ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సత్కార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 01 DEC 2025 1:13PM by PIB Hyderabad

గౌరవనీయ అధ్యక్షా!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరికీ ఇది గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా మీకు మా సాదర స్వాగతం... మీ మార్గదర్శకత్వాన ఈ సభలో కీలకాంశాల చర్చకు, తద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీ అమూల్య మార్గదర్శనం లభించడం మాకందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ మేరకు సభ తరపున, నా తరపున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవనీయ సభ్యులందరూ ఈ ఎగువ (రాజ్య)సభ మర్యాదను సదా పరిరక్షిస్తారని, చైర్మన్‌గా మీ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాను.. ఇది మీకు నేనిస్తున్న హామీ.

మన చైర్‌పర్సన్ ఓ సాధారణ... రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పటిదాకా తన జీవితమంతా సామాజిక సేవకే అంకితం చేశారు. ఇది ఆయన నిరంతర ప్రస్థానం కాగా, రాజకీయాలు అందులో ఒక భాగం మాత్రమే. ఆయన తన సమయంలో అధికశాతం సమాజ సేవలోనే గడిపారు. అత్యంత కీలకమైన యవ్వన దశ నుంచి ఇప్పటిదాకా సమాజ సంక్షేమానికి అదే నిబద్ధతతో పనిచేశారు. సామాజిక సేవాసక్తిగల మనందరికీ ఆయనొక ఒక ప్రేరణ... మార్గం చూపే కరదీపిక. ఒక సామాన్య కుటుంబికుడుగా.. సాధారణ సమాజ సభ్యుడుగా.. మారుతున్న రాజకీయ పరిస్థితులను అధిగమిస్తూ ఈ స్థాయికి ఎదగడమేగాక మనందరికీ మార్గనిర్దేశం చేయడం భారత ప్రజాస్వామ్యానికే గొప్ప గౌరవం. ఈ నేపథ్యంలో మీతో చిరకాల పరిచయం, ప్రజా జీవితంలో మీతో కలసి పనిచేసే అవకాశం లభించడం నాకు దక్కిన అదృష్టంగా పరిగణిస్తున్నాను. ఏదేమైనా, నేను ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ పాత్రలలో మీ పనితీరును గమనించినందున సహజంగానే మీపై నాలోని ప్రగాఢ సానుకూల భావన ఇలా వ్యక్తమైంది.

గౌరవనీయ అధ్యక్షా!

మీరు కాయిర్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించినపుడు ఆ సంస్థను చారిత్రక రీతిలో అత్యధిక లాభార్జనగల సంస్థగా తీర్చిదిద్దారు. అంకిత భావంతో సేవలందించగల ఒక వ్యక్తి ఏ సంస్థనైనా ఎంత వృద్ధిలోకి తేగలరో, దానికి ప్రపంచస్థాయి గుర్తింపును సముపార్జించి పెట్టగలరో మీరు నిరూపించారు. మన దేశంలో చాలా తక్కువ మందికి అనేక రంగాల్లో ఇటువంటి అవకాశాలు లభిస్తాయి. ఇక జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌ విధులను మీరు ఎంతో బాధ్యతతో నిర్వర్తించారు. ముఖ్యంగా జార్ఖండ్‌లో గిరిజన సమాజంతో మీరెంతటి ప్రగాఢ అనుబంధం ఏర్పరచుకున్నారో నేను గమనించాను. మేం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎప్పుడు కలిసినా, అక్కడ మీరు చిన్నచిన్న గ్రామాలను కూడా సందర్శించడాన్ని సగర్వంగా ప్రస్తావించేవారు. కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్ అందుబాటులో లేకున్నా మీరు వెనుకాడకపోవడం అక్కడి రాజకీయ నాయకులను ఆందోళనకు గురిచేసింది. ఏ వాహనం అందుబాటులో ఉంటే, అందులో ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోతుంటారు. సదుపాయాల గురించి యోచించకుండా మారుమూల ప్రదేశాలలో రాత్రివేళ కూడా బస చేసేవారు. రాష్ట్రంలో అత్యున్నతమైన గవర్నర్ పదవిలో ఉండి కూడా మీరు ప్రదర్శించిన సేవా స్ఫూర్తి, ఆ పాత్రకు మీరు సంపాదించిపెట్టిన గౌరవం మాకు సుపరిచితం.

ఓ సామాజిక కార్యకర్తగా, నాతో కలసి పనిచేసిన సహచరులుగా మీరు నాకు చిరపరిచితులు. ఈ పదవిని అలంకరించే ముందు మిమ్మల్ని పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా ఇతరత్రా వివిధ పదవుల్లో చూశాను. అయితే, సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉన్నపుడు కొందరు, కొన్ని సందర్భాల్లో దాని బాధ్యతలను ఒక భారంగా భావించే పరిస్థితి లేదా సంబంధిత విధివిధానాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కానీ, మీరు అటువంటి విధివిధానాలకు అతీతంగా వ్యవహరించడం నేను చూశాను. ప్రజా జీవితంలో అలా పని చేయాలంటే ఒక విశిష్ట సామర్థ్యం ఉండాలన్నది నా ప్రగాఢ నమ్మకం. మీలో ఆ సామర్థ్యం ప్రతిసారి మాకు అనుభవమైంది... అది మాకందరికీ గర్వకారణం.

గౌరవనీయ అధ్యక్షా!

సేవ, అంకితభావం, సంయమనం వంటి మాకందరికీ తెలిసిన విశిష్ట లక్షణాలు మూర్తీభవించిన మీ వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తాయి. దేశంలో “డాలర్‌ సిటీ” (తిరుప్పూరు)గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నగరంలో మీరు జన్మించినప్పటికీ, అణగారిన, వెనుకబడిన వర్గాల సముద్ధరణకే జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకోవడం ఎంతయినా ముదావహం.

గౌరవనీయ అధ్యక్షా!

మీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన రెండు ఉదంతాలను మీ నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి నేను విన్నాను. వాటిని తప్పక ప్రస్తావించాలని నేనిప్పుడు నిర్ణయించుకున్నాను. వాటిలో మొదటిది... మీరు బాల్యంలో అవినాషి ఆలయ పుష్కరిణిలో మునిగిపోయినా, ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, “మునిగిపోవడం వరకూ మాత్రమే నాకు తెలుసు... నన్నెవవరు రక్షించారో ఈనాటికీ తెలియదు. కానీ, నేను బతికి బయటపడ్డాను” అని చెప్పారు. ఈ సంఘటనను గుర్తు చేసుకున్నపుడల్లా మీపై దయ చూపిన ఆ దైవానికి మీ కుటుంబం కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంటుంది. ఇక రెండో ఉదంతం... మాకందరికీ బాగా తెలిసినదే! కోయంబత్తూరులో శ్రీ లాల్ కృష్ణ అద్వానీ పర్యటనకు ముందు భీకర బాంబు పేలుడు చోబుచేసుకుంది. ఆ విధ్వంసక ఉదంతంలో దాదాపు 60-70 మంది మరణించారు. దీని బారినుంచి మీరు త్రుటిలో బయటపడ్డారు. ఈ రెండు సంఘటనలను దైవ కటాక్ష సంకేతాలుగా పరిగణించిన మీరు, సమాజ సేవకు మరింతగా అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రగాఢ సానుకూల ధోరణితో తీసుకున్న ఆ నిర్ణయం ఆ తర్వాత మీ జీవితానికి ప్రతిబింబంగా మారింది.

గౌరవనీయ అధ్యక్షా!

మీ విషయంలో నాకు ఇటీవలే ఒక సంగతి తెలియవచ్చింది... ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక మీరు కాశీకి వెళ్లినపుడు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా అక్కడ ఏర్పాట్లన్నీ సవ్యంగానే ఉంటాయని నేను భావించాను. అయితే, ఆ పర్యటనలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం కాశీ నగరానికి సంబంధించి నాలో కొత్త ఆలోచనను స్ఫురింపజేసింది. మీరు మాంసాహారి అయినప్పటికీ- జీవితంలో తొలిసారి కాశీని సందర్శించి, విశ్వనాథుడికి పూజలు చేశాక గంగామాత ఆశీస్సులు పొందిన తర్వాత ఇకపై శాకాహారానికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, మాంసాహారం మంచిది కాదని, ఆ అలవాటు ఉన్నవారు మంచివారు కాదని నేను అనడం లేదు. కానీ, పావన కాశీ నగరం నేలపై మీ మనసులో కలిగిన పవిత్ర భావనతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని అక్కడి ఎంపీగా నేను సదా గుర్తుంచుకుంటాను. ఆ దిశగా మీకు స్ఫూర్తినిచ్చిన అంతర్గత ఆధ్యాత్మిక భావన అద్భుతమని చెప్పక తప్పదు.

గౌరవనీయ అధ్యక్షా!

విద్యార్థి దశలోనే మీలోని బలమైన నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటమైన నేపథ్యంలో ఇవాళ ఈ స్థానాన్ని అలంకరించి జాతీయ స్థాయిలో మమ్మల్ని నడిపించడానికి సిద్ధం కావడం మాకందరికీ గర్వకారణం.

గౌరవనీయ అధ్యక్షా!

అనేకమంది యువకులు సులభ మార్గాలను ఎంచుకునే కాలంలో ప్రజాస్వామ్య సమర్థకుడుగా మీరు ఆ దారిన కాకుండా, పోరుబాట పట్టారు. ప్రజాస్వామ్యానికి ఎదురైన సవాలును ఎదుర్కోవడానికే సిద్ధమయ్యారు. ఆ మేరకు ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షక దళ సభ్యుడిలా ఎదురొడ్డి నిలిచారు. ఆనాడు వనరులు పరిమితం... అవరోధాలు అపరిమితం... కానీ, మీ స్ఫూర్తి పూర్తిగా భిన్నం. మీ ప్రాంతంలోని ఆనాటి యువతరం అప్పటి మీ పోరాటాన్ని ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. ప్రజల్లో అవగాహన విస్తరణకు మీరు చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలను ఉత్తేజ పరచిన విధానం ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ శాశ్వత స్ఫూర్తిగా మిగిలాయి. మీ నిర్వహణ సామర్థ్యం ఎనలేనిది... అది నాకు బాగా తెలుసు. సంస్థలో మీకు అప్పగించిన ప్రతి బాధ్యతనూ నిబద్ధతతో నిర్వర్తించేందుకు మీరు సదా కృషి చేసేవారు. ప్రజలను ఒకేతాటిపై నడిపించడానికి, నవ్య దృక్పథాన్ని అంగీకరించి, కొత్త తరానికి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నించారు. సంస్థాగత కార్యకలాపాల్లో ఇది సదా కీలక లక్షణం. కోయంబత్తూరు ప్రజలు మిమ్మల్ని తమ ప్రతినిధిగా పార్లమెంటుకు పంపారు. అప్పుడు కూడా ఈ సభలో ముందుగా మీరు ఆ ప్రాంత సమస్యలకు అగ్ర ప్రాధాన్యమిచ్చి ప్రస్తావించే వారు. ఇవాళ ఈ సభకు చైర్‌పర్సన్‌గా, దేశ ఉప రాష్ట్రపతిగా మీ అపార అనుభవం మాకు స్ఫూర్తిదాయకం మాత్రమేగాక నిరంతర మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ సభలోని సభ్యులందరూ నేటి గర్వించదగిన క్షణాన్ని స్మరించుకుంటూ కర్తవ్య నిబద్ధతతో ముందుకు సాగుతారని నేను విశ్వసిస్తున్నాను. ఈ భావనతో నా తరఫున, సభ తరఫున మరోసారి మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

 

 

***


(रिलीज़ आईडी: 2197371) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam