ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్-ఆఫ్రికా అవుట్‌రీచ్ తో పాటు బ్రిక్స్ ప్లస్ డైలాగ్‌ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 24 AUG 2023 3:47PM by PIB Hyderabad

గౌరవనీయులారా,

ఆఫ్రికా గడ్డ మీద నా మిత్రులు అందరి మధ్యకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. బ్రిక్స్ అవుట్‌రీచ్ సమిట్‌ సందర్భంగా ఆఫ్రికా, ఆసియా, ల్యాటిన్ అమెరికా దేశాలతో ఆలోచనలను పంచుకునేందుకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు శ్రీ రామఫోసాకు నా అభినందనలను తెలియజేస్తున్నాను. గత రెండు రోజుల్లో, బ్రిక్స్ తాలూకు చర్చలన్నింటిలోనూ, మనం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలూ, సమస్యలపై దృష్టి కేంద్రీకరించాం. ఈ అంశాలకు బ్రిక్స్ ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇవ్వడం ఇప్పటి కాలంలో ఎంతయినా అవసరంమని మనం నమ్ముతున్నాం. బ్రిక్స్ వేదికను విస్తరించాలని కూడా మనం నిర్ణయించాం. భాగస్వామ్య దేశాలన్నింటికీ మనం స్వాగతం పలుకుతున్నాం. ఇది ప్రపంచ సంస్థలతో పాటు వేదికలకు ప్రాతినిధ్యాన్ని కల్పించి సమ్మిళితత్వాన్ని ఆవిష్కరించాలని మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఒక కార్యక్రమంగా ఉంది.
గౌరవనీయు లారా,
మనం ‘‘గ్లోబల్ సౌత్’’ అనే మాటలను వాడినప్పుడు, అవి కేవలం దౌత్యానికి సంబంధించిన పదాలు కావు. మన ఉమ్మడి చరిత్రలో.. వలసవాదాన్నీ, వర్ణ వివక్షనూ మనం కలిసికట్టుగా వ్యతిరేకించాం. మహాత్మాగాంధీ అహింస, శాంతియుత ప్రతిఘటన వంటి శక్తిమంతమైన భావనలను పెంపొందించి, పరీక్షించింది ఆఫ్రికా గడ్డ మీదే. వాటిని ఆయన భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆచరణలో పెట్టారు. ఆయన భావాలూ, ఆలోచనలూ నెల్సన్ మండేలా వంటి మహా నేతలకూ స్ఫూర్తిని అందించాయి. ఈ బలమైన చారిత్రక పునాదిని ఆధారం చేసుకొని, మనం మన ఆధునిక సంబంధాలకు ఒక కొత్త రూపురేఖలను అందిస్తున్నాం.
గౌరవనీయులారా,
ఆఫ్రికాతో సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యాన్నిస్తోంది. ఉన్నత స్థాయి సమావేశాలకు తోడు, మేం ఆఫ్రికాలో 16 కొత్త దౌత్య కార్యాలయాలను కూడా మొదలుపెట్టాం. ప్రస్తుతం, భారత్ ఆఫ్రికాకు నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగానే కాకుండా, అయిదో అతి పెద్ద పెట్టుబడిదారు దేశంగా కూడా ఉంది. అవి..సూడాన్, బురుండీ, రవాండాల్లో విద్యుత్తు ప్రాజెక్టులు గానీ, లేదా ఇథియోపియాతో పాటు మలావిలో చక్కెర ప్లాంటులు గానీ. అలాగే మొజాంబిక్, ఐవరీ కోస్టులతో పాటు ఎస్వాతినీలో టెక్నాలజీ పార్కులు గానీ, లేదా టాంజానియా, ఉగాండాల్లో భారతీయ విశ్వవిద్యాలయాలు నెలకొల్పిన క్యాంపసులు గానీ కావొచ్చు. ఆఫ్రికా దేశాల్లో సామర్థ్యాన్ని పెంచడానికీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికీ భారత్ పెద్దపీట వేస్తోంది. అజెండా-2063లో భాగంగా, రాబోయే కాలంలో ఒక గ్లోబల్ పవర్‌హౌస్‌గా ఎదిగే దిశగా ఆఫ్రికా చేస్తున్న ప్రయాణంలో భారత్ విశ్వసనీయ, సన్నిహిత భాగస్వామిగా ఉంటుంది. ఆఫ్రికాలో డిజిటల్ మాధ్యమ సేవలకు నోచుకోని ప్రజలకు ఆ సేవలను అందించడానికి మేం టెలి-ఎడ్యుకేషన్‌తో పాటు టెలి-మెడిసిన్లలో పదిహేను వేలకు పైగా ఉపకారవేతనాలు అందించాం. నైజీరియా, ఇథియోపియాలతో పాటు టాంజానియాలో కూడా డిఫెన్స్ అకాడమీలనూ, కళాశాలలనూ మేం ఏర్పాటు చేశాం. బోట్స్‌వానా, నమీబియా, ఉగాండా, లెసోథో, జాంబియా, మారిషస్, సీషెల్స్‌తో పాటు టాంజానియాలో శిక్షణనివ్వడానికి బృందాలను పంపించాం. ఆఫ్రికాలో శాంతినీ, స్థిరత్వాన్నీ కాపాడడానికి సుమారు 4400 మంది భారతీయ శాంతి పరిరక్షక దళం సభ్యులు వారి వంతు తోడ్పాటును అందిస్తున్నారు.. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఉగ్రవాదాన్నీ, పైరసీనీ ఎదుర్కోవడంలోనూ మేం ఆఫ్రికా దేశాలతో కలిసి పనిచేస్తున్నాం. కోవిడ్ మహమ్మారి విజృంభించిన కష్ట కాలంలో, అనేక దేశాలకు ఆహార పదార్థాలతో పాటు టీకామందులనూ మేం అందజేశాం. ప్రస్తుతం, మేం ఆఫ్రికా దేశాలతో కలిసి కోవిడ్ టీకాలతో పాటు ఇతర టీకామందులను కూడా తయారు చేయడం కోసం కృషి చేస్తున్నాం. మొజాంబిక్‌లో, మాలావిలో తుపానులు, మడగాస్కర్‌లో వరదలు వచ్చినప్పుడు మొదటగా స్పందించింది భారతే. ఎల్లవేళలా ఆఫ్రికాతో భారత్ భుజం భుజం కలిపి నిలబడింది.

గౌరవనీయులారా,
ల్యాటిన్ అమెరికా మొదలు సెంట్రల్ ఆసియా వరకు, పశ్చిమాసియా మొదలు ఈశాన్య ఆసియా వరకు, ఇండో-పసిఫిక్ మొదలు ఇండో-అట్లాంటిక్ వరకు.. అన్ని దేశాలనూ ఒక కుటుంబంగా  భారత్ చూస్తోంది. ‘‘వసుధైవ కుటుంబకమ్’’ (ప్రపంచం అంతా ఒకే కుటుంబం) అనే భావన వేల సంవత్సరాలుగా మా జీవన శైలికి పునాదిగా ఉంది. ఇది మా జి-20 అధ్యక్ష బాధ్యతకూ మూలమంత్రంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనలను ప్రధాన స్రవంతిలో భాగంగా చేయడానికి మూడు ఆఫ్రికా దేశాలతో పాటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా అతిథి దేశాలుగా పాలుపంచుకోవాల్సిందిగా మేం ఆహ్వానించాం. జి-20లో ఆఫ్రికా యూనియన్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా భారత్ తీసుకువచ్చింది.

గౌరవనీయులారా,
బ్రిక్స్‌తో పాటు ఇక్కడ హాజరైన మిత్రదేశాలన్నీ కలిసి బహుళ ధృవ ప్రపంచాన్ని పటిష్ఠపరచడంలో సహకారాన్ని అందించగలుగుతాయని నేను నమ్ముతున్నాను. ప్రపంచ సంస్థలను ప్రాతినిధ్య పూర్వకమైనవిగా, సందర్భశుద్ధి కలిగినవిగా తీర్చిదిద్దడానికి వాటిని సంస్కరించే పనిలో మనం పురోగతిని సాధించవచ్చు. ఉగ్రవాదంతో తలపడి నిరోధించడానికీ, పర్యావరణ భద్రత, వాతావరణ సంబంధిత కార్యాచరణ, సైబర్ భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఇంధన భద్రతలతో పాటు ఆటుపోట్లకు తట్టుకొని నిలవగలిగే సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చర్యల్ని తీసుకోవడం.. ఇవీ మన ఉమ్మడి ప్రయోజనాలు. ఈ రకంగా సహకరించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ సౌర కూటమి, ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలందరికీ ఆరోగ్య పరిరక్షణ సేవలు, బిగ్ క్యాట్ అలయన్సు, సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రపంచ కేంద్రం.. ఇలాంటి మా అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిందిగా మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. డిజిటల్ రంగంలో భారత్ కల్పిస్తున్న ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థతో ముడిపడి, ఆయా సేవలను మీ మీ ప్రాంతాల్లో ప్రగతి సాధనకు వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మేం మా అనుభవాన్నీ, సామర్థ్యాన్నీ మీ అందరితో సంతోషంగా పంచుకుంటాం. మన అందరి కృషీ మనకు సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ, ప్రత్యేకించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు శ్రీ రామఫోసాకు, నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీకు ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి పత్రికా ప్రకటన కు తెలుగు అనువాదం ఇది. పత్రికా ప్రకటన హిందీ భాషలో ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2200671) సందర్శకుల సూచీ సంఖ్య : : 15