|
ప్రధాన మంత్రి కార్యాలయం
భారత తొలి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్.. నమో భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
20 OCT 2023 4:35PM by PIB Hyderabad
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, విశేష ప్రజాదరణ గల చురుకైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి, శ్రీ వి.కె.సింగ్, శ్రీ కౌశల్ కిషోర్, ఇతర గౌరవనీయ ప్రముఖులు సహా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన నా కుటుంబ సభ్యులారా!
భారత తొలి రాపిడ్ రైలు రవాణా వ్యవస్థతోపాటు నమో భారత్ రైలును ఈ రోజు దేశానికి అంకితం చేయడం ఒక చారిత్రక ఘట్టం. దాదాపు నాలుగేళ్ల కిందట ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ కారిడార్ ప్రాజెక్టుకు నేను శంకుస్థాపన చేశాను. ఈ మార్గంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఇవాళ్టి నుంచి నమో భారత్ రైలు నడుస్తుంది. ఏదైనా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే రోజునే దాన్ని ప్రారంభించే తేదీని కూడా ప్రకటిస్తామని ఇంతకుముందు చెప్పిన మాటను నేనిప్పుడు పునరుద్ఘాటిస్తున్నాను. తదనుగుణంగా ఈ మార్గంలోని మీరట్ విభాగం ఏడాది లేదా ఏడాదిన్నరలో పూర్తవుతుంది.. ఆ సమయానికి మీ సేవలో ఉంటానని నేనిప్పుడే ప్రకటిస్తున్నాను.
ఈ అత్యాధునిక రైలులో ప్రయాణానుభూతిని నేను కూడా పొందాను. నా బాల్యం రైలు ప్లాట్‌ఫామ్‌లపై గడిపినా, నేటి రైల్వేల కొత్త రూపం నన్నెంతో ఉత్తేజితం చేస్తుంది. కాబట్టి, ఇదొక సుసంపన్న ఆనంద దాయక అనుభవం కాగలదని నేను ఘంటాపథంగా చెబుతున్నాను. మన సంప్రదాయంలో నవరాత్రి సమయాన శుభ కార్యాలు నిర్వహిస్తుంటారు. ఆ తరహాలోనే ఇవాళ దేశంలో తొలి నమో భారత్ రైలును కాత్యాయనీ మాత ఆశీస్సులతో ప్రారంభించాం. ఈ రైలును నడిపే డ్రైవర్లు సహా సిబ్బంది మొత్తం మహిళలే కావడం ఈ సందర్భంగా గమనార్హం. వీరు మన భరతమాత పుత్రికలు... ‘నారీశక్తి’ బలం ఇనుమడించడాన్ని ఈ పరిణామం సూచిస్తుంది. నవరాత్రి శుభ సందర్భంగా, ఈ బహుమతి పొందిన ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమో భారత్ రైలు ఆధునికమైనదేగాక, వేగంతోపాటు అద్భుత సామర్థ్యంగలది. నవ భారత్‌లో కొత్త ప్రయాణాలు, సంకల్పాలను ఇది నిర్వచిస్తుంది.
నా కుటుంబ సభ్యులారా!
దేశ ప్రగతి రాష్ట్రాల అభివృద్ధితో ముడిపడి ఉంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడిక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ మనతో ఉన్నారు... ఇవాళ బెంగళూరులోని రెండు మెట్రో లైన్లను కూడా దేశానికి అంకితం చేశాం. వీటిద్వారా బెంగళూరు ఐటీ హబ్‌తో అనుసంధానం మరింత మెరుగవుతుంది. దాదాపు 8,00,000 మంది నిత్యం మెట్రో మార్గంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో మరో రెండు లైన్లు అందుబాటులోకి రావడంపై నగర ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
నా కుటుంబ సభ్యులారా!
ప్రస్తుత 21వ శతాబ్దంలో భారత్ అన్ని రంగాల్లోనూ వేగంగా పురోగమిస్తోంది. చంద్రయాన్ ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపడం ద్వారా తన ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. భారీస్థాయిలో జి20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణ ద్వారా ప్రపంచంతో అనుసంధాన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. యావత్ ప్రపంచానికి ఒక ఆకర్షణగా, ఉత్సుకత కలిగించే దేశంగా భారత్ రూపాంతరం చెందింది. నేటి భారత్ ఆసియా క్రీడలలో రాణించింది... ముఖ్యంగా నా ఉత్తరప్రదేశ్ తోడ్పాటుతో 100 పతకాలను కైవసం చేసుకుంది. అలాగే 5జి సాంకేతికతను స్వయంగా ప్రారంభించి, దేశం నలుమూలలకూ చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలలోనూ నేటి భారత్ ముందంజలో ఉంది.
ప్రపంచాన్ని కోవిడ్-19 సంక్షోభం వణికించినప్పుడు భారత్ రూపొందించిన టీకాలు లక్షలాది ప్రాణాలను రక్షించాయి. ఇక ప్రధాన కంపెనీలు ఇప్పుడు మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వగైరా తయారీ కోసం భారత్‌కు వస్తున్నాయి. మనం ఇవాళ యుద్ధ విమానాలనే కాదు... విక్రాంత్ విమాన వాహక నౌకను కూడా తయారు చేస్తున్నాం. సముద్రంలో మన దేశీయ యుద్ధనౌక త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభించిన హై-స్పీడ్ నమో భారత్ రైలు కూడా భారత్‌లోనే తయారైంది... ఇది పూర్తిగా దేశీయ రైలు. ఇది విన్నపుడు మీరు గర్వపడుతున్నారా.. లేదా? మీ తల సగర్వంగా పైకి లేస్తుందా.. లేదా? ప్రతి భారతీయుడూ.. ముఖ్యంగా యువతరం ఉజ్వల భవితను చూస్తుందా.. లేదా? ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభించిన స్క్రీన్ డోర్ వ్యవస్థ కూడా దేశీయంగా రూపొందినదే!
ఇప్పుడు మీకు నేనొక ఆసక్తికర అంశం వెల్లడిస్తాను... మనం హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నపుడు లోపల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. భీకర శబ్దంతో ఎగిరే ట్రాక్టర్‌లాగా అనిపిస్తుంది. ఆ ధ్వని తీవ్రతకు మనం చెవులు మూసుకోవాలి. అలాగే, విమానంలోనూ శబ్దం చాలా ఎక్కువగానే ఉంటుంది. అయతే, ఈ రోజు నమో భారత్ రైలు విమానం కన్నా తక్కువ శబ్దంతో నడిచింది... ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా సాగిందో!
మిత్రులారా!
భవ్య భవిష్యత్ భారత్‌కు నమో భారత్ ఒక ఉదాహరణ. ఏ దేశంలోనైనా ఆర్థికశక్తి ఇనుమడిస్తే ప్రపంచంలో దాని ప్రతిష్ఠ కూడా పెరుగుతుందనే వాస్తవాన్ని నమో భారత్ రుజువు చేస్తోంది. ఢిల్లీ- మీరట్ మధ్య ఇప్పుడు 80 కిలోమీటర్లకు పైగా గల మార్గంలో ఈ రైలు ప్రయాణం ఒక ఆరంభం... మళ్లీ చెబుతున్నా... ఇది ఆరంభం మాత్రమే. ఈ మార్గం తొలిదశ పూర్తయ్యేసరికి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు నమో భారత్ రైలుతో అనుసంధానితం కాగలవు. నేనిప్పుడు రాజస్థాన్ పేరు ప్రస్తావించడం విని, అశోక్ గెహ్లాట్ నిద్రకు దూరం కావచ్చు. దేశంలోని మరిన్ని ప్రాంతాలు త్వరలోనే నమో భారత్ వ్యవస్థకు చేరువవుతాయి. అంతిమంగా ఇది పారిశ్రామిక ప్రగతికి తోడ్పడి, నా దేశ ప్రజలకు... ముఖ్యంగా భరతమాత యువ పుత్రులు, పుత్రికలకు కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి.
మిత్రులారా!
ఈ శతాబ్దంలోని ప్రస్తుత మూడో దశాబ్దం భారతీయ రైల్వేల రూపాంతరీకరణ దశాబ్దం. మిత్రులారా... మరో పదేళ్లలో యావత్ రైల్వే వ్యవస్థ ప్రగతిశీల పరిణామాన్ని మీరు చూడబోతున్నారు. ఇక నా విషయానికొస్తే- నా కలలు తాత్కాలిక ప్రయోజనానికి ప్రాధాన్యమివ్వవు లేదా వేగం తగ్గించే అలవాటు నాకు లేనేలేదు. నేటి యువతకు ఇదే నా హామీ... ఈ దశాబ్దం చివరికల్లా మన దేశపు రైళ్లు ప్రపంచంలో ఏ దేశానికీ తీసిపోని రీతిలో ఉంటాయి. భద్రత, సౌలభ్యం, పరిశుభ్రత, సామరస్యం, కరుణ, బలం ఏదైనా సరే- భారత రైల్వేలు అంతర్జాతీయంగా కొత్త మలుపు తిరుగుతాయి. ఇందులో భాగంగా త్వరలోనే 100 శాతం విద్యుదీకరణ లక్ష్య సాధనకు చేరువలో ఉన్నాయి. ఇవాళ నమో భారత్ ప్రారంభమైంది... దీనికిముందు వందే భారత్ రూపంలో దేశానికి ఆధునిక రైళ్ల సదుపాయం కలిగింది. అమృత భారత్ స్టేషన్ కార్యక్రమం కింద రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వేగంగా సాగుతోంది. ఈ దశాబ్దం చివరికల్లా అమృత భారత్, వందే భారత్, నమో భారత్ త్రయం భారతీయ రైల్వేల ఆధునికీకరణకు నిదర్శనంగా నిలుస్తాయి.
బహుళ రవాణా సాధన వ్యవస్థకు రూపమిచ్చే పనులు ఇవాళ వేగంగా సాగుతున్నాయి. అంటే- వివిధ ప్రజా రవాణా సాధానాలన్నీ ఏకీకృతమవుతాయి. ఇందులో భాగంగా నమో భారత్ రైలుకు బహుళ-రవాణా సాధన సంధానంపైనా దృష్టి సారించాం. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్ వంటి స్టేషన్లను రైలు-మెట్రో-బస్ టెర్మినళ్లతో నిరంతర అనుసంధానం ఉంటుంది. నమో భారత్ రైలు దిగగానే ఇంటికి లేదా కార్యాలయానికి వెళ్లడం కోసం వేరే రవాణా సాధనం కోసం ఎవరూ ఆందోళన పడే అవసరం ఉండదు.
నా కుటుంబ సభ్యులారా!
పరిణామశీల భారత్‌లో జనజీవన నాణ్యత కచ్చితంగా మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలి పీల్చగలగాలి... చెత్తకుప్పల బెడద తొలగిపోవాలి... చక్కని రవాణా సదుపాయాలుండాలి... నాణ్యమైన విద్యనిచ్చే విద్యాలయాలు ఉండాలి... మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లభించాలి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలో నిర్దిష్ట ప్రజా రవాణా వ్యవస్థపై నేటి స్థాయిలో ఎన్నడూ నిధులు వెచ్చించిన ఉదాహరణలు లేవు.
మిత్రులారా!
రవాణా సదుపాయాల మెరుగు లక్ష్యంగా నేల, నీరు, నింగితోపాటు అంతరిక్షం రంగంలో ప్రగతి సహా అన్ని వైపులా మా కృషిని విస్తరించాం. ఈ క్రమంలో జలరవాణాను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 100 జలమార్గాలను అభివృద్ధి చేశాం. గంగానదిలో అతిపెద్ద జలమార్గం నిర్మాణంలో ఉంది. అలాగే బెనారస్ నుంచి హల్దియా వరకూ అనేక జలమార్గ కూడళ్లు నిర్మితమయ్యాయి. పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాల రవాణా ద్వారా రైతులకు ఇవి ఎంతగానో ఉపయోపడుతున్నాయి. కాబట్టే, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పొడవైన గంగావిలాస్ అనే పర్యాటక నావ దేశంలో 3,200 కిలోమీటర్లు ప్రయాణించి, రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేని స్థాయిలో తీర ప్రాంతాల పొడవునా కొత్త మౌలిక సదుపాయాల విస్తరణతోపాటు ఆధునికీకరణ కూడా కొనసాగుతోంది. దీనివల్ల కర్ణాటక రాష్ట్రానికీ ప్రయోజనం కలుగుతోంది. ఉపరితల రవాణా విషయానికొస్తే- అత్యాధునిక ఎక్స్ ప్రెస్ వే నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. అలాగే రైల్వే రంగంలో నమో భారత్, మెట్రో రైళ్లు సహా రూ.3 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో మెట్రో మార్గాల విస్తరణకు ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతాల నివాసులే ప్రత్యక్ష సాక్షులు. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని నోయిడా, ఘజియాబాద్, లక్నో, మీరట్, ఆగ్రా, కాన్పూర్ వంటి నగరాలలో మెట్రో సేవల కల్పనకు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కర్ణాటకలోనూ బెంగళూరు, మైసూరు వంటి నగరాల్లో మెట్రో సేవల విస్తరణ చేపట్టారు.
భారత్ విమానయానం కూడా కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. ఇప్పుడు రబ్బరు చెప్పులు వేసుకునే సామాన్య ప్రజానీకం కూడా రయ్యిమంటూ విమానాల్లో దూసుకుపోతున్నారు. గడచిన తొమ్మిదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైంది. దేశీయ విమానయాన సంస్థలు దాదాపు వెయ్యి కొత్త విమానాల కోసం తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అలాగే, అంతరిక్ష రంగంలోనూ మన కృషి వేగంగా పురోగమిస్తోంది. మన చంద్రయాన్ ప్రయోగం చంద్రునిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. మరోవైపు 2040 వరకూ నిర్దిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం. మన గగన్‌యాన్ కార్యక్రమం కింద భారత వ్యోమగాములు త్వరలోనే స్వదేశీ అంతరిక్ష నౌకలో అంతరిక్ష ప్రయాణం చేయడమే కాదు. భారత అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తారు. చంద్రునిపై భారత వ్యోమగామిని దింపే రోజు మరెంతో దూరంలో లేదు. మరి ఇవన్నీ ఎవరికోసం? ఈ దేశ యువతరం కోసం... మీ ఉజ్వల భవష్యత్తు కోసమే!
మిత్రులారా!
నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడాలంటే కాలుష్యం తగ్గింపు అవశ్యం. అందుకే, దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల నెట్‌వర్క్‌ను గణనీయ స్థాయిలో విస్తరిస్తున్నాం. ఈ మేరకు రాష్ట్రాలకు 10,000 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.600 కోట్లతో 1300కుపైగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించింది. తదనుగుణంగా ఇప్పటికే 850కి పైగా బస్సులు నడుస్తున్నాయి. అలాగే బెంగళూరులో 1200కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల సహాయం అందిస్తోంది. ఢిల్లీ, యూపీ లేదా కర్ణాటక... రాష్ట్రం ఏదైనా ప్రతి నగరంలో ఆధునిక, కాలుష్యరహిత ప్రజా రవాణా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యనిర్దేశం చేసుకుంది.
మిత్రులారా!
దేశవ్యాప్తంగా అన్నిరకాల మౌలిక సదుపాయాల కల్పనలో పౌర సౌకర్యాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మెట్రో లేదా నమో భారత్ రైళ్ల వంటి మౌలిక సదుపాయాలు ఉద్యోగులకు ఎంతో కీలకం. చిన్న పిల్లలు లేదా వృద్ధ తల్లిదండ్రులు ఉన్నవారికి, వారి కుటుంబాలకు దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అద్భుత మౌలిక సదుపాయాల వల్ల పెద్ద కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయి కాబట్టి, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. చక్కని విమానయాన సదుపాయాలు, రహదారుల వల్ల వినియోగదారులతో వ్యాపారవేత్తలకు అనుసంధానం మెరుగవుతుంది. బలమైన మౌలిక సదుపాయాలు వివిధ వ్యాపారాలను ఒకచోటకు చేర్చి, అందరికీ ప్రయోజనం కల్పిస్తాయి. మెట్రో లేదా ‘ఆర్‌ఆర్‌టీఎస్’ వంటి మౌలిక సదుపాయాలు వల్ల ఉద్యోగినులలో భద్రతకు భరోసా లభిస్తుంది. వారు విధులకు సురక్షితంగా వెళ్లిరావడమే కాకుండా డబ్బు ఆదా అవుతుంది.
ఇక దేశంలో వైద్య కళాశాలల సంఖ్య పెరిగేకొద్దీ వైద్యులు కావాలని కలలుగనే యువత, చికిత్స అవసరమైన రోగులు కూడా ప్రయోజనం పొందుతారు. డిజిటల్ మౌలిక సదుపాయాల సౌలభ్యంతో పేదలకూ ప్రయోజనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. అన్ని రకాల సేవలూ ఆన్‌లైన్‌లో లభ్యం కావడం వల్ల కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస్థ నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుంది. ఇప్పుడే యూపీఐ ఆధారిత టికెట్ విక్రయ యంత్రాలను మనం చూశాం. ఇది మీ సౌలభ్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు. ఇప్పడు నేను ఏకరవు పెట్టిన రంగాలన్నీ గడచిన దశాబ్ద కాలంలో అద్భుత ప్రగతి సాధించాయి. వీటన్నిటితో ఇబ్బందులు తొలగడమేగాక జనజీవన సౌలభ్యం కలుగుతుంది.
నా కుటుంబ సభ్యులారా!
ఇది వరుస పండుగల నేపథ్యంలో సంబరాలు, సంతోషంతో గడిపే సమయం. దేశంలో ప్రతి కుటుంబానికి ఈ ఆనందం సొంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల రైతులు, ఉద్యోగులు, పెన్షనర్ల వంటి మన సోదరీసోదరులందరికీ ప్రయోజనం కలుగుతుంది. ఈ మేరకు రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఈ మేరకు ఎర్ర కందిపప్పు రూ.425, ఆవాలు రూ.200, గోధుమలు రూ.150 వంతున పెంపును ప్రకటించింది. తద్వారా మన రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. గోధుమలకు ‘ఎంఎస్‌పీ’ 2014లో రూ.1400 కాగా, ఇప్పుడు రూ.2000 దాటింది. గడచిన 9 ఏళ్లలో ఎర్ర కందిపప్పుపై రెట్టింపును మించి పెరిగింది. అలాగే ఆవాల ధర రూ.2600కు చేరింది. రైతులకు ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ధర లభించేలా చూడటంపై మా నిబద్ధతకు ఇది నిదర్శనం.
మిత్రులారా!
యూరియా సహా రైతుకు అవసరమైన ఎరువులన్నిటినీ ప్రభుత్వం తక్కువ ధరతో అందుబాటులో ఉంచుతోంది. అనేక దేశాల్లో బస్తా యూరియా ధర దాదాపు రూ.3000 కాగా, మన దేశంలో రూ.300కే లభిస్తోంది. ఇప్పుడు నేను మీకొక సంఖ్య చెబుతాను... బాగా గుర్తుంచుకోండి... అదేమిటంటే- అన్నదాతపై ఎరువుల వ్యయ భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2.5 లక్షల కోట్లకు పైగా వెచ్చిస్తోంది. దీనివల్ల ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రైతులందరికీ ప్రయోజనం చేకూరుతోంది. నా రైతులకు యూరియా ఖరీదైనదిగా మారకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ ఖజానా నుంచి ఇంత భారీ మొత్తం కేటాయిస్తున్నాం.
మిత్రులారా!
వరి గడ్డితోపాటు పంటకోత తర్వాత పొలాల్లో మిగిలే దుబ్బు వంటి అవశేషాలు వృథా కాకుండా చూసుకోవాలి. ఇటువంటి వ్యర్థాల వినియోగంతో బయో ఇంధనం, ఇథనాల్ తయారీ యూనిట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం కృషి చేస్తోంది. కాబట్టే, తొమ్మిదేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు పది రెట్లు ఎక్కువగా మనం ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాం. దీనివల్ల మన రైతులకు దాదాపు రూ.65,000 కోట్ల దాకా ఆదాయం లభించింది. గత పది నెలల్లోనే వారు రూ.18,000 కోట్లకుపైగా అందుకున్నారు. ఈ సందర్భంగా మీరట్-ఘజియాబాద్ ప్రాంతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. ఇథనాల తయారీ ఫలితంగా ఇక్కడి చెరకు రైతులు ఈ ఒక్క ఏడాదిలోనే రూ.300 కోట్లకు పైగా అందుకున్నారు. రవాణా రంగంలో ఇథనాల్ వాడకం పెరగడంతో ఈ ప్రాంతంలోని నా రైతు సోదరులకు ఎంతో లబ్ధి కలుగుతోంది. ప్రత్యేకించి పెద్దమొత్తంలో పేరుకుపోయిన బకాయి చెల్లింపుల సమస్యను పరిష్కరించడంలో ఇది ఎంతగానో తోడ్పడింది.
మిత్రులారా!
పండుగ సీజన్ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే మన అక్కచెల్లెళ్లకు బహుమతి ప్రకటించింది. ఈ మేరకు ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఇచ్చే వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.500దాకా తగ్గించింది. మరోవైపు దేశంలో 80 కోట్లకు పైగా కుటుంబాలకు ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం కరవు భత్యం మంజూరు చేసింది. మన గ్రూప్-బి, సి కేటగిరీ నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ కూడా ప్రకటించింది. ఈ విధంగా రైతులకు, ఉద్యోగులకు అదనంగా అందే రూ.వేల కోట్లతో సమాజం మొత్తానికీ ప్రయోజనం కలుగుతుంది. వారందరి కొనుగోళ్లతో మార్కెట్లు, వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి.
నా కుటుంబ సభ్యులారా!
ప్రభుత్వ నిర్ణయాలు సానుభూతితో కూడినవైనప్పుడు ప్రతి కుటుంబంలోనూ పండుగల ఆనందం ఇనుమడిస్తుంది. దేశంలోని ప్రతి కుటుంబం పండుగ సంబరాలతో సంతోషంగా ఉంటే నేనెంతో సంతోషిస్తాను. మీ అందరి ఉత్సవాల్లోనే నా ఆనందం ఉంటుంది.
నా ప్రియ సోదరీసోదరులారా!
మీరంతా నా కుటుంబ సభ్యులు కాబట్టి, నా ప్రాధాన్యం మీరే... నేను ఇదంతా చేస్తున్నది మీ కోసమే. మీరు సంతోషంగా ఉండి ప్రగతికి తోడ్పడితేనే దేశం కూడా పురోగమిస్తుంది. మీరంతా సంతోషంగా ఉంటేనే నాకూ సంతోషం... మీరు సమర్థులైనపుడు, దేశం కూడా తన సామర్థ్యం చాటుకోగలదు.
అయితే, సోదరీసోదరులారా!
నేను మిమ్మల్ని ఇవాళ ఓ కోరిక కోరాలని భావిస్తున్నాను.. నేను అడిగేదేమిటో మీరిస్తారా? మీరిచ్చే మాట వృథా పోరాదు. ఆ మేరకు మాట ఇస్తామని చేతులు పైకెత్తి నాకు భరోసా ఇవ్వండి.. ఇస్తామంటున్నారా.. అయితే, వినండి- ఒక నిరుపేద వద్ద సైకిల్ ఉంటే, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడా.. లేదా? రోజూ శుభ్రంగా తుడిచి పెట్టుకుంటాడా.. లేదా? మీకో స్కూటర్ ఉంటే, అది సరైన స్థితిలో ఉండే విధంగా చూసుకుంటారా.. లేదా? అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ కొత్త రైళ్లు ఎవరివి? వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎవరి బాధ్యత? మనదే... వాటిని జాగ్రత్తగా చూసుకుందాం... వాటిపై ఒక్క గీత కూడా పడకూడదు. మన రైళ్లు నిత్యం అద్దంలా మెరుస్తూండాలి. మీరు మీ సొంత వాహనాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లే, ఈ రైళ్ల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. మరి జాగ్రత్తగా చూసుకుంటారు కదూ? నమో భారత్ రైలు అందుబాటులోకి రావడంపై మరోసారి మీకందరికీ నా అభినందనలు... అనేకానేక ధన్యవాదాలు!
నాతో గళం కలిపి.. దిక్కులు మారుమోగేలా నినదించండి.
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
భారత్ మాతా కీ – జై!
ధన్యవాదాలు...
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే
***
(रिलीज़ आईडी: 2197346)
|