతో, విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాం: ప్రధానమంత్రి

దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన సర్వీసులను పెంచడానికి, తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యాలను కల్పించడానికి, దేశవ్యాప్తంగా సీ-ప్లేన్ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉడాన్ పథకం తదుపరి దశపై ప్రభుత్వం పని చేస్తోంది: ప్రధాని

దేశంలో ఇప్పటికే యుద్ధ విమానాలను, రవాణా విమానాలను తయారు చేయడం మొదలుపెట్టిన భారత్ ఇప్పుడు పౌర విమానాల తయారీ రంగంలో కూడా వేగంగా ముందుకు సాగుతోంది: ప్రధానమంత్రి

ప్రపంచ దేశాలకు, గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న) దేశాల మధ్య ప్రధాన విమానయాన ద్వారంగా మారుతున్న భారత్: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 JAN 2026 6:43PM by PIB Hyderabad

తెలంగాణలోని హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామిక దిగ్గజాలకు, నిపుణులకు, పెట్టుబడిదారులకు సాదరంగా స్వాగతం పలికారు. విమానయాన రంగంలో రాబోయే కాలం కొత్త ఆశయాలతో నిండి ఉంటుందని, ఇందులో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన పేర్కొన్నారు. విమానాల తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ వంటి రంగాల్లో భారత్ ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తోందని ప్రధాని వివరించారు. ప్రపంచ విమానయాన మార్కెట్లో భారతదేశం ఇప్పుడు ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన చెప్పారు. విమానయాన రంగానికి చెందిన భాగస్వాములందరికీ ఈ 'వింగ్స్ ఇండియా' సదస్సు ఒక ముఖ్యమైన వేదిక అని ప్రధాని తెలిపారు. 

 

గత పదేళ్లలో భారత విమానయాన రంగం ఒక చారిత్రక మార్పునకు గురైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు విమాన ప్రయాణం కేవలం కొద్దిమంది ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమయ్యేదని, కానీ ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, దీనికి అనుగుణంగానే భారతీయ విమానయాన సంస్థలు తమ విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లలో ఏకంగా 1,500 పైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చారని ఆయన వివరించారు.

 

ప్రభుత్వ దూరదృష్టి వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని ప్రధాని స్పష్టం చేశారు. విమాన ప్రయాణాన్ని కొందరికే పరిమితం చేయకుండా, ప్రతి పౌరుడు సులభంగా ప్రయాణించాలనే లక్ష్యంతో అందరికీ అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు.ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను విమానాశ్రయాలతో అనుసంధానించినట్లు ఆయన పేర్కొన్నారు. 2014లో మన దేశంలో కేవలం 70 ఎయిర్‌పోర్ట్‌లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 160 దాటిందని ఆయన గుర్తు చేశారు. అంటే కేవలం పదేళ్లలోనే ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు పైగా పెంచామన్నారు.100కు పైగా ఏరోడ్రోమ్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.ప్రభుత్వం సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసేందుకు 'ఉడాన్' పథకాన్ని తీసుకొచ్చిందని ప్రధాని తెలిపారు. ఈ పథకం ద్వారా విమాన టికెట్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ఉడాన్ పథకం వల్ల ఇప్పటివరకు దాదాపు కోటిన్నర మంది ప్రయాణికులు విమానమెక్కారని ప్రధాని తెలిపారు. గతంలో అసలు విమాన రాకపోకలే లేని ఎన్నో కొత్త మార్గాల్లో ఇప్పుడు సర్వీసులు నడుస్తున్నాయని ఆయన వివరించారు.

వికసిత భారత్ లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తున్న కొద్దీ, విమానయాన సౌకర్యాలు కూడా అనేక రెట్లు పెరుగుతాయని ప్రధాని వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారతదేశంలో 400 పైగా విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చి, దేశవ్యాప్తంగా ఒక భారీ నెట్‌వర్క్ ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న కీలక చర్యలను ఆయన వివరించారు: ప్రభుత్వం ఉడాన్ పథకం తదుపరి దశపై పని చేస్తోందని, దీనివల్ల ప్రాంతీయంగా విమాన సౌకర్యాలు మరింత మెరుగుపడటమే కాకుండా, ప్రయాణ ఖర్చులు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. దీనితో పాటు, దేశవ్యాప్తంగా సీ-ప్లేన్ (నీటిపై దిగే విమానాలు) సేవలను విస్తరించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతి మూలకు ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

 

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై కూడా ప్రభుత్వం గట్టిగా దృష్టి సారించిందని ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆధునికీకరిస్తున్నామని, దీనివల్ల చాలామంది ప్రయాణికులు విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. రాబోయే కాలంలో విమాన ప్రయాణాలకు ఉన్న డిమాండ్ మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతుందని, ఇది పెట్టుబడులకు మరిన్ని గొప్ప అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని అన్నారు. 

 

ప్రపంచ విమానయాన రంగంలో భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో, మన అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడటం తగ్గించుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. స్వయం సమృద్ధి దిశగా మనం వేసే అడుగులు భారత్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు. విమానాల డిజైన్, తయారీ, వాటి మరమ్మతులకు సంబంధించిన ఎంఆర్ఓ (మైంటెనన్స్,రిపేర్,ఓవర్హాల్) వ్యవస్థను బలోపేతం చేయడంపై భారత్ గట్టిగా దృష్టి పెడుతోందని ప్రధాని చెప్పారు. విమాన విడిభాగాల తయారీలోనూ, సరఫరాలోనూ భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన దేశంగా మారిందని ఆయన గుర్తు చేశారు. మన దేశంలోనే యుద్ధ విమానాలను, రవాణా విమానాలను తయారు చేయడం ఇప్పటికే మొదలుపెట్టామని, ఇప్పుడు పౌర విమానాల తయారీలో కూడా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ఆయన వివరించారు. ప్రపంచ విమానయాన మార్గాల్లో భారత్ కు ఉన్న భౌగోళిక స్థానం ఒక గొప్ప వరమని ప్రధాని చెప్పారు. దీనికి తోడు మన దేశంలో ఉన్న అద్భుతమైన దేశీయ నెట్‌వర్క్, భవిష్యత్తులో పెరగబోయే సుదూర ప్రయాణ విమానాల సంఖ్య, ఇవన్నీ కలిసి భారత విమానయాన రంగాన్ని ఎంతో బలోపేతం చేస్తాయని ఆయన వివరించారు.

భారతదేశంలోనే డిజైన్ చేసి, తయారు చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్-ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీఓఎల్) విమానాలు విమానయాన రంగానికి కొత్త దిశను చూపే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని పేర్కొన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పర్యావరణ హితమైన విమానయాన ఇంధనం తయారీపై కూడా భారత్ ముమ్మరంగా పనిచేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఈ 'గ్రీన్ ఫ్యూయల్'ను ఉత్పత్తి చేయడమే కాకుండా, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

విమానయాన రంగంలో భారత్ చేపడుతున్న అనేక సంస్కరణల వల్ల, మన దేశం గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న) దేశాలు, ప్రపంచ దేశాల మధ్య ఒక ప్రధాన విమానయాన ద్వారంగా మారుతోందని ప్రధాని తెలిపారు. విమానయాన పరిశ్రమతో అనుబంధం ఉన్న పెట్టుబడిదారులకు, తయారీదారులకు ఇది ఒక అద్భుతమైన సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు.

 

వివిధ ప్రాంతాలు, మార్కెట్లను అనుసంధానించడంలో భారత్ వేగంగా దూసుకుపోతోందని, ముఖ్యంగా నగరాలను ఓడరేవులతో వివిధ రవాణా మార్గాల ద్వారా అనుసంధానిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. భారత విమానయాన దార్శనికత కేవలం ప్రయాణికులకే పరిమితం కాదని, ఎయిర్ కార్గో (రవాణా) రంగానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. విమానాల ద్వారా సరకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా జరిగేలా అవసరమైన అన్ని నియంత్రణ సంస్కరణలపై ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు. డిజిటల్ కార్గో ప్లాట్‌ఫామ్‌లు మొత్తం ప్రక్రియను సులభతరం చేసి మరింత పారదర్శకంగా మారుస్తున్నాయని, అలాగే ఆఫ్-ఎయిర్‌పోర్ట్ ప్రాసెసింగ్ ఏర్పాట్లు విమానాశ్రయాలపై ఉన్న భారాన్ని తగ్గిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. కార్గో నిర్వహణను మెరుగుపరచి వేగవంతం చేయడానికి ఆధునిక గోదాములు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. వీటివల్ల భవిష్యత్తులో డెలివరీ సమయం తగ్గడంతో పాటు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన అన్నారు. భారత్ ఒక ప్రధానమైన, పోటీ సామర్థ్యం గల ట్రాన్స్-షిప్‌మెంట్ హబ్‌గా అవతరించబోతోందని స్పష్టం చేస్తూ, గోదాముల నిర్వహణ, ఫ్రైట్ ఫార్వార్డింగ్, ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్, ఈ-కామర్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులు పరిశీలించాలని శ్రీ మోదీ కోరారు.

 

ప్రపంచంలో ఈరోజు చాలా కొద్ది దేశాలకే విమానయాన రంగంలో భారత్‌కు ఉన్నంత విస్తృత స్థాయి, విధాన స్థిరత్వం, సాంకేతిక ఆశయాలు ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ స్వర్ణావకాశాన్ని ప్రతి దేశం, ప్రతి పరిశ్రమ నేత, ప్రతి ఆవిష్కర్త పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో దీర్ఘకాలిక భాగస్వాములుగా మారి, ప్రపంచ విమానయాన రంగం వృద్ధికి తమ వంతు సహకారం అందించాలని శ్రీ మోదీ కోరారు. భారత్‌ విమానయాన ప్రయాణంలో సహ-పైలట్లుగా భాగస్వాములవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ ఆయన ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు. ‘వింగ్స్ ఇండియా’ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

 


(रिलीज़ आईडी: 2219831) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Tamil , Malayalam