ప్రధాన మంత్రి కార్యాలయం
“మధ్యప్రదేశ్, బీనాలో అభివృద్ధి పనుల శంఖుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి గారి ప్రసంగానికి ఆంగ్ల అనువాదం.
प्रविष्टि तिथि:
14 SEP 2023 3:26PM by PIB Hyderabad
భారత్ మాతాకీ – జై!
భారత్ మాతాకీ – జై!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు హర్దీప్ సింగ్ పురీ, మధ్యప్రదేశ్ కు చెందిన ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రియమైన నా కుటుంబ సభ్యులారా!
బుందేల్‌ఖండ్ ప్రాంతం ధీరోదాత్తుల నేల, యోధుల భూమి. బీనా, బేత్వా నదుల వరప్రసాదం ఈ నేల. ఈ నెలలోనే రెండోసారి సాగర్‌లో మిమ్మల్ని అందరిని కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. శ్రీ శివరాజ్ గారి ప్రభుత్వం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇంతక్రితం సంత్ రవిదాస్ గారి అద్భుత స్మారక భవన నిర్మాణం కోసం పునాదిరాయి వేసేందుకు వచ్చాను. మధ్యప్రదేశ్ అభివృద్ధి సరికొత్త వేగాన్ని సంతరించుకునేలా చేయగల అనేక ప్రాజెక్టులకు ఈరోజు పునాది వేస్తున్నాను. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోని పారిశ్రామిక అభివృద్ధికి కొత్త శక్తిని ఇవ్వగలవు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు 50,000 కోట్లకంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. యాభై వేల కోట్లు అంటే ఎంత పెద్ద మొత్తమో ఉహించాగలరా? మన దేశంలో చాలా రాష్ట్రాల మొత్తం వార్షిక బడ్జెట్ కూడా ఇవాళ ఈ ఒక్క కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నంత కూడా ఉండదు. ఇది మధ్యప్రదేశ్ పట్ల ఉన్న మా నిబద్ధతను తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్ యువకులకు వేలాదిగా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టులు పేద, మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చుతాయి. బినా రిఫైన్‌రీ విస్తరణ, అనేక నూతన సౌకర్యాల ప్రారంభ సమయాన మధ్యప్రదేశ్ ప్రజలను నేను అభినందిస్తున్నాను.
స్నేహితులారా,
ఈ స్వాతంత్ర్య ‘అమృత కాలం’లో ప్రతి భారతీయుడు తన దేశాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించాడు. ఈ సంకల్పం నెరవేరాలంటే భారత్ స్వయం సమృద్ధిగా మారడం అత్యంత అవసరం, అలాగే విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడడాన్ని వీలైనంత మేరకు తగ్గించుకోవాలి. ఇప్పటికీ భారత్ పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకోవడం మాత్రమే కాదు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల కోసం కూడా ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈరోజు బీనాలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం పునాది వేయడం వల్ల ఇటువంటి ఉత్పత్తుల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశలో ముందడుగు పడుతుంది. ప్లాస్టిక్ పైపులు, బాత్రూమ్ బకెట్లు, మగ్గులు, ప్లాస్టిక్ నల్లాలు, ప్లాస్టిక్ కుర్చీలు, టేబుళ్లు, ఇంటి రంగులు, కార్ల బంపర్లు, డాష్‌బోర్డులు, ప్యాకేజింగ్ వస్తువులు, మెడికల్ పరికరాలు, గ్లూకోజ్ బాటిల్స్, మెడికల్ సిరింజ్‌లు, అనేక వ్యవసాయ పరికరాల తయారీలో పెట్రోకెమికల్సే ప్రధాన పాత్ర వహిస్తాయని చాలామందికి తెలియదు. ఇప్పుడు బీనాలో నిర్మించబడుతున్న ఆధునిక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఈ మొత్తం ప్రాంతాన్ని సరికొత్త అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్తుంది. దీనికి నేను హామీ ఇస్తున్నాను. దీనివల్ల ఇక్కడ కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి, స్థానిక రైతులకు, చిన్న వ్యాపారులకు లాభం జరుగుతుంది. ముఖ్యంగా, మన యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి.
నేటి ఆధునిక భారతంలో, ఉత్పత్తిరంగం కూడా రూపాంతరం చెందుతోంది. దేశ అవసరాలు పెరుగుతున్నప్పుడు, మారుతున్నప్పుడు, ఉత్పత్తిరంగాన్ని ఆధునీకరించటం కూడా చాలా ముఖ్యం. ఈ ఆలోచనతోనే, మధ్యప్రదేశ్‌లో 10 నూతన పారిశ్రామిక ప్రాజెక్టులలో ఈ కార్యక్రమం కింద పనులు ప్రారంభమయ్యాయి. నర్మదాపురంలో పునరుత్పాదక శక్తి (రిన్యూవబుల్ ఎనర్జీ)కి సంబంధించిన ఉత్పత్తి జోన్ కావచ్చు, ఇండోర్‌లో రెండు కొత్త ఐటీ పార్కులు కావచ్చు, రత్లంలో భారీ పారిశ్రామిక పార్క్ కావచ్చు, ఇవన్నీ మధ్యప్రదేశ్ పరిశ్రమల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. మధ్యప్రదేశ్ పారిశ్రామిక సామర్థ్యం పెరిగితే, అందరికీ ప్రయోజనం కలుగుతుంది. యువతకు, రైతులకు, చిన్న వ్యాపారులకు ఆదాయం పెరగడమే కాకుండా అందరికీ మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
నా కుటుంబ సభ్యులారా,
ఏ దేశమైనా లేదా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేయాలి, అవినీతిని కట్టడి చేయాలి. ఇప్పటి రాష్ట్ర యువతకు గుర్తుండకపోవచ్చు కానీ, ఒకప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా అపఖ్యాతిని మూటకట్టుకున్నది. స్వాతంత్ర్యం తర్వాత చాలా సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్‌ని పాలించిన వారు రాష్ట్రానికి నేరాలు, అవినీతిని తప్ప మరేదీ ఇవ్వలేదు. ఆ రోజుల్లో మధ్యప్రదేశ్ నేర కార్యకలాపాలకే ప్రసిద్ధి. ప్రజలకు చట్టవ్యవస్థపై ఎలాంటి నమ్మకం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లో పరిశ్రమలు ఎలా ఏర్పడతాయి? ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి, వ్యాపారం చేయడానికి ధైర్యం చేస్తారు? మీరు మాకు, మా కూటమి సహచరులకు సేవ చేసే అవకాశం ఇచ్చినపుడు, మేము మధ్యప్రదేశ్ పరిస్థితిని మార్చడానికి నిజాయితీగా కృషి చేశాము. మధ్యప్రదేశ్‌కు భయం నుంచి విముక్తి కలిగించి , చట్టవ్యవస్థను బలపరిచి, పరిస్థితిని మెరుగుపర్చాం. రోడ్లు, కరెంట్, నీరు వంటి ప్రాధమిక సౌకర్యాలు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో పూర్వతరానికి బాగా గుర్తుంటుంది. కానీ ఈరోజు బీజేపి ప్రభుత్వ పాలనలో, ప్రతి గ్రామానికి రోడ్లు ఏర్పడ్డాయి, ప్రతి ఇంటికి విద్యుత్ అందుతోంది. ప్రాంతాల మధ్య అనుసంధానత (కనెక్టివిటీ) మెరుగుపడడంతో పరిశ్రమలు, వ్యాపారాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మధ్యప్రదేశ్‌కు రావాలనుకుంటున్నారు, కొత్త ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు. పరిశ్రమల అభివృద్ధిలో మధ్యప్రదేశ్, కొన్ని సంవత్సరాల్లోనే నూతన శిఖరాలకు చేరుకుంటుందని నేను నమ్ముతున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
ప్రస్తుత నవీన భారత్ వేగంగా మారుతోంది. బానిస మనస్తత్వం నుండి విముక్తి, ప్రతి ఒక్కరి ప్రయత్నం (సబ్ కా ప్రయాస్ ) గురించి నేను ఎర్రకోటనుండి చేసిన ప్రసంగంలో సవివరంగా చర్చించిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఈరోజు భారతదేశం బానిస మనస్తత్వాన్ని అధిగమించి, గౌరవభావం కలిగిన స్వాతంత్రంతో ముందడుగు వేయడాన్ని చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. ఏ దేశమైనా ఇలాంటి సంకల్పాన్ని తీసుకుంటే, దానిలో మార్పు వెనువెంటనే మొదలవుతుంది. మీరు దీన్ని జీ20 సదస్సు సమయంలో కొంత చూడగలిగారు. ‘జీ20’ అనే పదం ప్రతి గ్రామంలోని పిల్లలలో గర్వంతో ప్రతిధ్వనిస్తోంది. జీ20 సదస్సును, భారత్ విజయవంతంగా ఎలా నిర్వహించిందో మీరందరూ గమనించారు కదా. ఇప్పుడు చెప్పండి, మిత్రులారా! చేతులు ఎత్తి సమాధానం చెప్పండి, ఆ చివర వెనక ఉన్నవారు కూడా సమాధానం ఇవ్వండి. జీ20 సదస్సు విజయం పట్ల మీరు గర్వపడుతున్నారా, లేదా? మీరు నిజంగా గర్వకారణంగా భావించారా, లేదా? దేశం యావత్తు గర్వించిందా, లేదా? గర్వంతో మీరు తల ఎత్తుకున్నారా, లేదా? మీ ఛాతీ గర్వంతో ఉప్పొంగిందా, లేదా?
నా ప్రియమైన ఆత్మీయులారా,
ఈరోజు మీరు సాధించిన ఈ విజయ భావన, మొత్తం దేశం అంతటా విస్తరించి ఉంది. జీ20 సదస్సు విజయం ఒక అద్భుతం. ఇది సాధించింది ఎవరు? ఇది ఎవరికి చెందుతుంది? దీన్ని ప్రదర్శించింది ఎవరు?
ఇది కేవలం మోదీ విజయం కాదు, మీ అందరిదీ. ఇది మీ అందరి సామర్థ్యం. ఇది 1.4 బిలియన్ భారతీయుల విజయము. ఇది భారతీయుల సమష్టి శక్తికి ప్రతీక. ఈ సదస్సుకోసం ప్రపంచం నలుమూలల నుండి భారత్‌కు వచ్చిన విదేశీ అతిథులు, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఇప్పటివరకు చూడలేదని వారు కొనియాడారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు చేరుకున్న విదేశీ అతిథులను ఆహ్వానించి, వారికి ఆయా ప్రదేశాలను చూపించినపుడు, భారతదేశం యొక్క వైవిధ్యం, వారసత్వం, సంపద పట్ల వారు ఎంతో సంతృప్తి చెందారు.
మధ్యప్రదేశ్‌లో కూడా, భోపాల్, ఇండోర్, ఖజురాహోలో జీ20 సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలలో పాల్గొన్నవారు, మీరు చేసిన కృషిని ప్రశంసించడమే కాదు, మీ గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు, మీ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మధ్యప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ, పారిశ్రామిక సామర్థ్యాలను మీరు ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది మధ్యప్రదేశ్ ప్రతిష్టను ప్రపంచస్థాయిలో ద్విగుణీకృతం చేసింది. జీ20 సదస్సును విజయవంతం చేయడంలో శివరాజ్ గారు, ఆయన మొత్తం టీమ్‌ను నేను అభినందిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
ఒక వైపు, నేటి భారత్ ప్రపంచంతో పోటిపడుతూ సాగే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. మన భారత్ అంతర్జాతీయ యవనికపై ‘విశ్వమిత్ర’గా (ప్రపంచ స్నేహితుడిగా) ఎదుగుతోంది. మరో వైపు, కొన్ని గుంపులు ఈ దేశాన్ని, సమాజాన్ని విభజించడానికి పనిచేస్తున్నాయి. వారు ఒక ‘ఇండి కూటమి’ని ఏర్పాటు చేశారు. కొందరు ఈ ఇండి కూటమిని ‘అహంకార కూటమి’ (‘ఘమండియా గఠ్‌బంధన్’) అని పిలుస్తున్నారు. వారి నాయకుడిలో స్పష్టత లేదు, నాయకత్వంపై అక్కడ అంతా అయోమయం ఉంది. అయినప్పటికీ, ఇటీవల వారు ముంబైలో ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో, ఈ ‘అహంకార కూటమి’ ఎలా పనిచేయాలో నిర్దేశించే తమ వ్యూహాలను, తంత్రాలను రూపొందించారని నేను అనుకుంటున్నాను. వారు ఒక రహస్య కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేశారు, అది ఏమిటి? అదే ఇండి కూటమి విధానం, అదే ‘అహంకార కూటమి’ విధానం, అది భారతదేశ సంస్కృతిపై దాడి చేయడం. భారత ప్రజల విశ్వాసంపై దాడి చేయడానికే ఇండి కూటమి నిర్ణయం. ఈ కూటమి, ఈ ‘అహంకార కూటమి’ ఉద్దేశ్యం వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కలిపి ఉంచిన విలువలను, సంస్కృతిని, సంప్రదాయాలను నాశనం చేయడం. దేవి అహిల్యాబాయి హోళ్కర్ దేశం నలుమూలలా సామాజిక సేవ చేయడానికి, మహిళల అభ్యున్నతికై ఉద్యమం ప్రారంభించడానికి, దేశ వారసత్వాన్ని కాపాడడానికి ప్రేరణ ఇచ్చిన ఆ ప్రాచీన సంస్కృతిని ముగించడానికే ఈ ఇండి కూటమి, ఈ ‘అహంకార కూటమి’ కంకణం కట్టుకుంది. అజరామరమైన మన సనాతన సంప్రదాయాలను, విలువలను అంతమొందించేందుకే ఈ ఇండి కూటమి వాళ్ళు ఉన్నారు.
సనాతన విలువల శక్తి వల్లనే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాను తన ఝాన్సీని ఇవ్వబోనని బ్రిటిష్‌వారికి మొహం మీదనే ప్రకటించారు. మహాత్మా గాంధీ గారి “హే రామ్!” అనే చివరి మాటలు, తాను సనాతనాన్ని జీవితాంతం ఆలింగనం చేసుకొని, భగవాన్ శ్రీరామ్ నుండి ప్రేరణ పొందినవే కదా. అదే సనాతనం ఆయనను జీవితాంతం అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపేందుకు ప్రేరేపించింది. కానీ ఈ ఇండి కూటమి, ఈ ‘అహంకార కూటమి’ వ్యక్తులు ఆ సనాతన సంప్రదాయాన్ని ముగించాలనుకుంటున్నారు. స్వామి వివేకానంద గారికి సమాజంలోని ఎన్నో దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపేందుకు ప్రేరణ ఇచ్చిన ఆ సనాతన విలువలనే ఇప్పుడు ఇండి కూటమి లక్ష్యంగా చేసుకుంది. లోకమాన్య తిలక్ గారు భారత స్వాతంత్ర్య జెండాను ఎగరేయడానికి, గణేశ్ పూజను స్వాతంత్ర్య ఉద్యమంతో మమేకం చేయడానికి, ప్రజా గణేశ్ ఉత్సవాల సంప్రదాయాన్ని స్థాపించడానికి ప్రేరణ ఇచ్చిన అవే సనాతాన విలువలను నాశనం చేయడానికి ఇండి కూటమి తమ శక్తియుక్తులను వినియోగిస్తోంది.
స్నేహితులారా,
మన సనాతన విలువల బలం వల్లే, స్వాతంత్ర్య సమరంలో ఉరి శిక్షను ఎదుర్కొన్న వీరులు, “నా వచ్చే జన్మలో కూడా నేను మళ్లీ భారత మాత గర్భంలోనే పుట్టాలి” అని ధైర్యంగా చెప్పగలిగారు. ఇవే సనాతన విలువలు సంత్ రవిదాస్‌కు ప్రాతినిథ్యం వహించి, తల్లి శబరిని బలపరిచి, మహర్షి వాల్మీకికి మూలాధారంగా నిలిచి, వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని ఒకటిగా కలిపి ఉంచాయి. అయితే, ఈ ఇండి కూటమిగా కలిసి ఉన్నవారు మాత్రం ఈ సనాతన విలువలను కూల్చివేయాలని కోరుకుంటున్నారు. నేడు, ఈ వ్యక్తులు బహిరంగంగా మాట్లాడడమే కాకుండా, బహిరంగంగానే దాడి కూడా ప్రారంభించారు. భవిష్యత్తులో, వారు మనపై ఇంకా ఎక్కువ దాడులు చేస్తారు. ప్రతి సనాతాని, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతివ్యక్తి, ఈ నేలను గౌరవించే ప్రతి ఒక్కరు, ఈ దేశాన్ని ప్రేమించే లక్షలాది మంది అప్రమత్తంగా ఉండాలి. వారు సనాతనాన్ని నిర్మూలించి, ఈ దేశాన్ని మరో వెయ్యేళ్ల బానిసత్వంలోకి నెట్టాలని చూస్తున్నారు. కానీ మనం అందరం కలిసి సంఘటితమై, ఐకమత్యంతో ఈ శక్తులను ఆపాలి, వారి ప్రయత్నాలను విఫలం చేయాలి
నా కుటుంబ సభ్యులారా,
దేశభక్తికి, ప్రజాశక్తి ఆరాధనకు, ప్రజాసేవా రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ అంకితమైనది. బీజేపీ పాలన యొక్క మౌలిక సూత్రం నిర్లక్ష్యం కాబడిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక కరుణగల ప్రభుత్వం. ఢిల్లీ అయినా భోపాల్ అయినా, నేడు ప్రభుత్వం మీ ఇళ్ల వరకు చేరి మీకు సేవ చేయడానికి శ్రమిస్తోంది. కోవిడ్-19 అనే పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు, ప్రభుత్వం కోట్లాది పౌరులకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించింది. సంతోషంలోనూ, దుఃఖంలోనూ మేము మీకు తోడుగా ఉన్నాము. మా ప్రభుత్వం 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందించింది. పేదవారి పొయ్యి ఎప్పుడూ వెలగాలి, వారి కడుపు ఆకలితో ఉండకూడదు. పేద, దళిత, వెనుకబడిన, గిరిజన కుటుంబాలకు చెందిన ఏ తల్లి కూడా ఆకలితో ఉన్న సంతానంతో నిద్రపోకూడదనే లక్ష్యంతో మా ప్రయత్నాలు కొనసాగాయి. అందుకే, పేదల కొడుకైన నేను, పేదల రేషన్ సమస్య గురించి, పేద తల్లి ఆందోళన గురించి ఆలోచించాను. మీ ఆశీర్వాదాలతో, ఈ బాధ్యతను నేను నేటికీ నిర్వర్తిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
మధ్యప్రదేశ్ అభివృద్ధి మరింత ఎత్తుకు ఎదగాలి, మధ్యప్రదేశ్‌లో ప్రతి కుటుంబ జీవితం ఇంకా సులభతరం కావాలి, ప్రతి ఇంటికి సంపద చేరాలి, ఇందుకోసమే మా నిరంతర ప్రయత్నం. మోదీ గ్యారంటీ అంటే ఏంటో మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ల ట్రాక్ రికార్డ్ గుర్తుపెట్టుకోండి, అలాగే నా ట్రాక్ రికార్డ్ కూడా గమనించండి. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని మోదీ గ్యారంటీ ఇచ్చారు. ఈరోజు మధ్యప్రదేశ్‌లోనే 40 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు పక్కా ఇళ్లను పొందాయి. ప్రతి ఇంటిలో టాయిలెట్ ఏర్పాటు చేస్తామని చెప్పాం, ఆ హామీ కూడా నెరవేర్చాం. నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పాం. ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా తెరుస్తామని చెప్పాం. అమ్మలు, అక్కాచెల్లెళ్ల కోసం పొగలేని వంటిళ్ళ సౌకర్యం కల్పిస్తామని గ్యారంటీ ఇచ్చాం. ఈ గ్యారంటీలన్నిటినీ మీ ‘సేవకుడు’ మోదీ నెరవేర్చుతున్నాడు. మన సోదరీమణుల లబ్దికోసం మన ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను కూడా తగ్గించింది. దీనివల్ల ఉజ్వల యోజన లబ్ధిదారులు ₹400 తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. ఉజ్వల యోజన ఎంత మంది అక్కాచెల్లెళ్ల జీవితాలను కాపాడుతోందో మనందరికీ తెలుసు. ఏఒక్క అక్కగానీ, ఏఒక్క చెల్లెలుగానీ పొగనిండిన గదిలో వంట చేయకూడదనేది మా సంకల్పం. అందుకే నిన్న కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో 75 లక్షల సోదరీమణులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఏఒక్క సోదరి కూడా గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉండకూడదనేదే మా లక్ష్యం. దాదాపు అన్ని కుటుంబాలకు మనం ముందే గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం, కానీ కొన్ని కుటుంబాల్లో సభ్యులు పెరగడం లేదా కుటుంబ విభజన వల్ల కొత్తగా మరో కనెక్షన్ అవసరం అవుతోంది. జాబితాలో ఉన్న అలాంటివారి కోసమే ఈ కొత్త పథకంతో ముందుకు వచ్చాం.
మిత్రులారా,
మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు పూర్తి నిజాయితీతో పని చేస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ప్రతి లబ్ధిదారుడికి పూర్తి ప్రయోజనం చేరేలా చూస్తామని హామీ ఇచ్చాం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి దీనికి ఒక మంచి ఉదాహరణ. ఈ పథకం ద్వారా ప్రతి రైతు నేరుగా తన బ్యాంక్ ఖాతాలో ₹28,000 పొందుతాడు. ఈ పథకంపై ప్రభుత్వం ఇప్పటివరకు 2.6 లక్షల కోట్లు ఖర్చు చేసింది.
స్నేహితులారా,
రైతుల ఖర్చు తగ్గించడానికి, వారికి తక్కువ ధరలో ఎరువులు అందించడానికి గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఈ కాలంలో మా ప్రభుత్వం ఖజానా నుంచి 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. ఈరోజు రైతులు తమ పొలాల్లో వాడే ఒక యూరియా బస్తా అమెరికాలో ₹3000కి అమ్మబడుతోంది. కానీ అదే బస్తాను నా భారతీయ రైతు సోదరులకోసం కేవలం ₹300కే అందిస్తున్నాం. దీనికోసమే ప్రభుత్వం పది లక్షల కోట్లు ఖజానా నుంచి ఖర్చు చేసింది. గుర్తుంచుకోండి, గతంలో యూరియా పేరిట వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవి. యూరియా కోసం రైతులు క్యూల్లో నిలబడి, లాఠీ దెబ్బలు కూడా భరించాల్సి వచ్చేది. ఇప్పుడు అదే యూరియా దేశంలోని ప్రతి చోటా సులభంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంది.
నా కుటుంబ సభ్యులారా,
సాగునీటి లభ్యత ఎంత ముఖ్యమో, బుందేల్ఖండ్ ప్రజలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. బుందేల్ఖండ్‌లో సాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్టులు డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాంతంలోని కెన్–బేత్వా లింక్ కాలువ సహా ఇతర సాగు ప్రాజెక్టులు లక్షలాది రైతులకు తమ జీవితకాలం మాత్రమే కాదు, వారి భవిష్యత్ తరాలకు కూడా ఎంతో మేలు చేయబోతున్నాయి. మన సోదరిమణుల ప్రతి ఇంటికి పైప్‌లైన్ ద్వారా తాగునీళ్లు అందించేందుకు మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. కేవలం గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల కొత్త కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా నీళ్లు అందించాం. కేవలం మధ్యప్రదేశ్‌లోనే 65 లక్షల కుటుంబాలకు పైప్ నీళ్లు చేరాయి. దీని వల్ల బుందేల్ఖండ్‌లోని మా తల్లులు, అక్కాచెల్లెళ్లకు ఎంతగానో ప్రయోజనం కలిగింది. బుందేల్ఖండ్‌లో అటల్ భూజల్ యోజన కింద కూడా నీటి వనరులను పెంచేందుకు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి.
స్నేహితులారా,
ఈ ప్రాంత అభివృద్ధికీ, దీని ప్రతిష్ట పెంచటానికీ మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 5న, రాణి దుర్గావతి గారి 500వ జయంతిని మనం జరుపుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంగా, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించే ప్రణాళికలు కూడా తయారుచేస్తోంది.
హితులారా,
మా ప్రభుత్వ కృషితో పేదలు, దళితులు, ఆదివాసీ ప్రజలు ఎక్కువగా లబ్దిపొందారు. నిర్లక్ష్యానికి గురైన వారికి ప్రాధాన్యం ఇవ్వడంలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే మా మోడల్ ఇవాళ ప్రపంచానికి మార్గం చూపుతోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అవతరించడానికి కృషి చేస్తోంది. ఈ లక్ష్యం సాధించడంలో మధ్యప్రదేశ్ పాత్ర ఎంతో కీలకం. మధ్యప్రదేశ్ తన పాత్రను ఖచ్చితంగా నెరవేర్చుతుంది. దీని వల్ల ఈ ప్రాంతంలోని రైతులు, పరిశ్రమలు, యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వచ్చే ఐదు సంవత్సరాలలో మధ్యప్రదేశ్ మరింత అభివృద్ధిని నమోదు చేస్తుంది. ఈరోజు మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మధ్యప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్తాయి. ఈ అభివృద్ధి వేడుకకు హాజరై, మాకు ఆశీర్వాదాలు ఇచ్చి, మాకు తోడుగా నిలిచిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
నాతో కలిసి పలకండి:
భారత్ మాతా కి – జై!
భారత్ మాతా కి – జై!
భారత్ మాతా కి – జై!
ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రిగారి ప్రసంగానికి రమారమి అనువాదం మాత్రమే. అసలు ప్రసంగం హిందీలో ఇవ్వబడింది.
***
(रिलीज़ आईडी: 2201189)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam