|
ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌసల్య వికాస్ కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
19 OCT 2023 7:48PM by PIB Hyderabad
నమస్కారం!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి భాయ్ శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్, శ్రీ మంగళ్ ప్రభాత్ లోధా, రాష్ట్ర మంత్రులు, సోదరీసోదరులారా!
ఈ నవరాత్రి సమయంలో వేడుకలు శుభప్రదంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మనం దుర్గాదేవి ఐదో రూపమైన స్కందమాతను పూజిస్తాం. తన బిడ్డ సర్వదా ఆనందంగా జీవించాలని, అపార కీర్తి ప్రతిష్ఠలు సముపార్జించాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకు మార్గం విద్య, నైపుణ్య సాధన మాత్రమే. ఈ దిశగా నవరాత్రి వంటి శుభ సందర్భంలో రాష్ట్రంలోని యువతరం నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధితో ముందడుగు వేయడానికి నిశ్చయించుకుని ఇక్కడ నా ముందు కూర్చున్న లక్షలాది యువత జీవితాల్లో ఈ ఉదయం శుభప్రదంగా మొదలైందని చెప్పక తప్పదు. ఈ బృహత్తర కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
మిత్రులారా!
ప్రపంచమంతటా నిపుణ భారత యువతకు డిమాండ్ విస్తృతమవుతోంది. ముఖ్యంగా జనాభాలో వృద్ధుల సంఖ్య అధికంగా గల అనేక దేశాలకు యువతరం లభ్యత చాలా కష్టం. మొత్తం మీద 16 దేశాలు సుమారు 40 లక్షల మంది నైపుణ్యంగల యువత కోసం ఎదురు చూస్తున్నాయని అనేక సర్వేలు తేల్చిచెప్పాయి. దేశీయంగా నిపుణ యువతకు కొరత ఫలితంగా అవి ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు విదేశాల్లో నిర్మాణ, ఆరోగ్య సంరక్షణ, పర్యాటక-ఆతిథ్య, విద్య, రవాణా వంటి అనేక రంగాల్లో నిపుణ యువత అవసరం ఎంతగానో ఉంది. అందువల్ల, భారత్ తన కోసమేగాక ప్రపంచ దేశాల కోసం నిపుణులను సిద్ధం చేస్తోంది.
మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఈ కొత్త నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రపంచవ్యాప్త అవకాశాలను అందుకునే విధంగా యువతను సిద్ధం చేస్తాయి. నిర్మాణ రంగ సంబంధితమైనవే కాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులలో నైపుణ్యాన్ని కూడా ఇక్కడ నేర్పుతారు. ఈ రాష్ట్రంలో మీడియా, వినోద రంగాలు అపార అవకాశాల గనులు. కాబట్టి, సంబంధిత ప్రత్యేక శిక్షణనిచ్చే కేంద్రాలు కూడా ఏర్పాటవుతాయి. భారత్ నేడు ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ రంగానికి కూడలిగా రూపొందుతోంది. కాబట్టి, అనేక కేంద్రాల్లో ఈ నైపుణ్యం కూడా పొందవచ్చు. ఇందుకుగాను మహారాష్ట్ర యువతకు నా అభినందనలతోపాటు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలో సాంకేతికేతర అంశాల్లో శిక్షణను కూడా భాగం చేయాలని ప్రభుత్వానికి, శ్రీ షిండేగారికి, ఆయన బృందానికి నా విజ్ఞప్తి. అలాగే, విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తే, దైనందిన జీవితంలో ఉపయోగించే ఓ 10-20 వాక్యాలను కూడా వారికి నేర్పాల్సి ఉంది. భాషపరంగా సమస్యలు తలెత్తకుండా కృత్రిమ మేధతో పని చేయించడంలోనూ వారికి తర్ఫీదు ఇవ్వడం అవసరం. విదేశాల్లో పని చేసేవారికి ఇలాంటివన్నీ చాలా ఉపయోగకరం. ఇలా సుశిక్షితులైన వారిని కంపెనీలు త్వరగా పనిలోకి తీసుకుంటాయి. అంటే- వారు ఉద్యోగార్హతతో విదేశాలకు వెళ్లగలుగుతారు. కాబట్టి, సాంకేతికేతర నైపుణ్య శిక్షణ దిశగా కొన్ని నిబంధనలను మార్చాలని కోరుతున్నాను. దీంతోపాటు ఆన్‌లైన్ మాడ్యూళ్లను రూపొందిస్తే, మిగిలిన సమయంలో ప్రత్యేక నైపుణ్య సాధనకు వారు పరీక్షలు రాసే వీలుంటుంది.
మిత్రులారా!
నైపుణ్యాభివృద్ధిపై మునుపటి ప్రభుత్వాలకు దూరదృష్టి లోపించడమేగాక చాలాకాలం పాటు ఉదాసీనత ప్రదర్శించడంతో యువతరం అనేక ఇక్కట్లకు గురైంది. పారిశ్రామిక రంగంలో డిమాండుకు తగినట్లుగా యువతకు ప్రతిభ ఉన్నప్పటికీ, నైపుణ్య శిక్షణ లేక ఉద్యోగాలు లభించడం కష్టమైంది. అయితే, మా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకతను గుర్తించి, దేశంలో తొలిసారి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా సృష్టించింది. ఆ విధంగా యువతరం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను సృష్టించడమే కాకుండా ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులతో, వివిధ పథకాలను కూడా మేం ప్రారంభించాం. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా వందలాది ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిద్వారా 1.30 కోట్ల మందికిపైగా యువత వివిధ వృత్తులలో శిక్షణ పొందారు.
మిత్రులారా!
నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వ శ్రద్ధ ఫలితంగా సామాజిక న్యాయ కల్పనకూ ఎంతో ఉత్తేజం లభించింది. సమాజంలోని బలహీన వర్గాల నైపుణ్యాభివృద్ధికి బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆనాడు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఆలోచన ధోరణి ప్రాథమిక సత్యంతో ముడిపడినది కాబట్టి, మన దళిత, అణగారిన సోదరీసోదరులకు భూమి లేదన్న వాస్తవం ఆయనకు బాగా తెలుసు. అందుకే, వారంతా గౌరవప్రదంగా జీవించాలంటే పారిశ్రామికీకరణకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. పరిశ్రమలలో పని చేయాలంటే నైపుణ్యం అత్యంత కీలకం. ఈ వర్గాలలో చాలామందికి నైపుణ్యం లేని కారణంగా లోగడ సంతృప్తికర ఉపాధికి, మంచి ఉద్యోగాలకు దూరమయ్యారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా నైపుణ్య పథకాల అమలుతో పేదలు, దళితులు, వెనుకబడిన, గిరిజన వర్గాలు మరింత ప్రయోజనం పొందుతున్నాయి.
మిత్రులారా!
దేశంలో మహిళా విద్యకుగల సామాజిక అవరోధాలను తొలగించడం ఎలాగో మాతా సావిత్రిబాయి ఫూలే ఆచరణాత్మకంగా చూపారు. విజ్ఞానం, నైపుణ్య సముపార్జనతో మహిళలు సమాజంలో మార్పు తేగలరని ఆమె ప్రగాఢంగా విశ్వసించారు. ఆమె ప్రేరణతో ప్రభుత్వం కూడా బాలికల విద్య, శిక్షణకు సమ ప్రాధాన్యమిస్తోంది. తదనుగుణంగా ప్రతి గ్రామంలో స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళా సాధికారత కార్యక్రమం కింద 3 కోట్ల మందికిపైగా మహిళలకు ప్రత్యేక శిక్షణ పొందారు. దేశంలో నేడు డ్రోన్ల ద్వారా వ్యవసాయంతోపాటు ఇతరత్రా పనులు కొన్ని చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నైపుణ్యం దిశగానూ అక్కచెల్లెళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
మిత్రులారా!
ప్రతి గ్రామంలోనూ భావితరానికి తమ నైపుణ్యాన్ని వారసత్వంగా అందించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. క్షురకులు, చర్మకారులు, రజకులు, తాపీ మేస్త్రీలు, వడ్రంగులు, కుమ్మరులు, కమ్మరులు, స్వర్ణకారుల వంటి నైపుణ్యంగల కుటుంబం లేని గ్రామమంటూ ఉండదు. అటువంటి కుటుంబాల పోషణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లతో ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ను ప్రారంభించింది. దీని గురించి అజిత్ దాదా ఇప్పుడే ప్రస్తావించారు... ఈ పథకం కింద శిక్షణ ఇవ్వడమేగాక ఆధునిక పరికరాల కొనుగోలుకు ఆర్థిక సహాయం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఏర్పాటయ్యే 500కు పైగా గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ‘పీఎం విశ్వకర్మ పథకాన్ని’ కూడా అమలు చేస్తాయని ప్రభుత్వం నాకు సమాచారమిచ్చింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా!
నైపుణ్యాభివృద్ధి దిశగా కృషి మాత్రమే కాకుండా నైపుణ్యం పెంపుతో దేశాన్ని బలోపేతం చేయగల రంగాలపైనా మనం దృష్టి సారించాలి. ఉదాహరణకు తయారీ రంగంలో నేడు మంచి నాణ్యతగల... ముఖ్యంగా లోపరహిత ఉత్పత్తులు అవసరం. అలాగే ‘పారిశ్రామిక విప్లవం 4.0’ కోసం కొత్త నైపుణ్యాలూ అవశ్యం. సేవల రంగం, జ్ఞాన ఆర్థిక వ్యవస్థ, ఆధునిక సాంకేతికతలను దృష్టిలో ఉంచుకుంటూ, ప్రభుత్వాలు కూడా కొత్త నైపుణ్యాలపై దృష్టి సారించాలి. ఏ రకమైన ఉత్పత్తులతో మనం స్వావలంబన వైపు వెళ్లగలమో మనం పరిశీలించాలి. అటువంటి ఉత్పత్తుల తయారీకి కావాల్సిన నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలి.
మిత్రులారా!
మన వ్యవసాయ రంగానికి కూడా ఇప్పుడు కొత్త నైపుణ్యాల అవసరం ఎంతగానో ఉంది. రసాయనాల వినియోగం వల్ల భూమాతకు విఘాతం కలుగుతోంది. భూసార పరిరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతులు అనుసరించడమే కాకుండా కొత్త నైపుణ్యాన్ని కూడా జోడించడం అవశ్యం. పంటల సాగులో నీటి సమతుల వినియోగం లక్ష్యంగా కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, వాటికి విలువ జోడింపు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటివి కూడా అవసరమే. అంతేగాక ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా వాటిని ప్రపంచానికి చేరువ చేసే కొత్త నైపుణ్యాలు కావాలి. ఈ దిశగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తమ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పథకాల పరిధిని మరింత విస్తరించాలి. ‘స్వాతంత్ర్య అమృత కాలం’లో వికసిత భారత్‌కు రూపుదిద్దాలంటే నైపుణ్యాభివృద్ధి సంబంధిత అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
ఈ నేపథ్యంలో శ్రీ షిండేతోపాటు ఆయన బృందానికి మరోసారి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నైపుణ్య పథంలో ప్రయనం ప్రారంభించిన లేదా దానిపై దృష్టి సారించి, ముందడుగుకు నిశ్చయించుకున్న యువత సరైన మార్గం ఎంచుకున్నారని నమ్ముతున్నాను. నైపుణ్య సముపార్జనతో సామర్థ్యం పెంపు ద్వారా వారు తమ కుటుంబాలకే కాకుండా దేశానికీ ఎంతో మేలు చేయగలరు. కాబట్టి, ఇక్కడి యువ కుమారులు, కుమార్తెలందరికీ నా శుభాకాంక్షలు.
చివరగా మీతో ఒక అనుభవాన్ని పంచుకుందామని భావిస్తున్నాను. నా విదేశీ పర్యటనలలో భాగంగా సింగపూర్ ప్రధానమంత్రితో కలసి ఓ కార్యక్రమానికి హాజరయ్యాను. నా కార్యక్రమాల జాబితా ప్రకారం నాకు అంత తీరిక లేకపోయినా, ఏదో ఒక విధంగా సమయం కేటాయించాలని ఆయన మరీమరీ కోరారు. ఒక దేశ ప్రధానమంత్రి అభ్యర్థన కాబట్టి, కొన్ని సర్దుబాట్లు చేసుకుని ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. సింగపూర్‌లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నాకు చూపించడం కోసమే ఆయన అలా అభ్యర్థించారు. ఆ కేంద్రం మనం భారత్‌లో నిర్వహించే ‘ఐటీఐ’ లాంటిది... ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లి, దాని గురించి సగర్వంగా వివరించారు. అది తన మానస పుత్రికని, ఆ సంస్థను తానెంతో ప్రేమతో చూసుకుంటానని వివరించారు. అయితే, ఇలాంటి సంస్థలో చేరడాన్ని ప్రజలు సామాజికంగా ఇచ్చగించని పరిస్థితి ఉండేదని చెప్పారు. తమ పిల్లలు కాలేజీకి వెళ్లకుండా ఇలాంటి వృత్తివిద్య అభ్యసించడాన్ని తల్లిదండ్రులు సాటివారిలో తలవంపుగా భావించేవారని తెలిపారు. కానీ, తాను పట్టుబట్టి, ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. దీంతో పలుకుబడిగల కుటుంబాల పెద్దలు కూడా తమ పిల్లల నైపుణ్యాభివృద్ధి కోసం ఇక్కడ చేర్చడానికి సిఫారసు చేయాల్సిందిగా తనను కోరుతున్నారని వివరించారు. నిజం చెప్పాలంటే- సాక్షాత్తూ ప్రధానమంత్రి నిశితంగా దృష్టి సారించిన కారణంగానే ఆ సంస్థకు పేరుప్రతిష్ఠలు పెరిగాయి. అదే తరహాలో శ్రమశక్తి ప్రాధాన్యాన్ని గుర్తించి.. ‘శ్రమయేవ జయతే’ నినాదానికి అనుగుణంగా నిపుణ మానవశక్తిని పెంచుకోవడం మనందరి సామాజిక కర్తవ్యం.
ఈ కార్యక్రమానికి హాజరైన యువతకు మరోసారి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. లక్షలాది ప్రజల సమక్షంలో మీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించినందుకు శ్రీ మంగళ్ ప్రభాత్, శ్రీ షిండే బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఎటు చూసినా యువతరమే కనిపిస్తోంది... వారందర్నీ ఇలా కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
నమస్కారం!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(रिलीज़ आईडी: 2198111)
|