ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శంకుస్థాపనోత్సవంలో ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
23 SEP 2023 4:54PM by PIB Hyderabad
హరహర మహాదేవ్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారూ, వేదికపై ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రులూ, ప్రతినిధులూ, క్రీడా ప్రముఖులూ, నా కాశీ కుటుంబ సభ్యులారా!
మరోసారి నాకు బనారస్‌కు వచ్చే అవకాశం దక్కింది. బనారస్‌లో కలిగే ఆనందాన్ని వర్ణించడం కష్టం. మరోసారి నాతో కలిసి చెప్పండి... ఓం నమః పార్వతీ పతయే, హరహర మహాదేవ్! నెల కిందట ఇదే రోజున చంద్రుడి ఉపరితలంపై శివశక్తి పాయింట్‌ను భారత్ చేరుకుంది. గత నెల 23న మన చంద్రయాన్ దిగిన ప్రదేశం శివశక్తి. ఒక శివశక్తి చంద్రుడిపై ఉంది. మరో శివశక్తి ఇక్కడ నా కాశీలో ఉంది. చంద్రుడిపై ఉన్న శివశక్తిపై భారత్ సాధించిన విజయానికిగాను.. ఇక్కడి శివశక్తి కేంద్రం నుంచి నేడు అభినందనలు తెలుపుతున్నాను.
ప్రియమైన కుటుంబ సభ్యులారా,
ఈ రోజు మనమంతా సమావేశమైన ప్రదేశం పవిత్ర స్థలం వంటిది. మాతా వింధ్యవాసిని నివాసాన్నీ, కాశీ నగరాన్నీ అనుసంధానిస్తున్న పవిత్ర ప్రదేశమిది. భారత ప్రజాస్వామిక యోధుడు, కేంద్ర మాజీ మంత్రి రాజ్ నారాయణ్ గారి గ్రామమైన మోతీ కోట్ గ్రామం ఇక్కడికి మరెంతో దూరంలో లేదు. ఈ నేలకు, రాజ్ నారాయణ్ గారి జన్మ స్థలానికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను.
ప్రియమైన కుటుంబ సభ్యులారా,
ఈ రోజు కాశీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఈ స్టేడియం వారణాసికే కాకుండా పూర్వాంచల్ యువతకు కూడా ఒక వరం. ఈ స్టేడియం పూర్తయితే 30,000 మందికి పైగా ప్రజలు ఇక్కడ మ్యాచ్‌లను వీక్షిస్తారు. ఈ స్టేడియం చిత్రాలు బయటికొచ్చినప్పటి నుంచి ప్రతి కాశీ వాసీ గర్వంతో ఉప్పొంగిపోతున్నాడని నాకు తెలుసు. భగవాన్ మహాదేవుడి నగరంలోని ఈ స్టేడియం.. నిర్మాణంలోనూ, చేతనలోనూ ఆయననే ప్రతిబింబిస్తోంది. ఇది క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడమే కాదు.. స్థానిక యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయి స్టేడియంలో శిక్షణ పొందే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇది నా కాశీకి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది.
ప్రియమైన కుటుంబ సభ్యులారా,
నేడు క్రికెట్ ద్వారా భారత్‌తో ప్రపంచం అనుసంధానమవుతోంది. క్రికెట్ ఆడటానికి కొత్త దేశాలు ముందుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. క్రికెట్ మ్యాచ్‌లు పెరిగే కొద్దీ కొత్త స్టేడియాల అవసరం పెరుగుతుంది. బనారస్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆ డిమాండును తీరుస్తుంది. మొత్తం పూర్వాంచల్ ప్రాంతంలో ఇదొక తారలా మెరుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో నిర్మాణపరంగా బీసీసీఐ నుంచి విశేష సహకారం లభించిన మొదటి స్టేడియం ఇది. కాశీ పార్లమెంటు సభ్యుడిగా, మీ ప్రతినిధిగా.. బీసీసీఐ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రియమైన కుటుంబ సభ్యులారా,
క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగి, ఇంత పెద్ద స్టేడియం నిర్మాణం పూర్తయితే.. అది క్రీడలతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంత పెద్ద క్రీడా కేంద్రాలను నిర్మిస్తే, వాటిలో భారీ క్రీడా కార్యక్రమాలు జరుగుతాయి. పెద్ద క్రీడా కార్యక్రమాలు జరిగితే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు, ఆటగాళ్ళు హాజరవుతారు. దాంతో హోటళ్ల యజమానులు, చిన్నా పెద్ద ఆహార విక్రేతలు, రిక్షా, ఆటో, టాక్సీ డ్రైవర్లు, బోట్ ఆపరేటర్లకు ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఇంత పెద్ద స్టేడియం వల్ల కొత్త క్రీడా శిక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. క్రీడా శిక్షణ విద్యలో అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు క్రీడాపరమైన అంకుర సంస్థలను బనారస్‌లోని యువత కెరీర్‌గా మలచుకోవచ్చు. ఫిజియోథెరపీ సహా క్రీడలకు సంబంధించిన అనేక కోర్సులు ప్రారంభమవుతాయి. ఒక ముఖ్యమైన క్రీడా పరిశ్రమ కూడా వారణాసికి రాబోతోంది.
ప్రియమైన కుటుంబ సభ్యులారా,
ఒకప్పుడు ఎప్పుడూ ఆటలాడుకుంటూ ఉంటే.. ఎన్నడైనా చదువుతారా, అలా ఆటల్లోనే మునిగిపోతారా అంటూ తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టేవారు. పిల్లలు ఇవన్నీ వినేవారు. ఇప్పుడు సమాజ దృక్పథం మారిపోయింది. పిల్లలెప్పుడూ ఆటలను ఇష్టపడేవారే. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా క్రీడలను చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. క్రీడల్లో రాణిస్తే ఎవరికైనా తప్పక గుర్తింపు లభిస్తుందన్న విధంగా దేశ ప్రజల మానసిక స్థితిలో మార్పు వచ్చింది.
మిత్రులారా,
ఒకట్రెండు నెలల కిందట మధ్యప్రదేశ్‌లోని షాడోల్ అనే గిరిజన ప్రాంతాన్ని నేను సందర్శించాను. అక్కడ కొంతమంది యువకులను కలిశాను. అక్కడి వాతావరణం, వాళ్ళ మాటలు నన్ను నిజంగా ఆకట్టుకున్నాయి. ఇది మన మినీ బ్రెజిల్ అని ఆ యువకులు నాతో చెప్పారు. అదెలా అని నేను వారిని అడిగాను. తమ ఊర్లో ఇంటికో ఫుట్‌బాల్ ఆటగాడు ఉన్నాడనీ, కొందరైతే తమ కుటుంబంలో మూడు తరాల్లో జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాళ్ళు ఉన్నారని చెప్పారు. ఒక ఆటగాడు రిటైరయ్యి తన జీవితాన్ని క్రీడకు అంకితం చేశాడు. ఈ రోజు ఆ ప్రాంతంలో ప్రతీ తరం ఫుట్‌బాల్ ఆడుతుండడాన్ని మీరు చూడొచ్చు. వార్షికోత్సవ సమయంలో ఇంటి వద్ద ఎవరూ కనిపించరని వారు చెప్తారు. ఈ ప్రాంతంలోని వందలాది గ్రామాల నుంచి లక్షలాది ప్రజలు రెండు నుంచి నాలుగు రోజులపాటు మైదానంలోనే ఉంటారు. ఇలాంటి దృశ్యాలను చూస్తే, దేశ ఉజ్వల భవితపై నా నమ్మకం మరింత పెరుగుతుంది. కాశీ పార్లమెంటు సభ్యుడిగా ఈ మార్పులను నేనిక్కడ చూస్తున్నాను.
సన్సద్ ఆటల పోటీల సమయంలో ఇక్కడ కనిపించే ఉత్సాహం నాకెప్పుడూ గుర్తుంటుంది. క్రీడా ప్రపంచంలో కాశీ యువత తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని నా కోరిక. అందుకే వారణాసి యువతకు అత్యుత్తమ క్రీడా సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త స్టేడియంతోపాటు సిగ్రా స్టేడియం కోసం దాదాపు రూ.400 కోట్లు వెచ్చిస్తున్నాం. సిగ్రా స్టేడియంలో 50కి పైగా క్రీడా కార్యక్రమాలకు తగిన సదుపాయాలను కల్పిస్తున్నాం. ఈ స్టేడియం ప్రత్యేకత ఏమిటంటే.. ఇది దివ్యాంగులనూ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన దేశంలో మొదటి మల్టీ డిసిప్లినరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అతి త్వరలో దీన్ని కాశీ ప్రజలకు అందించబోతున్నాం. బడాలాల్‌పూర్‌లోని సింథటిక్ ట్రాక్ అయినా, సింథటిక్ బాస్కెట్‌బాల్ కోర్టు అయినా, వివిధ ‘అఖాడా’లకు (రెజ్లింగ్ రింగ్‌లు) ప్రోత్సాహమైనా... మేం కొత్త మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాకుండా, నగరంలో ఇప్పటికే ఉన్న సౌకర్యాలనూ మెరుగుపరుస్తున్నాం.
ప్రియమైన కుటుంబ సభ్యులారా,
నేడు భారత్ క్రీడల్లో సాధిస్తున్న ఈ విజయాలు దేశ దృక్పథంలో వచ్చిన మార్పు ఫలితమే. యువత శారీరక దారుఢ్యమూ, వారి కెరీర్లతో మేం క్రీడలను అనుసంధానించాం. తొమ్మిదేళ్ల కిందటితో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర క్రీడా బడ్జెట్ మూడు రెట్లు పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఖేలో ఇండియా కార్యక్రమ బడ్జెట్ దాదాపు 70 శాతం పెరిగింది. పాఠశాలల నుంచి ఒలింపిక్ వేదికల వరకు.. ప్రభుత్వం మన ఆటగాళ్లతో కలిసి నడుస్తోంది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు.. ఖేలో ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఆటల పోటీలు జరిగాయి. మన ఆడబిడ్డలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అథ్లెట్లకు అడుగడుగునా సాధ్యమైన మేరకు అన్ని రకాల సహాయాలను ప్రభుత్వం అందిస్తోంది. ఒలింపిక్ పోడియం పథకం వాటిలో ఒకటి. ఈ పథకం కింద ఏడాది పొడవునా మన అగ్రశ్రేణి అథ్లెట్లకు ఆహారం, శారీరక దారుఢ్యం, శిక్షణ కోసం అనేక లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. దీని ఫలితం నేడు ప్రతి అంతర్జాతీయ పోటీలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ పోటీల చరిత్రలో గడిచిన చాలా దశాబ్దాలతో పోలిస్తే ఎక్కువ పతకాలను ఈ దఫా పోటీల్లో మన పిల్లలు సాధించారు. నేడు ఆసియా క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
భారత్‌లోని ప్రతి గ్రామంలోనూ ప్రతిభ ఉంది. అక్కడి ఛాంపియన్లు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు. వారిని పైకి తెచ్చి, వారి సామర్థ్యాన్ని పెంపొందించడం అత్యావశ్యకం. నేడు చిన్న చిన్న గ్రామాల నుంచి కూడా యువత దేశానికి వన్నె తెచ్చేలా ఎదుగుతున్నారు. మన చిన్న పట్టణాలు, పల్లెల్లో ఉన్న అపారమైన ప్రతిభకు వారు నిదర్శనం. ఆ ప్రతిభను పెంపొందించి వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి. అతి చిన్న వయస్సులోనే దేశంలోని మూలమూలల్లోని ప్రతిభను గుర్తించడంలో ఖేలో ఇండియా కార్యక్రమం గణనీయమైన పాత్ర పోషించింది. ఈ అథ్లెట్లను గుర్తించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. క్రీడా ప్రపంచంలో దేశానికి కీర్తిని తెచ్చిన అనేక మంది ప్రముఖ క్రీడాకారులు నేడు ఈ కార్యక్రమంలో మనతోపాటు ఉన్నారు. కాశీ పట్ల అభిమానాన్ని చూపిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
ప్రియమైన కుటుంబ సభ్యులారా,
నేడు అథ్లెట్లను తీర్చిదిద్దడానికి మంచి కోచ్‌లు, కోచింగ్ సౌకర్యాలు కూడా ముఖ్యమైనవి. ఇక్కడున్న ప్రముఖ క్రీడాకారులకు దీని ప్రాధాన్యమేంటో బాగా తెలుసు. అందుకే ప్రభుత్వమూ నేడు అథ్లెట్లకు మంచి శిక్షణను అందిస్తోంది. ప్రధాన పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు జాతీయ, అంతర్జాతీయ అనుభవమున్న వారిని కోచ్‌లుగా పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో.. వివిధ క్రీడా కార్యకలాపాలతో దేశ యువత మమేకమయ్యారు.
మిత్రులారా,
ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఇది గ్రామాలు, చిన్న పట్టణాల్లోని ఆటగాళ్లకు కొత్త అవకాశాలను అందిస్తుంది. గతంలో ఢిల్లీ, ముంబయి, కలకత్తా, చెన్నై వంటి నగరాల్లో మాత్రమే మెరుగైన స్టేడియాలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు దేశంలోని ప్రతీ మూలలో ఉన్న ఆటగాళ్లకు, మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా ఈ సదుపాయాలను అందించేలా కృషి చేస్తున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్న క్రీడా మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మన ఆడబిడ్డలకు విశేషంగా ప్రయోజనం కలిగించడం సంతోషాన్నిస్తోంది. ఇప్పుడు ఆటలు, శిక్షణ కోసం ఆడపిల్లలు ఇంటి నుంచి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం తగ్గింది.
మిత్రులారా,
నూతన జాతీయ విద్యా విధానం విజ్ఞాన శాస్త్రాలు, వాణిజ్యం మరేవైనా విద్యా విషయాలతో సమానంగా క్రీడలను నిలిపింది. గతంలో క్రీడలను కేవలం పాఠ్యేతర కార్యకలాపంగానే పరిగణించేవారు. కానీ ఇప్పుడలా కాదు. ఇప్పుడు పాఠశాలల్లో క్రీడలను అధికారికంగా ఓ పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మణిపూర్‌లో దేశంలో మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది మా ప్రభుత్వమే. ఉత్తరప్రదేశ్‌లో కూడా క్రీడా సదుపాయాల కోసం దాదాపు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. గోరఖ్‌పూర్ క్రీడా కళాశాల విస్తరణ నుంచి మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటు వరకు.. మన ఆటగాళ్ల కోసం కొత్త క్రీడా కేంద్రాలను నిర్మిస్తున్నాం.
మిత్రులారా,
క్రీడా సౌకర్యాలను విస్తరించడం దేశాభివృద్ధికి చాలా కీలకం. ఇది క్రీడలకు మాత్రమే కాదు.. ఆ రంగంలో దేశ ప్రతిష్ఠను కూడా నిలబెట్టే ముఖ్యమైన అంశం. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు ఆతిథ్యమిచ్చిన కారణంగానే ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు మనలో చాలా మందికి తెలిశాయి. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించగలిగే అలాంటి కేంద్రాలను భారత్‌లో మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు శంకుస్థాపన చేసిన ఈ స్టేడియం.. క్రీడల పట్ల మన అంకితభావానికి నిదర్శనం. కేవలం ఇటుకలూ, కాంక్రీటుతోనే ఈ స్టేడియాన్ని నిర్మించడం లేదు. ఇది భారత ఉజ్వల భవితకు ప్రతీక. ప్రతి అభివృద్ధి ప్రాజెక్టుకూ కాశీ ఆశీస్సులను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాశీ ప్రజల సహకారం లేనిదే ఏ పనీ పూర్తవదు. మీ ఆశీస్సులతో కాశీ అభివృద్ధిలో కొత్త అధ్యాయాలను మేం లిఖిస్తూనే ఉంటాం. క్రికెట్ స్టేడియం శంకుస్థాపనోత్సవ సందర్భంగా కాశీ ప్రజలకు, మొత్తం పూర్వాంచల్ ప్రజలకు మరోసారి నా శుభాకాంక్షలు.
హరహర మహాదేవ్! ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మూల ప్రసంగం హిందీలో ఉంది.
***
(रिलीज़ आईडी: 2201202)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam