ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ – జర్మనీ సంయుక్త ప్రకటన
प्रविष्टि तिथि:
12 JAN 2026 3:50PM by PIB Hyderabad
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ 2026 జనవరి 12, 13 తేదీల్లో అధికారికంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఛాన్సలర్ వెంట 23 మంది ప్రముఖ జర్మన్ సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఉంది.
జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారత్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. ఛాన్సలర్‌గా ఆసియాలోనూ ఆయనకు ఇదే తొలి పర్యటన. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కు జర్మనీ విశేష ప్రాధాన్యం ఇస్తోందనడానికి ఇది నిదర్శనం. 2024 అక్టోబరు 25న న్యూఢిల్లీలో విజయవంతంగా నిర్వహించిన భారత్ – జర్మనీ ఏడో అంతర ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) అనంతరం మెర్జ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. 2025లో భారత్ - జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు, 2026లో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇరుదేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు అత్యున్నత దశలో కొనసాగుతున్న వేళ ఈ పర్యటన సాగుతోంది. ప్రభుత్వం, వాణిజ్యం, పౌర సమాజం, విద్యా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల్లో నవోత్తేజాన్ని నాయకులిద్దరూ ప్రశంసించారు. వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిలో, దాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇది అత్యంత కీలకమైన అంశం.
జర్మనీ ఛాన్సలర్ మెర్జ్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ అహ్మదాబాద్‌లో స్వాగతం పలికారు. సబర్మతీ ఆశ్రమంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వారిద్దరూ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పతంగుల పండుగలో పాల్గొన్నారు. భారత్ - జర్మనీ సీఈవోల ఫోరంను ఉద్దేశించి వారు ప్రసంగించారు. ఛాన్సలర్ మెర్జ్ బెంగళూరులో కూడా పర్యటించి.. భారత్ - జర్మనీ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారం లక్ష్యంగా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
2026 జనవరి 12న భారత ప్రధానమంత్రి మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ అహ్మదాబాద్‌లో పరిమిత, ప్రతినిధి బృంద స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆధారంగా ఉన్న.. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, నియమాలతో కూడిన అంతర్జాతీయ క్రమంపై నిబద్ధత, పరస్పర గౌరవాలను వారు పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించిన వారిద్దరూ.. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
రక్షణ, భద్రత
రక్షణ, భద్రత అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలూ పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా.. 2025 నవంబరులో ఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి రక్షణ కమిటీ సమావేశంలో సాధించిన పురోగతిని వారు స్వాగతించారు. సిబ్బంది మధ్య సంస్థాగత చర్చలు, అధినేతల పర్యటనలపైనా ఇందులో చర్చించారు. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, ఉన్నతాధికారుల పర్యటనల ద్వారా ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్టు వారిద్దరూ స్పష్టం చేశారు. ఇరుదేశాల నావికా దళ నౌకలు క్రమం తప్పకుండా పరస్పరం ఓడరేవులను సందర్శించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య కొత్త ట్రాక్ 1.5 విదేశాంగ విధానం, భద్రతా చర్చలు ప్రారంభమవడాన్ని స్వాగతించారు.
నావికా దళ విన్యాసం మిలాన్‌లో, 2026 ఫిబ్రవరిలో నిర్వహించే నౌకా దళ అధినేతల సదస్సు హిందూ మహా సముద్ర నావికాదళ సమ్మేళనంలో (ఐవోఎన్ఎస్)లో, 2026 సెప్టెంబరులో జరిగే వైమానిక యుద్ధ విన్యాసం ‘తరంగశక్తి’లో పాల్గొనేందుకు జర్మనీ ఆసక్తి చూపడాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ స్వాగతించారు. అలాగే, సమాచార ఏకీకరణ కేంద్రం - హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఎఫ్‌సీ - ఐవోఆర్)లో లైజన్ ఆఫీసర్‌ను నియమించాలన్న జర్మనీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), యూరోడ్రోన్ మేల్ యూఏవీ కార్యక్రమం కోసం ఉమ్మడి ఆయుధ సహకార సంస్థ (ఓసీసీఏఆర్)ల విషయంలో సహకారంపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అధునాతన సైనిక సాంకేతికత విషయంలో సహకారం, దాని సద్వినియోగంతోపాటు ఐరోపాతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతం దిశగా ఈ కార్యక్రమం భారత్‌కు వీలు కల్పిస్తుంది.
రక్షణ పారిశ్రామిక సహకార ప్రణాళిక రూపకల్పనపై సంయుక్త ఆసక్తి ప్రకటనపై సంతకాలు చేయడాన్ని వారిద్దరూ స్వాగతించారు. సాంకేతిక భాగస్వామ్యాలు, సమష్టి వృద్ధి, రక్షణ వేదికలు, పరికరాల ఉమ్మడి అభివృద్ధి సహా దీర్ఘకాలిక పారిశ్రామిక సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. రక్షణ పరికరాల ఎగుమతి అనుమతులను వేగవంతం చేయడానికి జర్మనీ చేస్తున్న కృషిని భారత్ స్వాగతించింది. బెర్లిన్, న్యూఢిల్లీల్లో నిర్వహించిన రక్షణ సమావేశాలు/సదస్సుల ద్వారా భారత్, జర్మనీ రక్షణ రంగ వ్యాపార సంస్థల మధ్య పెరుగుతున్న పరస్పర సహకారాన్ని వారు అభినందించారు. ఈ రంగంలో క్రమం తప్పకుండా చర్చలను స్వాగతించారు. జలాంతర్గాములు, హెలికాప్టర్లు - మానవ రహిత వైమానిక వ్యవస్థల్లో అవరోధాల నివారణ వ్యవస్థలో కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నేతలూ అభినందించారు. ఉమ్మడి లక్ష్యాలు, ఇరుదేశాల శక్తియుక్తుల సమన్వయం ఆధారంగా బలమైన సంబంధాలను నిర్మించడం ద్వారా.. పారిశ్రామిక సహకారాన్ని మెరుగుపరచుకోవాలని ఆకాంక్షించారు. భారత్‌లోని నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి- తక్కువ వ్యయాన్నీ, జర్మనీ పెట్టుబడుల సమ్మేళనంతో పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
శిక్షణ, ఆదానప్రధానాల్లో సహకారానికి సంబంధించి.. ఇరుదేశాల సంస్థలకూ శాంతి పరిరక్షణలో శిక్షణ, సాయుధ దళాల మధ్య రవాణాపరంగా పరస్పర మద్దతు ఒప్పందం, డీఆర్డీవో – బీఏఏఐఎన్‌బీడబ్ల్యూ మధ్య సరికొత్త రక్షణ సాంకేతికతల ఆదాన ప్రధానాల దిశగా అవగాహన ఒప్పందం ఖరారవడాన్ని ఇరువురు నేతలూ స్వాగతించారు.
సీమాంతర ఉగ్రవాదం సహా ఉగ్రవాదమూ, హింసాత్మక తీవ్రవాదమూ ఏ రూపంలో ఉన్నా, ఏ రీతిలో వ్యక్తమయినా సహించేది లేదని ఇరువురు నేతలూ స్పష్టంగా, బలంగా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా.. సమగ్ర పద్ధతిలో, ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రయత్నాల దిశగా వారు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిని, 2025 నవంబరు 10న ఢిల్లీలో జరిగిన ఉగ్ర ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. ఐక్యరాజ్యసమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా.. ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, మౌలిక సదుపాయాలను నిర్మూలించడంతోపాటు ఉగ్రవాద నెట్‌వర్కులను, ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అన్ని దేశాలు సమష్టి కృషిని కొనసాగించాలని ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం ఆమోదాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. ఉగ్రవాద నిరోధంపై ఏర్పాటు చేసిన ఉమ్మడి కార్యబృందం సాధించిన పురోగతిని అభినందించారు.
వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులలో నిరంతర వృద్ధిని నాయకులు స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్యం 2024లో రికార్డు స్థాయికి చేరుకుందని, ఈ సానుకూల ధోరణి 2025లో కూడా కొనసాగిందని పేర్కొన్నారు. 2024లో భారత్, జర్మనీ మధ్య వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం 50 బిలియన్ డాలర్లను దాటింది. యూరోపియన్ యూనియన్‌తో భారత మొత్తం వాణిజ్యంలో ఇది 25 శాతానికి పైమాటే. భారత్ – జర్మనీ మధ్య కొనసాగుతున్న బలమైన పరస్పర పెట్టుబడులను, అలాగే ప్రపంచ సరఫరా వ్యవస్థల వైవిధ్యీకరణలో వీటి సానుకూల ప్రభావాలను వారు పేర్కొన్నారు. ఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, డిజిటలీకరణ, కృత్రిమ మేధ, ఆవిష్కరణల ఆధారిత సంస్థల ద్వారా.. ఇప్పటి వరకు వినియోగించుకోని ఆర్థిక సామర్థ్యాన్ని పూర్తిగా వెలికితీసేందుకు ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్‌లోని బలమైన ఆర్థిక వృద్ధి, వ్యాపార అనుకూల వాతావరణం, భారీ సంఖ్యలో ఉన్న నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని.. తద్వారా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని లేదా ఉన్న వ్యాపారాలను మరింత విస్తరించాలని భారత ప్రధానమంత్రి మోదీ జర్మనీ కంపెనీలను ఆహ్వానించారు. పెట్టుబడుల కోసం జర్మనీ ఆకర్షణీయ ప్రదేశమని ఛాన్సలర్ మెర్జ్ భారతీయ కంపెనీలకు సిఫార్సు చేశారు.
రాబోయే ఐరోపా యూనియన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ఉభయపక్షాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తుది రూపమే కీలకం కావాలనే అంశానికి తాము ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ, ఛాన్సలర్ మెర్జ్ పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందం ఖరారైన పక్షంలో రెండువైపులా వాణిజ్యం సజావుగా సాగడానికి, జర్మనీ-భారత్ ఆర్థిక సంబంధాలకు మరింత ఉత్తేజమిస్తుంది.
జర్మన్-ఇండియన్ సీఈఓ ఫోరం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక సహకార బలోపేతంపై సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనపై సంతకాలు పూర్తికావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఉభయ దేశాల్లో పరస్పర వ్యాపారాల దీర్ఘకాలిక మనుగడ సాధ్యం కావడంతోపాటు వాణిజ్య-పారిశ్రామిక సహకార విస్తృతికి మరింతగా ప్రోత్సాహమిస్తుంది. సీఈవో ఫోరం నిర్వహణపై ప్రధాని మోదీ, ఛాన్సలర్ మెర్జ్ ఇద్దరూ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికత, ఆటోమోటివ్, రక్షణ, నౌకా నిర్మాణం, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, ఫార్మా, రసాయనాలు, బయో-టెక్నాలజీ, పారిశ్రామిక పరికరాల ఇంజనీరింగ్, ఇంధనం తదితర రంగాల్లో వ్యాపార సహకారం, పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించడం లక్ష్యంగా రెండు పక్షాల ప్రముఖ ‘సీఈఓ’లు, అగ్ర పారిశ్రామికవేత్తలతో వారు చర్చించారు.
సాంకేతికత.. ఆవిష్కరణ.. శాస్త్ర-పరిశోధనలు...
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, డిజిటలీకరణ, టెలికమ్యూనికేషన్లు, ఆరోగ్యం, జీవ ఆర్థిక వ్యవస్థ సహా కీలక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకార విస్తృతిని నాయకులిద్దరూ స్వాగతించారు. ఈ పరిణామం ఆవిష్కరణ, సాంకేతిక భాగస్వామ్య ప్రణాళికను మరింత సంఘటితం చేస్తుంది.
సెమీకండక్టర్ వ్యవస్థ భాగస్వామ్యంపై తాజా సంయుక్త ప్రకటన ద్వారా సెమీకండక్టర్ విలువ శ్రేణి అంతటా సంస్థాగత చర్చల ప్రారంభానికి సుముఖతపై ఉభయపక్షాలు హర్షం వెలిబుచ్చాయి. భారత, జర్మనీ సెమీకండక్టర్ వ్యవస్థల మధ్య మెరుగైన పారిశ్రామిక సహకారం, సంస్థాగత పరిశోధనల ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్ఫుటం చేశారు. ‘గిఫ్ట్ సిటీ’లో నిరుడు మార్చి నెలలో ‘జర్మన్ టెక్నాలజీ ఎంటర్‌ప్రైజ్ ఇన్ఫినియన్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్’ (జీసీసీ) ప్రారంభంపై ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు.
సరఫరా వ్యవస్థల పునరుత్థాన ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తూ- కీలక ఖనిజాల సహకారంపై ఉమ్మడి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (జేడీఓఐ) ద్వారా ఆ రంగంలో సహకార విస్తృతి దిశగా పురోగతిని వారు ప్రశంసించారు. కీలక ఖనిజాల అన్వేషణ, పరిశోధన-అభివృద్ధి, ప్రాసెసింగ్-రీసైక్లింగ్ ద్వారా విలువ జోడింపు సహా రెండు దేశాల్లో పరస్పరంగానే కాకుండా తృతీయ పక్ష దేశాల్లో కూడా కీలక ఖనిజ ఆస్తుల సముపార్జన, అభివృద్ధి రంగాలలో అవకాశాల అన్వేషణపై లక్ష్యనిర్దేశం చేసుకున్నారు.
ఇండో-జర్మన్ డిజిటల్ చర్చలపై 2026–27కు గాను కార్యాచరణ ప్రణాళిక ఖరారును నాయకులిద్దరూ ప్రశంసించారు. అలాగే ఇంటర్నెట్-డేటా గవర్నెన్స్, ఏఐ, సెమీకండక్టర్లు, పారిశ్రామిక విప్లవం 4.0, అధునాతన సాంకేతికతలపై సహకారం ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో సహకారానికి సంబంధించి సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ (జేడీఓఐ) ప్రకటనపై సంతకాలు పూర్తికావడాన్ని ప్రశంసించారు.
‘ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్’ (ఐజీఎస్‌టీసీ) వ్యవధిని పొడిగించేందుకు వారిద్దరూ అంగీకరించారు. అధునాతన తయారీ, వైద్య సాంకేతికతలు, సుస్థిర ఉత్పత్తి, బయోఎకానమీ, వ్యర్థాలను సంపదగా మార్చే కార్యక్రమాలు, సుస్థిరత దిశగా కృత్రిమ మేధ రంగాల్లో ద్వైపాక్షిక పారిశ్రామిక-విద్యా వ్యూహాత్మక పరిశోధనలను ప్రోత్సహించడంలో ‘ఐజీఎస్‌టీసీ’ ప్రధాన పాత్ర పోషించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేంద్రం పరిధిలో (2+2) పరిశ్రమ-విద్యా ప్రాజెక్టులు, సైన్స్-ఇంజనీరింగ్ పరిశోధనలలో మహిళల భాగస్వామ్యం వంటి కార్యక్రమాల భాగస్వామ్యాన్ని వారిద్దరూ ప్రశంసించారు.
డిజిటల్ కన్వర్జెన్స్, బ్యాటరీ టెక్నాలజీ, గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్, అఫర్డబుల్ హెల్త్ కేర్ తదితరాలపై దృష్టి సారించేలా ‘ఇండో-జర్మన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఇన్నోవేషన్’ (IG-CoE) ఏర్పాటులో పురోగమనాన్ని నాయకులిద్దరూ కొనియాడారు. జన్యుశాస్త్రం, 3డీ బయోప్రింటింగ్-బయో మాన్యుఫ్యాక్చరింగ్‌లో వినూత్న ఫలితాల దిశగా బయోఎకానమీపై ద్వైపాక్షిక సహకారానికి శ్రీకారం చుట్టడంపై హర్షం ప్రకటించారు. ‘ఫెసిలిటీ ఫర్ యాంటీప్రొటాన్ అండ్ అయాన్ రీసెర్చ్’, ‘డ్యూకెస్ ఎలెక్ట్రోనెన్ సింక్రోట్రాన్’లకు సంబంధించి కీలక శాస్త్రవిజ్ఞాన ప్రాంగణాల్లో భారత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఉన్నత స్థాయి చర్చలను వారు ప్రశంసించారు. అలాగే ‘పెట్రా-3, ‘డీఈఎస్‌వై’లలోని ‘ఫ్రీ-ఎలక్ట్రాన్ లేజర్’ సదుపాయాల మధ్య నిరంతర సహకారంపై విశ్వాసం వెలిబుచ్చారు.
అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), జర్మన్ స్పేస్ ఏజెన్సీ (డీఎల్‌ఆర్)ల మధ్య చర్చల ప్రగతిపై నాయకులు హర్షం ప్రకటించారు. రెండు సంస్థల మధ్య సహకార విస్తృతి అవకాశాలను స్వాగతించారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పరిశ్రమ స్థాయి సంబంధాల బలోపేతానికి ఉభయ పక్షాలూ అంగీకరించాయి.
అందుబాటు ఆరోగ్య సంరక్షణ కోసం నిదర్శన ఆధారిత, ప్రజా కేంద్రక సంప్రదాయ వైద్య విధానాలకు ప్రోత్సాహంపై తమ నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. సంప్రదాయ వైద్యంలో శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఆల్-ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, జర్మనీలోని చారిటే విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందాన్ని వారు స్వాగతించారు.
కాలుష్యరహిత-సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం.. పునరుత్పాదక ఇంధనం
కాలుష్యరహిత-సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం (జీఎస్‌డీపీ) ఒప్పందం వ్యవధి 2026తో సగం పూర్తవుతుండటాన్ని నాయకులిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య ప్రధాన కార్యక్రమాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం సుస్థిర ప్రగతి, వాతావరణ కార్యాచరణపై ద్వైపాక్షిక సహకారాన్ని ముమ్మరం చేసింది. అలాగే ‘ఎస్‌డీజీ’ల విషయంలో బలమైన కట్టుబాటును ప్రకటిస్తూ పారిస్ ఒప్పందం అమలును బలోపేతం చేసింది. దీనికింద 2030 దాకా జర్మనీ ప్రభుత్వం హామీ ఇచ్చిన 10 బిలియన్ యూరోల నిధుల్లో అధికశాతం రాయితీ రుణాల కింద పంపిణీ అయ్యాయి. మరోవైపు 2022 నుంచి సుమారు 5 బిలియన్ యూరోలు వాతావరణ మార్పు ఉపశమనం-అనుసరణ సహా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర పట్టణాభివృద్ధి, కాలుష్య రహిత పట్టణ రవాణా, సహజ వనరుల నిర్వహణ, అటవీ-జీవవైవిధ్యం, వ్యవసాయం-పర్యావరణం, వర్తుల ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రాజెక్టుల కోసం ఉపయోగం/కేటాయింపులు చేశారు. మొత్తంమీద ‘జీఎస్‌డీపీ’ కింద భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు-ప్రాజెక్టులైన పీఎం ఇ-బస్ సేవ, సోలార్ రూఫ్‌టాప్ ప్రోగ్రామ్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అహ్మదాబాద్-సూరత్- బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటర్ విజన్-2047 వంటి వాటిని ఇండో-జర్మన్ సహకారంతో చేపట్టారు. అలాగే తమిళనాడులో వాతావరణ-పునరుత్థాన పట్టణ మౌలిక సదుపాయాలు, పశ్చిమ బెంగాల్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్, పునరుత్పాదక ఇంధన విస్తరణ దిశగా భారత్-జర్మనీ సహకారం కింద వ్యవసాయ-ఫోటోవోల్టాయిక్స్ సహా ఫైనాన్సింగ్ రంగంలో ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు చేయూత దిశగా నిధులు వినియోగించారు.
పునరుత్పాదక ఇంధనం కోసం రుణాలు, పెట్టుబడుల సమీకరణ ప్రాధాన్యాన్ని నాయకులిద్దరూ పునరుద్ఘాటించారు. ఈ రంగంలో పెట్టుబడుల కోసం భారత్-జర్మనీ వేదిక కింద ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన సంయుక్త కృషిపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సౌరశక్తి ఉత్పాదన, పవన విద్యుత్తుపై 2025 అక్టోబరులో ఉమ్మడి కార్యాచరణ బృందాల ఏర్పాటు, బ్యాటరీ స్టోరేజీ పరిష్కారాలపై కొత్త సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు వంటివాటిని స్వాగతించారు. ఈ ఉమ్మడి బృందాలు సాంకేతికత, ప్రమాణాలు, నియంత్రణ-పునరుత్పాదక ఇంధనం కోసం సరఫరా వ్యవస్థలు సహా పునరుత్థాన సామర్థ్య వికాసంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరిస్తాయి. అదే సమయంలో భారత్-జర్మనీల నుండి కంపెనీల మధ్య ఆదానప్రదానం, పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి.
ఇండో-జర్మన్ ఎనర్జీ ఫోరం పరిధిలోని సంయుక్త ప్రణాళిక కింద కృషి సహా గ్రీన్ హైడ్రోజన్‌పై సహకారం కొనసాగింపుపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ చేపట్టిన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, జర్మనీ అనుసరిస్తున్న జాతీయ హైడ్రోజన్ వ్యూహాన్ని లోతైన సాంకేతిక-వాణిజ్య-నియంత్రణల సహకారం సహా బలోపేతం చేసిన పరస్పర వ్యాపార సంబంధాల ద్వారా సమన్వయం చేయాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. భారత్‌లో హైడ్రోజన్ నిబంధనలు-ప్రమాణాల రూపకల్పనలో సహకార విస్తృతి దిశగా పెట్రోలియం-సహజ వాయువు నియంత్రణ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ), జర్మన్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అసోసియేషన్ ఫర్ గ్యాస్ అండ్ వాటర్ ఇండస్ట్రీస్ (డీవీజీడబ్ల్యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని నాయకులు స్వాగతించారు. భారత జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ‘ఏఎం గ్రీన్’ నుంచి ‘యూనిపర్ గ్లోబల్ కమోడిటీస్’కు గ్రీన్ అమ్మోనియా సరఫరా కోసం అతిపెద్ద కొనుగోలు ఒప్పందం కుదరడంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. ప్రైవేట్ రంగంలో నిబద్ధతగల భాగస్వాములుగా ఇప్పటిదాకా ఉభయ పక్షాలూ సాధించిన పురోగతిని.. ముఖ్యంగా భారత్‌లో తయారయ్యే గ్రీన్ అమ్మోనియా కోసం భారీ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు పూర్తికావడాన్ని వారిద్దరూ స్వాగతించారు.
ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో త్రైపాక్షిక అభివృద్ధి సహకార (టీడీసీ) ప్రాజెక్టుల ఫలితాల పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. మూడో ప్రపంచ దేశాలలో సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి పరస్పర శక్తి సామర్థ్యాలను సమీకరించుకోవడానికి ఇరుపక్షాల నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. ఘనా, కామెరూన్, మలావిలలో టీడీసీ ప్రాజెక్టులను విస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇండో-పసిఫిక్, అనుసంధానత, ప్రపంచ అంశాలు
స్వేచ్ఛాయుతమైన బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంతానికి, యూఎన్‌సీఎల్ఓఎస్‌తో సహా అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవానికి నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. నూతన ద్వైపాక్షిక ఇండో-పసిఫిక్ సంప్రదింపుల యంత్రాంగాన్ని ప్రకటించారు. భారతదేశం, జర్మనీ సంయుక్తంగా చేపడుతోన్న ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపీఓఐ) 'సామర్థ్య పెంపుదల, వనరుల భాగస్వామ్యం' కింద కార్యకలాపాలతో సహా ఈ ప్రాంతంలో జర్మనీ నిరంతర, పెరుగుతున్న భాగస్వామ్యాన్ని భారత్ స్వాగతించింది.
భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్‌కు (ఐఎంఈసీ) బలమైన మద్దతును పునరుద్ఘాటించిన ఇరువురు నాయకులు.. ప్రపంచ వాణిజ్యం, అనుసంధానత, శ్రేయస్సును పునర్నిర్మించడం, ప్రోత్సహించడంలో దాని పరివర్తనాత్మక సామర్థ్యాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టేందుకు మొదటి ఐఎంఈసీ మంత్రివర్గ సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రస్తుత సమకాలీన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా శాశ్వత, తాత్కాలిక సభ్యత్వ విభాగాలను విస్తరించడం ద్వారా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యూఎన్ఎస్‌సీ) సమగ్ర సంస్కరణలకు ఉన్న అత్యవసర అవసరాన్ని భారత్, జర్మనీ పునరుద్ఘాటించాయి. ఈ విషయంలో ఐజీఎన్‌లో రాత పూర్వక చర్చలను ప్రారంభించే దిశగా ముందుకు సాగాలని ఉభయ దేశాలు పిలుపునిచ్చాయి.
తీవ్ర స్థాయిలో మానవ సమస్యలు, ప్రతికూల ప్రపంచ పరిణామాలకు కారణమవుతూ ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం పట్ల ఇరు దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, ఐరాస చార్టర్ సూత్రాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతిస్తున్నట్లు వారు ప్రకటించారు.
'గాజా శాంతి ప్రణాళిక'ను ఇరు దేశాల నాయకులు స్వాగతించారు. గాజాలో ఘర్షణను ముగించే దిశగా ‘2025 నవంబర్ 17 నాటి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం- 2803 ఆమోదాన్ని’ ఒక ముందడుగుగా గుర్తించారు. ఈ తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయాలని అన్ని పక్షాలకు వారు తెలియజేశారు. గాజాకు అడ్డంకులు లేని, భారీ స్థాయిలో మానవతా సాయం అందించాల్సిన అవసరాన్ని.. దీనితో పాటు మానవతా సంస్థలకు ఆటంకం లేకుండా అనుమతి ఇచ్చే అవసరాన్ని వారు ప్రధానంగా చెప్పారు. న్యాయమైన, శాశ్వతమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధతంగా ఉన్నట్లు పునరుద్ఘాటించారు. చర్చల ద్వారా వచ్చిన 'రెండు దేశాల పరిష్కారం' రూపంలో మధ్యప్రాచ్య సంఘర్షణకు శాశ్వత పరిష్కారం కావాలని మరోసారి పిలుపునిచ్చారు.
వాతావరణ మార్పులపై వేగవంతమైన ప్రపంచ స్థాయి చర్యలకు ఉన్న అత్యవసర అవసరాన్ని ఇరు దేశాల నాయకులు ప్రముఖంగా పేర్కొన్నారు. పారిస్ ఒప్పందానికి ఉన్న ప్రాధాన్యతను, బెలెమ్‌లో జరగబోయే కాప్-30 పునరుద్ఘాటనను.. ఇటీవలి సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యంగా 'జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం', 'టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్'ను రూపొందించడాన్ని వారు పేర్కొన్నారు. గ్లోబల్ స్టాక్‌టేక్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు హరిత, సుస్థిర ఇంధన వ్యవస్థలు- ఆర్థిక వ్యవస్థల వైపు న్యాయబద్ధంగా మారడానికి.. అలాగే వాతావరణ మార్పుల విషయంలో పెరుగుతున్న ప్రభావాలకు తగ్గట్టు అవి మారేందుకు మద్దతుగా వాతావరణ ఆర్థిక సహాయం, సాంకేతిక బదిలీ రంగాలలో ప్రయత్నాలు- వాతావరణ ప్రభావ చర్యలను గణనీయంగా పెంచాలని వారు పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం చక్కగా రూపొందించిన వాతావరణ చర్యల సామర్థ్యాన్ని.. అలాగే దేశీయ- దేశాల మధ్య ఉండే విలువ గొలుసుల విషయంలో పరివర్తను రూపొందించేందుకు, వేగవంతం చేసేందుకు అన్ని వర్గాల ద్వారా వాతావరణ ఆర్థిక సహాయాన్ని పెంచడానికి ఉన్న ప్రాముఖ్యతను వారు ప్రధానంగా చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, తీవ్ర వాతావరణ పరిస్థితుల నుంచి ఎదురయ్యే ముప్పులను.. అలాగే వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత, జీవవైవిధ్య నష్టం వల్ల భద్రత విషయంలో వచ్చే పర్యవసానాలను కూడా వారు గుర్తించారు.
మహమ్మారుల విషయంలో సంసిద్ధత- ప్రతిస్పందన, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై పోరాటం, సరసమైన ధరకు లభించే ఆరోగ్య సంరక్షణ- మందులను సమానంగా అందుబాటులో ఉండేలా చూసుకోవటంతో సహా ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి వారు అంగీకరించారు.
విద్య, నైపుణ్యం, వలసలు, సాంస్కృతిక రంగాలు
వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రజల మధ్య బలమైన సంబంధాలను ఒక కీలకమైన అంశంగా ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. విద్యార్థులు, పరిశోధకులు, నైపుణ్యం కలిగిన నిపుణులు, కళాకారులు, పర్యాటకుల మధ్య పెరుగుతున్న సంబంధాలను స్వాగతించారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంస్కృతిక రంగాలకు భారతీయ సమాజం అందిస్తున్న విలువైన సహకారాన్ని వారు గుర్తించారు. అదే సమయంలో పరస్పర అవగాహనను పెంచడానికి విద్య, పరిశోధన, వృత్తి విద్యా శిక్షణ, సంస్కృతి, యువజన మార్పిడిలో విస్తృత సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రధానంగా పేర్కొన్నారు. భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వారికి జర్మనీ మీదుగా ప్రయాణించే సమయంలో 'వీసా రహిత ట్రాన్సిట్ సౌకర్యాన్ని' ప్రకటించినందుకు ప్రధానమంత్రి మోదీ ఛాన్స్‌లర్ మెర్జ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతీయుల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచుతుంది. మెగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (ఎంఎంపీఏ) నిబంధనలను పూర్తిగా అమలు చేయడం ద్వారా చట్టబద్ధమైన వలసలను మరింత బలోపేతం చేయటం, దేశం విడిచి వెళ్లాల్సిన వ్యక్తులను తిరిగి పంపించటం, అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, దస్త్రాలు- వీసా మోసాలకు వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
జర్మనీలో పెరుగుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యను, అలాగే ఉన్నత విద్యలో జాయింట్ - డ్యూయల్ డిగ్రీ కోర్సులను, ఉమ్మడి పరిశోధనలు- సంస్థాగత భాగస్వామ్యాల విస్తరణను ఇద్దరు నాయకులు గుర్తించారు. భారతీయ విద్యార్థులు- గ్రాడ్యుయేట్లు జర్మనీ ఉద్యోగ విపణిలో సులభంగా కలిసిపోయేలా రూపొందించిన ప్రాజెక్టులలో కూడా ఈ లోతైన సంబంధాలు కనిపిస్తున్నాయి. భారతీయ సాంకేతిక సంస్థలు (ఐఐటీ), జర్మనీలోని సాంకేతిక విశ్వవిద్యాలయాల మధ్య ఏర్పడిన సంస్థాగత అనుసంధానాలను వారు స్వాగతించారు. సంస్థాగత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు 'ఉన్నత విద్యపై ఇండో-జర్మన్ సమగ్ర ప్రణాళిక'ను రూపొందించడాన్ని వారు ఆహ్వానించారు. నూతన విద్యా విధానం కింద భారతదేశంలో ప్రాంగణాలను ప్రారంభించవలసిందిగా ప్రముఖ జర్మన్ విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారు.
మెగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (ఎంఎంపీఏ) కింద నైపుణ్యం కలిగిన కార్మికుల వలసల్లో కొనసాగుతున్న సహకారం పట్ల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిబద్ధత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు విషయంలో జర్మనీకి ఉన్న వ్యూహానికి అనుగుణంగా దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తూ.. అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ అన్ని పక్షాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నైపుణ్యం కలిగిన కార్మికుల రాకపోకలను సులభతరం చేయాలని ఉభయ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడుతూనే ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ నిపుణుల విషయంలో జర్మనీలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు నైపుణ్యం కలిగిన వలసల కోసం నైతిక విలువలతో కూడిన సుస్థిరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంపై దృష్టి సారించే 'గ్లోబల్ స్కిల్స్ పార్టనర్‌షిప్'కు సంబంధించిన జేడీఐపై సంతకం చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారతీయ, జర్మన్ ఉద్యోగ విపణికి అవసరమైన పాఠ్యాంశాలను తయారుచేయటం, పరిశ్రమలతో సహకారం, శిక్షకులకు శిక్షణ ఇవ్వడం వంటి అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే 'పునరుత్పాదక ఇంధనంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఇండో-జర్మన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేసేందుకు జేడీఐపై సంతకం చేయడాన్ని కూడా రెండు దేశాల నాయకులు స్వాగతించారు. ఈ నేపథ్యంలో సెకండరీ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కేంద్రాలతో సహా భారత్‌లో జర్మన్ భాషా బోధనను విస్తరించాలనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఇరుపక్షాలు ప్రకటించాయి.
భారత్, జర్మనీ దేశాలు బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటున్నాయి. బ్రెమెర్‌హావెన్‌లోని జర్మన్ మారిటైమ్ మ్యూజియం - లైబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మారిటైమ్ హిస్టరీ (డీఎస్ఎం), లోథల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ మధ్య కుదిరిన ఎంఓయూను ఇరువురు నాయకులు స్వాగతించారు. ఇది సముద్ర వారసత్వంపై సహకారాన్ని పెంచటంతో పాటు సముద్రాల చరిత్రలోని ఉమ్మడి అంశాలను ప్రదర్శిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యూజియంల మధ్య సహకారంపై మళ్లీ కొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. క్రీడలలో సహకారంపై జేడీఓఐ ఖరారు కావడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఇది అథ్లెట్ల శిక్షణ, క్రీడా పరిపాలన, సమగ్రత, అథ్లెట్ల హక్కులతో పాటు క్రీడా శాస్త్ర పరిశోధనలో సహకారాన్ని బలోపేతం చేస్తుంది.
తనకు, తన ప్రతినిధి బృందానికి అందించిన సాదర ఆతిథ్యానికి గాను ప్రధానమంత్రి మోదీకి ఛాన్స్‌లర్ మెర్జ్ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి భారత్-జర్మనీ ప్రభుత్వాల సంప్రదింపులు.. 2026 చివరలో జర్మనీలో జరుగుతాయని ఇరువురు ప్రకటించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.
***
(रिलीज़ आईडी: 2215019)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam