ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యాంగ సౌధం సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు.. ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల 28వ సదస్సుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం


· “భారత్‌ తన వైవిధ్యాన్ని ప్రజాస్వామ్య శక్తిగా మార్చుకుంది”

· “ప్రజాస్వామ్యానికి స్థిరత్వం.. వేగం.. స్థాయినిచ్చేది ప్రజాస్వామ్య సంస్థలు-ప్రక్రియలేనని భారత్‌ నిరూపించింది”

· “భారతదేశంలో ప్రజాస్వామ్యమంటే... చిట్టచివరి అంచెదాకా సేవా ప్రదానం”

· “మన ప్రజాస్వామ్యం లోతుగా వేళ్లూనుకున్న భారీ వృక్షం వంటిది; చిరకాలం నుంచీ చర్చలు-సంభాషణలు-
సమష్టి నిర్ణయాల సంప్రదాయం మన సొంతం”

· “ప్రతి ప్రపంచ వేదికపై వర్ధమాన దేశాల గళాన్ని భారత్‌ దృఢంగా వినిపిస్తోంది... జి20 అధ్యక్షత
సందర్భంగానూ వాటి ప్రాథమ్యాలకు ప్రపంచ కార్యాచరణలో ప్రాధాన్యమిచ్చింది”

प्रविष्टि तिथि: 15 JAN 2026 12:09PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ‘రాజ్యాంగ సౌధం’లోని సెంట్రల్ హాల్‌లో కామన్వెల్త్ స్పీకర్లు-ప్రిసైడింగ్ అధికారుల 28వ సదస్సును (సీఎస్‌పీఓసీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్ర ఎంతో విశిష్టమైనదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా చట్టసభల స్పీకర్లకు మాట్లాడే అవకాశం అంతగా ఉండదంటూ- ఇతరులు చెప్పేది వినడం, ప్రతి ఒక్కరి అభిప్రాయ వెల్లడికి అవకాశమివ్వడం వారి బాధ్యతని పేర్కొన్నారు. అత్యుత్సాహం చూపే, వివాదాస్పదంగా వ్యవహరించే సభ్యులను కూడా చిరునవ్వుతో నిభాయించే స్పీకర్లలో సహనం అత్యంత సార్వత్రిక లక్షణమని అభివర్ణించారు.

ఈ ప్రత్యేక సందర్భంలో విశిష్ట అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతూ- వారి హాజరీ తమకెంతో గౌరవమని శ్రీ మోదీ అన్నారు. వారంతా ఆశీనులైన ఈ ప్రదేశానికి భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఎనలేని ప్రాధాన్యం ఉందని చెప్పారు. భారత స్వాతంత్ర్యం ఖాయమై, వలస పాలన అంతమయ్యే రోజులలో రాజ్యాంగ రూపకల్పన కోసం ఇదే సెంట్రల్‌ హాలులో రాజ్యాంగ పరిషత్ సమావేశమైందని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్లపాటు ఈ భవనం జాతీయ చట్టసభ (పార్లమెంటు)గా పనిచేసిందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నో కీలక నిర్ణయాలతోపాటు చర్చలు ఇక్కడే సాగాయని వివరించారు. ఈ చారిత్రక ప్రదేశానికి ‘రాజ్యాంగ సౌధం’ (సంవిధాన సదన్)గా నామకరణం చేయడం ద్వారా దీన్ని ప్రజాస్వామ్యానికి అంకితం చేశామని శ్రీ మోదీ అన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 75 ఏళ్ల వేడుకను భారత్‌ ఇటీవలే నిర్వహించుకున్నదని గుర్తుచేశారు. ఇంతటి విశిష్ట ప్రదేశంలో గౌరవనీయ అతిథులందరి హాజరీ భారత ప్రజాస్వామ్యానికి ఒక మరపురాని మధుర క్షణమని ఆయన ఉద్ఘాటించారు.

కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్‌ అధికారుల సదస్సును భారత్‌లో నిర్వహించడం ఇది నాలుగో దఫా అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఆదానప్రదానమే ఈ సదస్సు ప్రధాన ఇతివృత్తమని ఆయన వివరించారు. భారత్‌ స్వాతంత్ర్యం పొందినపుడు... ఈ వైవిధ్యభరిత దేశంలో ప్రజాస్వామ్యం మనుగడపై ఆందోళన వ్యక్తమైందని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. అయితే, ఇదే వైవిధ్యాన్ని భారత్‌ తన ప్రజాస్వామ్య శక్తిగా మలచుకున్నదని ఆయన స్పష్టం చేశారు. అటుపైన దేశంలో ప్రజాస్వామ్యం ఏదో ఒకవిధంగా మనుగడ సాగించినా, అభివృద్ధి అసాధ్యమనే మరో వాదన బయలుదేరిందని ఆయన పేర్కొన్నారు. కానీ, “ప్రజాస్వామ్యానికి స్థిరత్వం, వేగం, స్థాయినిచ్చేది ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియలేనని భారత్‌ నిరూపించింది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్‌ నేడు ప్రపంచంలో శరవేగంగా పురోగమిస్తున్న కీలక ఆర్థిక వ్యవస్థగా పరిగణనలో ఉన్నదని పేర్కొన్నారు. అలాగే ‘యూపీఐ’ విజయంతో ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపు వ్యవస్థగల దేశంగా గుర్తింపు పొందిందని తెలిపారు. మరోవైపు అతిపెద్ద టీకా ఉత్పత్తిదారు.. రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు.. మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థ.. మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్.. నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్.. మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్.. అతిపెద్ద పాల ఉత్పత్తిదారు.. రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు- అంటూ భారత్‌ సాధించిన విజయాల జాబితాను ఆయన ఏకబిగిన వివరించారు.

“భారతదేశంలో ప్రజాస్వామ్యమంటే- చిట్టచివరి అంచెదాకా సేవా ప్రదానం” అంటూ... ఈ దేశం ప్రజా సంక్షేమ స్ఫూర్తితో పనిచేస్తుందని, వివక్షకు తావులేకుండా ప్రతి వ్యక్తికీ ప్రయోజనాలు చేరేలా చూస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ సంక్షేమ స్ఫూర్తి ఫలితంగానే- ఇటీవలి సంవత్సరాల్లో 25 కోట్ల మంది ప్రజలు పేదరిక విముక్తులయ్యారని వివరించారు. ఈ విధంగా “భారతదేశంలో ప్రజాస్వామ్యం పేదరికం నుంచి గట్టెక్కింది” అని ఆయన చెప్పారు.

భారత ప్రజలు సర్వోన్నతులు కాబట్టే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రాధాన్యమిస్తూ వాటి సాకారానికి ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా వివిధ ప్రక్రియల అమలు నుంచి సాంకేతికత వినియోగం దాకా ప్రతిదీ ప్రజాస్వామ్యబద్ధం చేసినట్లు ఆయన విశదీకరించారు. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి భారతీయుల హృదయాల్లో, జీవనాడులలో నిరంతరం ప్రవహిస్తూంటుందని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం ఇబ్బందులు పడుతుండగా వచ్చిన కోవిడ్-19 మహమ్మారిని శ్రీ మోదీ ఉదాహరించారు. అప్పటికే దేశం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ 150కిపైగా దేశాలకు మందులు, టీకాలను భారత్‌ సరఫరా చేసిందని గుర్తుచేశారు. ప్రజా ప్రయోజనాలు, సంక్షేమం, శ్రేయస్సు లక్ష్యంగా సేవలందించడమే భారత నైతిక విలువలకు నిదర్శనమని, ఈ దేశ ప్రజాస్వామ్యం వాటిని పెంచిపోషించిందని ఆయన ఉద్ఘాటించారు.

భారత్‌ను అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ప్రపంచ పౌరులలో అధికశాతం గుర్తిస్తున్నారని చెబుతూ- ఈ దేశ ప్రజాస్వామ్య పరిధి నిజంగా అసాధారణమని శ్రీ మోదీ ప్రకటించారు. దేశంలో 2024నాటి సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావిస్తూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా దీన్ని అభివర్ణించారు. ఈ ఎన్నికలలో దాదాపు 98 కోట్లమంది వయోజనులు ఓటు హక్కు కోసం నమోదయ్యారని, ఇది కొన్ని ఖండాల జనాభా మొత్తంకన్నా ఎక్కువని గుర్తుచేశారు. అలాగే 700కుపైగా పార్టీల తరఫున 8,000 మందికి పైగా అభ్యర్థులు పోటీచేసిన ఈ ఎన్నికలలో మహిళలు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా నేడు భారతీయ మహిళల భాగస్వామ్యం పెరగడమేగాక వారు మార్గదర్శకులుగానూ నిలుస్తున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ఒక మహిళ అని, ఈ సదస్సును నిర్వహిస్తున్న ఢిల్లీ నగర ముఖ్యమంత్రి కూడా ఒక మహిళేనని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్త గ్రామీణ, స్థానిక ప్రభుత్వ సంస్థలలో దాదాపు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులేనని, క్షేత్రస్థాయి నాయకులలో దాదాపు 50 శాతానికి ఇది సమానమని తెలిపారు. దీనికి సాటిరాగల దేశం ప్రపంచంలో మరేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్య వైవిధ్యం సుసంపన్నమైనదని, ఇక్కడ వందలాది భాషలు మాట్లాడే ప్రజలు ఉండగా, ఆయా భాషలలో 900కు పైగా టెలివిజన్ ఛానెళ్లు, వేలాది వార్తాపత్రికలు, మేగజైన్లు ప్రచురితమవుతున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇంతటి వైవిధ్యాన్ని నిభాయించగల సమాజాలు అత్యంత స్వల్పమని, ఈ వైవిధ్యంపై భారత్‌ సదా గర్విస్తుందని, ప్రజాస్వామ్యానికి అది బలమైన పునాది కావడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం లోతుగా వేళ్లూనుకున్న భారీ వృక్షం వంటిదని, చర్చలు-సంభాషణలు-సమష్టి నిర్ణయాల సంప్రదాయం మన దేశానికి సొంతమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అందుకే భారత్‌ను ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా పరిగణిస్తారని గుర్తుచేశారు. ఐదు వేల ఏళ్ల ప్రాచీన భారత పవిత్ర గ్రంథాలైన వేదాలలో- ప్రజలు సమస్యలపై చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్న గ్రామసభల ప్రస్తావనను ఆయన ఉటంకించారు. బుద్ధభగవానుడు జన్మించిన భరతభూమిలో బౌద్ధ సంఘాలు బహిరంగ, నిర్మాణాత్మక చర్చలకు నిలయాలని చెప్పారు. వాటిలో ఏకాభిప్రాయం లేదా ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకునేవారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ప్రజాస్వామ్య విలువలతో పనిచేసిన ఆనాటి గ్రామసభల గురించి వివరిస్తూ- జవాబుదారీతనం, నిర్ణయాత్మకత సంబంధిత స్పష్టమైన నియమాలను వివరించే తమిళనాడులోని 10వ శతాబ్దపు శాసనాన్ని ఆయన ప్రస్తావించారు. “భారత ప్రజాస్వామ్య విలువలు కాల పరీక్షకు నిలిచి, వైవిధ్యం అండగా తరతరాలనుంచీ బలోపేతమయ్యాయి” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

కామన్వెల్త్ దేశాలన్నిటి జనాభాలో దాదాపు 50 శాతం భారత్‌లోనే నివసిస్తున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఆ దేశాల పురోగమనానికి సాధ్యమైనంత ఎక్కువగా తోడ్పడేందుకు భారత్‌ నిరంతరం కృషి చేస్తున్నదని వివరించారు. ఆ మేరకు ఆరోగ్యం, వాతావరణ మార్పు, ఆర్థిక వృద్ధి లేదా ఆవిష్కరణ రంగాలు సహా కామన్వెల్త్ సుస్థి ప్రగతి లక్ష్యాల సాధనలో భారత్‌ కర్తవ్య నిబద్ధతతో తన బాధ్యతలను నెరవేరుస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా భాగస్వామ్య దేశాల అనుభవాల స్వీకరణకు భారత్‌ ఎన్నడూ వెనుకాడబోదని చెప్పారు. అదేవిధంగా స్వీయానుభవాల ప్రాతిపదికన ఇతర కామన్వెల్త్ దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

ప్రపంచం అసాధారణ మార్పులకు గురవుతున్న సమయంలో, వర్ధమాన దేశాల కోసం కొత్త మార్గాలను అన్వేషించాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి అంతర్జాతీయ వేదికపై వర్ధమాన దేశాల గళాన్ని భారత్‌ దృఢంగా వినిపిస్తున్నదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో జి20కి అధ్యక్షత వహించిన సందర్భంలోనూ వాటి ప్రాథమ్యాలకు ప్రపంచ కార్యాచరణలో ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. అదేవిధంగా వర్ధమాన దేశాలన్నిటితోపాటు కామన్వెల్త్ దేశాలకు ఆవిష్కరణల ప్రయోజనం చేకూరే విధంగా భారత్‌ స్థిరంగా కృషి చేస్తున్నదని శ్రీ మోదీ వివరించారు. భారత్‌ తరహాలోనే వర్ధమాన దేశాల్లోనూ వ్యవస్థలను రూపొందించుకునేలా సార్వత్రిక వనరుల వేదికలను రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య విజ్ఞానాన్ని, అవగాహనను ప్రోత్సహించే వివిధ మార్గాల అన్వేషణే ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలలో ఒకటని శ్రీ మోదీ చెప్పారు. ఈ దిశగా స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని, ఎందుకంటే- ఇది ప్రజలను ప్రజాస్వామ్య ప్రక్రియతో మరింత దగ్గర చేస్తుందని తెలిపారు. భారత పార్లమెంట్ ఇప్పటికే ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధ్యయన పర్యటనలు, సానుకూల శిక్షణ కార్యక్రమాలు, అనుభవ శిక్షణ  ద్వారా పౌరులకు పార్లమెంటును మరింతగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రధానమంత్రి వివరించారు. సభలో చర్చలు, కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం కోసం భారత్‌ కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నదని ఆయన తెలిపారు. అదే సమయంలో పార్లమెంటు సంబంధిత వనరులను కూడా ‘ఏఐ’తో మరింత వినియోగ హితంగా మారుస్తున్నామని శ్రీ మోదీ వెల్లడించారు. పార్లమెంటు పనితీరును యువతరం అర్థం చేసుకోవడంలో ఇది మెరుగైన అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు.

కామన్వెల్త్‌తో ముడిపడిన 20కిపైగా సభ్య దేశాల్లో పర్యటించడమేగాక అనేక జాతీయ చట్టసభల్లో ప్రసంగించే అవకాశం కూడా తనకు లభించిందని శ్రీ మోదీ గుర్తుచేశారు. తానెక్కడికి వెళ్లినా, ఎంతో నేర్చుకుంటున్నానని, అంతేగాక తాను గమనించిన ప్రతి ఉత్తమ పద్ధతిని లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లతో పంచుకుంటానని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో నేర్చుకుంటూ పంచుకోవడమనే ప్రక్రియను ప్రస్తుత సదస్సు కూడా మరింత మెరుగుపరచగలదని విశ్వసిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ తులియా అక్సన్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ క్రిస్టోఫర్ కలీలా తదితర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

నేపథ్యం

ఈ 28వ ‘సీఎస్‌పీఓసీ’కి లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా అధ్యక్షత వహించగా, మొత్తం 42 కామన్వెల్త్ దేశాలు, 4 పాక్షిక స్వయంప్రతిపత్తి గల జాతీయ చట్టసభల నుంచి 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్‌ అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడ కొనసాగడంలో స్పీకర్లు, ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర, పార్లమెంటరీ కార్యకలాపాలలో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం, పార్లమెంటుపై ప్రజల అవగాహనను పెంచే వినూత్న వ్యూహాలు, ఓటింగ్‌ వంటి అంశాలతోపాటు పౌర భాగస్వామ్యం సహా అనేక సమకాలీన పార్లమెంటరీ అంశాలపై ఈ సదస్సు చర్చిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2214973) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam