ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ - రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతర సంయుక్త ప్రకటన

प्रविष्टि तिथि: 05 DEC 2025 5:31PM by PIB Hyderabad

భారత్–రష్యా: నమ్మకం, పరస్పర గౌరవంతో కాల పరీక్షకు నిలబడిన ప్రగతిశీల భాగస్వామ్యం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ 23వ భారత-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు 2025 డిసెంబర్  నాలుగు, ఐదు తేదీలలో భారత్ లో పర్యటించారు.

భారత్, రష్యా దేశాల మధ్య ప్రత్యేక, ప్రాధాన్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2000 అక్టోబర్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారి భారతదేశంలో పర్యటించినప్పుడు కుదిరిన రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందానికి ఈ ఏడాది 25వ వార్షికోత్సవం.

పరస్పర విశ్వాసం, పరస్పర జాతీయ ప్రయోజనాల పట్ల గౌరవం,  వ్యూహాత్మక ఐక్యతపై ఆధారపడి కాల పరీక్షకు నిలబడిన రెండు దేశాల చిరకాల సంబంధం ప్రత్యేకతను ఇద్దరు నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు. బాధ్యతలు పంచుకున్న  ప్రధాన దేశాలుగా ఈ ప్రత్యేకమైన సంబంధం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మూలాధారంగా కొనసాగుతుందని, సమాన, విడదీయలేని భద్రత సూత్రాలపై ఈ స్థిరత్వాన్ని నిర్ధరించాల్సిన అవసరం ఉందని వారు దృఢంగా పేర్కొన్నారు.

భారత్,  రష్యా మధ్య ఉన్న బహుముఖ, పరస్పర ప్రయోజనకర సంబంధాలను ఇద్దరు నాయకులు సానుకూలంగా సమీక్షించారు. రాజకీయ, వ్యూహాత్మక, రక్షణ-భద్రత, వాణిజ్యం- పెట్టుబడులు, ఇంధనం, సైన్సు-సాంకేతికం, అణు, అంతరిక్షం, సాంస్కృతికం, విద్య,  మానవతా సహకారం వంటి అన్ని రంగాల్లో ఈ సహకారం విస్తరించి ఉన్నట్టు వారు పేర్కొన్నారు. సంప్రదాయ సహకార రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఇరు దేశాలు కొత్త రంగాల్లో సహకార అవకాశాలను క్రియాశీలంగా అన్వేషించడాన్ని స్వాగతించారు. 

ప్రస్తుత సంక్లిష్ట, సవాళ్లతో కూడిన, అనిశ్చితమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల మధ్య కూడా భారత్,  రష్యా సంబంధాలు దృఢంగా,  స్థిరంగా కొనసాగుతున్నాయని ఇద్దరు నాయకులు స్పష్టంగా పేర్కొన్నారు. ఆధునిక, సమతుల్య, పరస్పర ప్రయోజనకర, స్థిరమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఇరు దేశాలు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాయని వారు అన్నారు. భారత–రష్యా సంబంధాలను అన్ని రంగాల్లో పటిష్టం చేయడం తమ ఉమ్మడి విదేశాంగ విధాన ప్రాధాన్యమని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వెలికితీయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని నాయకులు అంగీకరించారు.

ఎకటరిన్బర్గ్, కజాన్‌లో భారత్ కాన్సులేట్ జనరల్‌లను తెరవడాన్ని నాయకులు స్వాగతించారు. ప్రాంతాల మధ్య సహకారాన్ని, వాణిజ్య, ఆర్థిక సంబంధాలను, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వీటి కార్యకలాపాలను త్వరగా ప్రారంభించాలని ఆకాంక్షించారు. 

గత శిఖరాగ్ర సమావేశం నుంచి  అన్ని స్థాయిలలో సమావేశాలు నిరంతరం విస్తృతం కావడాన్ని నాయకులు సంతృప్తితో గుర్తించారు, వీటిలో-  కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం, టియాంజిన్‌లో జరిగిన 25వ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తమ మధ్య జరిగిన సమావేశాలు; భారత విదేశాంగ మంత్రి, రష్యా మొదటి ఉప ప్రధాన మంత్రి సహ అధ్యక్షతన వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై 26వ భారత-రష్యా అంతర్-ప్రభుత్వ కమిషన్ (ఐఆర్ఐ జీసీ- టీఈసీ) సమావేశం,  రెండు దేశాల రక్షణ మంత్రుల సహ అధ్యక్షతన సైనిక, సైనిక-సాంకేతిక సహకారంపై 22వ  ఐఆర్ఐజీసీ (ఐఆర్ఐజీసీ - ఎం అండ్ ఎంటీసీ) సమావేశం, భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,  సమాచార, ప్రసార శాఖ మంత్రి, హోం, రక్షణ, యువజన వ్యవహారాలు, క్రీడలు, టెక్స్‌టైల్స్ శాఖ సహాయ మంత్రులు, నీతీ అయోగ్ ఉపాధ్యక్షుని సందర్శనలు, రష్యా నుంచి స్టేట్ డూమా చైర్మన్, మొదటి ఉప ప్రధాన మంత్రి, ఉప ప్రధాన మంత్రి, ఇంధన మంత్రి, సాంస్కృతిక మంత్రి పర్యటనలు, జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో వ్యూహాత్మక చర్చలు, విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు, యూ ఎన్ సమస్యలపై సంప్రదింపులు, ఉగ్రవాద వ్యతిరేక సంయుక్త అధ్యయన బృందం సమావేశం మొదలైనవి ఉన్నాయి.

వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యం 

రష్యాకు భారతదేశ ఎగుమతులను పెంచడం, పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా అధునాతన ఉన్నత సాంకేతిక రంగాలలో కొత్త సాంకేతిక, పెట్టుబడి భాగస్వామ్యాలను ఏర్పరచడం, సహకారానికి కొత్త మార్గాలు రూపాలను కనుగొనడంతో సహా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల్య, స్థిరమైన పద్ధతిలో విస్తరించాలనే తమ ఉమ్మడి ఆకాంక్షను నాయకులు పునరుద్ఘాటించారు.

2030 వరకు భారత్ - రష్యా ఆర్థిక సహకారానికి సంబంధించిన వ్యూహాత్మక రంగాల అభివృద్ధి కార్యక్రమం (ప్రోగ్రామ్ 2030) ఆమోదాన్ని నాయకులు స్వాగతించారు.

పరస్పర ప్రయోజనం ఉన్న రంగాలకు వర్తింపచేస్తూ, భారత్, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య వస్తువులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న ఉమ్మడి ప్రయత్నాలను నాయకులు ప్రశంసించారు. పెట్టుబడులకు ప్రోత్సాహం, రక్షణపై పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందంపై చర్చలను మరింత బలోపేతం చేయాలని వారు ఇరుపక్షాలను ఆదేశించారు.

వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక సాంస్కృతిక సహకారంపై  న్యూఢిల్లీ (నవంబర్ 2024),  మాస్కో (ఆగస్టు 2025)లో జరిగిన భారత-రష్యా అంతర్-ప్రభుత్వ కమిషన్ (ఐఆర్ఐజీసీ- టీఈసీ) 25వ, 26వ సమావేశాలు, భారత-రష్యా వ్యాపార ఫోరమ్ ఫలితాలను నాయకులు స్వాగతించారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్ర బిందువుగా ఉన్న బహిరంగ, సమ్మిళిత, పారదర్శక, వివక్ష రహిత బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ ప్రాముఖ్యతను ఇరుపక్షాలు స్పష్టంగా పేర్కొన్నాయి. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల సవరించిన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సకాలంలో సాధించడానికి, టారిఫ్,  నాన్-టారిఫ్ వాణిజ్య అవరోధాలను పరిష్కరించడం, రవాణాలో అడ్డంకులను తొలగించడం, కనెక్టివిటీని ప్రోత్సహించడం, సున్నితమైన చెల్లింపు విధానాలను నిర్ధరించడం, బీమా,  పునఃబీమా సమస్యలకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనడం, రెండు దేశాల వ్యాపారాల మధ్య నిరంతర పరస్పర చర్య వంటివి కీలకమని ఇరుపక్షాలు గుర్తించాయి. 

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిరంతరాయంగా నిర్వహించడానికి జాతీయ కరెన్సీల వాడకం ద్వారా ద్వైపాక్షిక పరిష్కార వ్యవస్థలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడాన్ని కొనసాగించాలని రెండు దేశాలూ అంగీకరించాయి. జాతీయ చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక సందేశ వ్యవస్థలు, అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వేదికల పరస్పర నిర్వహణను ప్రారంభించడంపై తమ సంప్రదింపులను కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

భారతదేశానికి నిరంతర ఎరువుల సరఫరా ఏర్పాటు చర్యలను ఇరుపక్షాలు స్వాగతించాయి.  ఈ రంగంలో ఉమ్మడి భాగస్వామ్య కర్మాగారాల ఏర్పాటుపై చర్చించాయి.

నైపుణ్యం కలిగిన కార్మికుల రాకపోకలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరమ్ (జూన్ 2025), ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ (సెప్టెంబర్ 2025)లో భారత ప్రతినిధుల భాగస్వామ్యాన్ని రష్యా స్వాగతించింది. ఈ ఫోరంల సందర్భంగా నిర్వహించిన ఇండియా-రష్యా వాణిజ్య చర్చలు ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని ప్రోత్సహించడంలో ఎంతో దోహదపడ్డాయని ఇరు పక్షాలు గుర్తించాయి.

అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల విశ్వసనీయత కోసం ఇంధన వనరులు, విలువైన రాళ్ళు, లోహాలు, కీలకమైన ముడి పదార్థాలతో సహా ఖనిజ వనరులలో ఉత్పాదక, పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్యం ప్రాముఖ్యతను నాయకులు గుర్తించారు. సార్వభౌమ దేశాలుగా భారత్, రష్యా మధ్య ఈ రంగంలో సమర్థవంతమైన సహకారం వాటి జాతీయ భద్రత, సామాజిక శ్రేయస్సులో ముఖ్యమైన భాగం.

ఇంధన భాగస్వామ్యం

ప్రత్యేక, ప్రాధాన్యం కలిగిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో  భాగంగా ఇంధన రంగంలో తమ విస్తృత సహకారాన్ని ఒక ముఖ్యమైన స్తంభంగా ఇరుపక్షాలు ప్రశంసించాయి. చమురు, చమురు ఉత్పత్తులు, చమురు శుద్ధి, పెట్రోకెమికల్ టెక్నాలజీలు, ఆయిల్‌ఫీల్డ్ సేవలు అప్‌స్ట్రీమ్ టెక్నాలజీలు, సంబంధిత మౌలిక సదుపాయాలు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ  సంబంధిత మౌలిక సదుపాయాలు, రెండు దేశాలలో ఇప్పటికే ఉన్న వివిధ ప్రాజెక్టులు, భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూజీసీ) టెక్నాలజీ, అణు ప్రాజెక్టులు మొదలైన రంగాలలో భారతీయ,  రష్యన్ కంపెనీల మధ్య ప్రస్తుత, ఇంకా అవకాశం ఉన్న సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. ఈ రంగంలోని పెట్టుబడి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన ప్రాముఖ్యతను కూడా వారు గుర్తించారు. ఇంధన రంగంలో తమ పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న వివిధ ఆందోళనలను పరిష్కరించడానికి అంగీకరించారు.

రవాణా, అనుసంధానం

అంతర్జాతీయ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ), చెన్నై-వ్లాడివోస్టాక్ (తూర్పు సముద్ర) కారిడార్, ఉత్తర సముద్ర మార్గానికి మద్దతుగా కనెక్టివిటీని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడం కోసం రవాణా మార్గాలను విస్తరించడంపై దృష్టి సారించి, స్థిరమైన, సమర్థవంతమైన రవాణా కారిడార్లను నిర్మించడంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరుదేశాలూ అంగీకరించాయి. ధ్రువ జలాల్లో పనిచేసే నౌకల కోసం నిపుణులకు శిక్షణ ఒప్పందంపై సంతకం చేయడాన్ని వారు స్వాగతించారు.

రెండు దేశాల రైల్వేల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సాంకేతిక మార్పిడి రంగంలో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఫలవంతమైన సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి.

రష్యన్ దూర ప్రాచ్యం, ఆర్కిటిక్‌లో సహకారం

రష్యన్ ఫెడరేషన్‌లోని దూర ప్రాచ్యం (ఫార్ ఈస్ట్), ఆర్కిటిక్ జోన్‌లో వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని విస్తరించడానికి ఇరుపక్షాలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. 2024-2029 కాలానికి రష్యన్ దూర ప్రాచ్యంలో వాణిజ్యం, ఆర్థిక పెట్టుబడి రంగాలలో భారత్, రష్యా సహకార కార్యక్రమం, ముఖ్యంగా వ్యవసాయం, ఇంధనం, మైనింగ్, మానవ వనరులు , వజ్రాలు, ఫార్మాస్యూటికల్స్, సముద్ర రవాణా మొదలైన రంగాలలో.మరింత సహకారానికి అవసరమైన ప్రణాళికను అందిస్తుంది. 

ఆర్కిటిక్‌కు సంబంధించిన సమస్యలపై క్రమం తప్పని ద్వైపాక్షిక సంప్రదింపుల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు పేర్కొన్నాయి.  ఉత్తర సముద్ర మార్గం పై  బహుముఖ ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని స్వాగతించాయి. మార్చి 2025లో మర్మాన్స్క్‌లో జరిగిన ఆరో అంతర్జాతీయ ఆర్కిటిక్ ఫోరమ్‌లో భారత ప్రతినిధి బృందం పాల్గొనడాన్ని రష్యా ప్రశంసించింది. ఆర్కిటిక్ కౌన్సిల్‌లో క్రియాశీల పరిశీలక పాత్ర పోషించడానికి భారత్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.

పౌర అణు సహకారం, అంతరిక్షంలో సహకారం

ఇంధన చక్రం, కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ (కేకేఎన్పీపీ) కు నిరంతర మద్దతు,  ఇంధనేతర అనువర్తనాలతో సహా అణు ఇంధన రంగంలో సహకారాన్ని విస్తృతం చేయాలనే ఉద్దేశ్యాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. అలాగే అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడం, సంబంధిత ఉన్నత సాంకేతికతల రంగంలో పరస్పర చర్యకు కొత్త ఎజెండాను రూపొందించడానికి కూడా అంగీకరించాయి. 2047 నాటికి భారతదేశ అణుశక్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలనే భారత ప్రభుత్వ ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుని, వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమైన భాగంగా అణుశక్తి శాంతియుత ఉపయోగాలలో సహకారం ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయి. 

మిగిలిన ఎన్పీపీ యూనిట్ల నిర్మాణంతో సహా కేకేఎన్పీపీ అమలులో సాధించిన పురోగతిని ఇరుపక్షాలు స్వాగతించాయి. పరికరాలు, ఇంధన సరఫరా కోసం కాలపరిమితికి కట్టుబడి ఉండాలని అంగీకరించాయి.

ఎన్పీపీ కోసం భారతదేశంలో రెండవ స్థలంపై తదుపరి చర్చ ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయి.. ఇంతకుముందు సంతకం చేసిన ఒప్పందాలకు అనుగుణంగా రెండవ స్థలం అధికారిక కేటాయింపును ఖరారు చేయడానికి భారత్ కృషి చేస్తుంది.

పరస్పరం ఆమోదయోగ్యమైన నిబంధనలు,  షరతులకు లోబడి, రష్యా రూపకల్పన చేసిన వీవీఈఆర్, ఎన్పీపీల పరిశోధన, ఉమ్మడి అభివృద్ధి, స్థానికీకరణ, రష్యా అభివృద్ధి చేసిన భారీ సామర్థ్యం గల ఎన్పీపీల కోసం అణు పరికరాలు, ఇంధన కూర్పుపై సాంకేతిక వాణిజ్య చర్చలను వేగవంతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

అంతరిక్షంలో సహకారం ప్రాముఖ్యతను గుర్తిస్తూ, శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్య అంతరిక్ష వినియోగంలో, ముఖ్యంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర కార్యక్రమాలు, ఉపగ్రహ ఆధారిత నావిగేషన్,  గ్రహాల అన్వేషణ వంటి రంగాలలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), రష్యన్ స్టేట్ స్పేస్ కార్పొరేషన్ "రోస్‌కాస్మోస్" మధ్య పెరిగిన భాగస్వామ్యాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. రాకెట్ ఇంజన్ల అభివృద్ధి, ఉత్పత్తి, వినియోగంలో పరస్పర ప్రయోజనకరమైన సహకారంలో పురోగతిని కూడా వారు గుర్తించారు.

సైనిక, సైనిక-సాంకేతిక సహకారం

సైనిక, సైనిక-సాంకేతిక సహకారం సాంప్రదాయకంగా భారత్, రష్యా మధ్య ఉన్న ప్రత్యేక, ప్రాధాన్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక మూల స్తంభం గా ఉంది. ఐఆర్ఐ జీసీ - ఎం- అండ్ ఎంటీసీ మార్గనిర్దేశం తో, అనేక దశాబ్దాల ఉమ్మడి ప్రయత్నాలు, ఫలవంతమైన సహకారం ద్వారా ఇది మరింత బలపడింది.

డిసెంబర్ 4, 2025న న్యూఢిల్లీలో జరిగిన ఎంఆర్ఐ జీసీ - ఎం- అండ్ ఎం టీసీ 22వ సమావేశం ఫలితాలను నాయకులు స్వాగతించారు. భారతదేశ ఆత్మనిర్భరత అన్వేషణకు ప్రతిస్పందనగా, ఈ భాగస్వామ్యాన్ని ఇప్పుడు అధునాతన రక్షణ సాంకేతికత,  వ్యవస్థల ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, సహ అభివృద్ధి, సహఉత్పత్తి వైపు మళ్లిస్తున్నారు.

జూన్ 2025లో క్వింగ్‌డావోలో జరిగిన ఎస్సీఓ  సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా జరిగిన రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశం సహా, నిరంతర సైనిక సంబంధాలపై నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. సాయుధ దళాల సంయుక్త సైనిక విన్యాసాలు 'ఇంద్ర'ను ఇరు దేశాలు ప్రశంసించాయి.  ఉమ్మడి సైనిక సహకార కార్యకలాపాలను కొనసాగించడానికి, అలాగే సైనిక ప్రతినిధుల మార్పిడిని విస్తరించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. 

సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఉమ్మడి భాగస్వామ్య సంస్థల ఏర్పాటు ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద రష్యా తయారీ ఆయుధాలు,  రక్షణ పరికరాల సంరక్షణకు అవసరమైన విడిభాగాలను, పరికరాలను, ఉప వ్యవస్థలను ఇతర ఉత్పత్తులను భారతదేశంలో ఉమ్మడిగా తయారు చేయడాన్ని ప్రోత్సహించేందుకు అంగీకారం కుదిరింది. ఇది భారత సాయుధ దళాల అవసరాలను తీర్చడమే కాక, పరస్పరం అనుకూలమైన మూడో దేశాలకు ఎగుమతులకు కూడా తోడ్పడుతుంది.

సైన్స్, టెక్నాలజీలో సహకారం

క్లిష్టమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని వేగవంతం చేయాలని ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి.

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు,  అధునాతన తయారీకి కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ, కీలక ఖనిజాలు, అరుదైన భూమి అన్వేషణ, ప్రాసెసింగ్ రీసైక్లింగ్ టెక్నాలజీలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరు దేశాలూ ఆసక్తిని వ్యక్తం చేశాయి.

సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాలలో ఉమ్మడి పరిశోధన అవసరాన్ని పేర్కొంటూ, ఈ రంగాల్లో మార్గ నిర్దేశ ప్రణాళిక కింద సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి. వినూత్న సాంకేతికతల ద్వారా సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి, పరిశోధన, అభివృద్ధి,  సాంకేతికతల ఉమ్మడి అభివృద్ధితో సహా, రెండు దేశాల స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థ ( (ఎస్ఎంఈి)ల కోసం అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని సులభతరం చేయాలని నిర్ణయించారు. సమాచార రక్షణ, కీలకమైన మౌలిక సదుపాయాల భద్రత, చట్ట అమలుకు సంబంధించిన వాటితో సహా, డిజిటల్ టెక్నాలజీల రంగంలో సహకారాన్ని మరింత పెంచడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తల మెరుగైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి స్టార్టప్‌ల కోసం సాఫ్ట్ సపోర్ట్ కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

సైన్స్, ఉన్నత విద్యా రంగాల్లో భారత్, రష్యాల మధ్య ఇప్పటికే ఉన్న గొప్ప సహకార అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, విద్య, శాస్త్రీయ సంస్థల మధ్య భాగస్వామ్య సంబంధాలను అభివృద్ధి చేసేందుకు ఇరుపక్షాలు పరస్పర ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఇందులో వివిధ రకాలైన విద్య/పరిశోధన కార్యక్రమాల కోసం విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల తాత్కాలిక మార్పిడి, విద్యా కార్యక్రమాలు, శాస్త్ర, పరిశోధన ప్రాజెక్టుల అమలు, ప్రత్యేక అంతర్జాతీయ ప్రదర్శనలు, సమావేశాలు, సెమినార్ల నిర్వహణ కూడా ఉన్నాయి. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల్లో ఉమ్మడి పరిశోధన ప్రాముఖ్యతను స్పష్టంగా పేర్కొంటూ, సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల రంగం లో రెండు దేశాల మధ్య సహకారం కోసం ఉద్దేశించిన మార్గ దర్శక ప్రణాళిక పరిధిలో సహకారాన్ని విస్తరించడానికి తమ సంసిద్ధతను ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. 


సాంస్కృతిక సహకారం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు

సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య సంబంధాలు రెండు దేశాల ప్రత్యేక, ప్రాధాన్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన అంశమని ఇరు పక్షాలు అంగీకరించాయి.ఇరు దేశాలలో జరిగిన ప్రధాన అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు, ఉత్సవాలు, కళా పోటీలలో భాగస్వామ్యాన్ని వారు అభినందించారు.  భారత, రష్యన్ సంస్కృతిని సంపూర్ణంగా ప్రదర్శించే లక్ష్యంతో, సమాన ప్రాతిపదికన తమ దేశాలలో సాంస్కృతిక మార్పిడి ఉత్సవాలను నిర్వహించడాన్ని స్వాగతించారు.

భారతదేశంలోనూ, రష్యాలోనూ జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉమ్మడి చిత్ర నిర్మాణం, పరస్పర భాగస్వామ్యంతో సహా చలనచిత్ర పరిశ్రమలో సహకారాన్ని విస్తరించాలనే ఆలోచనకు ఇరుపక్షాలు మద్దతు ఇచ్చాయి.

రెండు దేశాల మధ్య పర్యాటక మార్పిడిలో స్థిరమైన పెరుగుదలను ఇరుపక్షాలు అభినందించాయి.  రెండు దేశాలు ఇ-వీసాను ప్రవేశపెట్టడంతో సహా వీసా నిబంధనల సరళీకరణను స్వాగతించాయి. భవిష్యత్తులో వీసా విధానాన్ని మరింత సరళీకృతం చేసే ప్రక్రియను కొనసాగించడానికి వారు అంగీకరించారు.

రెండు దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థల మధ్య పెరిగిన మార్పిడులు, సంబంధాలను ఇరు పక్షాలు ప్రశంసతో గుర్తించాయి. సంవత్సరాలుగా, ఈ చర్చా మార్గం రెండు దేశాల వ్యూహాత్మక,విధాన రూపకల్పన వర్గాలు,  వ్యాపారాల మధ్య పరస్పర అవగాహనను పెంచింది. తద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి  దోహదపడింది.

విద్యా రంగంలో భారత్, రష్యా మధ్య సాంప్రదాయకంగా ఉన్న బలమైన సహకారాన్ని గుర్తిస్తూ, విద్యార్థుల శ్రేయస్సు కోసం జరిగిన  ప్రయత్నాలను ఇరుపక్షాలు ప్రశంసించాయి.  విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల మధ్య విద్యా సంబంధాలను ప్రోత్సహించడంలో తమ ప్రయత్నాలను కొనసాగించడానికి అంగీకరించాయి.

ఐక్యరాజ్యసమితి, బహుపాక్షిక వేదికలలో సహకారం

ఐక్యరాజ్యసమితిలోని సమస్యలపై తమ మధ్య  ఉన్నత స్థాయి రాజకీయ చర్చలు, సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి. దానిని మరింతగా పెంచుకోవడానికి అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి పోషించే కేంద్ర సమన్వయ పాత్రతో బహుపాక్షికతను పునరుజ్జీవింప చేయవలసిన అవసరాన్ని వారు స్పష్టంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవాన్ని, యూఎన్ చార్టర్‌లోని లక్ష్యాలు, సూత్రాల పట్ల తమ నిబద్ధతను కూడా అవి పునరుద్ఘాటించాయి.

సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా, అంతర్జాతీయ శాంతి, భద్రత సమస్యలను పరిష్కరించడంలో మరింత ప్రాతినిధ్యంతో ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉండేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమగ్రంగా సంస్కరించాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. సంస్కరణలు తెచ్చిన,  విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనకు తన దృఢమైన మద్దతును రష్యా పునరుద్ఘాటించింది.

జి20 లో తమ సహకారాన్ని ఇరు పక్షాలు ప్రముఖంగా ప్రస్తావించాయి.  దానిని మరింత విస్తృతం చేయడానికి అంగీకరించాయి. అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య సహకారానికి సంబంధించి ప్రధాన వేదిక అయిన జి20 ఎజెండాలో గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ఏకీకృతం చేయడం, ఆఫ్రికన్ యూనియన్ ఈ వేదికలో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరడం 2023లో జి20 అధ్యక్ష స్థానంలో అందించిన ఆచరణాత్మక వారసత్వంగా  పేర్కొన్నారు. భారత అధ్యక్షతన వర్చువల్ గా జరిగిన వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సులు ప్రపంచ వ్యవహారాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల స్థానాన్ని బలోపేతం చేయడానికి అనుకూలంగా ఒక ముఖ్యమైన సంకేతాన్ని పంపినట్టు వారు పేర్కొన్నారు. 

జీ20 అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు రెండింటికీ సమానమైన,  పరస్పర ప్రయోజనకరమైన ప్రాతిపదికన చర్చలకు ఒక వేదికను అందించే ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక వేదిక అని సంయుక్త  ప్రకటనలో పేర్కొన్నారు. జి20 తన ప్రధాన బాధ్యతపై దృష్టి పెట్టి, ఏకాభిప్రాయాన్ని ఆధారంగా చేసుకుని నిరంతరం ఫలప్రదంగా పనిచేయడం ఎంతో ముఖ్యమని వారు గుర్తించారు.

బ్రిక్స్ లో తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇరుపక్షాలు గుర్తించాయి. రాజకీయ - భద్రత, ఆర్థిక - ద్రవ్య, సాంస్కృతిక - ప్రజల మధ్య సహకారం అనే మూడు స్తంభాల కింద విస్తరించిన బ్రిక్స్‌లో సహకారాన్ని ప్రోత్సహించడానికి మరింతగా కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. పరస్పర గౌరవం,  అవగాహన, సార్వభౌమ సమానత్వం, సంఘీభావం, ప్రజాస్వామ్యం, పారదర్శకత, సమగ్రత, సహకారం ఏకాభిప్రాయం కలిగిన బ్రిక్స్ స్ఫూర్తికి వారు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2026లో  భారత బ్రిక్స్ చైర్‌షిప్‌కు రష్యా తన పూర్తి మద్దతును ప్రకటించింది.

రెండు దేశాల మధ్య ప్రత్యేక, ప్రాధాన్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడానికి షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) పరిధిలో తమ ఉమ్మడి కార్యాచరణ ప్రాముఖ్యతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.

ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీలలో రష్యా ప్రధానమంత్రి అధ్యక్షతన మాస్కోలో జరిగిన దేశాధినేతల ఎస్సీఓ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు రష్యా పక్షాన్ని భారత్ అభినందించింది. ఎస్సీఓ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలన్న భారత్ చొరవను రష్యా ప్రశంసించింది. దీని ప్రారంభ సమావేశం 2026లో భారత్ లో జరుగుతుంది.

సార్వత్రికంగా గుర్తించిన అంతర్జాతీయ చట్టం సూత్రాలు, సాంస్కృతిక, నాగరిక వైవిధ్యం ఆధారంగా ప్రాతినిధ్యం వహించే  ప్రజాస్వామ్య, న్యాయమైన బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థను రూపొందించడంలో షాంఘై సహకార సంస్థ పాత్ర పెరుగుతోందని ఇరుపక్షాలు గుర్తించాయి. 

రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి ప్రజా సంబంధాల రంగాలలో ఎస్సీఓ  సామర్థ్యాన్ని, సహకారాన్ని మరింత బలోపేతం చేయవలసిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరిహద్దుల ద్వారా జరిగే వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రతా ముప్పులను ఎదుర్కొనే రంగాలలో ఎస్సీఓ ఆధునికీకరణను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా ఇరుపక్షాలు పేర్కొన్నాయి. భద్రతా సవాళ్లను, బెదిరింపులను ఎదుర్కొనే సార్వత్రిక కేంద్రాన్ని తాష్కెంట్‌లోనూ, మాదకద్రవ్యాల వ్యతిరేక కేంద్రాన్ని దుషాన్బేలోనూ ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

సంస్కరించబడిన బహుపాక్షికత, అంతర్జాతీయ ఆర్థిక పాలనా సంస్థలు మరియు బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను సంస్కరించడం, దాని ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ కోణాలలో SDGల సాధనకు తోడ్పడటం, ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచే ప్రయత్నాలు వంటి కీలక సమస్యలపై G20, BRICS మరియు SCO లలో పరస్పర చర్యలను కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. , అంతర్జాతీయ సరఫరా గొలుసుల స్థిరత్వాన్ని పెంపొందించడం మరియు స్థితిస్థాపకతను అభివృద్ధి చేయడం, ఇందులో కీలకమైన ఖనిజాలు, స్వేచ్ఛాయుత మరియు న్యాయమైన వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉండటం మరియు వాతావరణ మార్పులతో సహా.

జీ20, బ్రిక్స్, ఎస్సీఓలో కొనసాగుతున్న పరస్పర కార్యకలాపాలను ప్రధాన అంశాలపై కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో పునర్వ్యవస్థీకృత బహుపాక్షికతకు సంబంధించిన ప్రయత్నాలు, అంతర్జాతీయ ఆర్థిక పాలనా సంస్థల, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక, సామాజిక పర్యావరణ కోణాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకారం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, స్థిరత్వాన్ని పెంచడం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల (అత్యవసర ఖనిజాలు సహా) సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉండడం,  వాతావరణ మార్పును ఎదుర్కోవడం వంటి అంశాలు ఉన్నాయి.

అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక సుస్థిరత సమస్యలతో సహా, బాహ్య అంతరిక్షం శాంతియుత ఉపయోగాలపై యూఎన్ కమిటీ (యూఎన్ సీఓపీయూఓఎస్) లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. 

భారీ విధ్వంసక ఆయుధాల వ్యాప్తిని నిరోధించచడంలో ప్రపంచ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారతదేశ సభ్యత్వానికి రష్యా తన బలమైన మద్దతును వ్యక్తం చేసింది. ప్రపంచ శాంతి,  భద్రతను ప్రోత్సహించడానికి పరస్పర విశ్వాసం స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు భారత్, రష్యా విజ్ఞప్తి చేశాయి. ఎగుమతి నియంత్రణల నిరంతర విస్తరణ రహిత స్వభావాన్ని పేర్కొంటూ, భద్రత, వాణిజ్యపరమైన పరిగణనల మధ్య సమతుల్యతను నిర్ధారించడం, అలాగే సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ రంగంలో సహకారాన్ని కొనసాగించడానికి తమ సుముఖతను వ్యక్తం చేశాయి.

తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ఆసియాన్ ప్రాంతీయ ఫోరమ్, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్‌తో సహా వివిధ ప్రాంతీయ ఫోరమ్‌లలో ప్రాంతంలో శాంతి, భద్రతను మరింతగా పెంచే లక్ష్యంతో సహకారాన్ని బలోపేతం చేయవలసిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయి. 

బాక్టీరియలాజికల్ (జీవ), టాక్సిన్ ఆయుధాల అభివృద్ధి, ఉత్పత్తి, నిల్వ, వాటిని ధ్వంసం చేయడంపై ఉన్న ఒప్పందాన్ని (బిటీడబ్ల్యూసీ) కఠినమైన పాటించాల్సిన అవసరాన్ని, దానిని స్థిరంగా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. ఇందులో దానిని సంస్థాగతీకరించడం ద్వారా బలోపేతం చేయడం, అలాగే సమర్థవంతమైన ధృవీకరణ యంత్రాంగంతో  కూడిన చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ప్రోటోకాల్‌ను ఆమోదించడం కూడా ఉన్నాయి. బిటీడబ్ల్యూసీ  అంశాలను నకలు చేసే మరే యంత్రాంగం ఏర్పాటునైనా తాము వ్యతిరేకిస్తామని కూడా ఇరు దేశాలు స్పష్టం చేశాయి. 

అంతరిక్షంలో ఆయుధ పోటీని నివారించడానికి కట్టుబడి ఉండే చట్టబద్ధ వ్యవస్థపై చర్చలు ప్రారంభించాల్సిన తక్షణ అవసరాన్ని ఇరుపక్షాలు పేర్కొన్నాయి. ఇందులో అంతరిక్షంలో ఆయుధాలను ఉంచడాన్ని,  అంతరిక్షంలో, అంతరిక్షం నుంచి లేదా అంతరిక్షానికి వ్యతిరేకంగా బలాన్ని ప్రయోగించడం లేదా ఉపయోగించడాన్ని నిషేధించడం వంటివి ఉన్నాయి. అంతరిక్షంలో ఆయుధాలను ఉంచడాన్ని నివారించడం, అంతరిక్ష వస్తువులకు వ్యతిరేకంగా బలాన్ని ఉపయోగించడం లేదా బెదిరింపుకు సంబంధించిన ఒప్పందపు ముసాయిదా,  అలాగే 2024లో ఆమోదించిన సంబంధిత ప్రభుత్వ నిపుణుల బృందం నివేదిక ఈ వ్యవస్థకు ఆధారంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డాయి.

రెండు దేశాలను ఏకం చేసే జీవవైవిధ్య పరిరక్షణ, అరుదైన, అంతరించిపోతున్న జాతుల, ముఖ్యంగా వలస పక్షి జాతుల పరిరక్షణకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలలో ప్రతిబింబించే సూత్రాలకు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ)లో చేరడానికి ఒక ఒప్పందాన్ని రష్యా ఆమోదించడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు పునరుద్ధరణ మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ)లో రష్యా త్వరగా చేరాలని భారత్ కోరింది. 

ప్రపంచ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఆర్థిక వ్యవస్థలు మార్పు చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం, సాంకేతికతలకు మెరుగైన లభ్యతను పెంపొందించడానికి, అలాగే అంతర్జాతీయ ఆర్థిక పాలనా సంస్థలను, ముఖ్యంగా బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను (సముచితంగా సంస్కరించడానికి సంబంధించిన ఉమ్మడి విధానాల అభివృద్ధిని కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఉగ్రవాదంపై పోరు

ఉగ్రవాదం, తీవ్రవాదం, సరిహద్దుల ద్వారా వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం,   మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఉమ్మడి సవాళ్లు,  బెదిరింపులను ఎదుర్కోవడంలో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

అన్ని రూపాలలోని, చర్యలలోని ఉగ్రవాదాన్ని, సరిహద్దుల ద్వారా ఉగ్రవాదుల కదలికలను,  ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వ్యవస్థలను, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే వారిని నివారించడానికి, ఎదుర్కోవడానికి తమ బలమైన నిబద్ధతను నాయకులు పునరుద్ఘాటించారు. 2025 ఏప్రిల్ 22న భారతదేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో, 2024 మార్చి 22న రష్యాలోని మాస్కో క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద చర్యలన్నింటినీ, వాటి ప్రేరణ ఏదైనా మతపరమైన లేదా సైద్ధాంతిక సాకులతో సంబంధం లేకుండా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు పాల్పడినా నేరపూరితమైనవిగా, సమర్థించరానివిగా నిర్ద్వందంగా ఖండించారు. అల్ ఖైదా, ఐసిస్/దాష్,  వాటి అనుబంధ సంస్థలతో సహా ఐక్యరాజ్యసమితి జాబితా చేసిన  అన్ని ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై సమన్వయ చర్యలు తీసుకోవాలని కూడా వారు పిలుపునిచ్చారు. ఈ చర్యలు ఉగ్రవాదుల సురక్షిత ఆశ్రయాలను రూపుమాపడం, ఉగ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టడం, ఉగ్రవాద నిధుల మార్గాలు, అంతర్జాతీయ నేరాలతో వాటికున్న సంబంధాలను తొలగించడం, సరిహద్దుల మీదుగా  విదేశీ ఉగ్రవాద నేతలు సహా ఉగ్రవాదుల కదలికలను నిలిపివేయడం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.

అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను బలమైన ఆధారంగా తీసుకుని, ఎటువంటి రహస్య లక్ష్యాలూ, ద్వంద్వ ప్రమాణాలు లేకుండా, అన్ని రూపాల, వేషాల అంతర్జాతీయ ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీ లేని పోరాటం చేయాలని రెండు దేశాలు పిలుపునిచ్చాయి. ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించడం ఎంతో ముఖ్యమని వారు అంగీకరించారు. అంతేగాకుండా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానాలు, అలాగే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం సమతుల్య అమలు అవసరాన్ని కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశాలు, వాటి సంబంధిత అధికార సంస్థలకు ఉన్న  ప్రాథమిక బాధ్యతను రెండు పక్షాలు స్పష్టంగా ప్రస్తావించాయి. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించని విధానాన్ని అవలంబించాలని అవి పిలుపునిచ్చాయి. అదేవిధంగా, ఐక్యరాజ్యసమితి పరిధిలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరితగతిన ఖరారు చేసి ఆమోదించాలని కోరాయి. ఉగ్రవాదం,  ఉగ్రవాదానికి దారితీసే హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యూఎన్జీఏ), భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీర్మానాల అమలుకు నిబద్ధతను తెలిపాయి. 

భారత ఉగ్రవాద వ్యతిరేక కమిటీ (సీటీసీ) అధ్యక్షతన అక్టోబర్ 2022లో భారత్ లో జరిగిన యూఎన్ఎస్‌సీ  కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశాన్ని ఇరు పక్షాలు గుర్తుచేసుకున్నాయి.  ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త,  అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల వాడకాన్ని ఎదుర్కోవడంపై ఏకగ్రీవంగా ఆమోదించిన ఢిల్లీ డిక్లరేషన్‌ను స్వాగతించాయి. చెల్లింపు సాంకేతికతలు, సోషల్ మీడియా వేదికలు, నిధుల సేకరణ పద్ధతులు, మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీలు లేదా డ్రోన్‌లు) దుర్వినియోగం వంటి సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉగ్రవాదులు దోపిడీ చేయడానికి సంబంధించిన ప్రధాన సవాళ్ళను పరిష్కరించడం ఈ డిక్లరేషన్ లక్ష్యంగా పెట్టుకుందని వారు పేర్కొన్నారు. ఆన్‌లైన్ స్పేస్‌లో విప్లవ, తీవ్రవాద భావజాల వ్యాప్తిని నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఈ రంగంలో తదుపరి సహకారాన్ని అభివృద్ధి చేయడానికి ఇరుపక్షాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ఎస్‌సీఓ, బ్రిక్స్ విధానాల్లో సంబంధిత యంత్రాంగాలను బలోపేతం చేసే సానుకూల పురోగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు

ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ముఖ్యంగా ఇరు దేశాల భద్రతా మండళ్ల మధ్య చర్చల యంత్రాంగం ద్వారా జరుగుతున్న సన్నిహిత సమన్వయాన్ని ఇరు పక్షాలు ప్రశంసతో గుర్తించాయి. మాస్కో ఫార్మాట్ సమావేశాల కీలక పాత్రను కూడా వారు ప్రముఖంగా పేర్కొన్నారు. 

ఐఎస్ఐఎస్,  ఐఎస్కేపీ, వాటి అనుబంధ సంస్థలతో సహా అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులపై తీసుకుంటున్న చర్యలను నాయకులు స్వాగతించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరాటం సమగ్రంగా, ప్రభావవంతంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ ప్రజలకు అత్యవసర,  నిరంతరాయ మానవతా సహాయాన్ని అందించాల్సిన అవసరాన్ని వారు పేర్కొన్నారు. 

మధ్యప్రాచ్యం/పశ్చిమ ఆసియాలో శాంతి,  సుస్థిరత్వానికి తమ నిబద్ధతను ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. సంయమనం పాటించాలని, పౌరులను రక్షించాలని,  అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చాయి. అలాగే పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే, ప్రాంతీయ సుస్థిరత్వాన్ని దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. ఇరాన్ అణు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని కూడా వారు ప్రస్తావించారు. గాజాలో నెలకొన్న మానవతా పరిస్థితి పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఘర్షణల విరమణ, మానవతా సహాయం, సుస్థిర శాంతి కోసం తమ మధ్య కుదిరిన ఒప్పందాలు, అవగాహనలకు సంబంధిత పక్షాలన్నీ కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు. 

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్ఎఫ్సీసీసీ), పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలను విస్తరించాల్సిన అవసరాన్ని ఇరు పక్షాలు గుర్తించాయి. వాతావరణ మార్పు, తక్కువ కార్బన్ అభివృద్ధి సమస్యలపై కుదిరిన అవగాహన ఒప్పందం పరిధిలో న్యూఢిల్లీలో సెప్టెంబర్ 10, 2025న వాతావరణ మార్పు,  తక్కువ కార్బన్ అభివృద్ధి సమస్యలపై జరిగిన భారత్, రష్యా సంయుక్త అధ్యయన బృందం తొలి సమావేశాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి. పారిస్ ఒప్పందం ఆర్టికల్ 6  లోని అంశాలను అమలు చేయడం, తక్కువ కార్బన్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, స్థిరమైన ఫైనాన్స్ సాధనాలను ఉపయోగించడంపై ద్వైపాక్షిక చర్చలను వేగవంతం చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

వాతావరణ మార్పుల ముఖ్య సమస్యలపై జీ20, బ్రిక్స్, ఎస్సీఓలలో పరస్పర చర్యలను కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. వాతావరణ మార్పు,  సుస్థిర అభివృద్ధిపై బ్రిక్స్ సంప్రదింపుల బృందంలో సమన్వయంతో చేసిన కృషి ద్వారా సాధించిన ఫలితాలను ఇరు పక్షాలు స్వాగతించాయి.  ఇందులో బ్రిక్స్ వాతావరణ పరిశోధన వేదిక, వాణిజ్యం, వాతావరణం, సుస్థిర అభివృద్ధి కోసం బ్రిక్స్ ప్రయోగశాలను ప్రారంభించడం కూడా ఉన్నాయి. 2026లో ఈ కూటమికి భారతదేశం అధ్యక్షత వహించే సమయంలో బ్రిక్స్‌లో వాతావరణ మార్పులను పరిష్కరించే విషయంలో ఫలవంతమైన సహకారాన్ని ఇరు పక్షాలు ఆకాంక్షించాయి. 

భారత్, రష్యా ప్రత్యేక, ప్రాధాన్య వ్యూహాత్మక భాగస్వామ్యం సుస్థిరత, వాటి విదేశాంగ విధానాల సారూప్య, అనుబంధ విధానాల పట్ల ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. దానిని మరింత బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. భారత్, రష్యా దేశాలు ప్రధాన శక్తులుగా బహుళ ధ్రువ ప్రపంచంలోనూ, బహుళ ధ్రువ ఆసియాలోనూ ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం కృషి చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో తమకు, తమ ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి గాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 24వ భారత-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం 2026లో రష్యాను సందర్శించవలసిందిగా శ్రీ మోదీని ఆయన ఆహ్వానించారు.

 

***


(रिलीज़ आईडी: 2199715) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Manipuri , Gujarati , Kannada , Malayalam , Bengali , English , Urdu