సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, డీప్ ఫేక్ లను అరికట్టేందుకు వ్యవస్థను బలోపేతం చేసిన ప్రభుత్వం


సృజనాత్మక స్వేచ్ఛను కాపాడుతూనే తప్పుదారి పట్టించే సమాచారంపై ప్రభుత్వం చర్యలు

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ధ్రువీకరించి,

నకిలీ వార్తలను తొలగించనున్న పీఐబీ ఫాక్ట్ చెక్ యూనిట్

నాడు పోస్టు చేయడమైనది: 12 DEC 2025 2:06PM by PIB Hyderabad

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో నకిలీ, తప్పుడు, తప్పుదోవ పట్టించే సమాచారం, కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించే డీప్ ఫేక్‌ సంఘటనలు పెరుగుతుండటం.. ప్రజాస్వామ్య విధానాన్ని, శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

నకిలీ వార్తలను సాధారణంగా తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారంగా పేర్కొంటారు. దీనిని వార్తగా ప్రసారం చేస్తారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి హానికరమైన సమాచారాన్ని నిషేధించడానికి.. ఇప్పటికే దేశంలో విస్తృత చట్టబద్ధమైన, సంస్థాగత వ్యవస్థ పని చేస్తోంది.


 

ఎలక్ట్రానిక్ మీడియా

  • కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం 1995 ప్రకారం టీవీ ఛానెళ్లు ప్రోగ్రామ్ కోడ్‌ను అనుసరిస్తాయి.

  • ఇది అశ్లీలమైన, పరువు నష్టం కలిగించే, ఉద్దేశపూర్వకంగా తప్పదోవ పట్టించే సమాచారం, సూచనాత్మక సంకేతాలు, అర్ధ సత్యాలను కలిగిన ప్రసారాలను నిషేధిస్తుంది.

  • ఈ చట్టం కింద రూపొందించిన నిబంధనల ఉల్లంఘనలను పరిష్కరించడానికి మూడు దశల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది.

  • మొదటి దశ..ప్రసారకుల స్వీయ నియంత్రణ

  • రెండో దశ..ప్రసారకుల స్వీయ నియంత్రణ సంస్థల ద్వారా నియంత్రణ

  • మూడో దశ..కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ

ప్రోగ్రాం కోడ్ ఉల్లంఘనలను సలహాలు, హెచ్చరికలు, క్షమాపణలు చెప్పడం, తాత్కాలిక ప్రసారాల నిలిపివేత వంటి చర్యల ద్వారా పరిష్కరిస్తారు.

ప్రింట్ మీడియా

  • భారత ప్రెస్ కౌన్సిల్ జారీ చేసిన పత్రికా ప్రవర్తనా నిబంధనలు.. తప్పుడు, కించపరచే, తప్పుదారి పట్టించే వార్తల ప్రచురణను నిరోధిస్తుంది.

  • ఈ నిబంధనల ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులను పీసీఐ దర్యాప్తు చేస్తుంది.

  • ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించిన తరువాత పత్రికలు, సంపాదకులు, పాత్రికేయులు మొదలైన వారిని హెచ్చరించడం, మందలించడం, నిందించడం వంటి చర్యలు తీసుకుంటుంది.

డిజిటల్ మీడియా

డిజిటల్ మీడియాలో వార్తలు , సమకాలీన విషయాలను ప్రచురించే వారి కోసం సమాచార, సాంకేతికత నియమాలు 2021 కింద ప్రత్యేక నైతిక నియమావళిని రూపొందించారు.

  • ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే సమాచారం, అసత్యపు వార్తలను నిరోధించాలి.

  • నైతిక నియమావళికి కట్టుబడి ఉండేందుకు మూడు-దశల ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

  • తప్పుడు, పరువు నష్టం కలిగించే సమాచారానికి సంబంధించిన ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడానికి సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా ఒక ఫిర్యాదు అధికారిని నియమించాలి.

  • ఐటీ నిబంధనల రెండో భాగం ప్రకారం తప్పుడు, అసత్యమైన, తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన బాధ్యతను మధ్యవర్తి సంస్థలపై ఉంటుంది.


 

దేశ సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, శాంతి భద్రతల ప్రయోజనాల దృష్ట్యా.. లేదా పై అంశాలకు సంబంధించిన ఏదైనా శిక్షార్హమైన నేరం చేసేందుకు ప్రేరేపించడాన్ని నిరోధించేందుకు సమాచార సాంకేతికత చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తుంది.

ఫ్యాక్ట్ చెక్ యూనిట్

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలను పరిశీలించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటైంది.

  • ఇది భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని అధికారుల నుంచి వచ్చే వార్తల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.

  • సమాచారం సరిగా ఉందని నిర్ధారించిన తరువాత ఎఫ్ సీయూ తన సామాజిక మాధ్యమ వేదికలపై ప్రచురిస్తుంది.

సమాజానికి అండగా నిలిచే సంస్థలను, నమ్మకాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తప్పుడు సమాచారం వల్ల కలిగే హానిని పరిష్కరిస్తూనే.. సృజనాత్మక స్వేచ్ఛను కాపాడటం దీని విధానం.

రాజ్యసభలో శ్రీ మోహమ్మద్ నదీముల్ హక్క్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారాన్ని నేడు సమర్పించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2203367) సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam