ప్రధాన మంత్రి కార్యాలయం
అంకుర భారత్ (స్టార్టప్ ఇండియా)కు దశాబ్దం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
· వాస్తవిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన భారత యువత
· పదేళ్ల కాలంలోనే విప్లవంగా మారిన స్టార్టప్ ఇండియా మిషన్.. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్
· సాహసోపేత నిర్ణయాలు నేటి కొత్త ఒరవడి
· ‘స్టార్టప్ ఇండియా’ కేవలం పథకం మాత్రమే కాదు.. వివిధ రంగాలనూ, అవకాశాలనూ అనుసంధానించే రంగుల హరివిల్లు
· మన అంకుర సంస్థలు తయారీ రంగంపై మరింత దృష్టి సారించాల్సిన సమయమిది
· అంకుర సంస్థల ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణలు దేశ భవితను రూపుదిద్దుతున్నాయి: ప్రధాని
प्रविष्टि तिथि:
16 JAN 2026 3:22PM by PIB Hyderabad
జాతీయ అంకుర సంస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అంకుర భారత్ (స్టార్టప్ ఇండియా) కార్యక్రమానికి దశాబ్దం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశేషమైన వేడుక అయిన జాతీయ అంకుర సంస్థల దినోత్సవం కోసం నేడు మనమంతా ఇక్కడ సమావేశమయ్యామని ప్రధానమంత్రి అన్నారు. నూతన, అభివృద్ధి చెందుతున్న భారతదేశ భవిత అయిన అంకుర సంస్థల వ్యవస్థాపకులు, ఆవిష్కర్తల సమక్షంలో ఈ వేడుక జరుగుతోందని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, ఫిన్‌టెక్, రవాణా, ఆరోగ్యం, సుస్థిరత వంటి రంగాల్లో పనిచేస్తున్న కొందరు ప్రతినిధులతో కొద్దిసేపటి కిందటే తాను సంభాషించానన్నారు. వారి ఆలోచనలు తనను ఆకట్టుకున్నాయన్న ఆయన.. వారి ఆత్మవిశ్వాసం, ఉన్నతమైన లక్ష్యాలు తనను మరింత ముగ్ధుడిని చేశాయని చెప్పారు. అంకుర భారత్ పథకం పదేళ్ల కిందట ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసిన శ్రీ మోదీ.. ఈ పథకం విశేష వృద్ధిని సాధించిందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రస్థానంలో భాగమైన యువతను కలవడం సంతోషాన్నిస్తోందన్నారు. వాస్తవిక సమస్యల పరిష్కారంపై భారత యువత దృష్టి సారించడం అత్యంత కీలకమైన అంశమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. సరికొత్తగా స్వప్నించే తెగువను చూపుతున్న యువ ఆవిష్కర్తలను అభినందించారు.
అంకుర భారత్ (స్టార్టప్ ఇండియా) పథకం నేటితో పదేళ్ల మైలురాయిని చేరుకుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రయాణం ఓ ప్రభుత్వ పథకం విజయగాథ మాత్రమే కాదన్నారు. ఇది లక్షలాది స్వప్నాల ప్రస్థానమనీ, అసంఖ్యాక భావాల సాక్షాత్కారమనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. పదేళ్ల కిందట వ్యక్తిగత కృషికీ, ఆవిష్కరణలకూ అవకాశం చాలా తక్కువగా ఉండేదని గుర్తుచేశారు. ఆ పరిస్థితులను సవాలు చేస్తూ.. అంకుర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇది ఆకాశమే హద్దుగా యువతకు అవకాశాలను అందించిందనీ, దాని ఫలితాలు నేడు మన కళ్లెదుట ఉన్నాయనీ చెప్పారు. “పదేళ్ల కాలంలోనే స్టార్టప్ ఇండియా మిషన్ ఒక విప్లవంగా మారింది. అంకుర సంస్థల పరంగా నేడు భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉంది’’ అని శ్రీ మోదీ వివరించారు. పదేళ్ల కిందట దేశంలో 500 కన్నా తక్కువగానే అంకుర సంస్థలు ఉండేవనీ, అయితే నేడు ఆ సంఖ్య రెండు లక్షలు దాటిందనీ తెలిపారు. 2014లో దేశంలో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు మాత్రమే ఉండేవనీ, కానీ నేడు దాదాపు 125 యూనికార్న్ సంస్థలు దేశంలో క్రియాశీలంగా ఉన్నాయనీ చెప్పారు. ప్రపంచం అచ్చెరువొందుతూ ఈ విజయగాథను వీక్షిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశ స్టార్టప్ ప్రయాణంపై చర్చ వచ్చినప్పుడు.. ఈ సభా ప్రాంగణంలో ఉన్న యువతలో చాలామంది గొప్ప ఉదాహరణలుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్టార్టప్ ఇండియా జోరు వేగంగా కొనసాగుతోందనీ.. నేటి అంకుర సంస్థలు యూనికార్న్‌లుగా ఎదుగుతూ, ఐపీవోలకు వెళ్తూ అంతకంతకూ మరిన్ని ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయనీ వివరించారు. ఒక్క 2025లోనే దాదాపు 44,000 కొత్త అంకుర సంస్థలు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచీ ఒకే ఏడాదిలో ఇంత భారీ స్థాయి వృద్ధిని సాధించడం ఇదే మొదటిసారి. దేశంలోని అంకుర సంస్థలు ఉపాధిని, ఆవిష్కరణలను, పురోగతిని ఏ విధంగా ముందుకు నడుపుతున్నాయో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనమని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
స్టార్టప్ ఇండియా పథకం దేశంలో సరికొత్త సంస్కృతికి ప్రాణం పోయడంపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. గతంలో కొత్త వ్యాపారాలు లేదా సంస్థలను ప్రధానంగా పెద్ద పారిశ్రామిక కుటుంబాలకు చెందిన వారే ప్రారంభించేవారనీ.. ఎందుకంటే నిధులూ, మద్దతూ వారికి మాత్రమే సులభంగా లభించేవని గుర్తుచేశారు. అదే సమయంలో మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లలు ఉద్యోగాల కోసమే కలలు కనేవారన్నారు. స్టార్టప్ ఇండియా పథకం ఈ ధోరణిని మార్చేసిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. నేడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలూ, గ్రామాలకు చెందిన యువత కూడా సొంతంగా అంకుర సంస్థలను ప్రారంభిస్తున్నారన్న ఆయన.. అత్యంత తీవ్రమైన క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారని వివరించారు. సమాజం కోసం, దేశం కోసం ఏమైనా చేయాలనే తపించే ఈ స్ఫూర్తికి తానెంతో విలువ ఇస్తానని ఆయన పునరుద్ఘాటించారు.
దేశంలో జరుగుతున్న ఈ మార్పులో మన ఆడబిడ్డలు కీలక పాత్ర పోషించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో 45 శాతానికి పైగా సంస్థల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్ లేదా భాగస్వామి ఉన్నారని తెలిపారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు సంబంధించి నిధుల సేకరణలో.. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఎదిగిందని శ్రీ మోదీ తెలిపారు. ఈ సమ్మిళిత వేగం దేశ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
స్టార్టప్ విప్లవంలో దేశం నేడు తన భవితను చూసుకుంటోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లకు ఇంత ప్రాధాన్యం ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే, దానికి చాలా సమాధానాలున్నాయన్నారు. భారత్ ప్రపంచంలో అత్యంత యువ జనాభా కలిగిన దేశం, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్న దేశం, కొత్త రంగాలు ఇక్కడ ఉద్భవిస్తున్నాయి... ఇవన్నీ ముమ్మాటికీ నిజమేనని ఆయన స్పష్టం చేశారు. అయితే, అన్నింటికంటే మిన్నగా తన మనస్సును హత్తుకున్నది మన దేశ యువతలోని ‘స్టార్టప్ స్ఫూర్తి’ అని ఆయన పునరుద్ఘాటించారు. నేటి భారత యువత తమ జీవితాలను సుఖమయమైన పరిధులకే పరిమితం చేసుకోవడానికిగానీ, పాత మూస పద్ధతులనే అనుసరించడానికి గానీ ఇష్టపడటం లేదన్నారు. వారు తమకంటూ కొత్త బాటలు వేసుకుంటూ.. సరికొత్త గమ్యాలనూ లక్ష్యాలనూ చేరుకోవాలని ఆరాటపడుతున్నారని ప్రధానమంత్రి కొనియాడారు. కష్టపడి పనిచేయడం ద్వారానే ఈ సరికొత్త లక్ష్యాలను చేరుకోగలమని స్పష్టం చేశారు. కోరికలు ఉండగానే సరిపోదు.. పట్టుదలతో కూడిన ప్రయత్నం ద్వారానే కార్యసిద్ధి కలుగుతుందన్న అర్థం వచ్చే ఓ సూక్తిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఓ సంస్థనో, వ్యాపారాన్నో ప్రారంభించాలంటే.. అన్నిటికన్నా ముందు కావలసింది ధైర్యమేని శ్రీ మోదీ చెప్పారు. ఈ స్థాయికి చేరుకోవడానికి యువత చూపిన అపారమైన సాహసాన్నీ, వారి తెగువనూ ప్రశంసించారు. గతంలో మన దేశంలో సంకటాలను ఎదుర్కోవడాన్ని నిరుత్సాహపరిచేవారనీ, కానీ నేడు అది సాధారణ జీవనశైలిగా మారిందనీ ఆయన వ్యాఖ్యానించారు. నెలవారీ జీతాల పరిధిని దాటి ఆలోచించే వారికి నేడు సమాజంలో గుర్తింపు మాత్రమే కాకుండా, గొప్ప గౌరవం కూడా లభిస్తోందన్నారు. ఒకప్పుడు నిరుపయోగమని భావించిన ఆలోచనలు.. నేడు కొత్త ఒరవడిగా మారుతున్నాయని శ్రీ మోదీ చెప్పారు.
సంకటాన్ని ఎదుర్కోవాలన్న తన దృఢ సంకల్పాన్ని వక్కాణిస్తూ... చాలా కాలంగా అది తనకు అలవాటేనని శ్రీ మోదీ చెప్పారు. ఎవరూ చేపట్టడానికి ఇష్టపడని పనులనూ, ఎన్నికల్లో నష్టపోతామనో లేదా అధికారం కోల్పోతామన్న భయంతోనో దశాబ్దాలుగా ప్రభుత్వాలు తప్పించుకున్న సమస్యలనునూ, రాజకీయంగా ముప్పుగా ముద్రపడిన పనులను పూర్తిచేయడాన్ని తాను బాధ్యతగా భావించానన్నారు. తాను కూడా ఆవిష్కర్తల మాదిరిగానే ఆలోచిస్తానన్నారు. దేశానికి ఏదైనా అవసరమైతే ఎవరో ఒకరు ముందడుగు వేయాలని నమ్ముతాన్నారు. ఆ క్రమంలో తనకు నష్టం జరిగినా, దాని వల్ల లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
నవకల్పనలను ప్రోత్సహించే ఓ బలమైన వ్యవస్థను దేశం గత పదేళ్లలో నిర్మించుకుందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పిల్లల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబులను నెలకొల్పామని, దేశ సమస్యలకు పరిష్కారాలు వెతికేలా యువతను ప్రోత్సహిస్తూ హ్యాకథాన్‌లను ప్రారంభించామని తెలిపారు. అంతేకాకుండా వనరుల కొరతతో మంచి ఆలోచనలు కనుమరుగైపోకుండా ఉండేలా ఇంక్యుబేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.
క్లిష్టమైన నిబంధనలు, అనుమతుల కోసం సుదీర్ఘ కాలం ఎదురుచూపులు, ఇన్‌స్పెక్టర్ రాజ్ భయాలు ఒకప్పుడు ఆవిష్కరణలకు అతిపెద్ద అవరోధాలుగా ఉండేవని శ్రీ మోదీ గుర్తుచేశారు. అందుకే తమ ప్రభుత్వం నమ్మకం, పారదర్శకతతో కూడిన వాతావరణాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. జన్ విశ్వాస్ చట్టం కింద 180కి పైగా నిబంధనలను నేరరహితం చేశామని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఆవిష్కర్తలు వివాదాలకు బదులు.. తమ పనిపైనే దృష్టి పెట్టడానికి వీలైందని తెలిపారు. దాంతో వారి విలువైన సమయం ఆదా అయిందన్నారు. అనేక చట్టాల పరిధిలో అంకుర సంస్థలు ఇప్పుడు స్వీయ ధ్రువీకరణ సదుపాయాన్ని పొందుతున్నాయనీ.. అలాగే కంపెనీల విలీనాలు, నిష్క్రమణలను మరింత సులభతరం చేశామని ఆయన తెలిపారు.
“స్టార్టప్ ఇండియా కేవలం పథకం మాత్రమే కాదు.. వివిధ రంగాలనూ, అవకాశాలనూ అనుసంధానించే రంగుల హరివిల్లు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. రక్షణ ఉత్పాదన రంగంలో ఇప్పటికే స్థిరపడిన సంస్థలతో అంకుర సంస్థలు పోటీపడడాన్ని గతంలో కనీసం ఊహించడానికీ కష్టంగా ఉండేదన్నారు. అయితే నేడు ఐడెక్స్ ద్వారా వ్యూహాత్మక రంగాల్లో కొనుగోళ్లపై కొత్త మార్గాలను తెరిచామని ఆయన తెలిపారు. ఒకప్పుడు ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లేని అంతరిక్ష రంగాన్ని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చామనీ.. ఈ రంగంలో దాదాపు 200 అంకుర సంస్థలు పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా డ్రోన్ రంగం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. కాలం చెల్లిన నిబంధనలు మన దేశాన్ని చాలా కాలం పాటు వెనక్కి నెట్టాయని, అయితే సంస్కరణలూ, ఆవిష్కర్తలపై ఉంచిన నమ్మకం ఈ రంగం రూపురేఖలను మార్చేసిందన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో గవర్నమెంట్ ఇ - మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) మార్కెట్ పరిధి విస్తృతమైందని వివరించారు. దాదాపు 35,000 అంకుర, చిన్న వ్యాపార సంస్థలు ఈ పోర్టల్‌లో నమోదయ్యాయనీ.. దాదాపు రూ.50,000 కోట్ల విలువైన 5 లక్షల ఆర్డర్లను ఈ సంస్థలు పొందాయనీ ఆయన తెలిపారు. తమ విజయాల ద్వారా అంకుర సంస్థలు ప్రతి రంగంలోనూ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తున్నాయన్నారు.
మూలధనం లేకపోతే అత్యుత్తమ ఆలోచనలు కూడా మార్కెటును చేరలేవని ప్రధానమంత్రి అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఆవిష్కర్తలకు ఆర్థిక సాయం అందుబాటులో ఉండేలా దృష్టి సారించిందన్నారు. అంకుర సంస్థల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా.. ఇప్పటివరకు రూ. 25,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. అలాగే స్టార్టప్ ఇండియా, ఇన్ స్పేస్, నిధి సీడ్ సపోర్ట్ ప్రోగ్రామ్ వంటి పథకాలు అంకుర సంస్థలకు ప్రారంభ పెట్టుబడిని అందిస్తున్నాయని ఆయన తెలిపారు. రుణ సదుపాయాన్ని మెరుగుపరచడం కోసం రుణ భరోసా పథకాన్ని ప్రారంభించామని శ్రీ మోదీ చెప్పారు. దీంతో పూచీకత్తు లేకపోవడమన్నది సృజనకు అవరోధం కాబోదని స్పష్టం చేశారు.
నేటి పరిశోధనే రేపటి మేధో సంపత్తిగా మారుతుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దీనిని ప్రోత్సహించడానికి రూ. లక్ష కోట్లతో పరిశోధన, అభివృద్ధి, నవకల్పన పథకాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. అలాగే ఉజ్వల భవిష్యత్తు ఉన్న రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు చేయూతనిచ్చేందుకు డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
భవిష్యత్తు కోసం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిలో కీలక పాత్ర పోషించే సరికొత్త రంగాల్లో నూతన ఆలోచనల దిశగా పనిచేయాలని ఆయన కోరారు. కృత్రిమ మేధను ఇందుకు ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో ముందున్న దేశాలకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందనీ.. భారత్‌కు సంబంధించి అంకుర సంస్థలపైనే ఈ బాధ్యత ఉందనీ వ్యాఖ్యానించారు. 2026 ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని శ్రీ మోదీ తెలిపారు. ఇది దేశ యువతకు గొప్ప అవకాశమన్నారు. ఏఐ రంగంలో కంప్యూటింగ్ ఖర్చులు అధికంగా ఉండడం వంటి సవాళ్లను ఆయన అంగీకరించారు. అయితే ‘ఇండియా ఏఐ మిషన్' ద్వారా వీటికి పరిష్కారాలు అందిస్తున్నట్టు తెలిపారు. పెద్ద సాంకేతికతను చిన్న అంకుర సంస్థలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు 38,000కు పైగా జీపీయూలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. తద్వారా భారతీయ సర్వర్‌లపై, భారతీయ ప్రతిభతో దేశీయ ఏఐ అభివృద్ధి చెందేలా చూస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఇతర రంగాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
భారత్ ఆశయం కేవలం భాగస్వామ్యానికి మాత్రమే పరిమితం కాకూడదని, అంతర్జాతీయ నాయకత్వాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కొత్త ఆలోచనలతో పనిచేయాలని, సమస్యలను పరిష్కరించాలని అంకుర సంస్థలను ఆయన కోరారు. గత దశాబ్దాల్లో డిజిటల్ స్టార్టప్‌లు, సేవా రంగాల్లో భారత్ అద్భుత విజయాలను సాధించిందని తెలిపారు. అయితే నేడు అంకుర సంస్థలు తయారీ రంగంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన కొత్త ఉత్పత్తులు చేయాలని, విశిష్ట సాంకేతిక ఆలోచనలను ఆవిష్కరించాలని.. తద్వారా భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ప్రయత్నంలోనూ అంకుర సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు. నిర్వాహకుల ధైర్యం, ఆత్మవిశ్వాసం, వారి ఆవిష్కరణలే దేశ భవితను రూపుదిద్దుతున్నాయనీ, వాటిపై తనకు అమితమైన విశ్వాసం ఉందనీ ఆయన చెప్పారు. గత పదేళ్లూ దేశ సామర్థ్యాన్ని నిరూపించాయని వ్యాఖ్యానిస్తూ.. ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. కొత్త స్టార్టప్ పోకడలు, సాంకేతికతల్లో ప్రపంచాన్ని ముందుండి నడిపించడం రాబోయే దశాబ్ద కాలంలో మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
నవకల్పనలకు ప్రోత్సాహం, వ్యవస్థాపకత్వాన్ని పెంపొందించడం, పెట్టుబడి ఆధారిత వృద్ధిని సాధించే దిశగా.. విప్లవాత్మక మార్పులను లక్ష్యంగా చేసుకున్న జాతీయ కార్యక్రమం ‘అంకుర భారత్ (స్టార్టప్ ఇండియా)’ను 2016 జనవరి 16న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్‌ను ఉద్యోగార్థుల దేశంగా కాకుండా ఉపాధినిచ్చే యాజమాన్యాలకు నెలవుగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
గత దశాబ్ద కాలంగా భారత ఆర్థిక, ఆవిష్కరణల వ్యవస్థలో అంకుర భారత్ పథకం మూలస్తంభంగా నిలిచింది. ఇది సంస్థాగత యంత్రాంగాలను బలోపేతం చేయడమే కాకుండా.. స్టార్టప్‌లకు అవసరమైన పెట్టుబడినీ, మార్గనిర్దేశాన్నీ విస్తృతంగా అందేలా చేసింది. అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో అంకుర సంస్థలు వృద్ధి చెందడానికి, పరిధిని విస్తరించుకోవడానికి అనువైన వాతావరణాన్ని ఇది కల్పించింది. దేశంలో అంకుర సంస్థలు మునుపెన్నడూ లేనంతగా ఈ సమయంలో విస్తరించాయి. దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా గుర్తింపు పొందిన అంకుర సంస్థలున్నాయి. ఉపాధి కల్పన, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి, వివిధ రంగాల్లో దేశీయంగా ప్రతీ దశలోని కార్యకలాపాలనూ బలోపేతం చేయడంలో ఈ సంస్థలు ముఖ్యమైన చోదక శక్తులుగా నిలిచాయి.
****
(रिलीज़ आईडी: 2215509)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam