ప్రధాన మంత్రి కార్యాలయం
2025 వ సంవత్సరం డిసెంబర్ 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 129 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
నాడు పోస్టు చేయడమైనది:
28 DEC 2025 11:47AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం. మీకు అభినందనలు. 2026 సంవత్సరం కొన్ని రోజుల దూరంలో ఉంది. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక సంవత్సరం జ్ఞాపకాలు మొత్తం నా మనస్సులో తిరుగుతున్నాయి. అనేక చిత్రాలు, అనేక చర్చలు, దేశాన్ని ఏకం చేసిన అనేక విజయాలు గుర్తొస్తున్నాయి. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిన అనేక క్షణాలను 2025 మనకు అందించింది. దేశ భద్రత నుండి క్రీడా మైదానాల వరకు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల నుండి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు భారతదేశం ప్రతిచోటా బలమైన ముద్ర వేసింది. ఈ సంవత్సరం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. నేటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీపడదని ప్రపంచం స్పష్టంగా చూసింది. ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా దేశంలోని ప్రతి మూల నుండి భారతమాత పట్ల ప్రేమ, భక్తికి సంబంధించిన చిత్రాలు ముందుకొచ్చాయి. ప్రజలు తమ స్వీయ ప్రత్యేక మార్గాల్లో తమ భావాలను వ్యక్తం చేశారు.
మిత్రులారా! 'వందేమాతరం' 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఇదే స్ఫూర్తి కనిపించింది. '#VandeMataram150' అనే హ్యాష్ ట్యాగ్ తో మీ సందేశాలు, సూచనలను పంపమని నేను మిమ్మల్ని కోరాను. ఈ ప్రచారంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మిత్రులారా! 2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరం. మన పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ విజేత గా నిలిచింది. అంధ మహిళల టి 20 ప్రపంచ కప్పును గెలుచుకోవడం ద్వారా భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా కప్ టి 20లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు సాధించడం ద్వారా ఏ అడ్డంకి కూడా తమ శక్తిని ఆపలేదని పారా-అథ్లెట్లు నిరూపించారు. భారతదేశం వైజ్ఞానిక, అంతరిక్ష రంగంలో కూడా ముందుకు దూసుకెళ్లింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న మొదటి భారతీయురాలు శుభాన్షు శుక్లా. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన అనేక ప్రయత్నాలు కూడా 2025కు గుర్తింపుగా మారాయి. భారతదేశంలో చిరుతల సంఖ్య ఇప్పుడు 30 కి పైగా పెరిగింది. 2025లో విశ్వాసం, సంస్కృతి, భారతదేశ ప్రత్యేక వారసత్వం అన్నీ కలిసి వచ్చాయి. సంవత్సరం ప్రారంభంలో జరిగిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సంవత్సరం చివరిలో అయోధ్యలోని రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి భారతీయుడిని గర్వంతో నింపింది. స్వదేశీ పట్ల ఉత్సాహం కూడా స్పష్టంగా కనిపించింది. భారతీయుడి చెమటతో, భారత మట్టి సుగంధంతో కూడిన వస్తువులను మాత్రమే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. భారతదేశానికి 2025 సంవత్సరం మరింత విశ్వాసాన్ని ఇచ్చిందని నేడు మనం గర్వంగా చెప్పగలం. ఈ సంవత్సరం మనం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవలసి వచ్చిందనేది కూడా నిజం. ఇప్పుడు 2026లో కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా! భారతదేశాన్ని నేడు ప్రపంచం గొప్ప ఆశతో చూస్తోంది. భారతదేశంలో ఆశాభావానికి అతిపెద్ద కారణం మన యువశక్తి. వైజ్ఞానిక రంగంలో మన విజయాలు, కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక విస్తరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను బాగా ఆకట్టుకున్నాయి.
మిత్రులారా! భారతదేశ యువత ఎల్లప్పుడూ కొత్త అంశాలను సాధించాలన్న మక్కువ కలిగి ఉంటారు. వారి అవగాహన కూడా అలాగే ఉన్నత స్థాయిలో ఉంటుంది. దేశ నిర్మాణానికి తాము ఎలా దోహదపడగలమని నా యువ మిత్రులు తరచుగా నన్ను అడుగుతారు. వారు తమ ఆలోచనలను ఎలా పంచుకోగలరు! చాలామంది తమ ఆలోచనలను నాకు ఎలా అందించగలమని అడుగుతారు. మన యువ మిత్రుల ఈ ఉత్సుకతకు సమాధానం 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్'. దీని మొదటి దఫా కార్యక్రమం గత సంవత్సరం జరిగింది. ఇప్పుడు రెండవ కార్యక్రమం కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది. వచ్చే నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 'జాతీయ యువజన దినోత్సవం' జరుపుకుంటారు. ఆ రోజున 'యంగ్ లీడర్స్ డైలాగ్' కూడా జరుగుతుంది. నేను కూడా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటాను. ఈ కార్యక్రమంలో మన యువత నవీన ఆవిష్కరణలు, ఫిట్‌నెస్, స్టార్టప్‌లు, వ్యవసాయం వంటి ముఖ్యమైన అంశాలపై తమ ఆలోచనలను పంచుకుంటారు. ఈ కార్యక్రమం గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.
మిత్రులారా! ఈ కార్యక్రమంలో మన యువత భాగస్వామ్యం పెరగడం చూసి నేను సంతోషిస్తున్నాను. దీనికి సంబంధించిన క్విజ్ పోటీ కొన్ని రోజుల క్రితం జరిగింది. ఇందులో యాభై లక్షలకు పైగా యువతీ యువకులు పాల్గొన్నారు. ఒక వ్యాసరచన పోటీ కూడా జరిగింది. ఇందులో విద్యార్థులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పోటీలో తమిళనాడు మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచాయి.
మిత్రులారా! నేడు దేశంలోని యువతరం తమ ప్రతిభను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలను పొందుతోంది. యువతీయువకులు తమ సామర్థ్యాలు, ఆసక్తుల ప్రకారం తమ ప్రతిభను ప్రదర్శించగల అనేక వేదికలను అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి ఒక వేదిక 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'. ఇది ఆలోచనలను కార్యాచరణగా మార్చే మరొక మాధ్యమం.
మిత్రులారా! 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025' ఈ నెలలో ముగిసింది. ఈ హ్యాకథాన్ సందర్భంగా విద్యార్థులు 80 కి పైగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన 270 కి పైగా సమస్యలపై పనిచేశారు. ట్రాఫిక్ సమస్య వంటి నిజ జీవిత సవాళ్లకు సంబంధించిన పరిష్కారాలను విద్యార్థులు అందించారు. దీనికి సంబంధించి యువతీయువకులు 'స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్'కు సంబంధించిన చాలా ఆసక్తికరమైన దృక్పథాలను పంచుకున్నారు. ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్టులు వంటి సవాళ్లకు పరిష్కారాలపై యువత తమ ఆలోచనలను కూడా ముందుకు తెచ్చింది. గ్రామాల్లో డిజిటల్ బ్యాంకింగ్ కోసం సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌పై సూచనలు అందజేశారు. వ్యవసాయ రంగం సవాళ్లను పరిష్కరించడంలో చాలా మంది యువతీయువకులు నిమగ్నమై ఉన్నారు. మిత్రులారా! గత 7-8 సంవత్సరాల్లో 13 లక్షలకు పైగా విద్యార్థులు 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'లో పాల్గొన్నారు. ఆరు వేల కంటే ఎక్కువ సంస్థలు ఈ హ్యాకథాన్ లో పాలుపంచుకున్నాయి. యువతీయువకులు వందలాది సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాలను కూడా అందించారు. ఇటువంటి హ్యాకథాన్‌లు ఎప్పటికప్పుడు జరుగుతాయి. ఈ హ్యాకథాన్‌లలో భాగం కావాలని నా యువ స్నేహితులను నేను కోరుతున్నాను.
మిత్రులారా! నేటి జీవితం సాంకేతికతతో ముడిపడి ఉంది. శతాబ్దాల కాలంలో జరిగే మార్పులు ఇప్పుడు కొన్ని సంవత్సరాలలో జరుగుతున్నాయి. రోబోలు మానవుల స్థానాన్ని భర్తీ చేస్తాయేమోనని కొన్నిసార్లు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ మారుతున్న కాలంలో మన మూలాలతో అనుసంధానం కావడం మానవ అభివృద్ధికి చాలా ముఖ్యం. మన తర్వాతి తరం కొత్త ఆలోచన, కొత్త పద్ధతుల సహాయంతో మన సంస్కృతి మూలాలతో అనుసంధానం కావడాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను.
మిత్రులారా! మీరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గురించి విని ఉంటారు. పరిశోధన, ఆవిష్కరణలు ఈ సంస్థ ముఖ్య లక్షణాలు. కొన్ని సంవత్సరాల కిందట అక్కడి కొంతమంది విద్యార్థులు తమ అధ్యయనాలు, పరిశోధనలలో సంగీతాన్ని కూడా చేర్చాలని భావించారు. అక్కడే ఒక చిన్న సంగీత తరగతి ప్రారంభమైంది. దీనికి పెద్ద వేదిక లేదా భారీ బడ్జెట్ అవసరం లేదు. క్రమంగా ఈ చొరవ పెరిగింది. నేడు మనం దీన్ని 'గీతాంజలి IISc' అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇది ఇకపై కేవలం ఒక తరగతి కాదు. ఇది క్యాంపస్ సాంస్కృతిక కేంద్రం. ఇది హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, జానపద సంప్రదాయాలు, శాస్త్రీయ శైలులను అందిస్తుంది. విద్యార్థులు ఇక్కడ కలిసి సాధన చేస్తారు. ప్రొఫెసర్లు కలిసి కూర్చుంటారు. వారి కుటుంబాలు కూడా చేరతాయి. నేడు రెండు వందల మందికి పైగా ఇందులో పాల్గొంటున్నారు. ప్రత్యేక విషయం ఏమిటంటే విదేశాలకు వెళ్లిన వారు కూడా ఆన్‌లైన్‌లో ఈ గ్రూపులో చేరుతున్నారు.
మిత్రులారా! మన మూలాలతో అనుసంధానం అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయులు కూడా తమ పాత్రను పోషిస్తున్నారు. మనల్ని దేశం వెలుపలికి తీసుకెళ్లే మరో ఉదాహరణ దుబాయ్. అక్కడ నివసించే కన్నడ కుటుంబాలు తమను తాము ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకున్నాయి. “మన పిల్లలు టెక్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నారు, కానీ వారు తమ భాష నుండి దూరమవుతున్నారా?” అని. "కన్నడ పాఠశాల" ఈ ప్రశ్న నుండే పుట్టింది. పిల్లలకు కన్నడ బోధించడం, నేర్చుకోవడం, రాయడం, మాట్లాడటం నేర్పించే ప్రయత్నమిది. వెయ్యి మందికి పైగా పిల్లలు ఇందులో పాల్గొంటున్నారు. నిజంగా కన్నడ నాడు, నుడి నమ్మా హేమ్మే. కన్నడ భూమి, భాష మన గర్వం.
మిత్రులారా! ‘మనసుంటే మార్గముంటుందని ఒక పాత సామెత ఉంది. ఈ మాట మణిపూర్‌కు చెందిన యువకుడు మోయిరంగ్ థెమ్ సేథ్ ద్వారా మరోసారి నిజమని నిరూపితమైంది. ఆయన వయస్సు 40 సంవత్సరాల కంటే తక్కువ. మోయిరంగ్ థెమ్ నివసించే మణిపూర్ మారుమూల ప్రాంతంలో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండేది. ఈ సవాలును అధిగమించడానికి ఆయన స్థానిక పరిష్కారాలపై ఆధారపడ్డారు. సౌరశక్తిలో ఈ పరిష్కారాన్ని కనుగొన్నారు. మణిపూర్‌లో సౌరశక్తిని ఉత్పత్తి చేయడం చాలా సులభం. కాబట్టి మోయిరంగ్ థెమ్ సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం కారణంగా నేడు ఆ ప్రాంతంలోని వందలాది ఇళ్లకు సౌరశక్తి చేరుకుంది. ప్రత్యేకత ఏమిటంటే ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధిని మెరుగుపరచడానికి ఆయన సౌరశక్తిని ఉపయోగించారు. నేడు ఆయన ప్రయత్నాల కారణంగా మణిపూర్‌లోని అనేక ఆరోగ్య కేంద్రాలు కూడా సౌరశక్తిని పొందుతున్నాయి. మణిపూర్ మహిళా శక్తి కూడా ఈ పని నుండి చాలా ప్రయోజనం పొందింది. స్థానిక మత్స్యకారులు, కళాకారులు కూడా దీని ద్వారా సహాయం పొందారు. మిత్రులారా! నేడు 'పి.ఎం. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన' కింద ప్రభుత్వం ప్రతి లబ్ధిదారు కుటుంబానికి సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి సుమారు 75,000 నుండి 80,000 రూపాయలను అందిస్తోంది. మోయిరంగ్ థెమ్ ప్రయత్నాలు వ్యక్తిగతమైనప్పటికీ అవి సౌరశక్తికి సంబంధించిన ప్రతి ప్రచారానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 'మన్ కీ బాత్' ద్వారా ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌కు వెళ్దాం. జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం గురించి మీకు గర్వంగా అనిపించే ఒక కథను నేను పంచుకోవాలనుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో జెహన్‌పోరా అనే ప్రదేశం ఉంది. చాలా సంవత్సరాలుగా ప్రజలు అక్కడ కొన్ని ఎత్తైన గుట్టలను చూస్తున్నారు. ఇవి సాధారణ గుట్టలుగానే ఉన్నాయి. అవి ఏమిటో ఎవరికీ తెలియదు. అప్పుడు ఒక రోజు ఒక పురావస్తు శాస్త్రవేత్త వాటిని గమనించాడు. ఆయన ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించినప్పుడు ఈ గుట్టలు కొంత అసాధారణంగా కనిపించాయి. దీని తరువాత ఈ గుట్టల శాస్త్రీయ అధ్యయనం ప్రారంభమైంది. పై నుండి ఛాయాచిత్రాలు తీయడానికి డ్రోన్‌లను ఉపయోగించారు. భూమిని మ్యాప్ చేశారు. ఆపై కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడటం ప్రారంభించాయి. ఈ గుట్టలు సహజమైనవి కాదని తేలింది. అవి భారీ మానవ నిర్మిత నిర్మాణ అవశేషాలు. ఈ సందర్భంలో మరొక ఆసక్తికరమైన విశేషం తెలిసింది. కాశ్మీర్ నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఫ్రాన్స్‌లోని ఒక మ్యూజియం ఆర్కైవ్‌లలో పాత, అస్పష్టమైన ఛాయాచిత్రాన్ని కనుగొన్నారు. బారాముల్లాకు చెందిన ఆ ఛాయాచిత్రం మూడు బౌద్ధ స్థూపాలను చూపించింది. ఇక్కడి నుండి కాలం మలుపు తిరిగింది. కాశ్మీర్ అద్భుతమైన గతం మనకు వెల్లడైంది. ఈ చరిత్ర దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. కాశ్మీర్‌లోని జెహన్‌పోరాలో ఉన్న ఈ బౌద్ధ సముదాయం కాశ్మీర్ గతాన్ని, దాని గొప్ప గుర్తింపును మనకు గుర్తు చేస్తుంది.
నా ప్రియమైన దేశ ప్రజలారా! ఇప్పుడు నేను మీతో భారతదేశం నుండి వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక ప్రయత్నం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ ప్రయత్నం మన హృదయాలను ఆకట్టుకుంటుంది. భారతీయ భాష , సంస్కృతిని ప్రోత్సహించడానికి ఫిజీలో ప్రశంసనీయమైన చొరవ జరుగుతోంది. అక్కడి కొత్త తరాన్ని తమిళ భాషతో జోడించడానికి వివిధ స్థాయిలలో నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిజీలోని రాకి-రాకి ప్రాంతంలోని ఒక పాఠశాలలో మొదటిసారిగా గత నెలలో తమిళ దినోత్సవాన్ని జరుపుకున్నారు. తమ భాషపై బహిరంగంగా గర్వాన్ని వ్యక్తం చేసే వేదిక ఆ రోజు పిల్లలకు లభించింది. వారు తమిళంలో కవితలు చదివారు. ప్రసంగించారు. వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ సంస్కృతిని ప్రదర్శించారు. మిత్రులారా! దేశంలో తమిళ భాషను ప్రోత్సహించడానికి నిరంతరం కృషి జరుగుతోంది. కొద్ది రోజుల కిందట నా పార్లమెంటరీ నియోజకవర్గం కాశీలో నాలుగవ ‘కాశీ తమిళ సంగమం’ జరిగింది. ఇప్పుడు నేను మీతో ఒక ఆడియో క్లిప్‌ను పంచుకుంటాను. ఈ క్లిప్ వినండి. తమిళం మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఈ పిల్లలు ఎక్కడి వారో ఊహించండి.
# (ఆడియో క్లిప్ 1 పాయల్) #
మిత్రులారా! తమిళంలో చాలా స్పష్టంగా తమ భావాలను వ్యక్తీకరిస్తున్న ఈ పిల్లలు కాశీకి- వారణాసికి- చెందినవారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వారి మాతృభాష హిందీ. కానీ తమిళ భాష పట్ల వారికి ఉన్న ప్రేమ వారిని తమిళం నేర్చుకోవడానికి ప్రేరేపించింది. ఈ సంవత్సరం వారణాసిలో జరిగిన 'కాశీ తమిళ సంగమం' సందర్భంగా తమిళం నేర్చుకోవడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. 'లర్న్ తమిళ్ - తమిళ కరాకలం' అనే థీమ్ కింద వారణాసిలోని 50 కి పైగా పాఠశాలల్లో ప్రత్యేక ప్రచారాలను నిర్వహించారు. దీని ఫలితాలను ఈ ఆడియో క్లిప్‌లో మనం వినవచ్చు.
# (ఆడియో క్లిప్ 2 వైష్ణవి) #
మిత్రులారా! తమిళం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష. తమిళ సాహిత్యం కూడా చాలా సమృద్ధమైంది 'కాశీ తమిళ సంగమం'లో పాల్గొనవలసిందిగా 'మన్ కీ బాత్'లో నేను మిమ్మల్ని కోరాను. ఈరోజు దేశంలోని ఇతర ప్రాంతాలలో పిల్లలు, యువతలో తమిళ భాషపై ఆసక్తి ఏర్పడటం నాకు సంతోషంగా ఉంది. ఇదే భాషకున్న శక్తి. ఇది భారతదేశ ఐక్యత.
మిత్రులారా! వచ్చే నెలలో మనం దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడల్లా స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల పట్ల కృతజ్ఞతతో మన హృదయాలు నిండిపోతాయి. మన దేశం స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి ప్రజలు స్వాతంత్ర్య ఉద్యమానికి దోహదపడ్డారు. స్వాతంత్ర్య సాధన పోరాటంలో పాల్గొన్న చాలా మంది వీర నాయకులకు, వీరనాయికలకు దురదృష్టవశాత్తు తగిన గౌరవం లభించలేదు. అలాంటి స్వాతంత్ర్య సమరయోధురాలు ఒడిషాకు చెందిన పార్వతి గిరి. ఆమె శత జయంతిని 2026 జనవరి లో జరుపుకుంటారు. ఆమె 16 సంవత్సరాల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మిత్రులారా! స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత పార్వతి గిరి తన జీవితాన్ని సామాజిక సేవకు, గిరిజన సంక్షేమానికి అంకితం చేశారు. ఆమె అనేక అనాథ శరణాలయాలను స్థాపించారు. ఆమె స్ఫూర్తిదాయకమైన జీవితం ప్రతి తరానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది.
"మూ పార్వతి గిరి జింకు శ్రద్ధాంజలి అర్పణ్ కరూఛీ
“పార్వతి గిరి గారికి నేను నివాళులర్పిస్తున్నాను."
మిత్రులారా! మన వారసత్వాన్ని మరచిపోకుండా ఉండటం మన బాధ్యత. మనకు స్వేచ్ఛను తెచ్చిన వీరులు, వీరనారీమణుల గొప్ప గాథలను తర్వాతి తరాలకు అందించాలి. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నప్పుడు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసిందని మీకు గుర్తుండవచ్చు. అందులో ఒక విభాగం విస్మృత వీరులు- ‘అన్‌సంగ్ హీరోస్’ కు ప్రత్యేకించడం జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గణనీయమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
నా ప్రియమైన దేశవాసులారా! సమాజ సంక్షేమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చర్చించడానికి ‘మన్ కీ బాత్’ మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. మనందరికీ ఆందోళన కలిగించే విషయంగా మారిన ఒక సమస్యను ఈ రోజు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- ఐ.సి.ఎం.ఆర్. ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. న్యుమోనియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు- యూటీఐ వంటి అనేక వ్యాధుల విషయంలో యాంటీబయాటిక్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఇది పేర్కొంది. ఇది మనందరికీ చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ నివేదిక ప్రకారం దీనికి ప్రధాన కారణం ప్రజలు యాంటీబయాటిక్స్‌ను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం. యాంటీబయాటిక్స్ అంటే ఆలోచించకుండా తీసుకోవలసిన మందులు కాదు. వాటిని వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాలి. ఒక మాత్ర వేసుకుంటే ప్రతి సమస్య నయమవుతుందని ఈ రోజుల్లో ప్రజలు నమ్మడం ప్రారంభించారు. అందుకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు యాంటీబయాటిక్స్ కంటే ఎక్కువగా ప్రబలంగా మారుతున్నాయి. మీరందరూ మీ అభీష్టానుసారం మందులు వాడకుండా ఉండాలని నేను కోరుతున్నాను. యాంటీబయాటిక్స్ విషయానికి వస్తే దీన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మందులకు మార్గదర్శకత్వం అవసరం. యాంటీబయాటిక్స్‌కు వైద్యులు అవసరం. ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! మన సంప్రదాయ కళలు సమాజాన్ని శక్తిమంతం చేయడమే కాకుండా ప్రజల ఆర్థిక పురోగతికి ప్రధాన మాధ్యమంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ప్రాంతానికి చెందిన లేస్ క్రాఫ్ట్ (Lace Craft) ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. ఈ అల్లికల కళ - లేస్ క్రాఫ్ట్ తరతరాలుగా మహిళల చేతుల్లో ఉంది. దేశ నారీమణులు దీన్ని చాలా ఓపికగా, జాగ్రత్తగా కాపాడుకున్నారు. నేడు ఈ సంప్రదాయాన్ని కొత్త రంగురూపులతో ముందుకు తీసుకువెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ సంయుక్తంగా చేతివృత్తులవారికి కొత్త డిజైన్లను నేర్పుతున్నాయి. వారికి మెరుగైన నైపుణ్య శిక్షణను అందిస్తున్నాయి. కొత్త మార్కెట్లతో అనుసంధానిస్తున్నాయి. నరసాపురం లేస్‌కు జి.ఐ. ట్యాగ్ కూడా లభించింది. నేడు దీని నుండి 500 కంటే ఎక్కువ ఉత్పత్తులు తయారవుతున్నాయి. 250 కంటే ఎక్కువ గ్రామాల్లో సుమారు లక్ష మంది మహిళలు దీని నుండి ఉపాధి పొందుతున్నారు.
మిత్రులారా! తమ కృషి ద్వారా సాంప్రదాయిక కళలను ప్రోత్సహించడమే కాకుండా స్థానిక ప్రజలను కూడా శక్తిమంతులను చేస్తున్న వ్యక్తులను గురించి తెలియజేసేందుకు 'మన్ కీ బాత్' ఒక వేదిక. మణిపూర్‌లోని చురాచాంద్ పూర్‌కు చెందిన మార్గరెట్ రాంథార్సియెమ్ అలాంటి ఒక ఉదాహరణ. మణిపూర్ సాంప్రదాయిక ఉత్పత్తులు, హస్తకళలు, వెదురు, కలపతో తయారు చేసిన వస్తువులు ఆమె దృక్కోణం కారణంగా ప్రాధాన్యత పొందాయి. ప్రజల జీవితాలను మార్చడానికి మాధ్యమమయ్యాయి. నేడు మార్గరెట్ యూనిట్‌లో 50 మందికి పైగా కళాకారులు పనిచేస్తున్నారు. ఆమె తన కృషి ద్వారా ఢిల్లీతో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో తన ఉత్పత్తులకు మార్కెట్‌ను అభివృద్ధి చేసుకున్నారు.
మిత్రులారా! మణిపూర్ నుండి మరొక ఉదాహరణ సేనాపతి జిల్లా నివాసి చోఖోనే క్రిచేనా గారిది. ఆమె కుటుంబం మొత్తం సాంప్రదాయిక వ్యవసాయంలో పాల్గొంది. క్రిచేనా ఈ సాంప్రదాయిక అనుభవాన్ని చాలా వరకు విస్తరించారు. పూల పెంపకాన్ని తన అభిరుచిగా మార్చుకున్నారు. నేడు ఆమె ఈ పనిని వివిధ మార్కెట్లతో అనుసంధానిస్తున్నారు. ఈ ప్రయత్నం ఆ ప్రాంతంలోని స్థానిక సమాజాలకు సాధికారత కల్పిస్తోంది. మిత్రులారా! సాంప్రదాయిక జ్ఞానాన్ని ఆధునిక దృక్పథంతో ఉపయోగించినప్పుడు అది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుందనే వాస్తవానికి ఈ ఉదాహరణ నిదర్శనం. మీ సమీపంలో ఇలాంటి విజయగాథలు ఉంటే దయచేసి వాటిని నాతో పంచుకోండి.
మిత్రులారా! మన దేశంలోని అత్యంత అందమైన విషయం ఏమిటంటే ఏడాది పొడవునా దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుంది. వివిధ పండుగలు మాత్రమే కాకుండా స్థానిక ఉత్సవాలు కూడా వివిధ రాష్ట్రాల్లో జరుగుతాయి. దీని అర్థం మీరు ప్రయాణించాలని నిర్ణయించుకుంటే దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో జరిగే ప్రత్యేకమైన వేడుకకు సిద్ధంగా ఉంటారు. అటువంటి పండుగ ప్రస్తుతం రాణ్ ఆఫ్ కచ్‌లో జరుగుతోంది. ఈ సంవత్సరం కచ్ రణోత్సవ్ నవంబర్ 23వ తేదీన ప్రారంభమైంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కచ్ విభిన్న జానపద సంస్కృతి, జానపద సంగీతం, నృత్యం, చేతిపనులను ప్రదర్శిస్తుంది. రాణ్ ఆఫ్ కచ్ గొప్పతనాన్ని దర్శించడం నిజంగా ఆనందదాయకమైన అనుభవం. రాత్రి సమయంలో తెల్లటి రాణ్ పై చంద్రకాంతి వ్యాపించినప్పుడు ఆ దృశ్యం మంత్రముగ్ధులను చేస్తుంది. రాణ్ ఉత్సవ్ లో టెంట్ సిటీ చాలా ప్రజాదరణ పొందింది. గత నెలలో దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడా రెండు లక్షల మందికి పైగా ప్రజలు రణోత్సవ్‌లో పాల్గొన్నారని నేను తెలుసుకున్నాను. మీకు అవకాశం దొరికినప్పుడు దయచేసి అలాంటి ఉత్సవాల్లో పాల్గొని భారతదేశ వైవిధ్యాన్ని ఆస్వాదించండి.
మిత్రులారా! ఇది 2025లో 'మన్ కీ బాత్' చివరి ఎపిసోడ్. మనం 2026లో జరిగే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఖచ్చితంగా అదే ఉత్సాహంతో, ఉల్లాసంతో పాల్గొందాం. మన అనే భావనతో మన ‘మన్ కీ బాత్’ చెప్పుకునేందుకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కలుద్దాం. కొత్త శక్తి, కొత్త విశేషాలు, మనల్ని ప్రేరణతో నింపే దేశవాసుల లెక్కలేనన్ని గాథలు 'మన్ కీ బాత్'లో మనందరినీ కలుపుతాయి. ప్రతి నెలా 'వికసిత భారతదేశం' కోసం ప్రజలు తమ దృష్టిని పంచుకునే అనేక సందేశాలను నేను అందుకుంటాను. ఈ దిశలో ప్రజల సూచనలు, వారి ప్రయత్నాలను చూసినప్పుడు ఈ నమ్మకం మరింత బలపడుతుంది. ఈ విషయాలన్నీ నన్ను చేరినప్పుడు 'వికసిత భారతదేశ' సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ నమ్మకం రోజురోజుకూ బలపడుతుంది. ఈ సంకల్పసిద్ధి యాత్రలో 2026 సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయి కావాలి. మీరు, మీ కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని గడపాలి. ఈ కోరికతో ఈ ఎపిసోడ్‌కు వీడ్కోలు పలికే ముందు 'ఫిట్ ఇండియా ఉద్యమం' మిమ్మల్ని కూడా ఫిట్ గా ఉంచాలని నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా ఫిట్‌గా ఉండాలి. ఈ శీతాకాల వాతావరణం వ్యాయామానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాయామం తప్పకుండా చేయండి. మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. వందేమాతరం.
***
(రిలీజ్ ఐడి: 2218581)
సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
Malayalam
,
Punjabi
,
Punjabi
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
Tamil
,
Kannada