సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దావోస్‌లో భారత్ గొప్ప శుభారంభం
ప్రపంచ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను చూపుతున్న భారత ఏఐ నమూనాలు..
అయిదో పారిశ్రామిక విప్లవ యుగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్నాం: అశ్వినీ వైష్ణవ్
భారత్‌లో అందరికీ అందుబాటులో ఏఐ సాంకేతికత..
సమర్థవంతమైన సేవలందించేందుకు తోడ్పాటు: అశ్వినీ వైష్ణవ్
'ఏఐ పవర్ ప్లే ప్యానెల్' చర్చలో అగ్రశ్రేణి అంతర్జాతీయ ఏఐ శక్తిగా భారత్.. ఐఎంఎఫ్ ర్యాంకింగ్‌కు పోటీ
ఏఐ పాలనలో భారత్ అనుసరిస్తున్న సాంకేతిక-చట్టపరమైన విధానం ద్వారా
వివక్ష, డీప్‌ఫేక్, విశ్వసనీయత సమస్యలకు పరిష్కారం: అశ్వినీ వైష్ణవ్
प्रविष्टि तिथि:
21 JAN 2026 5:20PM by PIB Hyderabad
"ఏఐ పవర్ ప్లే" పేరుతో నిర్వహించిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ చర్చా కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. కృత్రిమ మేథ వల్ల మారుతున్న ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక ప్రభావం, పాలనాపరమైన సవాళ్లు, ఈ సాంకేతికత అందరికీ చేరేందుకు గల మార్గాలపై ఈ చర్చలో ప్రధానంగా దృష్టి సారించారు. దేశాల మధ్య అధికారాన్ని, ఉత్పాదకతను, విధానాలను ఏఐ ఎలా మారుస్తుందనే అంశంపై ప్రపంచ స్థాయి విధానకర్తలు, పారిశ్రామికవేత్తలు, పలు సంస్థల ప్రతినిధులు చర్చించారు.

యురేషియా గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీ ఇయాన్ బ్రెమ్మర్ ఈ చర్చా కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి క్రిస్టలినా జార్జివా, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్ ఛైర్ శ్రీ బ్రాడ్ స్మిత్, సౌదీ అరేబియా పెట్టుబడి శాఖ మంత్రి శ్రీ ఖలీద్ అల్-ఫాలిహ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వక్తలుగా పాల్గొన్నారు.
ఏఐ రంగంలో అగ్రగామి దేశాల జాబితాలో భారత్ ఉందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ చర్చలో స్పష్టం చేశారు. ఏఐ ఆర్కిటెక్చర్‌కు సంబంధించి అయిదు కీలక అంశాలైన అప్లికేషన్లు, నమూనాలు, చిప్స్, మౌలిక సదుపాయాలు, ఇంధనం వంటి విభాగాల్లో భారత్ పురోగమిస్తోందని తెలిపారు. భారీ మోడల్స్‌పై దృష్టి సారించేందుకు మాత్రమే కాక, క్షేత్రస్థాయి అమలు, పెట్టుబడికి రాబడి (ఆర్ఓఐ) అంశాల ఆధారంగా భారతదేశ ఏఐ వ్యూహాన్ని రూపొందించినట్లు వివరించారు.

అత్యంత భారీ మోడల్స్‌ను రూపొందించటం వల్ల మాత్రమే లాభాలు రావనీ, వాస్తవ ప్రపంచంలోని దాదాపు 95 శాతం సమస్యలను 20 నుంచి 50 బిలియన్ పారమితుల్లోని మోడళ్లతోనే పరిష్కరించవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. ఉత్పాదకత, సామర్థ్యం, సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు భారత్ ఇప్పటికే సమర్థవంతమైన, చౌకైన మోడల్స్‌ను సిద్ధం చేసిందని, ప్రస్తుతం వివిధ రంగాల్లో వాటిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో గరిష్ఠ ఫలితాలను అందించే ఈ విధానం, ఆర్థిక నిలకడ గల ఏఐ విస్తరణకు భారతదేశం ప్రాధాన్యతను ఇస్తున్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాల గురించి ప్రస్తావిస్తూ, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంచనాల ప్రకారం ఏఐ వినియోగం, సంసిద్ధతలో భారత్ మూడో స్థానంలో, ఏఐ ప్రతిభలో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
భారీ స్థాయిలో ఏఐ విస్తృతి, ఆధునిక ఏఐ సామర్థ్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావటంపై భారత్ దృష్టి సారిస్తుందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. జీపీయూల కొరతను అధిగమించేందుకు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) నమూనాను ప్రభుత్వం అనుసరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 38,000 జీపీయూలను జాతీయ స్థాయిలో కంప్యూటింగ్ సదుపాయంగా అందుబాటులోకి తీసుకువచ్చి ప్రభుత్వ సబ్సిడీతో విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలకు ప్రపంచ వ్యయంతో పోల్చితే దాదాపు మూడో వంతు ఖర్చుకే అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 10 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా రూపొందించిన ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, భారత ఐటీ రంగం, అంకురసంస్థలు దేశీయంగా మాత్రమే కాక, ప్రపంచస్థాయిలోనూ సేవలందించేందుకు ఏఐని సమర్థవంతంగా వినియోగించగలవని ఆయన తెలిపారు.
ఏఐ నియంత్రణ, పాలన పట్ల సాంకేతిక-చట్టపరమైన విధానం అవసరమని శ్రీ అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. "ఏఐ కేవలం చట్టంపైనే ఆధారపడి ఉండకూడదు. వివక్షను గుర్తించటానికి, డీప్‌ఫేక్‌లను కోర్టులో సాక్ష్యంగా అంగీకరించేలా కచ్చితత్వంతో ధ్రువీకరించటానికి, అన్‌లెర్నింగ్ పద్ధతుల ద్వారా సురక్షిత వినియోగాన్ని నిర్ధారించటానికి సాంకేతిక పరికరాలను అభివృద్ధి చేయాలి" అని అన్నారు. ఇలాంటి స్వదేశీ సాంకేతిక రక్షణ కవచాలను భారత్ క్రియాశీలకంగా అభివృద్ధి చేస్తోందని ఆయన వెల్లడించారు.
ప్రపంచ ఏఐ రంగంలో భారత్ ఎదుగుదలను ఇతర వక్తలు కూడా అభినందించారు. దశాబ్ద కాలంలో ప్రపంచ రాజకీయ, సాంకేతిక శక్తిగా భారత్ అవతరించిందని శ్రీ ఇయాన్ బ్రెమ్మర్ అన్నారు. సాంకేతికత విస్తృతి, అందుబాటులో ఉండటం, సార్వభౌమ సామర్థ్యానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యత.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఆదర్శప్రాయమైన నమూనా అని అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2217310)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
Odia
,
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam