ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
14 SEP 2023 5:38PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం శ్రీ టి.ఎస్. సింగ్ దేవ్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగిని శ్రీమతి రేణుకా సింగ్ జీ, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన ఛత్తీస్‌గఢ్ కుటుంబ సభ్యులారా!
అభివృద్ధి దిశగా ఛత్తీస్‌గఢ్ ఇవాళ మరో కీలక అడుగు వేస్తోంది. రూ.6,400 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను బహుమతిగా అందుకుంది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఛత్తీస్‌గఢ్ సామర్థ్యాన్ని పెంచటానికి, ఆరోగ్య రంగంలో మరింత పురోగతికి నూతన పథకాలను ఇవాళ ప్రారంభించాం. సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులు కూడా ఇవాళ పంపిణీ చేశాం.
మిత్రులారా,
వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, పేదలకు భారత్ అందించే సంక్షేమ నమూనాను ప్రపంచం గమనిస్తూ, అభినందిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా కొన్ని ముఖ్యమైన దేశాల నుంచి అధినేతలు ఢిల్లీకి వచ్చిన విషయం మీకు తెలిసిందే. భారతదేశ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి చేస్తున్న కృషిని చూసి వారంతా ముగ్ధులయ్యారు. భారత్ సాధించిన విజయ పాఠాలను నేర్చుకోవాలని ప్రపంచంలోని ప్రధాన సంస్థలు కోరుకుంటున్నాయి. అభివృద్ధి విషయంలో ఇవాళ దేశంలోని ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి సమ ప్రాధాన్యత లభించటమే ఇందుకు కారణం. ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కలిసికట్టుగా మనం దేశాన్ని ముందుకు నడిపించాలి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో మీ అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా,
దేశాభివృద్ధికి ఛత్తీస్‌గఢ్ శక్తి కేంద్రం వంటిది. శక్తి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పుడే దేశం కూడా ముందుకు సాగేందుకు బలాన్ని పొందుతుంది. ఈ ఆలోచనతోనే 9 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్ సమగ్రాభివృద్ధికి అలుపెరుగని కృషి చేశాం. ఆ దార్శనికత, విధానాల ఫలితాలను ఇవాళ చూడవచ్చు. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రతి రంగంలోనూ పూర్తిగా అమలవుతున్నాయి. నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది.. జూలై నెలలోనే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నేను రాయ్‌పూర్ వచ్చాను. ఆ సమయంలో విశాఖపట్నం-రాయ్‌పూర్ ఎకనామిక్ కారిడార్, రాయ్‌పూర్-ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే అదృష్టం కలిగింది. ఎన్నో ముఖ్యమైన జాతీయ రహదారులు కూడా మీ రాష్ట్రానికి బహుమతిగా లభించాయి. ఇవాళ రైలు వ్యవస్థలో అభివృద్ధికి, ఛత్తీస్‌గఢ్ నూతన అధ్యాయాన్ని లిఖిస్తోంది. బిలాస్‌పూర్-ముంబై రైల్వే లైన్‌లోని ఝార్సుగూడ-బిలాస్‌పూర్ సెక్షన్‌లో రద్దీని ఈ రైలు నెట్‌వర్క్ తగ్గిస్తుంది. ప్రారంభం కానున్న, నిర్మాణంలో ఉన్న రైల్వేలైన్లు, రైలు కారిడార్లు ఛత్తీస్‌గఢ్ పారిశ్రామికాభివృద్ధిని కొత్త శిఖరాలకు చేర్చుతాయి. ఈ మార్గాల్లో పనులు పూర్తయితే ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటమే కాక, నూతన ఉపాధి, ఆదాయావకాశాలు లభిస్తాయి.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కారణంగా దేశానికి శక్తి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ ఎన్నో రెట్లు బలపడుతుంది. బొగ్గు గనుల నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా ఖర్చు, రవాణా సమయం తగ్గుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయటానికి పిట్ హెడ్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. తలైపల్లి గనిని అనుసంధానించే 65 కి.మీ. మేరీ గో రౌండ్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. దేశంలో ఇలాంటి ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతోంది. వీటివల్ల ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయి.
నా కుటుంబ సభ్యులారా,
రాబోయే 25 ఏళ్లు 'అమృత్ కాల్' సమయంలో దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చుకోవాలి. ప్రతి పౌరుడి సమాన భాగస్వామ్యం ద్వారా దీన్ని సాధించగలం. దేశ ఇంధన అవసరాలను తీర్చుకుంటూ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఇందులో భాగంగా సూరజ్‌పూర్ జిల్లాలో మూసివేసిన బొగ్గు గనిని ఎకో-టూరిజానికి అభివృద్ధి చేశారు. కోర్వా ప్రాంతంలోనూ ఎకో-పార్కు అభివృద్ధి పని జరుగుతోంది. గనుల నుంచి విడుదలయ్యే నీటితో ఇవాళ వేలాది మంది ప్రజలకు సాగు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ ప్రయత్నాల ద్వారా గిరిజన ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది.
మిత్రులారా,
అడవులను, భూమిని రక్షించటంతో పాటు అటవీ సంపద ద్వారా సంక్షేమ మార్గాలను చూపాలన్నదే మా దృఢ సంకల్పం. దేశంలో లక్షలాది మంది గిరిజన యువత వన ధన్ వికాస్ యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ ఏడాది ప్రపంచం, మిల్లెట్ సంవత్సరాన్ని జరుపుకుంటోంది. రాబోయే ఏళ్లలో మన ధాన్యాలు, చిరుధాన్యాలు విస్తారమైన మార్కెట్‌ను సృష్టించగలవు. దేశంలో ఒకవైపు గిరిజన సంప్రదాయానికి కొత్త గుర్తింపు లభిస్తుండగా, మరోవైపు అభివృద్ధికి నూతన మార్గాలు తెరుచుకుంటున్నాయి.
నా కుటుంబ సభ్యులారా,
ఇక్కడ ఇవాళ పంపిణీ చేసిన సికిల్ సెల్ ఎనీమియా కౌన్సెలింగ్ కార్డులు కూడా గొప్ప సేవలను అందిస్తాయి. ముఖ్యంగా గిరిజన సమాజానికి సేవలు అందుతాయి. సికిల్ సెల్ ఎనీమియాతో మన గిరిజన సోదరీసోదరులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. సరైన అవగాహనతో ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' సంకల్పంతో మనం ముందుకు సాగాలి. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ సంకల్పంతో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో నేను కొన్ని విషయాలను వివరిస్తాను. ఇది ఈనాటి కార్యక్రమం.
ధన్యవాదాలు!
***
(रिलीज़ आईडी: 2200044)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam