ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


నూతన ఆలోచనలు, ఉత్సాహం, స్పష్టమైన లక్ష్యంతో, యువశక్తి దేశ నిర్మాణంలో ముందంజలో నిలుస్తోంది: ప్రధానమంత్రి

స్వామి వివేకానంద ఆలోచనలు యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి: ప్రధానమంత్రి

యువతపై ప్రత్యేక దృష్టితో అనేక పథకాలు అమలు చేస్తున్నాం: ఇక్కడినుంచే భారత్‌లో స్టార్టప్ విప్లవం అసలైన ఊపందుకుంది: ప్రధానమంత్రి

సంస్కృతి, కంటెంట్, సృజనాత్మకత ఆధారంగా ఆరెంజ్ ఎకానమీలో భారతదేశం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది: ప్రధానమంత్రి

గత దశాబ్ద కాలంగా ప్రారంభించిన సంస్కరణల శ్రేణి ఇప్పుడు ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’గా దూసుకుపోతోంది; ఈ సంస్కరణలకు మన యువశక్తి కేంద్రబిందువుగా నిలుస్తోంది: ప్రధానమంత్రి

బానిస మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు భారత యువత సంకల్పం తీసుకోవాలి: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 JAN 2026 9:12PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. శ్రీ మోదీ ప్రసంగిస్తూ, తాను ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, నేటి యువ పౌరులలో చాలా మంది ఇంకా పుట్టలేదని,  అలాగే, 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలుగానే ఉన్నారని తెలిపారు. గడచిన  కాలంతో నిమిత్తం లేకుండా యువతరంపై తన నమ్మకం స్థిరంగా, అచంచలంగా ఉందని ఆయన చెప్పారు. “మీ సామర్థ్యం, మీ ప్రతిభ, మీ బలం నుంచే నేను ఎల్లప్పుడూ శక్తిని పొందాను. ఈ రోజు మీరందరూ అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధన పగ్గాలను చేతబట్టారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 వరకూ ఈ కాలం దేశానికి, యువతకు నిర్ణయాత్మక దశ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. యువ భారతీయుల బలం, వారి సామర్థ్యాలు దేశం బలాన్ని నిర్ణయిస్తాయని, వారి విజయం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. వికసిత భారత్ యువ నాయకుల చర్చలో పాల్గొన్నవారిని ప్రధాన మంత్రి అభినందించారు, అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడంలో యువ నాయకత్వం కీలక పాత్రను పోషిస్తుందని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమం స్వామి వివేకానంద జయంతితో కలిసి రావడం విశేషమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “స్వామి వివేకానందను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆయన ఆశయాల స్ఫూర్తితో వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా వేదక కోసం జనవరి 12వ తేదీని ఎంపిక చేశారు. స్వామి వివేకానంద జీవితం మనందరికీ గొప్ప మార్గదర్శకం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా వేదిక వేగవంతమైన వృద్ధి పట్ల శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశ అభివృద్ధి అజెండాను రూపొందించడంలో యువత నేరుగా పాలుపంచుకునేందుకు ఇది ఒక శక్తివంతమైన వేదిక అని ఆయన అభివర్ణించారు.  “ఈ కార్యక్రమంతో కోట్లాది మంది యువత అనుబంధం, 50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు, 30 లక్షలకు పైగా యువకులు వికసిత భారత్ ఛాలెంజ్‌లో పాల్గొని, దేశాభివృద్ధికి తమ ఆలోచనలను పంచుకోవడం సహా  ఇంత పెద్ద ఎత్తున యువశక్తి భాగస్వామ్యం అపూర్వమని”  శ్రీ మోదీ ఉద్ఘాటించారు

కార్యక్రమంలో వ్యక్తమైన అభిప్రాయాల నాణ్యతను ప్రశంసిస్తూ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి,  ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై వ్యక్తమైన ఆలోచనలను ప్రధాన మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమం సందర్భంగా చేసిన ప్రజెంటేషన్లను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలనే భారతదేశ అమృత తరం బలమైన సంకల్పాన్ని అవి ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. భారతదేశంలోని ఈ తరం (జెన్-జడ్) యువత సృజనాత్మకత, వినూత్న స్ఫూర్తిని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ సంభాషణను విజయవంతంగా నిర్వహించినందుకు  పాల్గొన్న యువతకు, మేరా యువ భారత్  సంస్థ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి, 2014 కంటే ముందు ఉన్న కాలాన్ని ప్రస్తావిస్తూ దానిని విధానపరమైన స్తంభన, అవినీతి, యువతకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్న యుగంగా వర్ణించారు. ఉద్యోగాలు, పరీక్షలు, వ్యాపారం ప్రారంభించడానికి యువత అప్పట్లో క్లిష్టమైన ప్రక్రియలు ఎదుర్కొందని, నిర్ణయాలు ఆలస్యం కావడం, విధానాల అమలు సరిగా లేకపోవడం జరిగిందని ఆయన తెలిపారు. నేడు అసాధారణంగా అనిపించేది పదేళ్ల క్రితం సాధారణంగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి పాలనా సంస్కరణలు భారత యువత అనుభవాన్ని ఏ విధంగా మార్చాయో ఆయన వివరించారు.

ఈ మార్పునకు స్టార్టప్ వ్యవస్థను ప్రధానమంత్రి ఉదాహరణగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా స్టార్టప్ సంస్కృతిలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి ఉన్నా, 2014 కంటే ముందు భారతదేశంలో స్టార్టప్‌లపై శ్రద్ధ చాలా తక్కువగా ఉండేదని ఆయన తెలిపారు. 2014 వరకు, దేశంలో నమోదైన స్టార్టప్‌లు 500 కంటే తక్కువ” అని ఆయన తెలియజేశారు. స్టార్టప్ సంస్కృతి లేకపోవడంతో, ప్రతి రంగంలో ప్రభుత్వ జోక్యం అధికంగా ఉండేదని, మన యువత ప్రతిభకు,  సామర్థ్యాలకు అనుగుణంగా తమ కలలు సాకారం చేసుకొనే అవకాశం వారికి దొరకలేదని శ్రీ మోదీ అన్నారు. 

భారత యువత సామర్థ్యాలపై తనకు ఉన్న విశ్వాసమే యువ ఆవిష్కర్తలకు సాధికారత కల్పించే నూతన అభివృద్ధి విధానానికి దారితీసిందని ప్రధానమంత్రి చెప్పారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే పన్ను, నిబంధనల సరళీకరణ వంటి కీలక సంస్కరణలు, కార్యక్రమాలను ఆయన వివరించారు. గతంలో ప్రభుత్వ ఆధిపత్యంలో ఉన్న రంగాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు  చేరువ చేయడం ద్వారా ఈ సంస్కరణలు భారత స్టార్టప్ విప్లవాన్ని వేగవంతం చేశాయని ఆయన తెలిపారు.

అంతరిక్ష రంగాన్ని ప్రధాన ఉదాహరణగా చెబుతూ, "ఐదు, ఆరు సంవత్సరాల క్రితం వరకు, అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కేవలం ఇస్రో ఒక్కదానిపైనే ఉండేది. మేం అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతించాం. దానికి మద్దతుగా ఉండే ప్రణాళికలను,  సంస్థలను ఏర్పాటు చేశాం” అని పేర్కొన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం వల్ల 300కు పైగా స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయని శ్రీ మోదీ తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్  సంస్థల విజయాలను ఆయన ఉదహరించారు. యువత నడిపిస్తున్న ఆవిష్కరణలు భారత్ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరడానికి ఈ విజయాలు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల ఆధిపత్యంలో ఉన్న రక్షణ రంగంలో జరిగిన ప్రధాన సంస్కరణలను కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. "నేడు భారతదేశంలో 1,000 కంటే ఎక్కువ రక్షణ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. ఒక యువత డ్రోన్‌లు తయారు చేస్తుంటే, మరొకరు యాంటీ-డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు, కొందరు ఏఐ ఆధారిత కెమెరాలను సృష్టిస్తుంటే, మరికొందరు రోబోటిక్స్‌లో పనిచేస్తున్నారు" అని శ్రీ మోదీ చెప్పారు.

కొత్త తరం సృష్టికర్తలను ప్రోత్సహించడంలోనూ, సంస్కృతి, కంటెంట్, సృజనాత్మకతపై ఆధారపడిన భారతదేశ ఆరెంజ్ ఎకానమీ వృద్ధికి డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రభావాన్ని ప్రధాన మంత్రి ప్రముఖంగా తెలిపారు. " 'ఆరెంజ్ ఎకానమీ'లో, అంటే సంస్కృతి, కంటెంట్, సృజనాత్మకతలో భారత్ అపూర్వమైన వృద్ధిని చూస్తోంది. మీడియా, ఫిల్మ్, గేమింగ్, సంగీతం, డిజిటల్ కంటెంట్, వీఆర్- ఎక్స్ఆర్ వంటి రంగాలలో భారత్ ప్రధాన ప్రపంచ కేంద్రంగా అవతరిస్తోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. “'వరల్డ్ ఆడియో-విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (వేవ్స్) యువ సృష్టికర్తలకు ప్రధాన వేదికగా మారింది. వేరే విధంగా చెప్పాలంటే, రంగం ఏదైనా సరే, భారతదేశంలో అనంతమైన అవకాశాల ద్వారాలు తెరుచుకుంటున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు. తమ ఆలోచనలను ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిరంతర మద్దతు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

గత దశాబ్ద కాలంలో ప్రారంభించిన సంస్కరణల ఎజెండా వేగవంతమైందని, అందులో యువతే కీలకం అని ప్రధానమంత్రి తెలిపారు. యువ నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రక్రియలను సరళతరం చేసేందుకు, వారి పొదుపును పెంచేందుకు తరువాతి తరం జీఎస్టీ సంస్కరణలు,  రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు వంటి చర్యలను ఆయన వివరించారు. ఏఐ, ఆధునిక తయారీ రంగం కారణంగా పెరుగుతున్న ఇంధన అవసరాన్ని ప్రస్తావిస్తూ, పౌర అణు ఇంధన రంగంలో సంస్కరణలను ఆయన వివరించారు. శాంతి (ఎస్‌హెచ్ఏఎన్‌టి‌ఐ) చట్టం వంటి సంస్కరణలు నమ్మకమైన విద్యుత్ సరఫరా ఉండేలా చూడడం, పెద్ద ఎత్తున ఉపాధిని సృష్టించడం, ఆర్థిక వ్యవస్థ అంతటా సానుకూల ప్రభావాలను  ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కొరతను ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంతర్జాతీయ అవకాశాల కోసం యువతను సిద్ధం చేయడానికి భారత్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఆయన వివరించారు. "ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న అవకాశాల కోసం భారత యువత సిద్ధంగా ఉండేలా చూడడమే మా ప్రయత్నం. అందువల్ల, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన రంగాలలో నిరంతరం సంస్కరణలు జరుగుతున్నాయి" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. నూతన జాతీయ విద్యా విధానం వచ్చిన తర్వాత, ఉన్నత విద్యకు సంబంధించిన నిబంధనలను ప్రస్తుతం సంస్కరిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. "విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారతదేశంలో తమ క్యాంపస్‌లను తెరుస్తున్నాయి. ఇటీవల, వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పీఎం సేతు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కింద, వేలాది ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తారు. తద్వారా యువతకు ప్రస్తుత, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వవచ్చు" అని శ్రీ మోదీ తెలిపారు.

ఒక దేశం స్వావలంబన, అభివృద్ధి చెందినదిగా ఉండాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మాకాలే వలసవాద కాలంనాటి విద్యా విధానాలను ప్రస్తావిస్తూ, ఆ విధానాలు భారతీయులలో వారి స్వంత వారసత్వం, ఉత్పత్తులు, సామర్థ్యాల పట్ల ఒక రకమైన న్యూనతా భావాన్ని నింపాయని ఆయన అన్నారు. "పదేళ్లలో, మాకాలే అనాలోచిత విధానాలకు 200 సంవత్సరాలు పూర్తవుతుంది, అందుకే, దేశంలోని ప్రతి యువత ఈ మానసిక స్థితి నుంచి భారతదేశానికి విముక్తి కలిగించాలని కలసికట్టుగా సంకల్పం తీసుకోవాలి” అని భారత యువతకు శ్రీ మోదీ పిలుపు ఇచ్చారు. 

భారతీయ వారసత్వాన్ని గౌరవిస్తూనే, ప్రపంచ జ్ఞానాన్ని స్వీకరించడం ఎంత ముఖ్యమో ప్రధానమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన "ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః" అనే వేద మంత్రాన్ని ఉదహరించారు. దీని అర్థం -  "శ్రేయస్కరమైన, శుభప్రదమైన శ్రేష్ఠమైన ఆలోచనలు అన్ని దిశల నుంచి నుండి మన వద్దకు రావాలి." మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతుల నుంచి నేర్చుకోవాలి. కానీ మీ స్వంత వారసత్వాన్ని, మీ ఆలోచనలను తక్కువ చేసి చూసే ధోరణికి ఎప్పుడూ తావు ఇవ్వకూడదు" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్త ఆలోచనలను స్వీకరిస్తూనే, భారతదేశం గురించి ఉన్న అపోహలను పటాపంచలు చేసి, మెరుగైన దేశం కోసం స్ఫూర్తిని నింపిన స్వామి వివేకానందుడిని శ్రీ మోదీ ఉదహరించారు. యువత సామర్థ్యంపై అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, “మీ అందరిపై, మీ శక్తిసామర్థ్యాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది” అన్నారు. ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఆరోగ్యాన్ని  కాపాడుకోవాలని, సంతోషంగా ఉండాలని ఆయన యువతను ప్రోత్సహించారు. అందరికీ మరోసారి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. 

 

***


(रिलीज़ आईडी: 2215016) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada