ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 14 JAN 2026 11:41AM by PIB Hyderabad

వణక్కం!

ఇనియ పొంగల్ నల్వాళ్తుక్కళ్! ఈ ఆనందభరిత పొంగల్ పండుగ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు!

పొంగల్ ఈ రోజున నిజంగా ఓ అంతర్జాతీయ పర్వదినంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగాగల తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా దీన్ని అపరిమిత ఉత్సాహంతో నిర్వహించుకుంటారు. అటువంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే, ఈ ప్రత్యేక పండుగ వేడుకల్లో మీ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. తమిళుల జీవనంలో పొంగల్ పంగుడ మధురానుభూతి. భూమాత, అన్నదాతలతోపాటు సూర్య భగవానునిపై మానవాళి కృతజ్ఞతకు ఈ పండగ ఓ ప్రతీక. ప్రకృతితో, కుటుంబంతో, సమాజంతో సామరస్యానికిగల ప్రాధాన్యాన్ని ఇది మనకు అవగతం చేస్తుంది. ఇదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు వంటి పేర్లతో ఈ పర్వదినాన ప్రజలు సంబరాల్లో తలమునకలై ఉన్నారు. దేశవిదేశాల్లోని తమిళ సోదరీసోదరులందరికీ పొంగల్ సహా ఈ పండుగల వేళ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

మిత్రులారా!

తమిళ సంస్కృతి సంబంధిత అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం గత సంవత్సరం నాకు లభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ సందర్భంలో తమిళనాడులోని వెయ్యేళ్ల నాటి గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రార్థనలు చేశాను. అలాగే వారణాసిలో కాశీ-తమిళ సంగమం వేడుకల సమయాన అక్కడున్న అనుక్షణం సాంస్కృతిక సమ్మేళన ఉత్తేజపూర్వక అనుభూతిని పొందాను. ఇక పంబన్ వంతెన ప్రారంభోత్సవం కోసం రామేశ్వరం వెళ్లినపుడు, మరోసారి తమిళ చారిత్రక వైభవాన్ని కళ్లారా చూశాను. తమిళ సంస్కృతి మన దేశానికి మాత్రమేగాక యావత్‌ ప్రపంచానికీ ఉమ్మడి వారసత్వం. ‘ఒకే భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి పొంగల్ వంటి పండుగలతో బలం పుంజుకుంటుంది.

మిత్రులారా!

ప్రపంచం నాగరికతలలో దాదాపు ప్రతి ఒక్కటీ పంట కోతల సమయాన్ని ఒక పండుగలా నిర్వహించుకుంటుంది. ఈ క్రమంలో తమిళ సంస్కృతి రైతును ఒక జీవన మూలస్తంభంగా పరిగణిస్తుంది. వ్యవసాయం-రైతన్న ప్రాధాన్యం ఎంతటిదో తమిళ కావ్యం తిరుక్కురళ్‌ విశదీకరిస్తుంది. దేశ పురోగమనంలో మన రైతులు బలమైన భాగస్వాములు. ఆరుగాలం శ్రమించే వారి కృషి స్వయంసమృద్ధ- స్వావలంబన భారత్‌ లక్ష్యానికి అపారమైన శక్తినిస్తుంది. రైతుల సాధికారతకు కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా నిబద్ధతతో నిరంతరం శ్రమిస్తోంది.

మిత్రులారా!

ప్రకృతిపై మన కృతజ్ఞత మాటలకు పరిమితం కాకుండా, దాన్నొక జీవన విధానంగా మార్చుకునే విధంగా పొంగల్ పండుగ స్ఫూర్తినిస్తుంది. ఈ భూగోళం మనకెంతో ఇస్తున్నప్పుడు, దాన్ని పరిరక్షించడం మన కర్తవ్యం. ముఖ్యంగా భావితరాల కోసం భూసారాన్ని పదిలం చేయడం, జల సంరక్షణ, వనరుల వివేచనాత్మక వినియోగం అత్యంత ప్రధాన బాధ్యతలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ లైఫ్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్’, ‘అమృత సరోవర్’ వంటి కార్యక్రమాలు ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. అంతేకాకుండా వ్యవసాయాన్ని మరింత సుస్థిరం. పర్యావరణ హితం చేసే దిశగానూ మేం కృషి చేస్తున్నాం. రాబోయే రోజల్లో సుస్థిర వ్యవసాయ పద్ధతులు, జల యాజమాన్యం... అంటే- నేను తరచూ చెబుతున్నట్లుగా ప్రతి నీటిబొట్టుకు మరింత పంట, ప్రకృతి వ్యవసాయం, అగ్రి-టెక్, విలువ జోడింపు వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే మన యువత ఈ రంగాలన్నింటా నవ్య దృక్పథంతో ముందుకెళ్తున్నారు. కొన్ని నెలల కిందట తమిళనాడులో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన ఓ సదస్సుకు నేను హాజరయ్యాను. ఆ సందర్భంగా- తమిళ యువతరంలో కొందరు అత్యన్నత అవకాశాలను ఆవలకు నెట్టి, పొలాలకు తమనుతాము అంకితం చేసుకున్న తీరు నన్నెంతో ఆశ్చర్యపరచింది. వారెంత అద్భుత ఫలితాలు సాధిస్తున్నారో నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. సుస్థిర వ్యవసాయ విప్లవం దిశగా ఈ ఉద్యమాన్ని మరింత విస్తరించాల్సిందిగా వ్యవసాయ రంగంలోని నా యువ తమిళ మిత్రులను కోరుతున్నాను. మన పళ్లాలు.. జేబులు నిండుగా ఉండాలి. అదే సమయంలో భూగోళం సురక్షితంగా ఉండాలన్నదే మనందరి లక్ష్యం కావాలి.

మిత్రులారా!

ప్రపంచ ప్రాచీన జీవన నాగరికతలలో తమిళ సంస్కృతి కూడా ఒకటి. ఇది శతాబ్దాలను అనుసంధానిస్తూ, చరిత్ర సారాన్ని గ్రహిస్తూ, ఉజ్వల భవిష్యత్తు దిశగా వర్తమానానికి సారథ్యం వహిస్తుంది. నేటి భారత్‌ ఈ స్ఫూర్తితోనే తన మూలాల నుంచి ఉత్తేజం పొందుతూ కొత్త అవకాశాలను అన్వేషిస్తూ శరవేగంగా పురోగమిస్తోంది. ఈ పవిత్ర పొంగల్ పండుగ సందర్భంగా- తన సంస్కృతితో ప్రగాఢ అనుబంధం సహా తన గడ్డను గౌరవించే, భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగేదిగా  భారత్‌కు సారథ్యం వహించే అపరిమిత ఆత్మవిశ్వాసాన్ని మనమిక్కడ అనుభూతి చెందుతున్నాం.

ఇనియ పొంగల్ నల్వాళ్తుక్కళ్‌! వాళ్గ తమిళం... వాళ్గ భారతం! మరోసారి మీకందరికీ పొంగల్ శుభాకాంక్షలతో అనేకానేక ధన్యవాదాలు.

వణక్కం!

 

***


(रिलीज़ आईडी: 2214994) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada