ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు శీతకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
పార్టీ ఏదయినా సరే.. కొత్త తరం ఎంపీలకూ, మొదటిసారి సభ్యులుగా
ఎన్నికైన వారికి అవకాశం లభించేట్లుగా మనం చూడాలి: ప్రధానమంత్రి
ప్రజాస్వామ్యం సరైన ఫలితాలను ఇవ్వగలుగుతుందని నిరూపించిన భారత్: ప్రధానమంత్రి
దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోవడానికి మనం చేస్తున్న కృషికి
సరికొత్త శక్తిని అందించనున్న శీతకాల సమావేశాలు: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
01 DEC 2025 12:41PM by PIB Hyderabad
శీతకాల సమావేశాలు-2025 ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశాలు కేవలం ఒక ఆనవాయితీ కాదు.. ఇవి శరవేగంగా ప్రగతి చెందే దిశగా సాగుతున్న దేశ ప్రయాణానికి ఒక కొత్త శక్తిని అందించే ముఖ్య సాధనమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ సమావేశాలు దేశ ప్రగతికి జోరును జోడించడానికి ప్రస్తుతం సాగుతున్న ప్రయత్నాలకు ఒక కొత్త శక్తిని అందిస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాన’’ని శ్రీ మోదీ అన్నారు.
భారత్ నిరంతరంగా తన ప్రజాస్వామిక సంప్రదాయాల చైతన్యాన్నీ, ఉత్సాహాన్నీ చాటిచెప్పిందని ప్రధానమంత్రి తెలిపారు. ఇటీవలి బీహార్ ఎన్నికలను ఆయన ఒక ఉదాహరణగా చెబుతూ... ఆ ఎన్నికల్లో ఇదివరకు ఎప్పుడూ లేని స్థాయిలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని ప్రశంసించారు. ఇది దేశ ప్రజాస్వామ్య శక్తికి ఒక ప్రబల ప్రమాణంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ, ఇది ఒక ప్రశంసనీయ, ఉత్సాహపూర్వకమైన సరళి అని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక కొత్త ఆశనీ, కొత్త విశ్వాసాన్నీ తీసుకువచ్చిందని అన్నారు. భారత్‌లో ప్రజాస్వామిక వ్యవస్థలు మరింతగా బలపడుతున్న కొద్దీ ఇది దేశ ఆర్థిక సామర్థ్యాల్ని ఏ విధంగా పరిపుష్టం చేస్తున్నదీ ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. ‘‘ప్రజాస్వామ్యం సరి అయిన ఫలితాలను అందించగలుగుతుందని భారత్ రుజువు చేసింద’’ని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ‘‘భారత్‌లో ఆర్థిక స్థితిగతులు కొత్త శిఖరాల్ని ఎంత వేగంగా చేరుకుంటున్నాయో గమనిస్తే, ఇది ఒక కొత్త విశ్వాసాన్ని మేలుకొలపడంతో పాటుగా వికసిత్ భారత్ గమ్యస్థానం వైపు సాగిపోతున్న మనందరికీ ఒక కొత్త బలాన్ని కూడా ఇస్తోంది’’ అని శ్రీ మోదీ వర్ణించారు.
జాతీయ హితం, ఫలప్రద చర్చ, విధానాలకు ఆధారం కాగలిగిన ఫలితాలపై సభ సమావేశాల్లో దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా అన్ని రాజకీయ పక్షాలకూ ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. దేశం కోసం ఏమేమి ఊహించగలదు... ఏయే పనులను పూర్తి చేయడానికి ఇప్పటికే నిబద్ధురాలయిందీ అనే విషయాలపై పార్లమెంటు సదా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు వాటి బాధ్యతను నిర్వర్తించాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ, అర్థవంతమైన ముఖ్యాంశాల్ని ప్రస్తావించాల్సిందిగా కోరారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమి తాలూకు ప్రభావం సభా కార్యకలాపాలపై పడనివ్వకూడదని రాజకీయ పక్షాలకు హిత బోధ చేశారు. ఎన్నికల్లో విజయం వరించినందువల్ల కలిగే అహంకారాన్ని సహితం సభ సమావేశాల్లో కనిపించనివ్వరాదని శ్రీ మోదీ అన్నారు. ‘‘శీతకాల సమావేశాల్లో సమతుల్యం, బాధ్యతలతో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి కోరుకునే హుందాతనం కూడా ఉట్టిపడాల’’ని శ్రీ మోదీ చెప్పారు.
విషయాలను సమగ్రంగా పరిశీలించి చర్చించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రధానమంత్రి చెప్పారు. జరుగుతున్న మంచి పనిని గమనించి, అలాంటి పనులకు మరింత మెరుగులు దిద్దాల్సిందిగాను, అవసరమైన చోట్ల కచ్చితమైన ఆలోచనలను అందించాల్సిందిగా సభ్యులను కోరారు. దీని వల్ల పౌరులకు అన్ని విషయాలూ తెలుస్తాయని ఆయన అన్నారు. ‘ఇది కష్టపడాల్సిన పని... అయితే దేశం కోసం ఇది అవసరమ’’ని ఆయన తెలిపారు.
మొదటిసారి ఎంపీలు, యువ ఎంపీల పట్ల ప్రధానమంత్రి ఆందోళనను వ్యక్తం చేస్తూ, వారి వారి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడానికి గాని లేదా దేశాభివృద్ధి చర్చల్లో పాలుపంచుకోవడానికి గాని తగిన అవకాశం లభించడం లేదని వివిధ రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయన్నారు. ఈ ఎంపీలకు మాట్లాడే అవకాశం లభించేటట్లు చూడాలని అన్ని రాజకీయ పక్షాలకూ ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘నవ తరం లోతైన ఆలోచనల నుంచీ, నవ తరం శక్తియుక్తుల నుంచీ ఈ సభ, ఈ దేశం లాభపడాల’’ని ఆయన తెలిపారు.
పార్లమెంటు విధానాలను రూపొందించే, వాటిని అమలు చేసే స్థలం.. అంతే తప్ప, నాటకమాడే లేదా నినాదాలు చేసే ప్రదేశం కాదని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ‘‘నాటకాలు ఆడటానికో లేదా నినాదాలు ఇవ్వడానికి కొన్ని ప్రాంతాలున్నాయి. పార్లమెంట్లో మన దృష్టంతా విధానాలపైనే ఉండి తీరాలి. ఉద్దేశాలు కూడా సుష్పష్టంగా ఉండాల’’ని ఆయన అన్నారు.
ఈ సమావేశాలకు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎగువ సభ కొత్త గౌరవ సభాధ్యక్షుని మార్గదర్శకత్వంలో ఆరంభం కానుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చైర్మన్కు తన అభినందనల్ని తెలియజేస్తూ, చైర్మన్ నాయకత్వం ఉభయ సభల పనితీరును మరింత బలపరచగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
జీఎస్టీ సంస్కరణలు పౌరుల్లో నమ్మకం తాలూకు బలమైన వాతావరణాన్ని ఏర్పరిచాయని ప్రధానమంత్రి చెబుతూ, వాటిని నవ తరం సంస్కరణలుగా వర్ణించారు. ఈ దిశగా అనేక ముఖ్య కార్యక్రమాలను శీతకాల సమావేశాలు ప్రవేశపెట్టనున్నాయని ఆయన అన్నారు.
పార్లమెంటులో ఇటీవలి ధోరణులపై శ్రీ మోదీ ఆందోళనను వ్యక్తం చేశారు. మన పార్లమెంటును అయితే ఎన్నికలకు న్నాహక క్షేత్రంగానో లేదా ఎన్నికల్లో ఓటమి తరువాత ఆశాభంగాన్ని వ్యక్తం చేయడానికో ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ పద్ధతుల్ని దేశం ఆమోదించలేదు. వారు తమ విధానాన్నీ, వ్యూహాన్నీ మార్చుకోవాల్సిన తరుణం ఇది. మెరుగ్గా ఎలా పనిచేయవచ్చో అనే విషయంలో వారికి మెలకువలు చెప్పడానికయినా సరే నేను సిద్ధంగా ఉన్నాన’’ని కూడా శ్రీ మోదీ అన్నారు.
‘‘ఈ బాధ్యతలను మనసులో ఉంచుకుని మనమంతా ముందడుగు వేస్తామని ఆశిస్తున్నాను. అంతేకాకుండా దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని దేశ ప్రజలకు చెప్పదలచుకున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు. దేశం ప్రగతి దిశగా దూసుకుపోవాలన్న దేశ దృఢసంకల్పాన్ని ఆయన మరో సారి స్పష్టం చేస్తూ, ‘‘దేశం కొత్త శిఖరాల వైపునకు సాగుతోంది.. మరి ఈ ప్రయాణానికి కొత్త శక్తిని అందించడంలో ఈ సభ ఒక కీలక పాత్రను పోషిస్తుంద’’న్నారు.
***
(रिलीज़ आईडी: 2196934)
आगंतुक पटल : 4