ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
నవ శకంలోకి అడుగుపెట్టిన భారత్-ఈయూ సంబంధాలు: పీఎం
కార్మిక శక్తి ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను అందించే భారత్-ఈయూ ఎఫ్‌టీఏ: పీఎం
భారత్-ఈయూ సంబంధాలను ఏకోన్ముఖ సామాజిక భాగస్వామ్యంగా మార్చాలని పీఎం పిలుపు
ప్రపంచాభివృద్ధికి డబుల్ ఇంజిన్‌గా ఇండియా-ఈయూ మారాలి: పీఎం
प्रविष्टि तिथि:
27 JAN 2026 9:21PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండియా-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ ఫోరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, కమిషన్ల అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య సందర్శన కాదని, అది భారత్-ఈయూ సంబంధాల్లో నూతన శక ప్రారంభాన్ని సూచిస్తుందన్నారు. భారత గణతంత్ర దినోత్సవాల్లో ఈయూ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం ఇదే తొలిసారని శ్రీ మోదీ వెల్లడించారు. దేశ చరిత్రలో అతి పెద్ద స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని భారత్, యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్నాయని తెలియజేశారు. అనేక మంది సీఈవోలతో పెద్ద స్థాయిలో భారత్-యూరోపియన్ యూనియన్ వ్యాపార వేదికను నిర్వహించామన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయాన్ని సూచిస్తున్నాయని వివరించారు.
ఈ సమన్వయం యాదృచ్ఛికమైనది కాదని, అంతర్జాతీయ స్థిరత్వం కోసం మార్కెట్ ఆర్థిక వ్యవస్థలుగా భారత్, ఈయూలకు ఉమ్మడి విలువలు, సంయుక్త ప్రాధాన్యాలున్నాయని, స్వేచ్ఛాయుత సమాజాలుగా ప్రజల మధ్య సహజ సంబంధాలున్నాయన్నారు. ఇలాంటి బలమైన పునాదిపై ఏర్పడిన ఈ భాగస్వామ్యం నూతన శిఖరాలకు చేరుకుంటుందని, స్పష్టమైన ఫలితాలతో ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా ఏర్పడుతుందని చెప్పారు. గడచిన పదేళ్లలో వాణిజ్యం రెట్టింపై 180 బిలియన్ యూరోలకు చేరుకుందని, 6,000కు పైగా యూరోపియన్ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. అలాగే భారత్‌లో ఈయూ పెట్టుబడులు 120 బిలియన్ల యూరోలను దాటాయని వెల్లడించారు. ఈయూలో కూడా 1,500 భారతీయ సంస్థలు పనిచేస్తున్నాయని, అక్కడ భారత పెట్టుబడులు దాదాపు 40 బిలియన్ యూరోలకు చేరుకున్నాయని చెప్పారు. ఆర్ అండ్ డీ, తయారీ, సేవా రంగాల్లో భారత్, యూరోపియన్ సంస్థల మధ్య బలమైన సహకారం ఉందనీ, దీనిని నడిపించేది, లబ్ధి పొందేది ఇరుపక్షాలకు చెందిన వ్యాపారవేత్తలేనన్నారు.
‘ఏకోన్ముఖ సామాజిక భాగస్వామ్యం’గా ఈ భాగస్వామ్యాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ దార్శనికతతోనే ఈ రోజు సమగ్ర ఎఫ్‌టీఏ పూర్తయిందని, ఇది యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను అందిస్తుందని, దీనివల్ల జౌళి, రత్నాలు, ఆభరణాలు, వాహన విడిభాగాలు, ఇంజినీరింగ్ వస్తువులకు ప్రయోజనం లభిస్తుందని శ్రీ మోదీ తెలియజేశారు. అలాగే పండ్లు, కూరగాయలు, శుద్ధి చేసిన ఆహారం, సముద్ర ఉత్పత్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. ముఖ్యంగా రైతులకు, మత్స్యకారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందనీ, అలాగే సేవారంగంలో ప్రధానంగా ఐటీ, విద్య, సంప్రదాయ వైద్యం, వ్యాపార సేవలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
ప్రపంచ వ్యాపార రంగంలో ప్రధాన అనిశ్చితులు నెలకొనడంతో సంస్థలు తమ మార్కెట్ వ్యూహాలు, భాగస్వామ్యాలపై పునరాలోచిస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో వ్యాపార ప్రపంచానికి ఈ ఎఫ్‌టీఏ స్పష్టమైన, సానుకూలమైన సందేశాన్ని పంపిస్తోందని చెప్పారు. అలాగే ఉభయ పక్షాల వ్యాపార సమూహాల మధ్య సమర్థమైన, విశ్వసనీయమైన, భవిష్యత్తు ఆధారిత భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన వేదికగా పనిచేస్తుందనీ, ఈ ఎఫ్‌టీఏ అందించే అవకాశాలను వ్యాపారవేత్తలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
వ్యాపార భాగస్వామ్యాలకు లబ్ధి చేకూరేలా భారత్, యూరోపియన్ యూనియన్‌కు ఉమ్మడి ప్రాధాన్యాలున్నాయని శ్రీ మోదీ అన్నారు. మూడు ప్రాధాన్యాంశాలను ఆయన ప్రస్తావించారు. మొదటిది, వాణిజ్యం, సాంకేతికత, కీలకమైన ఖనిజాలు ఆయుధాలుగా మారిన ఈ ప్రపంచంలో ఇతరులపై ఆధారపడటం వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గించడానికి సంయుక్తంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీలు, బ్యాటరీలు, చిప్పులు, ఏపీఐల విషయంలో ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించాలని, నమ్మకమైన ఉమ్మడి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని వ్యాపార సమాజాన్ని ఆయన కోరారు. రెండోది, రక్షణ పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతలపై భారత్, ఈయూ దృష్టి సారించాలన్నారు. రక్షణ, అంతరిక్షం, టెలికాం, ఏఐ రంగాల్లో సహకారం ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మూడోది, ఇరు పక్షాలకు స్వచ్ఛమైన, సుస్థిరమైన భవిష్యత్తు ప్రాధాన్యమని స్పష్టం చేశారు. హరిత హైడ్రోజన్, సౌర విద్యుత్తు, స్మార్ట్ గ్రిడ్లలో ఉమ్మడి పరిశోధన, పెట్టుబడులకు పిలుపునిచ్చారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, సుస్థిర రవాణా వ్యవస్థలపై పరిశ్రమలు కలసి పనిచేయాలని శ్రీ మోదీ సూచించారు. అలాగే జల నిర్వహణ, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థల, సుస్థిర వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేయాలన్నారు.
ఈ రోజు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలతో వ్యాపార వర్గాలపై ప్రత్యేక బాధ్యత ఉందని ప్రధానమంత్రి అన్నారు. తర్వాతి అడుగు వేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. పరస్పర సహకారం ద్వారానే ఈ భాగస్వామ్యానికి విశ్వసనీయత, పరిధి, స్థాయి చేకూరతాయని శ్రీ మోదీ వివరించారు. ఉమ్మడి సంక్షేమాన్ని సమష్టి ప్రయత్నాలతో సాధించవచ్చన్నారు. తమ సామర్థ్యాలను ఏకం చేయాలని, మొత్తం ప్రపంచాభివృద్ధికి డబుల్ ఇంజిన్‌గా మారాలంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్, భారతీయ, ఐరోపా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
(रिलीज़ आईडी: 2219588)
आगंतुक पटल : 7