ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పరీక్షా పే చర్చ - 2023’ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 27 JAN 2023 9:06PM by PIB Hyderabad

'పరీక్షా పే చర్చ' ఇంత చలిలో జరగడం బహుశా ఇది తొలిసారి. సాధారణంగా ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. అయితే, జనవరి 26 గణతంత్ర దినోత్సవంలో విద్యార్థులు పాల్గొనాలన్న ఉద్దేశంతో ఈ తేదీని నిర్ణయించారు. ఢిల్లీ బయట నుంచి వచ్చిన వారు ఆ అవకాశం వినియోగించుకున్నారా? కర్తవ్య్‌ పథ్‌కు వెళ్లారా? అనుభవం ఎలా ఉంది? ఆనందం కలిగిందా? తిరిగి వెళ్లిన తరువాత ఇంట్లో వారికి ఏమి చెబుతారు? ఏమీ చెప్పరా? మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోను. అయితే 'పరీక్షా పే చర్చ' నాకు కూడా ఒక పరీక్ష అనే మాట కచ్చితంగా చెబుతాను. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు నాకు పరీక్ష పెడుతున్నారు. ఆ పరీక్ష స్వీకరించడం నాకు ఆనందంగా ఉంది; ఆసక్తితో పాల్గొంటున్నాను. ఎందుకంటే లక్షల సంఖ్యలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పిల్లలు చాలా చురుగ్గా ప్రశ్నలు వేస్తున్నారు, తమ సమస్యలు వెల్లడిస్తున్నారు, వ్యక్తిగత ఇబ్బందులు కూడా పంచుకుంటున్నారు. నా దేశ యువత ఏం ఆలోచిస్తోంది, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటోంది, దేశం నుంచి వారి ఆకాంక్షలు ఏమిటి, ప్రభుత్వాల నుంచి వారు ఏం ఆశిస్తున్నారు, వారి కలలు, సంకల్పాలు ఏమిటి అనేవి తెలుసుకోవడం నాకు గొప్ప అదృష్టం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది నాకు నిజంగా అమూల్య నిధి. ఈ ప్రశ్నలన్నింటినీ భద్రపరచాలని ప్రభుత్వ అధికారులకు సూచించాను. 10-15 ఏళ్ల తరువాత అవకాశం వస్తే సామాజిక శాస్త్రవేత్తల చేత ఈ ప్రశ్నలపై విశ్లేషణ చేయించాలనే ఆలోచన ఉంది. తరాలు మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నాయి. ఆ మార్పుల మధ్య యువత కలలు, సంకల్పాలు, ఆలోచనా ధోరణి కూడా మారుతోంది. మీరు అడిగే ప్రశ్నల రూపంలో ఇంత సరళంగా, ఇంత విస్తృతమైన పరిశోధనా గ్రంథం దక్కడం చాలా అరుదు. ఎక్కువగా మాట్లాడనవసరం లేదు. ఈ కార్యక్రమం ప్రతిసారి ఎక్కువసేపు సాగుతోందన్న ఫిర్యాదు వినిపిస్తోంది. అందుకే వెంటనే ప్రారంభించాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటి? ఇది ఎక్కువసేపు సాగుతుందా? సాగాలా? ఇక మరింత చెప్పను. మీ అందరి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. ఎలా ముందుకు సాగాలో చెప్పండి. ముందుగా ఎవరు ప్రశ్న వేస్తారు?
వ్యాఖ్యాత: ప్రపంచాన్ని మార్చాలని కోరుకుంటే, ప్రపంచాన్ని కాకుండా మిమ్మల్ని మీరు మార్చుకోవడం నేర్చుకోండి అని మీరు చెప్పేది వాస్తవం. గౌరవ ప్రధాన మంత్రి గారు, మీ స్ఫూర్తిదాయక ప్రసంగం ఎల్లప్పుడూ మాలో సానుకూల శక్తినీ, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీ అపారమైన అనుభవం, విజ్ఞానవంతమైన మార్గదర్శకత్వం నుంచి నేర్చుకోవడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారూ! మీ ఆశీర్వాదం, అనుమతితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ధన్యవాదాలు సర్.
గౌరవ ప్రధానమంత్రి గారూ, సాంస్కృతిక వైభవం, శిల్ప సౌందర్యానికి పేరుగాంచిన మదురై నగరానికి చెందిన అశ్విని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. అశ్వినీ, దయచేసి మీ ప్రశ్న అడగండి.
అశ్విని: గౌరవ ప్రధానమంత్రి గారూ, నమస్కారం! నా పేరు అశ్విని. నేను తమిళనాడులోని మదురై కేంద్రీయ విద్యాలయం నెం.2 విద్యార్థిని. సర్, నా ప్రశ్న ఏమిటంటే నా ఫలితాలు మంచి రీతిలో రాకపోతే, నా కుటుంబ సభ్యుల నిరాశను నేను ఎలా ఎదుర్కోవాలి? నేను ఆశించిన మార్కులు రాకపోతే ఏం చేయాలి? మంచి విద్యార్థిగా ఉండడం కూడా అంత సులభమైన పని కాదు. పెద్దలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి, పరీక్ష రాసే విద్యార్థి ఒత్తిడికి, నిరాశకు గురవుతాడు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు మణికట్టును కోసుకోవడం, చిరాకు పెరగడం సాధారణంగా మారింది. తమ భావాలను నమ్మి చెప్పుకునే వ్యక్తి ఎవ్వరూ లేకపోవడం కనిపిస్తోంది. ఈ అంశంలో దయచేసి మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు సర్.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు, అశ్విని. గౌరవ ప్రధానమంత్రి గారూ, నవదేశ్ జగూర్ భారత రాజధాని, అనేక సామ్రాజ్యాలకు కేంద్రంగా, మనోహరమైన మధ్యయుగ చరిత్రకు,  అద్భుతమైన నిర్మాణ శైలులకు నిలయమైన ఢిల్లీ నుంచి వచ్చారు. హాల్లో కూర్చున్న ఆయన, తన ప్రశ్న ద్వారా ఇదే తరహా సమస్యను ప్రస్తావించాలనుకుంటున్నారు. నవదేశ్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
నవదేశ్: శుభోదయం. గౌరవ ప్రధానమంత్రి గారూ, నేను ఢిల్లీలోని పీతం పూరా ప్రాంతంలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నా.  నా పేరు నవదేశ్ జగూర్. సర్, నా ప్రశ్న ఏమిటంటే నా ఫలితాలు సరిగా రాకపోతేకుటుంబంతో ఎలా వ్యవహరించాలో  దయచేసి మార్గనిర్దేశం చేయండి. సర్. చాలా ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు, నవదేశ్. గౌరవ ప్రధానమంత్రి గారూ, ప్రపంచానికి శాంతి, కరుణ సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుడు, గురు గోవింద్ సింగ్,  వర్ధమాన మహావీరుడు జన్మించిన పురాతన నగరం పాట్నా నుంచి  ప్రియాంక కుమారి వచ్చారు. ఆమె కూడా ఇదేవిధమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. మీ సలహా కోరుతున్నారు. ప్రియాంకా, దయచేసి మీ ప్రశ్న అడగండి.
ప్రియాంక: నమస్కారం! గౌరవ ప్రధానమంత్రి గారూ, నా పేరు ప్రియాంక కుమారి. నేను పాట్నా రాజేంద్ర నగర్‌లోని రబీంద్ర బాలిక ప్లస్ టూ విద్యాలయంలోని 11వ తరగతి విద్యార్థిని. నా ప్రశ్న ఏమిటంటే నా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. నేను కూడా మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ కారణంగా ఒత్తిడిలో ఉన్నాను.  అందుకే దయచేసి మీ సలహా కోరుతున్నాను. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు ప్రియాంకా. గౌరవ ప్రధానమంత్రి గారూ, అశ్విని, నవదేశ్, ప్రియాంక ఈ ముఖ్యమైన సమస్య అనేక విద్యార్థులను ప్రభావితం చేస్తుందని భావిస్తూ, దీనిని పరిష్కరించడానికి మీ సలహా కోరుతున్నారు.
ప్రధాన మంత్రి: అశ్వినీ, నువ్వు క్రికెట్ ఆడతావా? క్రికెట్‌లో గూగ్లీ బాల్ ఒకటి ఉంటుంది. లక్ష్యం ఒక్కటే ఉంటుంది, కానీ దాని దిశ వేరేగా ఉంటుంది. నువ్వు మొదటి బాల్‌కే ఔట్ చేయాలని అనుకుంటున్నావని నేను భావిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నీపై అధిక అంచనాలు ఉండటం చాలా సహజం. అందులో తప్పేమీ లేదు కూడా. వారి సామాజిక హోదా వారిపై చాలా ఒత్తిడిని పెడుతుంది.  అది వారి మనసును ఎంతగా ప్రభావితం చేస్తుందంటే, తమ పిల్లల గురించి సమాజంలోని ఇతరులకు ఏం చెప్పాలని వారు ఆలోచిస్తారు. పిల్లలు వెనుకబడిఉంటే వారి గురించి ఏం చర్చించుకోవాలి అనే సంక్లిష్టత  వారికి ఎప్పుడూ ఉంటుంది. తల్లిదండ్రులు తమ స్నేహితులతో కలిసి క్లబ్‌లో లేదా సొసైటీలో కూర్చున్నప్పుడు లేదా చెరువు గట్టు వద్ద ఇతరులతో బట్టలు ఉతుకుతున్నప్పుడు పిల్లల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితి రావచ్చు. పిల్లల సామర్థ్యాలు తెలిసినప్పటికీ, వారు తమ సామాజిక హోదా కారణంగా పిల్లల గురించి గొప్పలు చెబుతారు, ఎందుకంటే వారికి న్యూనతాభావం ఉంటుంది. తమ పిల్లల నుంచి గొప్ప అంచనాలు పెట్టుకుంటారు. ఇది సామాజిక జీవితంలో అభివృద్ధి చెందిన సహజ ధోరణి. రెండవది, మీరు మంచి పనులు చేస్తే, అందరికి మీ నుంచి కొత్త అంచనాలు ఏర్పడటం సహజమే. మేం రాజకీయాల్లో ఉన్నాం. ఎన్ని ఎన్నికల్లో గెలిచినా, ఇంకా తప్పక గెలవాలి అనే ఒత్తిడి ఉంటుంది. 200 సీట్లు గెలిస్తే, ఎందుకు 250 సీట్లు గెలవలేదు అని అడుగుతారు. 300 సీట్లు గెలిస్తే, ఎందుకు 350 సీట్లు గెలవలేదు అని అంటారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే వాటికి తలొగ్గాలా? ఒక్క క్షణం ఆలోచించండి. రోజంతా మీకేం చెప్పారు? మీరేం విన్నారు? వాటిపై మీరు సమయాన్ని వృధా చేస్తారా లేక ఆత్మపరిశీలన చేసుకుంటారా? మీ సామర్ధ్యం, ప్రాధాన్యం, అవసరం, ఉద్దేశాలను మీపై ఉన్న అంచనాలతో సమన్వయం చేసుకోండి. మీరు క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళి ఉంటారు. స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు ఉంటారు, బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రాగానే వారు 'ఫోర్, ఫోర్, సిక్స్, సిక్స్' అని కేకలు వేయడం ప్రారంభిస్తారు. ప్రేక్షకుల డిమాండ్‌పై ఆ బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లు కొట్టడం ప్రారంభిస్తాడా? ఏ ఆటగాడైనా అలా చేస్తాడా? లేదు. ప్రజలు ఎంత కేకలు వేసినా ఆ ఆటగాడు తాను ఎదుర్కొంటున్న బంతిపై మాత్రమే దృష్టి పెడతాడు. ఆ బ్యాట్స్‌మెన్ బౌలర్ ఉద్దేశాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాడు. బంతికి అనుగుణంగా ఆడతాడు. ప్రజలు ఎంత అరిచినా, అతను ఏకాగ్రతతో ఉంటాడు.  అందువల్ల, మీరు మీ కార్యాచరణలో ఏకాగ్రతతో ఉంటే, మీరు ఒత్తిళ్లను, అంచనాలను అధిగమిస్తారు. తొందరగా లేదా ఆలస్యంగా అయినా మీరు ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అందుచేత, నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒత్తిళ్లకు లొంగిపోవద్దు.
అయితే కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని విశ్లేషించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా? మీలో చాలా సామర్థ్యం ఉన్నప్పటికీ, మీరు నిరాశలో ఉండటం వల్ల కొత్తదనాన్ని సృష్టించడానికి ఆసక్తి ఉండడం లేదా? కొన్ని సార్లు ఆ ఆశలు గొప్ప శక్తిగా, స్ఫూర్తిగా మారతాయి. పిల్లలపై ఆశల విషయంలో తల్లిదండ్రులు ఏమి చేయాలో నేను ఇప్పటికే చెప్పాను. తల్లిదండ్రులు తమ సామాజిక ఒత్తిడి  భారాన్ని పిల్లలపైకి బదిలీ చేయకూడదు. కానీ అదే సమయంలో, పిల్లలు తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదు. మీరు ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తే, ఇలాంటి సమస్యలను చాలా తేలికగా పరిష్కరించుకోగలరని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ! చాలా ధన్యవాదాలు. మీ స్ఫూర్తిదాయకమైన మాటలు తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. సర్, మేము ఒత్తిడికి లోను కాకుండా, ఉత్సాహంతో పరీక్షలు రాస్తాం. ధన్యవాదాలు!
వ్యాఖ్యాత: చంబా ప్రకృతి అందాలతో నిండిన కొండ ప్రాంత పట్టణం, ఇది 'భారతదేశ పారిస్' గా ప్రసిద్ధి చెందింది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా నుంచి ఆరూషి ఠాకూర్ వర్చువల్‌గా మనతో  కలుస్తున్నారు. ఆరూషి, దయచేసి మీ ప్రశ్న అడగండి.
ఆరూషి: నమస్కారం.గౌరవ ప్రధానమంత్రి గారూ. నా పేరు ఆరూషి ఠాకూర్. నేను చంబా జిల్లా, డల్హౌసీలోని కేంద్రీయ విద్యాలయం బనిఖేత్‌లో 11వ తరగతి చదువుతున్నాను. సార్, పరీక్షల సమయంలో నన్ను బాగా కలవరపెట్టే ప్రశ్న ఏమిటంటే, నేను ఎక్కడి నుంచి నుండి చదవడం ప్రారంభించాలి? నేను అన్ని మర్చిపోయానేమో అని ఎప్పుడూ అనిపిస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ చాలా ఒత్తిడికి గురవుతాను. దయచేసి నాకు సలహా ఇవ్వండి సార్.
వ్యాఖ్యాత: ఆరూషి, ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి గారూ! రాయ్‌పూర్ ఛత్తీస్‌గఢ్‌కు రాజధాని. ఈ రాష్ట్రాన్ని 'భారతదేశ ధాన్యాగారం'  అని పిలుస్తారు. రాయ్‌పూర్‌కు చెందిన అదితి దేవన్ కూడా ఈ సమస్యపై తన ఉత్సుకతకు ఒక పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. అదితీ, దయచేసి మీ ప్రశ్న అడగండి.
అదితి దేవన్: నమస్కారం, గౌరవ ప్రధానమంత్రి గారూ. నా పేరు అదితి దేవన్. నేను ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌లోని కృష్ణ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి విద్యార్థిని. నా ప్రశ్న ఏమిటంటే నాకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అనే భయం ఉండటంతో నేను చాలా ఆందోళన చెందుతాను. కానీ చివరికి ఏమీ చేయలేకపోతున్నాను.  ఎందుకంటే పనులు చాలా ఉన్నాయి. ఏ పని అయినా సమయానికి పూర్తిచేశానంటే, మరిన్ని పనులు ఉండటంతో మరింత ఆందోళన పెరుగుతుంది.  లేదా వాటిని వాయిదా వేయాల్సి వస్తుంది. అన్ని పనులను సమయానికి ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవాలని నాకు ఆసక్తి ఉంది. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు అదితీ, గౌరవ ప్రధానమంత్రి గారూ, అరుషి, అదితి తమ పరీక్షలకు సిద్ధమవ్వడం, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం గురించి మీ మార్గనిర్దేశం కోరుతున్నారు. దయచేసి వారి సమస్యను పరిష్కరించండి.
ప్రధానమంత్రి: చూడండి, ఈ సమస్య కేవలం పరీక్షలకే పరిమితం కాదు. పరీక్ష అయినా కాకపోయినా, మన జీవితంలో సమయ నిర్వహణ గురించి మనం తెలుసుకోవాలి. పని ఎందుకు పేరుకుపోతుందో మీరు గమనించే ఉంటారు. పని సమయానికి పూర్తి కాకపోవడం వల్ల అది పేరుకుపోతుంది. పని చేస్తే ఎవరూ అలసిపోరు. బదులుగా, మనం పని పూర్తి చేసినప్పుడు సంతృప్తి భావన కలుగుతుంది. పని చేయకపోతేనే మనిషి అలసిపోతాడు. ఎవరైనా తన చుట్టూ పేరుకుపోయిన పనిని చూసినప్పుడు, అతనికి అలసట అనిపించడం మొదలవుతుంది. అందువల్ల వెంటనే ప్రారంభించాలి. రెండోది, , ఒక వారం పాటు మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో డైరీ రాయండి. మీరు చదువుతున్నా, ఏ సబ్జెక్ట్ కోసం ఎంత సమయం ఖర్చు చేస్తున్నారు,  సులభ మార్గాల కోసం చూస్తున్నారా లేదా మూలాలు అర్థం చేసుకోవడానికి వెడుతున్నారా అని గమనించండి. వివరాల్లోకి వెళ్తున్నారా లేదా అని మీకు మీరుగా కొంచెం విశ్లేషించండి.  మీరు మీ సమయాన్ని ఎక్కువగా మీకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టులకే వెచ్చిస్తున్నారని,  వాటిలోనే లీనమైపోతున్నారని మీరు గమనిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను, అయితే, మీకు ఇష్టం లేకపోయినా మీకు అవసరమైన మూడు విషయాలు ఉన్నాయి. వాటిని మీరు భారంగా భావిస్తారు. రోజుకు రెండు గంటల సమయం  వాటికోసం వెచ్చించినప్పటికీ, ఫలితాలు తగినంతగా రావట్లేదని మీరు అనుకుంటారు. రెండు గంటలు తప్పనిసరిగా చదవాలనే అవసరం లేదు. మనస్సు నిలకడగా ఉన్నప్పుడు చదవడం మంచిది. మీకు ఇష్టం లేని, కష్టంగా అనిపించే సబ్జెక్టుకు 30 నిమిషాలు సమయం కేటాయించడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత, మీకు ఇష్టమైన సబ్జెక్టును తీసుకుని, దానిపై 20 నిమిషాలు గడపండి. అదేవిధంగా, మీకు కొంచెం తక్కువ ఇష్టమైన సబ్జెక్టుపై 30 నిమిషాలు సమయం వెచ్చించండి. ఈ విధంగా ఒక దినచర్య ఏర్పాటు చేసుకోండి. మీకు  ఉపశమనంగా అనిపిస్తుంది.  అలా మీరు సాధారణంగా తప్పించుకోవాలనే సబ్జెక్టులపై క్రమంగా ఆసక్తి కలుగుతుంది. మీకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టులో లీనమైపోవడం వలన చాలా సమయం వృథా అవుతుంది. మీలో గాలిపటాలు ఎగురవేసేవారు ఒక విషయాన్ని గమనించి ఉంటారు. నాకు చిన్నప్పుడు గాలిపటాలు ఎగురవేయడం అంటే చాలా ఇష్టం. గాలిపటం దారం కొన్నిసార్లు ఒకదానితో ఒకటి చిక్కుకుపోయి, పెద్ద ముడిగా మారుతుంది. ఒక తెలివైన వ్యక్తి ఏమి చేస్తాడు? బలంగా లాగుతాడా? అలా చేయడు. ఆ ముడిని ఎలా విప్పాలా అని చూస్తూ, ప్రతి దారాన్ని నెమ్మదిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.  ఆపై ఆ ముడిని నెమ్మదిగా విప్పుతాడు. చివరికి, ఆ ముడిని విప్పడంలో విజయం సాధిస్తాడు.  తనకు అవసరమైన దారం అంతా అతనికి దొరుకుతుంది. మనం బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. శాంతంగా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. మీరు శాంతంగా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే, మీరు దాన్ని సరైన మార్గంలో చేయగలరని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. మరో విషయం. మీరు ఎప్పుడైనా మీ అమ్మ ఇంట్లో చేసే పని షెడ్యూల్‌ను గమనించారా? నిజానికి, మీరు పాఠశాల  నుంచి  ఇంటికి వచ్చినప్పుడు మీ తల్లి ప్రతిదీ సిద్ధం చేసి ఉంచడం చూసి మీరు చాలా సంతోషిస్తారు. ఉదయం మీరు పాఠశాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు, మీ తల్లి ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచారు. ఇది చాలా సంతోషకరమైన విషయం, కానీ మీరు ఎప్పుడైనా మీ అమ్మ సమయ నిర్వహణను గమనించారా? ఆమెకు తెలుసు, ఉదయం 6 గంటలకల్లా ఒక పనిని లేదా 6:30 గంటలకల్లా మరొక పనిని పూర్తి చేయాలి. ఆమె బిడ్డ 9 గంటలకు పాఠశాలకు వెళ్లాలంటే, అప్పటికల్లా ఆమె అన్నీ సిద్ధం చేయాలి. ఆమె బిడ్డ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి తాను ఏమేమి చేయాలో ఆమెకు తెలుసు. ఇంటి పనులన్నీ చేస్తున్నప్పటికీ, తల్లి అటువంటి కచ్చితమైన సమయ నిర్వహణ  కలిగి ఉంటుంది. కానీ ఆమె ఏ పని చేసినా భారంగా భావించదు. ఆమె ఎప్పుడూ ‘అలసిపోయాను, చాలా పని ఉంది‘ అని ఫిర్యాదు చేయదు.  ఎందుకంటే ఆ గంటల్లో తాను అన్నింటినీ పూర్తి చేయాలని ఆమెకు తెలుసు. ముఖ్యంగా, ఆమెకు కొంత అదనపు సమయం ఉన్నప్పుడు కూడా ఊరికే కూర్చోదు. ఆమె ఏదో ఒక సృజనాత్మక  పని తీసుకుంటుంది. ఆమె సూది, దారం తీసుకుని ఏదో ఒకటి చేస్తుంది. ఆమె విశ్రాంతి తీసుకోవడానికి తన సొంత ఏర్పాట్లు చేసుకుంది. మీ తల్లి దినచర్యలను గమనిస్తే, ఒక విద్యార్థిగా సమయనిర్వహణ ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకుంటారు. సమయనిర్వహణ అంటే తప్పనిసరిగా రెండు, మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే కాదు. సూక్ష్మమైన సమయ నిర్వహణ ఉండాలి. ఒక నిర్దిష్ట సబ్జెక్ట్ కు మీరు ఎంత సమయం వెచ్చించాలో నిర్ణయించాలి. ఆరు రోజుల పాటు చదువుతోనే తప్ప ఇతర ఏ పనీ చేయకూడదన్న నియమాలు పెట్టకండి. అప్పుడు మీరు అలసిపోతారు. సమయాన్ని సమానంగా విభజించండి.  అది కచ్చితంగా లాభదాయకం అవుతుంది. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, సమర్థుడైన విద్యార్థిగా ఉండటానికి పద్ధతిగా,  క్రమబద్ధంగా  ఉండాలని మాకు మార్గనిర్దేశం చేసినందుకు మీకు ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి గారూ, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ విశిష్టమైన గిరిజన కళ, మంత్రముగ్ధులను చేసే చిత్రకూట్ జలపాతం,  అత్యుత్తమ నాణ్యత గల వెదురుకు ప్రసిద్ధి. బస్తర్ జిల్లాకు చెందిన రూపేష్ కశ్యప్  ఇక్కడ ఉన్నారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక అంశంపై మీ సలహా కోరుకుంటున్నారు. రూపేష్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
రూపేష్: శుభోదయం, గౌరవ ప్రధానమంత్రి గారూ. నా పేరు రూపేష్ కశ్యప్. నేను ఛత్తీస్‌గఢ్, బస్తర్ జిల్లా, దర్భాలోని స్వామి ఆత్మానంద్ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 9వ తరగతి విద్యార్థిని. సార్, పరీక్షల్లో అక్రమ మార్గాలను ఎలా నివారించగలను? ఇదే నా ప్రశ్న. ధన్యవాదాలు సార్.
వ్యాఖ్యాత: రూపేష్, ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి గారూ, ఒడిశా ఆధ్యాత్మిక రాజధాని, అద్భుతమైన రథయాత్రకు,  ప్రశాంతమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందిన వారసత్వ నగరం జగన్నాథ్ పూరీ నుంచి తన్మయ్ బిస్వాల్ కూడా అదే విధమైన సమస్యపై మీ మార్గదర్శకత్వం కోరుకుంటున్నారు.
తన్మయ్: గౌరవ ప్రధానమంత్రి గారూ, నమస్కారం. నా పేరు తన్మయ్ బిస్వాల్. నేను ఒడిశా లోని పూరీ  కోణార్క్‌  జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్నాను. పరీక్షల సమయంలో విద్యార్థులు చేసే కాపీయింగ్  లేదా మోసం (కార్యకలాపాలను ఎలా తొలగించగలం? ఇదే నా ప్రశ్న. దయచేసి దీనిపై నాకు మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు సార్.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, పరీక్షల్లో అక్రమ మార్గాలను ఎలా నివారించాలనే దానిపై రూపేష్ తన్మయ్ మీ మార్గదర్శకత్వం కోరుకుంటున్నారు.
ప్రధానమంత్రి: పరీక్షల్లో జరిగే తప్పుడు పద్ధతులు, అక్రమాలకు వ్యతిరేకంగా ఏదో ఒక పరిష్కారం కనుగొనాలని మన విద్యార్థులు కూడా భావించడం నాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా కష్టపడి చదివే విద్యార్థులు, తాము ఇంత కష్టపడితే, కొందరు మోసం చేసి, కాపీ కొట్టి పరీక్షలు పాస్ అవుతున్నారనే విషయం గురించి కచ్చితంగా ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా, మోసాలు, కాపీలు చేసేవారు, కానీ రహస్యంగా. ఇప్పుడు, వారు గర్వంగా తాము సూపర్‌వైజర్‌ను మోసం చేశామని చెప్పుకుంటున్నారు. విలువలలో వచ్చిన ఈ మార్పు చాలా ప్రమాదకరం, కాబట్టి ఈ సామాజిక వాస్తవం గురించి మనమందరం ఆలోచించాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లు నడిపే ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థులు బాగా చదివేది తమ వల్లే అనుకుంటారు. ఎందుకంటే వారు తల్లిదండ్రుల నుంచి ట్యూషన్ ఫీజు తీసుకున్నారు.  వారు తమ విద్యార్థులకు కాపీ కొట్టడానికి సహాయం చేస్తారు. అలాంటి ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అనేది మీరు చెప్పండి. కొంతమంది విద్యార్థులు చదవడానికి సమయం కేటాయించకుండా, మోసం చేయడానికి కొత్త మార్గాలను కనుగొనడంలో చాలా సృజనాత్మకంగా ఉన్నారని నేను గమనించాను. వారు గంటలు గంటలు గడిపి, సూక్ష్మంగా కనిపించే విధంగా నోట్సు తయారుచేస్తారు. కాపీ చేయడానికి, మోసం చేయడానికి సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో వారు గంటలు గడుపుతారు కాబట్టి, మోసంలో వారు చాలా సృజనాత్మకంగా ఉన్నారని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. అంత సమయాన్ని వారు నేర్చుకోవడానికి ఉపయోగించి ఉంటే, వారు మరింత బాగా రాణించి ఉండేవారు కదా? ఎవరైనా వారికి మార్గనిర్దేశం చేసి, ఈ విషయాన్ని అర్థమయ్యేలా చేసి ఉండాల్సింది. ఇంకా మనం ఒక విషయం అర్థం చేసుకుందాం.  ఇప్పుడు జీవితం చాలా మారిపోయింది. ప్రపంచం చాలా మారిపోయింది. కాబట్టి, ఒక్క పరీక్షలో పాస్ అయితే జీవితం స్థిరపడినట్లు కాదు అనే విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో, ఎప్పుడూ ఏదో ఒక పరీక్ష రాస్తూనే ఉండాలి. మోసం చేసి ఎన్నిసార్లు విజయం సాధించగలరు? అందుకే, మోసాలకు పాల్పడేవారు ఒకటి లేదా రెండు పరీక్షలు పాస్ కావచ్చు, కానీ వారి జీవితంలో విజయం సాధించలేరు.  మోసం ఎవరి జీవితాన్ని నిర్ణయించలేదు. అన్యాయ పద్ధతులకు పాల్పడడం ద్వారా మార్కులు పొందడం సాధ్యమే. కానీ వారి జీవితంలో ఏదో ఒక సమయం  వారికి ప్రశ్నార్థకం అవుతుంది. మోసం ద్వారా ఒకటి లేదా రెండు పరీక్షలు పాస్ అయి ఉండవచ్చు. కానీ జీవితంలో ఏదో ఒక దశలో  ఇరుక్కుపోతామని వారు గ్రహించాలి. కష్టపడి పనిచేసే విద్యార్థులకు నేను చెప్పదలిచింది ఏమిటంటే, మీ కష్టానికి మీ జీవితంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఎవరైనా అన్యాయంగా మీ కంటే 2-4 మార్కులు ఎక్కువగా పొందడంలో విజయం సాధించవచ్చు, కానీ వారు మీ జీవితంలో మీకు ఎప్పటికీ అడ్డంకి కాలేరు. మీలో అంతర్లీనంగా ఉన్న బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి, ఆ విద్యార్థులను అనుసరించవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పరీక్షలు వస్తూ పోతూ ఉంటాయి. మనం మన జీవితాన్ని పూర్తిగా జీవించాలి. కాబట్టి, మన జీవితంలో సులభ మార్గాలను అనుసరించకూడదు. రైల్వే స్టేషన్‌లో కొంతమంది ప్రయాణికులు వంతెనను ఉపయోగించకుండా, ట్రాక్‌లపైకి దూకి మరొక ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లడం మీరు గమనించే ఉంటారు. దానికి ప్రత్యేక కారణం ఏమీ ఉండదు. కానీ అది వారికి సరదాగా ఉంటుంది. అక్కడ బోర్డుపై ఇలా రాసి ఉంటుంది. ‘షార్ట్‌కట్ మిమ్మల్ని కట్ చేస్తుంది.’ కాబట్టి, ఇతరులు షార్ట్‌కట్‌లకు పాల్పడుతున్నారని మీరు ఎప్పుడూ ఆందోళన చెందకండి. షార్ట్‌కట్‌లకు దూరంగా ఉండండి.  మీ పనిపై దృష్టి పెట్టండి. మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు గౌరవ ప్రధాన మంత్రి గారూ. మీ మాటలు నేరుగా మా హృదయాల్లోకి వెళ్ళిపోయాయి. ధన్యవాదాలు.
గౌరవ ప్రధాన మంత్రి సార్, వరి పొలాలు, సాంప్రదాయ కేరళ సంగీతం వినిపించే పలక్కాడ్ నుంచి తేజస్ సుజయ్ మీ సలహా కోరుకుంటున్నారు.  సుజయ్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
సుజయ్: నమస్కారం, గౌరవ ప్రధాన మంత్రి గారూ. నా పేరు తేజస్ సుజయ్. నేను కేంద్రీయ విద్యాలయం కంజిక్కోడ్, కర్ణకులం సాంబలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని. నా ప్రశ్న ఏమిటంటే, కష్టపడి పనిచేయడం,  తెలివిగా పనిచేయడం ఈ రెండింటిలో ఏది ముఖ్యం? మంచి ఫలితాలకు ఈ రెండూ అవసరమా? దయచేసి సలహా ఇవ్వండి. ధన్యవాదాలు సార్.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు సుజయ్.  గౌరవ ప్రధాన మంత్రి గారూ.
ప్రధానమంత్రి: అతని ప్రశ్న ఏమిటి? అతను ఏం అడుగుతున్నాడు?
వ్యాఖ్యాత: సార్, అతను కష్టపడి పనిచేయడం,  తెలివిగా పనిచేయడం గురించి అడుగుతున్నాడు.
ప్రధానమంత్రి: కష్టపడి పనిచేయడం,  తెలివిగా పనిచేయడం గురించా?
వ్యాఖ్యాత: ధన్యవాదాలు, సార్.
ప్రధానమంత్రి: సరే, మీరు మీ చిన్నతనంలో ఒక కథ చదివి ఉంటారు.  అందరూ చదివి ఉంటారు. ఆ కథ ద్వారా తెలివిగా పనిచేయడం అంటే ఏమిటో,  కష్టపడి పనిచేయడం  అంటే ఏమిటో మీరు అంచనా వేయవచ్చు. మనం చిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళం. ఒక కుండలో నీరు ఉండేది. నీరు కొంచెం లోతుగా ఉంది.  ఒక కాకి నీరు తాగాలనుకుంది. కానీ అది లోపలికి చేరుకోలేకపోయింది. అప్పుడు ఆ కాకి చిన్న చిన్న గులకరాళ్లను తీసుకొని ఆ కుండలో వేసింది.  నెమ్మదిగా నీరు పైకి వచ్చింది.  అది ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుంది. మీరు ఈ కథ విన్నారా? ఇప్పుడు దీన్ని మీరు ఏమని పిలుస్తారు. కష్టపడి పనిచేయడం అని అంటారా లేక తెలివిగా పనిచేయడం అని అంటారా? చూడండి, ఈ కథ రాసినప్పుడు స్ట్రా లేదు. లేదంటే, ఈ కాకి మార్కెట్‌కు వెళ్లి ఒక స్ట్రా తీసుకొచ్చేది. చూడండి.  కొంతమంది వ్యక్తులు కేవలం కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. కొంతమంది వ్యక్తుల జీవితంలో కష్టపడి పనిచేయడమే ఉండదు. కొంతమంది వ్యక్తులు తెలివిగా పనిచేస్తారు.  కొంతమంది వ్యక్తులు తెలివిగా కష్టపడి పనిచేస్తారు.  అందువలన, తెలివిగా కష్టపడి పనిచేయడం ఎలాగో కూడా ఆ కాకి మనకు నేర్పుతోంది. అందువలన, మనం ప్రతి పనిలోని సూక్ష్మభేదాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది వ్యక్తులు, విషయాలను అర్థం చేసుకోకముందే తమ మెదడును ఉపయోగించడం ప్రారంభిస్తారు. వారు చాలా కష్టపడి పనిచేస్తారు, కానీ ఫలితం మాత్రం ఉండదు. నాకు గుర్తుంది, నేను చాలా కాలం క్రితం ఒక గిరిజన ప్రాంతంలో పని చేసేవాడిని. నేను ఒక లోతట్టు ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఎవరో ఒక పాత జీప్‌ను ఏర్పాటు చేసి, దాన్ని తీసుకొని వెళ్ళమని మాతో చెప్పారు. మేము ఉదయం 5:30 గంటల ప్రాంతంలో బయలుదేరవలసి వచ్చింది. కానీ మా జీప్ ఏ మాత్రం కదలడం లేదు. మేము చాలా ప్రయత్నించాం. తోశాం. చాలా శ్రమపడ్డాం. కానీ మా జీప్ కదలలేదు. సమయం 7:30 అయిపోయింది. చివరకు ఒక మెకానిక్‌ను పిలిచాం. మెకానిక్ కేవలం రెండు నిమిషాలు కూడా తీసుకోకుండా దాన్ని సరిచేశాడు. తరువాత అతను 200 రూపాయలు అడిగాడు. రెండు నిమిషాల పనికి అతను 200 రూపాయలు అడగడం నాకు ఆశ్చర్యం కలిగించింది! నేను అతన్ని కారణం అడిగాను. అతను నాతో "200 రూపాయలు రెండు నిమిషాల పనికి కాదు, 50 సంవత్సరాల అనుభవానికి" అని చెప్పాడు. మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం. కానీ జీప్ కదలలేదు. అతను తెలివిగా కొన్ని బోల్ట్‌లను బిగించాల్సి వచ్చింది. దానికి రెండు నిమిషాలు కూడా పట్టలేదు, జీప్ స్టార్ట్ అయింది. దీని అర్థం ఏమిటంటే, ప్రతిదీ కష్టపడి పనిచేయడంతోనే చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. మీరు మల్లయోధులను, క్రీడా ప్రపంచంలోని ఇతర వ్యక్తులను చూసి ఉంటారు. ఆటగాడికి ఏ కండరాలు అవసరమో ఒక శిక్షకుడికి కచ్చితంగా తెలుస్తుంది. అదేవిధంగా, ఒక వికెట్ కీపర్ గంటల తరబడి వంగి ఉన్న స్థితిలో నిలబడవలసి ఉంటుంది. మనం క్లాసులో ఏదైనా అల్లరి చేస్తే, టీచర్ కూడా మన చెవులు పట్టుకొని కూర్చోబెడతారు. ఆ స్థానం చాలా బాధాకరంగా ఉంటుంది. నొప్పి కలుగుతుందా, లేదా? ఆ నొప్పి మానసికమైనది,  శారీరకమైనది కూడా. కానీ ఒక వికెట్ కీపర్‌కు, అది అతని శిక్షణలో భాగం. ఆ స్థానంలో గంటల తరబడి నిలబడటానికి అతనికి శిక్షణ ఇస్తారు. తద్వారా అతని కండరాలు క్రమంగా బలంగా మారి, అతను వికెట్ కీపర్‌గా మెరుగ్గా రాణించగలడు. ఒక బౌలర్‌కు అదే శిక్షణ అవసరం లేదు. అతనికి వేరే శిక్షణా పద్ధతులు అవసరం. అందువలన, మనం ఏమి చేయాలనుకుంటున్నాం? ఏది ఉపయోగపడుతుంది?  అనే దానిపై మనం దృష్టి పెట్టాలి. మనం అన్నింటినీ సాధించడానికి ప్రయత్నిస్తే, చాలా కష్టం అవుతుంది. చేతులు, కాళ్లు ఎత్తడం, పరుగెత్తడం,  అలాంటి ఇతర పద్ధతులు ఫిట్‌నెస్‌కు మంచివి. కానీ మనం ఏదైనా సాధించాలంటే, నిర్దిష్ట అంశాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. దీనిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, వారు మంచి ఫలితాన్ని కూడా ఇస్తారు. బౌలర్‌కు కండరాలు దృఢంగా లేకపోతే అతడు బంతి వేయగలడా? ఎన్ని ఓవర్లు వేయగలడు? వెయిట్‌లిఫ్టింగ్ చేసే వారు విభిన్న కండరాలను దృఢం చేయాలి. వారు కఠిన శ్రమ చేస్తారు. కానీ తెలివైన పద్ధతిలో శ్రమిస్తారు.  అప్పుడు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. చాలా ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి సార్.  జీవితంలో ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయడాన్ని ఎంచుకోవాలనే వివేకవంతమైన మీ సలహాకి ధన్యవాదాలు
గురు ద్రోణాచార్యుల పేరు మీద ఉన్న సైబర్ సిటీకి ప్రసిద్ధి చెందిన హర్యానా పారిశ్రామిక నగరం గురుగ్రామ్ నుంచి వచ్చిన విద్యార్థిని జోవితా పాత్ర ఆడిటోరియంలో ఉన్నారు. మిమ్మల్ని మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. జోవితా, దయచేసి మీ ప్రశ్న అడగండి.
జోవితా పాత్ర: నమస్కారం గౌరవ ప్రధాన మంత్రి సార్. నా పేరు జోవితా పాత్ర. నేను హర్యానాలోని గురుగ్రామ్, జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. పరీక్షా పే చర్చ 2023లో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.  గౌరవ ప్రధానమంత్రి గారూ, సగటు స్థాయి విద్యార్థిగా ఉన్న నేను చదువుపై దృష్టి ఎలా కేంద్రీకరించాలి? ఈ అంశంలో దయచేసి మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు సర్.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు జోవితా. గౌరవ ప్రధానమంత్రి గారూ, సగటు విద్యార్థిని అయిన జోవితా పాత్ర పరీక్షలలో మెరుగ్గా రాణించడానికి మీ సలహా కోరుకుంటున్నారు. దయచేసి ఆమెకు మార్గనిర్దేశం చేయండి.
ప్రధానమంత్రి: ముందుగా, మీకు మీరు ఒక సగటు విద్యార్థి అని తెలుసుకున్నందుకు నేను మీకు అభినందనలు తెలుపుతున్నాను. సాధారణంగా సగటు కన్నా తక్కువ స్థాయిలో ఉన్న చాలామంది తమను తాము మేధావులుగా భావించుకుంటారు. అందుకే ముందుగా మీకే కాదు, మీ తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నా సామర్థ్యం ఇదీ అన్న వాస్తవాన్ని మీరు అంగీకరించిన తర్వాత, దానికి తగిన విధంగా జీవితం లోని విషయాలను ఎంచుకోవచ్చు. అప్పుడు మేధావిగా నటించాల్సిన అవసరం ఉండదు. మన నిజమైన సామర్థ్యాన్ని మనం గుర్తించే రోజే, మనం నిజంగా చాలా సామర్థ్యవంతులమవుతాం. తమ సామర్థ్యాన్ని గుర్తించని వారు సామర్థ్యవంతులవడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించగలిగే బలాన్ని దేవుడు మీకు ప్రసాదించాడు. ఈ బలం మీ ఉపాధ్యాయులు, మీ కుటుంబ సభ్యుల వల్లనే మీకు లభించింది. అందరు తల్లిదండ్రులను నేను ఒకటే కోరుకుంటున్నాను. వారి పిల్లల సామర్థ్యాన్ని నిజాయితీగా అంచనా వేయాలి. వారిలో ఆత్మన్యూనతా భావం పెరగనివ్వకండి.  అదే సమయంలో సరైన అంచనాతో వారికి మార్గనిర్దేశం చేయండి. కొన్నిసార్లు, మీ పిల్లలు చాలా ఖరీదైన వస్తువును కొనివ్వమని మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు మీరు వారికి, "ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు కాబట్టి, ఇప్పుడే కొనివ్వలేము. రెండు సంవత్సరాలు ఆగమని" స్పష్టంగా చెప్పండి. ఇందులో తప్పేమీ లేదు. మీరు మీ ఆర్థిక స్థితిని మీ పిల్లలతో చర్చిస్తే, అందులో ఎలాంటి తప్పు లేదు. మనలో చాలా మంది సాధారణ నేపథ్యం నుంచే వచ్చాం. అసాధారణ నేపథ్యాల నుంచి  వచ్చిన వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. కానీ సాధారణ వ్యక్తులు ఏదైనా అసాధారణమైనది చేసినప్పుడు, వారు ఒక కొత్త శిఖరాన్ని చేరుకుంటారు.  సగటు స్థాయిని దాటిపోతారు. మీరు చూడండి, విజయం సాధించిన చాలా మంది వ్యక్తులు వారి జీవితంలో ఒకానొక సమయంలో చాలా సాధారణ వ్యక్తులే. కానీ వారు తమ జీవితంలో అసాధారణమైన పనులు చేశారు.  తద్వారా అసాధారణ ఫలితాలను పొందారు. ఇప్పటికే మీరు గమనించి ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏ దేశం ఎంత వృద్ధి నమోదు చేసింది? ఇతర దేశాల ఆర్థిక స్థితి ఎలా ఉంది? అనే విషయాలు తరచూ చర్చకు వస్తున్నాయి. కరోనా తర్వాత ఇది ఒక సాధారణ ధోరణిగా మారింది. ప్రపంచంలో ఆర్థిక నిపుణులు లేరని కాదు.  ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేయగల నోబెల్ బహుమతి గ్రహీతలు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు, ప్రతి వీధిలో, ప్రతి కాలనీలోనూ సలహాలు ఇచ్చే వారికి కూడా కొదవలేదు. ఎంతో కృషి చేసిన మంచి పండితులు కూడా ఉన్నారు. అయితే నేటి పరిస్థితుల్లో భారత్‌ను ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలుస్తున్నారు. భారత్‌ను ఒక ఆశాకిరణంగా చూస్తున్నారు. రెండు, మూడు సంవత్సరాల క్రితం, మన ప్రభుత్వం గురించి "ఈ ప్రభుత్వంలో ఆర్థికవేత్తలు ఎవరూ లేరు. ప్రభుత్వంలో ఉన్నవారంతా సాధారణ వ్యక్తులే.  ప్రధానమంత్రికి కూడా ఆర్థికశాస్త్రంపై జ్ఞానం లేదు" అని రాశారు. ఇలాగే రాశారు. మీరు ఈ వ్యాఖ్యలను చదువుతారో లేదో? కానీ మిత్రులారా, సగటు అని ముద్ర వేసిన ఆ దేశమే ఈ రోజు ప్రపంచంలో ప్రకాశిస్తోంది. కాబట్టి మిత్రులారా, మీరు సాధారణులు అనుకుంటూ ఎప్పుడూ ఒత్తిడికి గురికావద్దు. ఇంకో విషయం, మీరు సగటు వ్యక్తి అయినా, మీలో ఖచ్చితంగా ఏదో ఒక అసాధారణమైన విషయం ఉండి ఉంటుంది. అలాగే అసాధారణమైన వ్యక్తులలో కూడా, ఏదో ఒక విషయం సగటు స్థాయిలో ఉంటుంది. ప్రతి ఒక్కరికీ దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి దానికి ఎరువు, నీరు అందించడం. అప్పుడు మీరు చాలా వేగంగా ముందుకు సాగుతారు. ఇది నా విశ్వాసం. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, అనేక మంది విద్యార్థులు, భారతీయులు తాము విలువగలిగిన వారుగా, ప్రాధాన్యం ఉన్నవారుగా భావించేలా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి గారూ, ఆధునిక వాస్తుశిల్పంతో కూడిన,  అద్భుతమైన పట్టణ ప్రణాళికకు, ప్రసిద్ధ శిల్పకారుడు నెక్ చంద్ సృష్టించిన సుందరమైన రాక్ గార్డెన్ కు  ప్రసిద్ధి గాంచిన చండీగఢ్ రాజధాని నగరం నుంచి మన్నత్ బాజ్వా తనలాంటి అనేకమంది విద్యార్థులను ప్రభావితం చేసే మౌలిక సమస్యపై మీ సలహా కోరుతున్నారు. మన్నత్ -  దయచేసి మీ ప్రశ్న అడగండి.
మన్నత్ బాజ్వా: నమస్కారం. గౌరవ ప్రధానమంత్రి గారూ. నా పేరు మన్నత్ బాజ్వా. నేను సెయింట్ జోసెఫ్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, మీలాంటి ప్రతిష్ఠాత్మక స్థానంలో, అంటే ఇంత పెద్ద జనాభా ఉన్న,  చాలా మంది అభిప్రాయాలు చెప్పేవాళ్లు ఉన్న భారత్ వంటి దేశాన్ని నడపడం గురించి నేను ఊహించుకున్నప్పుడు, మీపై ప్రతికూల అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు కదా. అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుందా? అలా అయితే, స్వీయ సందేహాన్ని కలిగించే ఆ భావనను మీరు ఎలా అధిగమిస్తారు? ఈ విషయంలో మీ మార్గదర్శకత్వం నాకు కావాలి. ధన్యవాదాలు సార్.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, అష్టమీ సేన్ దక్షిణ సిక్కింలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం తేయాకు తోటలకు,  ఆకట్టుకునే అందానికి, ప్రశాంతతకు,  మంచుతో నిండిన హిమాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె కూడా, తప్పనిసరిగా పరిష్కారం అవసరమైన ఇదే సమస్యపై  మీ మార్గదర్శకత్వం కోరుకుంటున్నారు. అష్టమీ, దయచేసి మీ ప్రశ్న అడగండి.
అష్టమి సేన్: నమస్కారం, గౌరవ ప్రధానమంత్రి గారూ. నా పేరు అష్టమి సేన్. నేను దక్షిణ సిక్కింలోని రంజిత్ నగర్, డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, ప్రతిపక్షాలు, మీడియా మిమ్మల్ని విమర్శించినప్పుడు, మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారు? నిజానికి నా తల్లిదండ్రులు చేసే ఫిర్యాదులను, ప్రతికూల వ్యాఖ్యలను కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, స్వామి దయానంద సరస్వతి వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల గుజరాత్ నుంచి కుంకుమ్ ప్రతాప్ భాయ్ సోలంకి వర్చువల్ మాధ్యమం ద్వారా కనెక్ట్ అయ్యారు.  ఆమె కూడా ఇంచుమించు ఇదే  సంశయంతో మీ సలహా కోరుతున్నారు. కుంకుమ్, మీ ప్రశ్న అడగండి.
కుంకుమ్: గౌరవ ప్రధానమంత్రి గారూ, నా పేరు సోలంకి కుంకుమ్. నేను గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా, శ్రీ హదాలా భాల్ హైస్కూల్‌లో పన్నెండో  తరగతి చదువుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, మీరు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి. మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు కుంకుమ్.  గౌరవ ప్రధానమంత్రి గారూ, ఆకాష్ దరిరా భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరులో నివసిస్తున్నారు. సాంప్రదాయకంగా, ఆధునికంగా ఉండే అనేక కార్యకలాపాలకు ఇది సరైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.  తన ప్రశ్న ద్వారా, కొంతకాలంగా తన మనసులో ఉన్న ఇలాంటి విషయంపైనే ఆయన మీ సలహా కోరుకుంటున్నారు. ఆకాష్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
ఆకాష్: నమస్తే, మోదీజీ. నేను బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్నా. నా పేరు ఆకాష్ దరిరా. నా ప్రశ్న ఏమిటంటే, ప్రతిపక్షాలు చేసే ప్రతి ఆరోపణను, ప్రతి విమర్శను మీరు ఒక టానిక్‌గా ఒక అవకాశంగా ఎలా చూస్తారో మీ నుంచి  నేర్చుకోమని మా అమ్మమ్మ కవిత మఖిజా నాకు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. మోదీజీ, మీరు దీన్ని ఎలా చేస్తారు? జీవితంలో ప్రతి పరీక్షలోనూ విజయం సాధించడానికి మావంటి యువతను కూడా దయచేసి ప్రేరేపించండి. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, మీ జీవితం కోట్లమంది యువతకు స్ఫూర్తిదాయకం. జీవిత సవాళ్ల మధ్య సానుకూలంగా ఎలా ఉండాలి, విజయాన్ని ఎలా సాధించాలి అనే విషయంలో మన్నత్, అష్టమి, కుంకుమ్, ఆకాష్ మీ అనుభవం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. దయచేసి వారికి సలహా ఇవ్వండి.
ప్రధానమంత్రి: మీరు పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఉపాధ్యాయులతో (మీకు ఎవరితో అయితే సన్నిహిత సంబంధం ఉందో) మీ ప్రదర్శన గురించి చర్చిస్తారు కదా. అప్పుడు ఒక ప్రశ్నకు మీరు సరైన సమాధానం రాయలేకపోతే, మీ మొదటి స్పందన ఏమిటి? ‘అది సిలబస్ లో లేనిది‘అని అంటారు. అవునా? మీరు నన్ను అడిగిన ఈ ప్రశ్న కూడా సిలబస్ లో లేనిది. కానీ మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. మీరు మీ ప్రశ్నను నాకు ముడిపెట్టకుండా ఉండి ఉంటే, బహుశా మీరు మీ భావాలను వేరే విధంగా వ్యక్తపరిచేవారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని వింటున్నారని మీకు తెలుసు కాబట్టి, నేరుగా ప్రశ్న అడగడం ఒక ఇబ్బంది అని భావించి, చాకచక్యంగా నన్ను ఇందులో భాగం చేశారు. ఇక నా విషయానికి వస్తే నాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది. అది నాకు ఒక విశ్వాస సూత్రంలాంటిది. సూత్రప్రాయంగా నేను నమ్మేది ఏమిటంటే, విమర్శ అనేది ఒక సజీవ ప్రజాస్వామ్యాన్ని మరింత సమృద్ధిగా తీర్చిదిద్దే శుద్ధి యజ్ఞం. విమర్శ అనేది అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యానికి ప్రాథమిక అవసరం. మీరు ఓపెన్ సోర్స్ టెక్నాలజీ గురించి విని ఉంటారు. మీకు దాని గురించి తెలుసా లేదా? ఓపెన్ సోర్స్ టెక్నాలజీలో విభిన్న వ్యక్తులు విభిన్న ఆలోచనలను అందిస్తారు. ఓపెన్ సోర్స్ టెక్నాలజీ కింద ప్రజలు తమ ప్రయోగాలను పంచుకుంటారు, వారు ఎక్కడ ఇరుక్కుపోయారు లేదా లోపాలను చర్చిస్తారు. ప్రజలు వారి వ్యక్తిగత సాంకేతికతను  ఓపెన్ సోర్స్ టెక్నాలజీలో చేరుస్తారు. చాలా మంది కృషి తర్వాత అది ఒక పరిపూర్ణ సాఫ్ట్‌వేర్‌గా మారుతుంది. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ఈ రోజుల్లో చాలా శక్తిమంతమైన సాధనంగా మారింది. అదే విధంగా, కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తిని మార్కెట్‌లో ప్రవేశపెట్టి, ‘ఉత్పత్తిలో లోపాలను ఎవరైనా గుర్తించినట్లయితే, వారికి బహుమతి ఇస్తామని‘ ప్రకటిస్తాయి. అంటే, లోపాలను, వాటిని పరిష్కరించే మార్గాలను ఎవరైనా చూపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అవునా? కొన్నిసార్లు ఏమి జరుగుతుందంటే, ఆ మొత్తం విషయం అంతా విమర్శించే వ్యక్తి  చుట్టూ తిరుగుతుంది.ఉదాహరణకు, మీ పాఠశాలలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీ ఉంది మీరు ఎంతో ఉత్సాహంగా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటారు. అప్పుడు, మీ అత్యంత ఆప్తమిత్రులలో ఒకరు, ఎవరి అభిప్రాయాలకు మీరు ఎక్కువ విలువ ఇస్తారో వారు "ఈ ఫ్యాన్సీ డ్రెస్ నీకు అంతగా బాగాలేదు." అంటారు. సహజంగానే, మీరు సానుకూలంగా స్పందిస్తారు. కానీ, మీకు అంతగా నచ్చని మరొక విద్యార్థి పట్ల మీ స్పందన ఇందుకు భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే అతన్ని చూసినప్పుడల్లా మీకు ప్రతికూల ప్రకంపనలు ఎదురవుతాయి. అతను మీరు వేసుకున్న ఆ ఫ్యాన్సీ డ్రెస్ గురించి ఎగతాళి చేస్తాడు. అతనికి మీ స్పందన చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకు? మీకు దగ్గరైన వారి స్పందనను మీరు స్వాగతిస్తారు. దానిని సానుకూలంగా తీసుకుంటారు. అయితే, మీకు నచ్చని వ్యక్తి నుంచి  అదే స్పందన ఎదురైనప్పుడు, మీరు సంయమనం కోల్పోతారు ‘వ్యాఖ్యానించడానికి నువ్వు ఎవరు? నేను ఇదే ధరించాలనుకుంటున్నాను‘   అంటారు కదా. అదే విధంగా, ఎవరైనా మిమ్మల్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ఉంటే వారిని పట్టించుకోకండి. వారి కోసం మీ సమయాన్ని వృథా చేయకండి. ఎందుకంటే వారికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి. అయితే, ఇంట్లో జరిగే విమర్శ తప్పుగా భావించాలా? ఇంట్లో అసలు విమర్శ ఉండకూడదా? తల్లిదండ్రులు కూడా ఏదైనా విమర్శ చేయడానికి ముందు చాలా విషయాలు తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి. వారు మిమ్మల్ని గమనించాలి. మీ ఉపాధ్యాయులను కలవాలి. మీ స్నేహితుల అలవాట్లు తెలుసుకోవాలి. మీ రోజువారీ కార్యకలాపాలను అర్థం చేసుకోవాలి. మీరు మొబైల్ ఫోన్‌పై ఎంత సమయం గడుపుతున్నారు, స్క్రీన్ ముందు ఎంత సమయం ఉంటున్నారు వంటి విషయాలన్నింటినీ వారు ఎంతో సమీపంగా గమనిస్తారు. ఇలా అన్నింటినీ పరిశీలించిన తర్వాత, మీరు మంచి ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ సామర్థ్యం ఏమిటి, మీలో ఉన్న ప్రతిభ ఏమిటి, అలాగే మీరు ముఖ్యంకాని విషయాలపై మీ శక్తిని ఎలా వృథా చేస్తున్నారో సున్నితంగా, ప్రేమతో మీకు తెలియజేస్తారు. ఇది మీ మనసును చేరుతుంది. వారి విమర్శ మేలు చేస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు సమయం లేదు, వారు విమర్శించరు. కానీ వారు జోక్యం చేసుకుంటారు. మీ కోపం ఆ జోక్యం పైనే ఉంది. వారు ఏదైనా అంటారు. మీరు భోజనం చేస్తున్నప్పుడు, వారు మీరు ఇది తిన్నారా అది తిన్నారా అని అడుగుతారు. ఇదే జరుగుతుంది కదా? చూడండి, చూడండి, మీరు ఈ రోజు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. జోక్యం చేసుకోవడం అనేది విమర్శ కాదు. పిల్లలకు అనవసరంగా అంతరాయం కలిగించవద్దని తల్లిదండ్రులను కూడా నేను కోరుతున్నాను. పిల్లల విషయంలో తరచూ జోక్యం చేసుకుంటూ మీరు వారిని అంచనా వేయలేరు. ఉదయం సమయంలో వారు చాలా ఆనందంగా ఉన్న స్థితిలో “పాలు చల్లారిపోయాయి. ఇంకా తాగలేదు” అని చెప్పి వారి మనస్థితిని చెడగొడితే ఏమవుతుంది? చాలా సార్లు తల్లిదండ్రులు ఇతరుల పిల్లల ఉదాహరణలు చెబుతుంటారు. “ఇతర పిల్లలు అయితే అమ్మ చెప్పగానే వెంటనే పాలు తాగుతారు, తల్లిదండ్రుల మాట వింటారు” అని అంటారు. అలా చెప్పడంతో ఆ పిల్లవాడు మనస్తాపానికి లోనవుతాడు. కోపంగా మారతాడు, ఫలితంగా అతని ఆ రోజు షెడ్యూల్ పూర్తి  గందరగోళంగా మారిపోతుంది.
మీరు పార్లమెంట్‌లో జరిగే చర్చలను చూస్తుంటారు. కొందరు ఎంపీలు పార్లమెంట్‌లో ప్రసంగాలు చేయడానికి ముందే బాగా సిద్ధమై  వస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులకు వారి మనస్తత్వం బాగా తెలుసు. అందుకే ప్రసంగం జరుగుతున్న మధ్యలోనే ఉద్దేశపూర్వకంగా దుమారానికి దారి తీసే వ్యాఖ్య చేస్తారు. అలా మాట్లాడుతున్న ఎంపీ సహజంగానే దానికి స్పందిస్తాడని వారికి బాగా తెలుసు. అప్పుడు ఆ వ్యాఖ్యకు స్పందించడం తనకు చాలా ముఖ్యమని ఆ ఎంపీ భావిస్తాడు. అందువల్ల అతడు దృష్టి చెదిరి ఆ వ్యాఖ్యకు స్పందిస్తాడు. ఫలితంగా ఎంత మంచి సిద్ధతతో వచ్చినప్పటికీ అతనికి నష్టం జరుగుతుంది. కానీ ఆ వ్యాఖ్యను తేలికగా తీసుకుని వెంటనే తన ప్రసంగానికే కట్టుబడి ఉంటే, అతడు కోరుకున్న ఫలితాలను పొందగలుగుతాడు. కాబట్టి మన దృష్టిని ఎప్పటికీ కోల్పోవద్దు.
రెండో విషయం ఏమిటంటే, ఎవరికైనా విమర్శ చేయాలంటే ఎంతో కష్టం.  లోతైన అధ్యయనం అవసరం. దానిని విశ్లేషించాలి. పోలికలు చేయాలి. గతాన్ని పరిశీలించి, వర్తమానాన్ని చూడాలి. భవిష్యత్తుపైనా ఆలోచించాలి. దీనికి ఎంతో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే నిజమైన విమర్శ సాధ్యమవుతుంది. అయితే నేటి కాలంలో చాలామంది షార్ట్‌కట్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ మంది విమర్శలు చేయకుండా ఆరోపణలే చేస్తుంటారు. ఆరోపణలను విమర్శలుగా మనం భావించకూడదు. ఆరోపణలకు, విమర్శలకు మధ్య చాలాతేడా ఉంది. విమర్శ అనేది మనల్ని సమృద్ధిగా చేసే ఒక రకమైన పోషకం లాంటిది. కేవలం ఆరోపణలే చేసే వారిని మనం తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లపై మన సమయాన్ని వృథా చేయకూడదు. అయితే విమర్శను మాత్రం తేలికగా తీసుకోకూడదు. విమర్శను ఎప్పుడూ విలువైనదిగా భావించాలి. విమర్శ మన జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. మీరు నిజాయితీగా ఉండి, సమగ్రతతో పనిచేసి, ఒక నిర్దిష్ట లక్ష్యంతో సమాజం కోసం పని చేస్తే, అలాంటి ఆరోపణలను పట్టించుకోకండి. మిత్రులారా. అవే మీకు గొప్ప శక్తిగా మారుతాయని నేను భావిస్తున్నాను. చాలా ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారు, మీ సానుకూల శక్తి కోట్లాది మంది దేశ ప్రజలకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది. ధన్యవాదాలు, గౌరవ ప్రధానమంత్రి గారు. సరస్సుల నగరమైన భోపాల్‌కు చెందిన దీపేష్ అహిర్వార్ వర్చువల్ గా అనుసంధానమై ఉన్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నారు. దీపేష్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
దీపేష్: గౌరవ ప్రధానమంత్రి గారు, నమస్కారం! నా పేరు దీపేష్ అహిర్వార్. నేను భోపాల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ఈ రోజుల్లో, పిల్లలలో ఫాంటసీ ఆటలు, ఇన్ స్టాగ్రామ్ వ్యసనం చాలా సర్వసాధారణమైపోయాయి. మా చదువులపై దృష్టి ఎలా కేంద్రీకరించాలి? దృష్టి మరలకుండా మా చదువులపై ఎలా ఏకాగ్రత చూపాలి అనే దాని గురించి నాకో ప్రశ్న ఉంది. దీనిపై మీ మార్గదర్శకత్వం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు దీపేష్. గౌరవ ప్రధానమంత్రి గారు, ఆదితాబ్ గుప్తా ప్రశ్న ఇండియా టీవీ  ద్వారా ఎంపికయింది. ఆదితాబ్ వర్చువల్ గా  అనుసంధానమై ఉన్నారు. ఆదితాబ్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
ఆదితాబ్ గుప్తా: నా పేరు ఆదితాబ్ గుప్తా. నేను పదో తరగతి చదువుతున్నాను. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, మా దృష్టి మరలే అంశాలు  కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. మా దృష్టి చదువుల కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువగా ఉంటోంది. నా ప్రశ్న ఏమిటంటే, మేము చదువులపై ఎలా దృష్టి పెట్టాలి? సోషల్ మీడియాపై గడిపే సమయాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఎందుకంటే, మీ కాలంలో ఇప్పుడున్నన్ని దృష్టి మరల్చే అంశాలు లేవు కదా.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు ఆదితాబ్. గౌరవ ప్రధానమంత్రి గారు, తదుపరి ప్రశ్న కామాక్షి రాయ్ నుంచి. ఇది కూడా చాలా మంది విద్యార్థులకు సంబంధించినదే. ఆమె ప్రశ్న రిపబ్లిక్ టీవీ ద్వారా ఎంపికయింది. కామాక్షి, దయచేసి మీ ప్రశ్న అడగండి.
కామాక్షి రాయ్: శుభాకాంక్షలు! ప్రధానమంత్రి గారికి,  అందరికీ! నేను కామాక్షి రాయ్, ఢిల్లీలో పదో తరగతి చదువుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, పరీక్షల సమయంలో విద్యార్థుల దృష్టి సులభంగా మరలకుండా ఉండటానికి, అనుసరించదగిన వివిధ మార్గాలు ఏమిటి? ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు కామాక్షి. గౌరవ ప్రధానమంత్రి గారు, ఈ ప్రశ్న జీ టీవీ  ద్వారా ఎంపికయింది. మనాన్ మిట్టల్  వర్చువల్ మాధ్యమం ద్వారా మనతో కలుస్తున్నారు. మనాన్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
మనాన్ మిట్టల్: నమస్తే, ప్రధానమంత్రి గారు! నేను డీపీఎస్ బెంగళూరు సౌత్ నుంచి మనాన్ మిట్టల్‌ని. నాదో ప్రశ్న ఉంది. ఆన్‌లైన్‌లో చదువుకునేటప్పుడు ఆన్‌లైన్ గేమింగ్ వంటి అనేక దృష్టి మరల్చే అంశాలు  ఉన్నాయి. మేము వాటిని ఎలా నివారించాలి?
ప్రధానమంత్రి: వీరంతా ఎప్పుడూ గాడ్జెట్‌లలో  మునిగి తేలే విద్యార్థులేనా?
వ్యాఖ్యాత: ధన్యవాదాలు మనాన్! గౌరవ ప్రధానమంత్రి గారు, దీపేష్, ఆదితాబ్, కామాక్షి, మనాన్ పరీక్షల సమయంలో దృష్టి మరలడం  అనే సమస్య నుంచి ఎలా బయటపడాలనే దానిపై మీ సలహా కోరుతున్నారు. దయచేసి వారికి మార్గనిర్దేశం చేయండి.
ప్రధానమంత్రి: అన్నింటికంటే ముందుగా, మీరు తెలివైనవారా లేక ఆ గాడ్జెట్ తెలివైనదా అనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవాలి. కొన్నిసార్లు, మీరు మీ కంటే గాడ్జెట్‌లనే ఎక్కువ తెలివైనవిగా భావిస్తున్నట్లు అనిపిస్తుంది. పొరపాటు అక్కడే మొదలవుతుంది. నన్ను నమ్మండి. దేవుడు మీకు చాలా శక్తిని ఇచ్చాడు. మీరే తెలివైనవారు. గాడ్జెట్‌లు మీ కంటే తెలివైనవి కాలేవు. మీరు ఎంత తెలివైనవారైతే, మీరు అంత సరిగ్గా ఆ గాడ్జెట్‌ను ఉపయోగించగలుగుతారు. ఇది మీ పనివేగాన్ని పెంచే ఒక సాధనం. ఆవిధంగా దాన్ని ఉపయోగిస్తే, బహుశా దాని దుష్ప్రభావాలను మీరు తొలగించగలుగుతారు. రెండవది, ఇది దేశానికి సంబంధించిన తీవ్ర ఆందోళనకరమైన విషయం. మొన్ననే ఎవరో నాకు చెప్పారు. భారతదేశంలో ప్రజలు సగటున రోజుకు ఆరు గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారు అని. ఆరు గంటలు! ఇది మాత్రం ఆ వ్యాపారంలో ఉన్నవారికి సంతృప్తికరమైన విషయమే అవుతుంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్లలో టాక్ టైమ్ గురించే చర్చ ఉండేది. అప్పుడు ప్రజలు సగటున 20 నిమిషాలు మాత్రమే ఉపయోగించేవారని చెప్పేవారు. కానీ రీల్స్ ప్రవేశించిన తర్వాత వాటి నుంచి బయటపడటం చాలా కష్టం అయింది. ఒకసారి చూడడం మొదలుపెట్టాక మీరు అకస్మాత్తుగా ఆపేస్తారా? చెప్పండి, ఆపేస్తారా? మీరు రీల్స్ చూడరా? రీల్స్ చూడకపోతే ఎందుకు సంకోచపడుతున్నారు? చెప్పండి, మధ్యలోనే వదిలేస్తారా? చూడండి, మన సృజనాత్మక శక్తిని రోజుకు ఆరు గంటలు మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ఖర్చు చేస్తే అది నిజంగా ఆందోళనకరమైన విషయం. ఒక విధంగా మనమే ఈ గ్యాడ్జెట్లకు బానిసలమవుతున్నాం. కానీ మనం వీటి బానిసలుగా ఉండకూడదు. దేవుడు మనకు సొంత అస్తిత్వాన్ని,  వ్యక్తిత్వాన్ని  ఇచ్చాడు. అందువల్ల మనం దానికి బానిసలుగా మారుతున్నామా లేదా అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా చురుకుగా ఉన్నప్పటికీ, మీరు నా చేతిలో మొబైల్ ఫోన్‌ను చూసి ఉండరు. నేను దాని కోసం సమయాన్ని నిర్ధరించాను. దానిపై ఎక్కువ సమయాన్ని గడపను. ముఖ్యమైన సమావేశంలో ఉన్న వ్యక్తులు కూడా, మొబైల్ వైబ్రేట్ అయిన వెంటనే, అకస్మాత్తుగా ఫోన్ తీయడం నేను తరచుగా చూస్తాను. మనం ఈ గాడ్జెట్‌లకు బానిసలు కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని నేను అనుకుంటున్నాను. నాకు స్వేచ్చ ఉంది. నాకు సొంత అస్తిత్వం ఉంది. నాకు ఉపయోగపడే దానికి నేను నన్ను పరిమితం చేసుకుంటాను. నేను సాంకేతికతను ఉపయోగిస్తాను. సాంకేతికత నుంచి పారిపోను. కానీ నా అవసరం, ఆవశ్యకతకు అనుగుణంగా మాత్రమే దానిని ఉపయోగిస్తాను. ఉదాహరణకు, మీరు దోసతో తయారు చేయడానికి ఆన్‌లైన్‌లో ఒక మంచి వంటకం గురించి చదివారు అనుకుందాం. దానికి ఏ పదార్థాలు అవసరమో తెలుసుకోవడానికి ఒక గంట గడిపారు. మీ కడుపు నిండుతుందా? నిండదు కదా? మీరు తయారు చేసి తినవలసి ఉంటుంది. అందువల్ల, గాడ్జెట్ మీకు పరిపూర్ణంగా దేన్నీ అందించదు. మీ అంతర్గత సామర్థ్యమే  అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు. పూర్వ కాలంలో పిల్లలు ఎక్కాలను చాలా తేలికగా చెప్పేవారు. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్ళినప్పుడు, వారి నైపుణ్యాన్ని చూసి ఆ దేశాల ప్రజలు ఆశ్చర్యపోవడాన్ని నేను స్వయంగా చూశాను.ఇప్పుడు మీరు చూడండి. కాలక్రమేణా ఏమి జరిగిందో. ఇప్పుడు, ఎక్కాలలో నైపుణ్యం ఉన్న పిల్లల కోసం మనం వెతకవలసి వస్తుంది. అంటే, మనం మన సామర్థ్యాన్ని కోల్పోతున్నాం. మన సామర్థ్యాన్ని కోల్పోకుండా, మనం దీన్ని చేతనంగా ప్రయత్నించాలి. లేకపోతే, ఆ నైపుణ్యం క్రమంగా నశించిపోతుంది. 'ఇది నాకు గుర్తుందా లేదా' అని మనం నిరంతరం మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ రోజుల్లో, చాలా కృత్రిమ మేధ వేదికలు  ఉన్నాయి. మీరు ఏమీ చేయనవసరం లేదు. ఆ వేదికల్లోని చాట్ సెక్షన్‌కు వెడితే అది మీకు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేస్తుంది. ఇప్పుడు గూగుల్ మరో అడుగు ముందుకు వేసింది. మీరు ఇందులో ఇరుక్కుపోతే మీ సృజనాత్మకత అంతరించిపోతుంది. అందువల్ల, నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, పురాతన భారతదేశంలోని ఆరోగ్య శాస్త్రాలలో ఉపవాసం అనే ఒక సంప్రదాయం ఉంది. మన దేశంలోని కొన్ని మతపరమైన ఆచారాలలో కూడా ఉపవాసం ప్రబలంగా ఉంది. ఇప్పుడు కాలం మారింది. అందువల్ల, మీరు వారానికి కొన్ని రోజులు లేదా రోజుకు కొన్ని గంటలు సాంకేతికతపై ఉపవాసం  అనే ఈ కళను అభ్యసించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంటే మీరు ఆ సమయం వరకు సాంకేతికతకు దూరంగా ఉంటారు.
పిల్లలు పదో తరగతి, లేదా పన్నెండో తరగతి చదువుతుంటే చాలా కుటుంబాలు ఆందోళనలో ఉండటం మీరు చూసే ఉంటారు. ఇంట్లో టీవీలో చూడాల్సిన కార్యక్రమాలను కూడా కుటుంబ సభ్యులే నిర్ణయిస్తారు. కొన్నిసార్లు, వారు టీవీ సెట్‌ను ఒక గుడ్డ ముక్కతో కప్పి ఉంచుతారు. పిల్లలు పదో తరగతి లేదా పన్నెండో తరగతి చదువుతున్నందున, వారిని టీవీ చూడకుండా నిషేధిస్తారు. మనం అంత తెలివిగా ఉండి, టీవీ సెట్‌ను గుడ్డతో కప్పగలిగినప్పుడు, వారంలో ఒక రోజు డిజిటల్ పరికరాలను తాకకుండా ఉపవాసం చేయాలని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేమా?  దాని వల్ల వచ్చే ప్రయోజనాలను గమనించండి. క్రమంగా మీరు ఉపవాసం సమయాన్ని పెంచాలని అనిపిస్తుంది. మన కుటుంబాలు చిన్నగా మారుతున్నాయి. ఈ డిజిటల్ ప్రపంచంలో చిక్కుకుపోతున్నాయి. ఒకే ఇంట్లో తల్లి, కొడుకు, అక్క, తమ్ముడు, తండ్రి జీవిస్తున్నారు,.కానీ వారు వాట్సాప్ ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకుంటున్నారు. నేను మీ గురించే మాట్లాడుతున్నాను. మమ్మీ వాట్సాప్ ద్వారా డాడీకి మెసేజ్ పంపుతారు. అందరూ ఇంట్లో కలిసి కూర్చుని ఉన్నా, ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో మునిగిపోయి ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇలా అయితే కుటుంబం ఎలా నడుస్తుంది? పూర్వకాలంలో, ప్రజలు బస్సులో లేదా రైలులో ప్రయాణించేటప్పుడు కబుర్లు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు, వారికి మొబైల్ కనెక్టివిటీ దొరికిన వెంటనే, ప్రపంచంలో ఉన్న పనులన్నీ వారికే ఉన్నట్లుగా మొబైల్ ఫోన్లలో మునిగిపోతారు. అది లేకపోతే, మొత్తం ప్రపంచమే ఆగిపోతుందేమో అన్నట్లుగా వ్యవహరిస్తారు. మనం ఈ రోగాలను గుర్తించాలి. మనం ఈ రోగాలను గుర్తించగలిగితే, అలాంటి రోగాల నుంచి మనం బయటపడగలం. అందువల్ల, మీ ఇంట్లో ఒక ప్రత్యేక గదిని ‘నో టెక్నాలజీ జోన్’ గా నిర్ణయించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.ఆ గదిలోకి ప్రవేశించాలనుకునే ఎవరైనా తమ మొబైల్‌ను మరొక గదిలో ఉంచాలి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లు లేకుండా ఆ గదిలో కలిసి సమయాన్ని గడుపుతారు. ఇంట్లో గుడి కోసం ఒక ప్రత్యేక స్థలం కేటాయించినట్లుగా, గదుల్లో ఒకదాన్ని 'నో టెక్నాలజీ జోన్'గా చేసుకోండి. చూడండి, మీరు మీ జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తారు. ఆనందం ఉన్నప్పుడు, మీరు దాని బానిసత్వం  నుంచి బయటపడతారు. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారు, సవాలుతో కూడిన పరిస్థితులను ఇంత సులభమైన పద్ధతిలో ఎదుర్కోవడానికి 'డిజిటల్ ఉపవాసం' వంటి ఆహ్లాదకరమైన మంత్రాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారు, హిమాలయ పర్వత శ్రేణులలో సహజ సౌందర్యంతో నిండిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ నుంచి నిదా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. నిదా, మీ ప్రశ్న అడగండి.
నిదా: గౌరవ ప్రధానమంత్రి గారికి నమస్కారం! నేను జమ్మూలోని సుంజ్‌వాన్ గవర్నమెంట్ మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నా. నా పేరు నిదా. నా ప్రశ్న ఏమిటంటే, మనం కష్టపడి పనిచేసినప్పుడు కూడా ఆశించిన ఫలితం పొందకపోతే, ఆ ఒత్తిడిని మనం ఎలా సానుకూల దిశలోకి మళ్లించగలం? సర్, మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు నిదా.  గౌరవ ప్రధానమంత్రి గారు, శ్రీకృష్ణుడి బోధనలు పుట్టిన గడ్డ,  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నీరజ్ చోప్రా వంటి ప్రముఖ క్రీడాకారుల నేల హర్యానాలోని పల్వాల్ నుంచి ప్రశాంత్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ప్రశాంత్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
ప్రశాంత్: గౌరవ ప్రధానమంత్రి గారికి నమస్కారం! నా పేరు ప్రశాంత్. నేను హర్యానాలోని పల్వాల్ జిల్లా,హథిన్ లోని షహీద్ నాయక్ రాజేంద్ర సింగ్ మోడల్ సంస్కృతి ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ లో సైన్స్ ఫ్యాకల్టీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని. పరీక్షా ఫలితాలపై  ఒత్తిడి ఎలా ప్రభావం చూపుతుంది అనేది మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్న  ప్రశ్న. ఈ విషయంలో మీ సలహా కావాలి. ధన్యవాదాలు సర్.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు ప్రశాంత్. గౌరవ ప్రధానమంత్రి గారు, నిదా, ప్రశాంత్ వంటి కోట్లాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా పరీక్షా ఫలితాలపై ఒత్తిడి చూపే ప్రభావం గురించి మీ మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారు.
ప్రధానమంత్రి: చూడండి, పరీక్ష ఫలితాల తర్వాత ఒత్తిడికి ప్రధాన కారణం ఏమిటంటే, విద్యార్థులు పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారు చాలా బాగా చేశామనే వాతావరణాన్ని సృష్టిస్తారు. వారు 90 శాతం మార్కులు వస్తాయని పెద్దపెద్ద మాటలు చెప్తారు. కుటుంబ సభ్యులు కూడా తమ పిల్లలను నమ్ముతారు. తల్లిదండ్రులకు నిజం చెబితే వెంటనే తిట్లు పడతాయని భావించడం వల్ల  పిల్లలు తరచుగా అలా చేస్తుంటారు. అందువల్ల, నెల రోజుల తర్వాత ఫలితాలు వచ్చే ముందు వరకు ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడమే మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్ముతారు కాబట్టి, వారు చాలా కష్టపడ్డారని, ఆడుకోవడానికి బయటకు వెళ్లలేదని, కుటుంబంలో జరిగిన పెళ్లికి కూడా హాజరు కాలేదని, కాబట్టి ఈసారి చాలా మంచి ఫలితాలు సాధిస్తారని తమ స్నేహితుల మధ్య గొప్పలు చెప్పుకోవడం కూడా ప్రారంభిస్తారు. అంతేకాదు, తమ పిల్లవాడు తప్పకుండా క్లాస్‌లో మొదటి స్థానం లేదా రెండో స్థానం సాధిస్తాడన్నట్టుగా తల్లిదండ్రులే ఒక వాతావరణాన్ని సృష్టిస్తారు. చివరికి ఫలితాలు వచ్చినప్పుడు, పిల్లలకు 40-45 మార్కులు మాత్రమే వస్తే సహజంగానే అప్పుడు తుపాను మొదలవుతుంది. అందువల్ల, మనం చేయవలసిన మొదటి పని ఏమిటంటే, నిజాన్ని ఎదుర్కొనే అలవాటును వదులుకోకూడదు. అబద్ధాల వెనుక మనం ఎంతకాలం జీవించగలం? పేపర్ సరిగా రాయలేదని ఒప్పుకోవాలి. 'నేను ప్రయత్నించాను, కానీ అది సరిపోలేదు' అని చెప్పగలగాలి. మీరు ముందుగానే దానిని అంగీకరించి, మీరు అనుకున్న దానికంటే ఐదు మార్కులు ఎక్కువ సాధిస్తే, ఇంట్లో ఎలాంటి ఒత్తిడి ఉండదు. వాస్తవానికి, మీ తల్లిదండ్రులు మీరు చెప్పిన దానికంటే మెరుగ్గా రాశారని మిమ్మల్ని అభినందిస్తారు. ఒత్తిడికి రెండో కారణం ఏమిటంటే, మనం మనల్ని మన స్నేహితులతో పోల్చుకోవడం. అతను ఇది చేస్తే నేనూ అది చేయాలి అన్న భావన. తరగతిలో ఒక మంచి ప్రతిభావంతమైన విద్యార్థుడు ఉంటాడు. అలాగే మరికొందరూ కూడా ఆశాజనకులే. అసలు తేడా చాలా స్వల్పమే. కేవలం 19–20 మాత్రమే. అయినప్పటికీ, పగలు రాత్రి ఆ పోటీ ఆలోచనల ప్రవాహంలోనే జీవిస్తుంటాం. ఇదీ ఒత్తిడికి మరో ముఖ్యమైన కారణం. మనం మనకోసం జీవించాలి. మనకు ప్రియమైన వారి నుంచి,  అందరి నుంచి కూడా నేర్చుకోవాలి. అయినా మనం మన ఆంతరంగిక శక్తిని బలోపేతం చేసుకోవాలి. మనం ఇలా చేస్తే, ఒత్తిడి నుంచి బయటపడే అవకాశాలు పెరుగుతాయి. రెండోది, జీవితం పట్ల మన దృక్పథం ఏమిటి? మనం పరీక్షలో నెగ్గలేకపోయాం, అందుకే మన జీవితం ముగిసింది అని ఏ రోజు అయితే భావిస్తామో ఆ రోజు ఒత్తిడి కచ్చితంగా వస్తుంది. జీవితం అనేది ఏ ఒక్క స్టేషన్‌లోనూ ఆగిపోదు.. ఒక రైలు తప్పిపోతే మరొక రైలు వచ్చి, మిమ్మల్ని ఇంకొక పెద్ద స్టేషన్‌కి తీసుకెళ్తుంది. కాబట్టి, ఆందోళన పడకండి.  పరీక్షలు అనేవి జీవితానికి ముగింపు కాదు. సందేహం లేదు, మనకంటూ మన సొంత ప్రమాణాలు  ఉండాలి.  మనల్ని మనం నిరంతరం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇది మన ప్రయత్నంగా ఉండాలి. ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి మన మనస్సులో ఒక సంకల్పం తీసుకోవాలి. “ఏం జరిగినా, నా జీవితాన్ని ఎలా జీవించాలో నాకు తెలుసు. నేను దానిని  ఎదుర్కొంటాను” అని మీరు  దృఢ నిశ్చయాన్ని చేసుకుంటే, అప్పుడు అది చాలా సులభం అవుతుంది. అందువల్ల, పరీక్ష ఫలితాలకు సంబంధించిన ఒత్తిడిని కొన్నిసార్లు తీవ్రంగా తీసుకోకూడదు అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు!
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, మీ అనుభవాన్ని విన్న తర్వాత మాకు ఒక కొత్త అవగాహన లభించింది. ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి గారూ, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆర్. అక్షర సిరి అనే విద్యార్థిని ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.  దాని గురించి మీ దిశానిర్దేశం కోసం ఎదురుచూస్తున్నారు. అక్షరా, దయచేసి మీ ప్రశ్నను అడగండి.
అక్షర: గౌరవ ప్రధానమంత్రి గారూ, నమస్కారం! నా పేరు ఆర్. అక్షరా సిరి. నేను తెలంగాణా లో రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. సార్, మరిన్ని భాషలను నేర్చుకోవడానికి మనం ఏమి చేయాలి? దీనిపై నాకు మీ మార్గదర్శకత్వం కావాలి. ధన్యవాదాలు సార్.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు అక్షరా. గౌరవ ప్రధానమంత్రి గారూ, భారతదేశ నడి మధ్య నగరం భోపాల్‌లో నివసించే రితికా ఘోడ్కే నుంచి కూడా ఇలాంటి ప్రశ్నే వచ్చింది. ఆమె ఆడిటోరియంలో మాతో ఉన్నారు. రితికా, దయచేసి మీ ప్రశ్న అడగండి.
రితికా ఘోడ్కే: గౌరవ ప్రధానమంత్రి గారూ, నమస్కారం! నా పేరు రితికా ఘోడ్కే. నేను మధ్యప్రదేశ్, భోపాల్‌లోని ప్రభుత్వ సుభాష్ ఎక్సలెన్స్ సెకండరీ స్కూల్ ఫర్ ఎక్సలెన్స్, పన్నెండవ తరగతి విద్యార్థిని. సార్, ఎక్కువ భాషలను మనం ఎలా నేర్చుకోవచ్చు? అది ఎందుకు ముఖ్యం?  అనేది నా ప్రశ్న. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు రితికా. గౌరవ ప్రధానమంత్రి గారూ, అక్షర,  రితికలకు అత్యంత అవసరమైన బహుళ భాషా నైపుణ్యాలను  ఎలా సంపాదించుకోవాలో దయచేసి మార్గనిర్దేశం చేయండి.
ప్రధానమంత్రి: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా, నేను మీకు మొదట్లో మిగతా విషయాలను వదిలిపెట్టి, కొంచెం దృష్టి పెట్టమని చెప్పాను, కానీ ఈ ప్రశ్న విషయానికి వస్తే, మీరు కొంచెం బాహ్య ప్రపంచంతో కలవాలని నేను చెబుతాను. కొంచెం కొంచెం బహిర్ముఖంగా ఉండటం చాలా అవసరం. నేను ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే, భారతదేశం భాషా వైవిధ్యంతో నిండిన దేశం. మనకు వందలాది భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయని మనం గర్వంగా చెప్పగలం.  ఇదే మన సంపద, మన సౌభాగ్యం. మనం మన ఈ సంపద పట్ల గర్వపడాలి. మీరు గమనించే ఉంటారు.  ఒక విదేశీయుడు మిమ్మల్ని కలిసినప్పుడు, మీరు భారతదేశానికి చెందినవారని అతనికి తెలిస్తే, అతనికి భారతదేశం గురించి ఏ మాత్రం పరిచయం ఉన్నా, అతను మిమ్మల్ని 'నమస్తే' అని పలకరిస్తారు. ఉచ్చారణ అంత స్వచ్చంగా ఉండకపోయినా, 'నమస్తే' అని శుభాకాంక్షలు చెప్తారు. ఆ మాటను అతను పలికిన వెంటనే, మీరు అప్రమత్తం అవుతారు. మీ ఇద్దరి మధ్య వెంటనే ఒక సాన్నిహిత్యం అభివృద్ధి చెందుతుంది. ఈ విదేశీయుడు  'నమస్తే' అని పలకరించడం చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. సంభాషణకు ఎంత శక్తి ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు ఇంతటి పెద్ద దేశంలో నివసిస్తున్నారు. మీకు ఒక అలవాటుగా తబలా, వేణువు, సితార్ లేదా పియానో నేర్చుకోవాలని అనిపించదా? దానివల్ల మనలో మరింత అదనపు క్రమశిక్షణ పెరుగుతుంది. అవునా? మీకు ఈ భావన ఉన్నప్పుడు, మీరు పొరుగు రాష్ట్రాల నుంచి ఒకటి లేదా రెండు భాషలను ఎందుకు నేర్చుకోకూడదు? మీరు కచ్చితంగా ప్రయత్నించాలి. మనం కేవలం ఒక భాషను లేదా కొన్ని మాట్లాడే పదాలను నేర్చుకుంటున్నామని కాదు. దీనివల్ల మీరు ఆ రాష్ట్ర అనుభవాల సారాంశాన్ని పొందుతారు. ప్రతి భాష వ్యక్తీకరణ వెనుక, వేల సంవత్సరాల పాటు నిరంతరంగా, విచ్ఛిన్నం కాకుండా, మారకుండా కొనసాగిన అనుభవాల ప్రవాహం ఉంది. ఎత్తుపల్లాలు ఉన్న ప్రవాహం ఉంది. అనేక సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత ముందుకు సాగే ఒక ప్రవాహం ఉంది, ఆ తరువాతే ఒక భాష వ్యక్తీకరణ రూపాన్ని తీసుకుంటుంది. అందువల్ల, మనం సాధ్యమైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు, నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మన దేశంలో రాతితో చేసిన 2000 సంవత్సరాల నాటి ఒక మంచి స్మారక చిహ్నం ఉందని మనకు తెలిసినప్పుడు మనం గర్వంగా భావించమా? ఎవరైనా గర్వంగా భావిస్తారు. అప్పుడు మనకు, దేశంలో ఏ ప్రాంతంలో ఈ స్మారక చిహ్నం ఉంది అని తెలుసుకోవడానికి ఆసక్తి  కలుగుతుంది. 2000 సంవత్సరాల క్రితమే నిర్మించిన ఇంత గొప్ప వారసత్వ కట్టడం! మన పూర్వీకులకు ఎంతటి విజ్ఞానం ఉండేదో అని మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష ఉన్న దేశం ఈ విషయంపై గర్వపడకూడదా? మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష ఉందని మనం గర్వంగా ప్రకటించాలి. మనం అలా చేయాలా వద్దా? మీకు తెలుసా, తమిళం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష?  ప్రపంచంలో ఏ దేశంలో ఇంతటి గొప్ప సంపద ఉంది? ఇంతటి ఘనమైన భాష మన దేశంలో ఉంది, అయినప్పటికీ మనం దానిని గర్వంగా ప్రకటించుకోం.  నేను గతసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించినప్పుడు, నేను ఉద్దేశపూర్వకంగా కొన్ని తమిళ పదాలు మాట్లాడాను, ఎందుకంటే ప్రపంచానికి నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. తమిళ భాష ప్రపంచంలోనే అత్యుత్తమ భాష. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష, అది నా దేశానికి చెందినది అనే వాస్తవం పట్ల నేను గర్వపడుతున్నాను. మనం దాని గురించి గర్వపడాలి. ఇప్పుడు చూడండి, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యక్తి దోశను ఆస్వాదించరా? అతను సాంబార్‌ను కూడా ఆస్వాదిస్తాడు. ఆ సమయంలో, అతను ఉత్తరం దక్షిణం మధ్య ఎటువంటి తేడాను చూడలేదు. మీరు దక్షిణానికి వెళితే, అక్కడ పరాటా, కూరగాయలు అలాగే పూరీ, కూరగాయలు కూడా కనిపిస్తాయి. ప్రజలు వాటిని ఆస్వాదిస్తారు. వారు దానిని చూసి గర్వపడతారా లేదా? ఎటువంటి సమస్య లేదు. మాతృభాషతో పాటు ప్రతి ఒక్కరూ ఇతర భాషలలో కూడా కనీసం కొన్ని మాటలు అయినా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎవరినైనా కలిసినప్పుడు వారి భాషలో రెండు మాటలు మాట్లాడితే, అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వెంటనే ఒక అనుబంధ భావం ఏర్పడుతుంది. అందువల్ల భాషలను ఎప్పటికీ భారంగా భావించకూడదు. చాలా సంవత్సరాల క్రితం నేను సామాజిక సేవలో పాల్గొన్న సమయంలో నాకు ఒక సంఘటన స్పష్టంగా గుర్తుంది. అప్పుడు నేను ఒక చిన్న అమ్మాయిని గమనించాను. పిల్లలకి ఇతర భాషలను త్వరగా నేర్చుకునే అపారమైన ప్రతిభ ఉంటుంది. అహ్మదాబాద్‌లోని క్యాలికో మిల్స్‌లో ఒక శ్రామిక కుటుంబం ఉండేది. నేను కొన్నిసార్లు ఆ కుటుంబాన్ని భోజనానికి వెళ్ళేవాడిని. ఆ కుటుంబంలో ఒక చిన్న కూతురు ఉండేది. ఆమె చాలా భాషలు మాట్లాడేది. అది శ్రామికుల కాలనీ కాబట్టి, అక్కడ వివిధ ప్రాంతాల ప్రజలతో కూడిన వాతావరణం ఉండేది. ఆమె తల్లి కేరళకు చెందినది. తండ్రి బెంగాల్‌కు చెందినవాడు. వివిధ ప్రాంతాల ప్రజలు ఉండే వాతావరణం కారణంగా, హిందీ అక్కడ ఉమ్మడి భాషగా ఉండేది. అలాగే పొరుగున ఉన్న మరాఠీ కుటుంబం, సమీపంలోని గుజరాతీ పాఠశాల కారణంగా ఆమెకు మరిన్ని భాషా పరిచయాలు ఏర్పడ్డాయి. 7–8 సంవత్సరాల వయసున్న ఆ చిన్న అమ్మాయి బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ భాషలను ఎంతో అనర్గళంగా మాట్లాడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కలిసి కూర్చున్నప్పుడు, ఆమె ఒక్కొక్కరితో వారి సొంత భాషలైన బెంగాలీ, మలయాళం లేదా గుజరాతీలలో మాట్లాడటం చూస్తే ఆ వాతావరణం ఆమెపై ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిందో తెలియజేస్తుంది. అందుకే నేను మీ అందరినీ కోరేది ఏమిటంటే మన వారసత్వంపై మనం గర్వపడాలి. ఎర్రకోట నుంచి నేను ప్రస్తావించిన ‘పంచ ప్రాణాలు’ (ఐదు సంకల్పాలు) కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తాయి. మన వారసత్వంపై గర్వపడాలి, మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఈ భాషపై గర్వపడాలి.ప్రతి భారతీయుడు దేశంలోని ప్రతి భాషపై గర్వపడాలి. ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధాన మంత్రి గారూ, బహుభాషావాదంపై మీరు ఇచ్చిన మార్గదర్శకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, చారిత్రక కటక్ నగరం నుంచి  వచ్చిన సునైనా త్రిపాఠి అనే ఉపాధ్యాయురాలు ఒక ముఖ్యమైన విషయంపై మీ సలహాను కోరుతున్నారు. మేడమ్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
సునైనా త్రిపాఠి: నమస్కారం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారూ. నేను ఒడిశాలోని కటక్‌లో ఉన్న వరల్డ్ స్కూల్ నుంచి సునైనా త్రిపాఠి కృష్ణమూర్తిని. నా ప్రశ్న ఏమిటంటే విద్యార్థులను తరగతి గదిలో చదువు వైపు ఎలా ఆకర్షించాలి? జీవితానికి సంబంధించిన అర్ధవంతమైన విలువలను ఎలా బోధించాలి? అలాగే తరగతి గదిలో క్రమశిక్షణతో కూడిన చదువును ఆసక్తికరంగా ఎలా మార్చాలి? ధన్యవాదాలు!

వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా వారిని ప్రేరేపించడం గురించి సునైనా త్రిపాఠి  మీ మార్గదర్శకత్వాన్ని కోరుతున్నారు.

ప్రధానమంత్రి: ఈ ప్రశ్న ఒక ఉపాధ్యాయురాలి నుంచే వచ్చిందా? నేను సరిగ్గా చెప్పానా? చూడండి, ఈ రోజుల్లో, ఉపాధ్యాయులు తమలో తాము లీనమైపోవడం తరచుగా కనిపిస్తుంది. నేను ఒక వాక్యం పూర్తి చేయకముందే మీరు దానిని గమనించారు. ఉపాధ్యాయులకు సుమారు 20-30 నిమిషాల ఉపన్యాసం ఉంటుంది. వారు అనర్గళంగా మాట్లాడతారు. తరగతి గదిలో ఎవరో కదులుతూ ఉండటం లేదా అటూ ఇటూ తిరుగుతూ ఉండటం మీరు గమనించి ఉండవచ్చు. నేను నా చిన్ననాటి అనుభవం నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో, ఉపాధ్యాయులు చాలా మంచివారు. నా చిన్నతనంలో అలా ఉండేది కాదు. కాబట్టి, ఉపాధ్యాయులను విమర్శించే హక్కు నాకు లేదు. కానీ నేను ఒక విషయం గమనించాను. ఉపాధ్యాయులు ఏదైనా విషయం మరిచిపోయినప్పుడు, అది విద్యార్థులకు తెలియకూడదని అనుకుంటారు, దాన్ని దాచాలనుకుంటారు. అప్పుడు వారు ఏమి చేస్తారు? అకస్మాత్తుగా ఒక విద్యార్థివైపు తిరిగి, అతను నిలబడి ఉన్నాడని గానీ లేదా ఏదైనా భిన్నంగా చేస్తున్నాడని గానీ మందలిస్తారు. ఆ ఒక్క విద్యార్థిపైనే 5–7 నిమిషాలు గడుపుతారు. అంతలోనే వారికి పాఠ్యవిషయం గుర్తొస్తే, మళ్లీ బోధనను కొనసాగిస్తారు. లేదంటే, ఎవరో ఒక విద్యార్థి నవ్వుతున్నాడని కనిపిస్తే, వెంటనే అతడినే పట్టుకుంటారు. ఇవన్నీ ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయా అని నాకు తెలుసుకోవాలనుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉపాధ్యాయులు నిజంగా చాలా మంచివారు.

ఈ రోజుల్లో ఉపాధ్యాయులు కూడా తమ పాఠ్యాంశాలను మొబైల్ ఫోన్‌లో ఉంచుకుని బోధిస్తున్నారని మీరు గమనించి ఉంటారు. కదా? మొబైల్ ద్వారానే బోధిస్తారు. కానీ అనుకోకుండా ఫోన్‌లో ఏదైనా బటన్ తప్పుగా నొక్కితే  అది కనబడక దానిని వెతుక్కుంటూ ఉంటారు. నిజానికి వారు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నైపుణ్యం కలవారు కాకపోవచ్చు.  కేవలం 2–4 మౌలిక విషయాలే నేర్చుకుని ఉంటారు. పొరపాటున ఏదైనా తప్పు బటన్ నొక్కితే, పాఠం డిలీట్ అవుతుంది లేదా ఎక్కడికో వెళ్లిపోతుంది. అది ఎక్కడ ఉందో వారికి అర్థం కాదు. అప్పుడు వారు చాలా కలత చెందుతారు. చలికాలంలో కూడా చెమటలు పట్టడం మొదలవుతుంది. తన దుస్థితిని చూసి తన విద్యార్థులు సంతోషిస్తున్నారేమో అని అనుకుంటాడు. లోపాలు  ఉన్నవారు, తమ లోపాలు బయటపడకుండా ఉండేందుకు ఇతరులపై పెత్తనం చెలాయించే అలవాటును పెంచుకుంటారు. మన ఉపాధ్యాయులు తమ విద్యార్థులతో అనుబంధ భావనను పెంచుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. విద్యార్థులు మీ జ్ఞానాన్ని పరీక్షించాలనుకోవడం లేదు. ఇది ఉపాధ్యాయులలో ఉన్న తప్పుడు అభిప్రాయం. ఎవరైనా విద్యార్థి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నట్లయితే, అది మిమ్మల్ని పరీక్షిస్తున్నట్లు కాదు. ఒక విద్యార్థి మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నాడంటే, అతనిలో జిజ్ఞాస ఉందని అర్థం. మీరు అతని జిజ్ఞాసను ప్రోత్సహించాలి. అతని జిజ్ఞాసే అతని జీవితంలో అతిపెద్ద ఆస్తి.

జిజ్ఞాస ఉన్న ఏ వ్యక్తినీ అణచివేయడానికి ప్రయత్నించవద్దు. అతన్ని అడ్డుకోవద్దు. అతను చెప్పేది సరిగా వినండి. మీకు సమాధానం తెలియకపోతే, మీరు అతనితో  'నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు, కానీ నేను తొందరపాటుతో సమాధానం చెబితే అది అన్యాయం అవుతుంది' అని చెప్పాలి. అతన్ని రేపు కలుద్దామని చెప్పండి. 'మనం రేపు నా ఛాంబర్‌లో దీని గురించి చర్చిద్దాం. ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందో కూడా నేను నీ నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా  ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా మరింత చదువుతాను. నేను గూగుల్‌లో శోధించి, ఇతరులను కూడా అడుగుతాను. రేపు పూర్తిగా సిద్ధమై వస్తాను”  అని చెప్పాలి. 'ఇంత చిన్న వయస్సులో ఈ ఆలోచన అతనికి ఎక్కడ నుంచి నుండి వచ్చింది?' అని అతని నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. చూడండి, అతను మిమ్మల్ని వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇప్పటికీవిద్యార్థులు తమ ఉపాధ్యాయుల మాటలకు చాలా విలువ ఇస్తారు. మీరు అతనికి ఏదైనా తప్పు చెబితే, అది జీవితాంతం అతన్ని వెంటాడుతుంది. అందువల్ల, మీ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం తీసుకోవడంలో తప్పు లేదు. మనం అతనికి తర్వాత చెప్పినా ఫరవాలేదు.  

ఇక క్రమశిక్షణ గురించి. కొన్ని సందర్భాల్లో, తన ప్రభావాన్ని చూపించడానికి ఒక ఉపాధ్యాయుడు బలహీనమైన విద్యార్థినే ప్రశ్న అడుగుతాడు. ఆ విద్యార్థి తడబడుతూ ఏదో మాట్లాడతాడు. అప్పుడు ఉపాధ్యాయుడు అతన్ని “నేను ఎంతో కష్టపడి బోధిస్తున్నాను. అయినా నువ్వు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావా?” అని మందలిస్తాడు.  నేను ఒక ఉపాధ్యాయుడినై ఉంటే ఏమి చేసేవాడిని? నేను తెలివైన విద్యార్థిని ప్రశ్న అడిగేవాడిని. అతను విషయాన్ని చాలా స్పష్టంగా వివరించేవాడు. ముందుగా అర్థం కాని బలహీనమైన విద్యార్థికీ కూడా ఇప్పుడు సులభంగా అర్థమయ్యేది. నేను ప్రతిభావంతులైన విద్యార్థులను గౌరవిస్తున్నందున, మెరుగ్గా రాణించాలనే కొత్త పోటీ కూడా ఏర్పడుతుంది.

రెండోది -   ఒక క్రమశిక్షణ లేని విద్యార్థి ఉంటే, అతను ఏకాగ్రత లేకుండా తరగతిలో ఏదో ఒకటి చేస్తూ ఉంటే, అది ఆహ్లాదకరంగా ఉండదు. ఉపాధ్యాయుడు అతన్ని ప్రత్యేకంగా పిలిచి, ఆప్యాయంగా, ఇది చాలా గొప్ప అంశం అయినప్పటికీ అతను వేరే పనిలో నిమగ్నమై ఉన్నాడని చెప్పాలి. 'సరే, ఇప్పుడు నా ముందు ఆడు. నీకు చాలా సరదాగా ఉంటుంది. నువ్వు ఏమి ఆడుతున్నావో నేను కూడా చూడాలనుకుంటున్నాను. సరే, మనం మరోసారి ఆడుకుందాం. నువ్వు ఏకాగ్రతతో ఉంటే, నీకు ప్రయోజనం ఉండేదా లేదా?' మీరు అతనితో అలా మాట్లాడితే అతనికి ఒక విధమైన అనుబంధం ఏర్పడుతుంది.  క్రమశిక్షణతో ఉంటాడు.  కానీ మీరు అతని అహం దెబ్బతీస్తే, అది కచ్చితంగా అతనికి నష్టం చేస్తుంది. కొంతమంది ఉపాధ్యాయులు తెలివైన పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు, తెలివితేటలు కూడా పనిచేస్తాయి. వారు ఏం చేస్తారంటే, తరగతిలో ఎక్కువ అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ మానిటర్‌ చేస్తారు. అతను మానిటర్‌ అయిన తర్వాత, తన ప్రవర్తనను మెరుగుపరుచుకోవాలని గ్రహిస్తాడు. అతను తనను తాను మెరుగుపరుచుకోవడమే కాకుండా, తరగతిని క్రమశిక్షణలో ఉంచడానికి అనేక సర్దుబాట్లు చేస్తాడు. అతను తన అల్లరిని నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. తన ఉపాధ్యాయుడికి ప్రియమైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తాడు. అంతిమంగా, అతని జీవితం మారుతుంది. ఫలితంగా తరగతి వాతావరణం కూడా మెరుగుపడుతుంది. ఇలాంటి మార్గాలు అనేకం ఉండవచ్చు. కానీ, మనం కొట్టడం వంటి శారీరక శిక్షను  ఆశ్రయించకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. మనం అనుబంధ భావన మార్గాన్ని ఎంచుకోవాలి. మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటే, అది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. చాలా ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: గౌరవ ప్రధానమంత్రి గారూ, జీవితంలోని విలువపై ఇంత సరళంగా,  సున్నితంగా స్ఫూర్తినిచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు. గౌరవ ప్రధానమంత్రి గారూ, 'పరీక్షా పే చర్చ 2023' చివరి ప్రశ్న కోసం నేను ఢిల్లీకి చెందిన శ్రీమతి సుమన్ మిశ్రాను ఆహ్వానిస్తున్నాను. ఆమె ఇక్కడ ఆడిటోరియంలో ఉన్నారు. ఆమె తన సందేహానికి మీ నుంచి  సమాధానం కోరుకుంటున్నారు. మేడమ్, దయచేసి మీ ప్రశ్న అడగండి.
సుమన్ మిశ్రా: శుభోదయం గౌరవ ప్రధానమంత్రి గారూ. నేను సుమన్ మిశ్రాను. సార్, విద్యార్థులు సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయంపై నేను మీ సలహా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్.
వ్యాఖ్యాత: ధన్యవాదాలు మేడమ్. గౌరవ ప్రధానమంత్రి గారూ!
ప్రధానమంత్రి: విద్యార్థులు సమాజంలో ఎలా ప్రవర్తించాలి? మీరు ఇది అడుగుతున్నారా? నా అభిప్రాయం ప్రకారం, దీనిని కొంచెం వేరుగా భావించాలి. మనం ఏ సమాజం గురించి మాట్లాడుతున్నాం? మనం కలిసే, కొంత సమయం గడుపుతూ చర్చలలో మునిగే మన సన్నిహిత వర్గమా? మీరు మీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారు? వారికి బూట్లతో లేదా లేకుండా ఎక్కడికైనా వెళ్లమని చెప్పితే, వారు దానిని అనుసరిస్తారు.  కానీ నిజమైన విషయం ఏమిటంటే, పిల్లలను ఇంటికే మాత్రమే పరిమితం చేయకూడదు. దీనిపై నేను ఎక్కడ ఏం చెప్పింది సరిగ్గా గుర్తు లేదు. బహుశా ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలోని ఒక ఎపిసోడ్‌లోనే చెప్పానేమో. నేను చెప్పింది ఏమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు 10 లేదా 12 తరగతి పరీక్షలు ముగిసిన తరువాత రాష్ట్రంలో కొన్ని చోట్లకు వెళ్లి ఐదు రోజులు గడపమని, ఫోటోలు తీసుకురమ్మని, తిరిగి వచ్చాకా విశేషాలు చెప్పమని కొంత డబ్బు ఇచ్చి పంపాలి. వారిని ఒక్కరినే పంపే ధైర్యం మీరు చూపాలి. చూడండి, అతను తిరిగి ఇంటికి వస్తాడు. ఎన్నో విషయాలు నేర్చుకొని వస్తాడు. నిజ జీవితాన్ని ఎదుర్కొన్నప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లవాడు 12వ తరగతిలో ఉంటే, అతన్ని రాష్ట్రం వెలుపలికి వెళ్ళమని చెప్పండి.  “నీ వద్ద ఈ మొత్తం డబ్బు ఉంది, రిజర్వేషన్ లేకుండా రైల్లో వెళ్లాలి.  నీ కోసం ఈ ప్యాక్ చేసిన సామాన్లు,  భోజనం ఉన్నాయి. వెళ్ళి చాలా ప్రదేశాలు సందర్శించు.  తిరిగి వచ్చినప్పుడు నీ అనుభవాన్ని మాకు చెప్పు” అని చెప్పండి. పిల్లలపై తరచుగా ప్రాక్టీస్ లేదా ట్రయల్ తీసుకోవాలి. వారు సమాజంలోని వివిధ వర్గాల వ్యక్తులను కలిసేలా ప్రేరేపించాలి. అతను కబడ్డీ పోటీలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన తన పాఠశాల స్నేహితుని కలిసాడా అని అడగాలి. అతని ఇంటికి వెళ్లి ఆ వ్యక్తిని కలవమని చెప్పండి. వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుతంగా రాణించిన ఎవరినైనా కలసిరమ్మని ప్రోత్సహించండి. అతను అభివృద్ధి చెందే అవకాశం ఇవ్వాలి. కానీ అతను ఏం చేయాలో బలవంతం చేయకూడదు.  దయచేసి అతన్ని నియంత్రణలతో బంధించకండి. పిల్లలు కూడా యూనిఫామ్ ధరించాలని ఎవరైనా నిర్బందిస్తే ఏం జరుగుతుంది? అందులో ఏమైనా తర్కం ఉందా? మనం పిల్లలను ఎదగనివ్వాలి. వారిని కొత్త లోకాలకు తీసుకెళ్లాలి.  కొత్త ప్రదేశాలకు పరిచయం చేయాలి. కొన్నిసార్లు మనం కూడా వారితో పాటు వెళ్లాలి. మా రోజుల్లో, మేము సెలవుల్లో మా మామ ఇంటికి లేదా ఇతర బంధువుల ఇంటికి వెళ్ళేవాళ్ళం. సొంత ఇష్టాలు, సరదాలు ఉంటాయి. జీవితాన్ని సృష్టించాలి. మనం మన పిల్లలను మన స్వంత ఇష్టాలకు పరిమితం చేయకూడదు. మనం వారి పరిధిని విస్తరించడానికి ప్రయత్నించాలి. అయితే వారు చెడు అలవాట్లకు లోనుకాకుండా, లేదా తన గదిలో లీనమైపోకుండా, లేదా నిస్సత్తువగా మారకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.  ఇంతకుముందు, అతను భోజనం సమయంలో ఇతరులతో కూర్చున్నప్పుడు ఉత్సాహంగా ఉండేవాడు. ఇప్పుడు నవ్వడం, జోకులు వేయడం మానేశాడు. సమస్య ఏమిటి? దీనిపై తల్లిదండ్రులు త్వరగా స్పందించాలి.  పిల్లలు దేవుడిచ్చిన వరం. వారిని రక్షించడం, ప్రోత్సహించడం మన బాధ్యత. ఈ స్ఫూర్తి ఉంటే, ఫలితాలు సహజంగానే బాగుంటాయి. 'అతను నా కొడుకు కాబట్టి అతను నాకు విధేయత చూపాలి' లేదా 'నువ్వు నాలాగే మారాలి' లేదా 'నేను ఏమి చేశానో నువ్వు తప్పక పాటించాలి' అనే భావన మీకు ఏర్పడితే, పరిస్థితి మరింత చెడిపోతుంది. అందువల్ల, స్వేచ్ఛ  ఇవ్వడం అవసరం. జీవితంలో విభిన్నమైన పనులలో నిమగ్నమవ్వడానికి ప్రోత్సహించాలి.
ఉదాహరణకు, కొన్నిసార్లు పాములు పట్టేవారు మిమ్మల్ని సందర్శిస్తారు. మీ పిల్లలను వారిని కలిసి, వారు ఎక్కడ నివసిస్తారో తెలుసుకోమని చెప్పండి. వారు ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి? మీ పిల్లలు కూడా వారి గురించి తెలుసుకోవడానికి ఉత్సాహంగా మారతారు. మీ పిల్లల పరిధిని విస్తరించడానికి ప్రయత్నాలు చేయాలి. వారు పరిమితులకు కట్టుబడి ఉండకూడదు. వారికి ఆకాశమే హద్దుగా ఉండాలి. వారికి ఒక అవకాశాన్ని ఇవ్వండి. వారు సమాజంలో మరింత బలంగా ఎదుగుతారు. చాలా ధన్యవాదాలు.
వ్యాఖ్యాత: పరీక్షలకు హాజరయ్యే చాలామందిని కలవరపెట్టే విషయాలలో  స్ఫూర్తిదాయకమైన సలహాలను అందించి పరీక్షలను భయం కాకుండా ఉత్సాహంగా మార్చినందుకు ధన్యవాదాలు గౌరవ ప్రధానమంత్రి గారూ. ఇది స్ఫూర్తి, ఉత్తేజంతో నిండిన అద్భుతమైన కార్యక్రమం ముగింపు దశకు వచ్చిన సందర్భం. ఈ మధురస్మృతుల సంగీతం మా హృదయాలలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది.. ఈ వేదికను తమ ఉనికితో అలంకరించి, మాలో ఉత్తేజాన్ని రేకెత్తించిన గౌరవ ప్రధానమంత్రికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.  .
ప్రధానమంత్రి నిర్వహించిన ‘ పరీక్షా పే చర్చా’ కార్యక్రమం మనలాంటి కోట్లాదిమంది పిల్లలలో ఉన్న అసహనం, ఆందోళన, అసాధ్యమని ఊహించే స్వభావాన్ని ఉత్సాహం, విజయం సాధించే ఆకాంక్షగా మార్చింది. గౌరవ ప్రధానమంత్రిగారికి ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు.
ప్రధానమంత్రి: మీ అందరికీ చాలా ధన్యవాదాలు. పరీక్షల భారాన్ని తగ్గించడానికి మన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి నిర్ణయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది మన జీవితంలో సహజమైన భాగంగా ఉండాలి.  జీవితంలో సజావుగా కొనసాగే క్రమాన్ని సృష్టించాలి.  మీరు ఇది చేస్తే, పరీక్ష ఒక ఉత్సవంగా మారుతుంది.  ప్రతి పరీక్షార్థి జీవితం ఉత్సాహంతో నిండిపోతుంది.  ఆ ఉత్సాహం ఉత్తమతకు గ్యారంటీ.  ప్రగతికి గ్యారంటీ. ఆ ఉత్సాహాన్ని మీతో తీసుకెళ్ళండి.  ఇదే మీ అందరికీ నా ఉత్తమ ఆశీర్వాదం.  చాలా చాలా ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.  

 

***


(रिलीज़ आईडी: 2210088) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Marathi , Urdu , हिन्दी , Odia , Malayalam , English , Manipuri , Tamil