హోం మంత్రిత్వ శాఖ
2026 సంవత్సరానికి సంబంధించిన సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార విజేతలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
సంస్థాగత విభాగంలో ఎంపికైన 'సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ'
వ్యక్తిగత విభాగంలో పురస్కారాన్ని అందుకోనున్న 'లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే'
విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు భారత్‌లో చేసిన అమూల్యమైన కృషి, నిస్వార్థ సేవను గుర్తించేందుకు 'సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని' ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశంలో గణనీయంగా మెరుగపడిన విపత్తు నిర్వహణ పద్ధతులు, సంసిద్ధత, నివారణ, ప్రతిస్పందన యంత్రాంగాలు
దీని ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారీగా తగ్గిన మరణాల సంఖ్య
प्रविष्टि तिथि:
23 JAN 2026 9:07AM by PIB Hyderabad
సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారానికి సంబంధించి 2026 సంవత్సరానికి గాను, 'సంస్థాగత విభాగంలో 'సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ' (ఎస్‍ఎస్‍డీఎంఏ), వ్యక్తిగత విభాగంలో 'లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే' ఎంపికయ్యారు. విపత్తు నిర్వహణలో చేసిన అద్భుతమైన కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది.
విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు, సంస్థలు భారత్‌లో చేసిన అమూల్యమైన కృషి, నిస్వార్థ సేవను గుర్తించటంతో పాటు గౌరవించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 'సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం' పేరుతో ఒక వార్షిక అవార్డును ఏర్పాటు చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రతి ఏటా ఈ అవార్డును ప్రకటిస్తున్నారు.
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశంలో విపత్తు నిర్వహణ పద్ధతులు, సంసిద్ధత, నివారణ, ప్రతిస్పందన యంత్రాంగాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. దీని ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మరణాల సంఖ్య భారీగా తగ్గింది.
2026 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల కోసం 2025 మే 1 నుంచి నామినేషన్లను స్వీకరించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా 2026 అవార్డులకు విస్తృత ప్రచారం కల్పించారు. మొత్తంగా వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి మొత్తం 271 నామినేషన్లు అందాయి.
విపత్తు నిర్వహణ రంగంలో 2026 అవార్డు గ్రహీతలు చేసిన అత్యుత్తమ కృషి:
లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే - వ్యక్తిగత విభాగం
భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే.. 2024లో కేరళలోని వయనాడ్‌లో వరదలు సంభవించటం, కొండచరియలు విరిగిపడిన సమయంలో భారీ స్థాయిలో మానవతా సహాయం, విపత్తు సహాయక (హెచ్ఏడీఆర్) పనులకు నాయకత్వం వహించారు. వేగవంతమైన తరలింపు, సహాయక సామగ్రి పంపిణీ, అత్యవసర సేవల పునరుద్ధరణను నిర్ధరించేందుకు అధికారులు, స్థానిక నాయకులతో ఆమె సమన్వయం చేసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అనేక ప్రమాదకరమైన సహాయక మిషన్లకు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే.. వందలాది మందిని రక్షించారు. మారుమూల గ్రామాలకు కీలకమైన అనుసంధానాన్ని పునరుద్ధరించిన చూరల్‌మలలోని 190 అడుగుల బెయిలీ వంతెనను వేగంగా నిర్మించడాన్ని ఆమె పర్యవేక్షించారు. రాత్రివేళ కేవలం నాలుగు గంటల్లోనే తాత్కాలిక పాదచారుల వంతెనను నిర్మించడంతో పాటు 'కొమాట్సు పీసీ210' ఎక్స్‌కవేటర్‌ను బరువుకు సమతూకంగా (కౌంటర్ వేయిట్) ఉపయోగించడం వంటి వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాలను ఆమె ఉపయోగించారు.
బరువైన 150 టన్నుల పరికరాలను సమీకరించడం ద్వారా లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే నేతృత్వంలో జరిగిన పనులు.. సమయానుకూలమైన ఉపశమనం, పునరుద్ధరణ పనుల ద్వారా వేలాది మందికి ప్రయోజనం చేకూర్చాయి. విపత్తు ప్రతిస్పందన, మానవతా కార్యకలాపాలలో 2,300 మందికి పైగా సిబ్బందికి ఆమె శిక్షణ ఇచ్చారు. ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా విపత్తు ముప్పు తగ్గింపును (డీఆర్ఆర్) ఆమె ఆచరణలోకి తీసుకువచ్చారు. సైనిక ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి విపత్తు ప్రభావిత మారుమూల ప్రాంతాలలో వంతెనలు, ప్రవేశ మార్గాలు, ఆశ్రయాల వేగవంతమైన నిర్మాణానికి ఆమె తోడ్పడ్డారు. ఇది సహాయక, పునరుద్ధరణ చర్యలకు ఎంతో మద్దతుగా నిలిచింది. ఆమె కృషి ఆచరణాత్మక నాయకత్వం, విపత్తు ముప్పు తగ్గింపు (డీఆర్ఆర్) కార్యకలాపాలలో పెరుగుతున్న మహిళల పాత్రను తెలియజేస్తోంది.
సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్ఎస్‌డీఎంఏ) - సంస్థాగత విభాగం
సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్ఎస్‍డీఎంఏ) 2005లో ఏర్పాటైంది. గ్రామ స్థాయిలో విపత్తు నిర్వహణ సహాయకులు(డీఎంఏ), బ్లాక్ స్థాయి ప్రధాన కార్యాలయాల్లో 'విపత్తు నిర్వహణ పర్యవేక్షకులు' (డీఎంఎస్), జిల్లా స్థాయి ప్రధాన కార్యాలయాల్లో 'విపత్తు నిర్వహణ సమన్వయకర్తలు' (డీఎంసీ).. ఇలా మూడు అంచెల్లో 1,185 మంది శిక్షణ పొందిన 'ఆపద మిత్ర'లను విపత్తు నిర్వహణ అధికారులుగా నియమించడం ద్వారా సిక్కింలో విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందనను ఎస్ఎస్‍డీఎంఏ గణనీయంగా బలోపేతం చేసింది. విపత్తు నిర్వహణ సహాయకులను అన్ని గ్రామ పంచాయతీల్లో నియమించింది. ఇది భాగస్వామ్య ప్రణాళిక, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు, పంచాయతీ స్థాయి కమిటీల ఏర్పాటుకు దారితీసింది. దీనివల్ల మొత్తం ఆరు జిల్లాలలో విపత్తులు, వాతావరణ ముప్పులను తట్టుకోగల సామర్థ్యం మెరుగుపడింది.
2016లో మాంతం కొండచరియలు విరిగిపడటం, 2023లో తీస్తా నది వరదల వంటి క్లిష్ట సమయాల్లో ఎస్‌ఎస్‍డీఎంఏ చేపట్టిన తక్షణ (రియల్-టైమ్) సమన్వయంతో... శిక్షణ పొందిన మొదటి స్థాయి సహయకులు.. 2,563 మందిని రక్షించడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగారు. ముందస్తు హెచ్చరికలు, సంసిద్ధత, స్థానిక సామర్థ్య పెంపుదలపై గట్టిగా దృష్టి సారించి 'ఆపద మిత్ర' ద్వారా క్రియాశీలక, సమాజ-కేంద్రీకృత విపత్తు ముప్పు తగ్గింపు (డీఆర్ఆర్) విధానాన్ని ఎస్‍ఎస్‌డీఎంఏ ఏర్పాటుచేసింది. ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలకు అనువైన సమాజ-కేంద్రీకృత విపత్తు నిర్వహణ, అనుసరణీయమైన నమూనాను ఈ సంస్థ అభివృద్ధి చేసింది.
***
(रिलीज़ आईडी: 2217917)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Nepali
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada