ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని మెహసానాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
30 OCT 2023 8:04PM by PIB Hyderabad
భారత్ మాతాకీ జై!
ఏమైంది మీకివాళ? మీ గళం అంబాజీ దాకా వినిపించేలా గొంతెత్తి నినదించండి...
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
వేదికను అలంకరించిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్, ఇతర మంత్రులు, పార్లమెంటులో నా సహచరుడు-బీజేపీ గుజరాత్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఇతర ఎంపీలు, శాసనసభ్యులు, జిల్లా-తాలూకా పంచాయతీల సభ్యులు, పెద్ద సంఖ్యలో సభకు హాజరైన గుజరాత్‌లోని నా ప్రియ కుటుంబ సభ్యులారా!
ఎలా ఉన్నారు నా ఖాఖరియా టప్పా? ముందుగా- మీతో కొంతసేపు గడపడానికి, నా పాఠశాల రోజుల నుంచి తెలిసిన ముఖాలను చూసే అవకాశం ఇచ్చినందుకు గుజరాత్ ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. మీ అందరినీ కలవడం, మీ ముంగిట్లో అడుగుపెట్టినపుడు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం నాకు అపరిమిత ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. ఈ నేలకు, నన్ను ఇంతవాడిని చేయడంలో మీరు చూపిన ఆదరాభిమానాలకు నేనెంతో రుణపడి ఉన్నాను. మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చినపుడల్లా ఇదంతా తలచుకుని నా హృదయం ఆర్ద్రమవుతుంది. ఈ నేపథ్యంలో మీ రుణాన్ని కొంత తీర్చడానికి ఇది తగిన సందర్భమని నేను భావిస్తున్నాను. ఇవాళ, రేపు.. అంటే- అక్టోబరు 30, 31 రెండు రోజులూ మనందరికీ స్ఫూర్తిదాయకాలు. ఎందుకంటే- స్వాతంత్ర్య పోరాటంలో ఆదివాసీలను (గిరిజనం) ముందుండి నడిపి, బ్రిటిష్ వారిని గడగడలాడించిన గోవింద్ గురూజీ వర్ధంతి ఇవాళే! ఇక రేపు భారత దేశపు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.
సర్దార్ సాహెబ్‌పై మా తరానికి ప్రగాఢ గౌరవం ఉండేది... భావితరం ఆయనకు శిరసాభివందనం చేసే వీలు లేకపోవచ్చుగానీ, ఐక్యతా విగ్రహంలో దర్శనమిచ్చే ఆయన రూపాన్ని తలెత్తుకు చూస్తారు. ఎందుకంటే- సర్దార్ సాహెబ్ పాదాల వద్ద నిలబడే ప్రతి వ్యక్తి తలెత్తకు నిలబడాల్సిందే మరి! ఇక శ్రీ గురు గోవింద్ స్వాతంత్ర్య పోరాటానికే కాకుండా ఆదివాసీ సమాజానికి, భరతమాత సేవకు అంకితం చేశారు. సేవ, దేశభక్తి విషయంలో ఆయన నిబద్ధత ఎంత బలమైనదంటే- త్యాగమనే సంప్రదాయానికి... ఆ మాటకొస్తే త్యాగానికే ఆయనొక ప్రతీక. మధ్యప్రదేశ్, గుజరాత్ గిరిజన ప్రాంతాల్లో శ్రీ గురు గోవింద్ జ్ఞాపకాలను పదిలపరుస్తూ మా ప్రభుత్వం మాన్‌గఢ్ క్షేత్రాన్ని రూపుదిద్దడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఆయనను మనం స్మరించుకుందాం.
నా ప్రియ కుటుంబ సభ్యులారా!
ఇక్కడికి వచ్చేముందు అంబామాత పాదాలనంటి ఆశీర్వాదం పొందే అవకాశం నాకు లభించింది. అమ్మ తేజస్సును, స్థల వైభవాన్ని చూసి నేనెంతో పరవశించాను. ఇక మీరందరూ వారం నుంచీ పరిశుభ్రత కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని విన్నాను. అంబాజీలో పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న మీతోపాటు నా ప్రభుత్వ సహచరులకు అభినందనలు. అంబా మాత ఆశీస్సులు నిరంతరం మనపై వర్షిస్తూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నిన్నటి నా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కూడా గబ్బర్ కొండపై అభివృద్ధి పనుల తీరును, దాని వైభవాన్ని ప్రస్తావించాను. నిజంగా అక్కడ అసాధారణ రీతిలో పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ దాదాపు రూ.6,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నేపథ్యంలో అంబా మాత ఆశీస్సులు లభించడం ఓ చిరస్మరణీయ అనుభవం. రైతుల భవితకు భరోసా ఇవ్వడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఉత్తర గుజరాత్ అభివృధ్ధి దిశగా దేశంలోని ఇతర ప్రాంతాలతో ఆ ప్రాంత అనుసంధానాన్ని ఒక మార్గంగా ఎంచుకోవడం హర్షణీయం. మెహసానా పరిసరాల్లోని పటాన్, బనస్కాంత, సబర్కాంత, మహిసాగర్, ఖేడా, అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాలన్నీ అభివృద్ధి ప్రాజెక్టుల నిధులు. ప్రగతి పనులలో వేగం ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చి, పెద్ద సంఖ్యలో ప్రజలకు ఆనందాన్నిస్తుంది. ఈ అభివృద్ధి పనులన్నింటిపైనా గుజరాత్ ప్రజలకు నా అభినందనలు.
నా ప్రియ కుటుంబ సభ్యులారా!
భారత్ ప్రగతి ప్రయాణంపై ఇవాళ ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఇది వాస్తవమా.. కాదా? గొంతెత్తి చెప్పండి. మన దేశం అభివృద్ధి పథంలో సాగుతుండటంపై ఇతర దేశాలన్నీ చర్చించుకుంటున్నాయా... లేదా? చంద్రయాన్ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇటీవల అంతరిక్ష నౌకను భారత్ విజయవంతంగా దింపింది. ఈ అద్భుత దృశ్యాలను మీరంతా చూసే ఉంటారని భావిస్తున్నాను. ప్రపంచంలోని ఏ దేశమూ ఇప్పటిదాకా ఈ ఘనతను సాధించ లేదు. ఇది తెలిశాక ఓ గ్రామీణుడు... కనీసం బడి ముఖమైనా ఎరుగని 80-90 ఏళ్ల వృద్ధుడు కూడా గర్విస్తాడు. అయితే, భారత్ సాధించిన విజయాలపై జి20 దేశాల్లో పెద్దగా చర్చ కనిపించలేదు. అయితే, జి20 గురించి తెలియని వారు మన దేశంలో బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. మన దేశంలో జి20 కోసం ఎలాంటి వాతావరణం సృష్టించామంటే- ‘టి20’ క్రికెట్ గురించి తెలియకపోయినా, దీన్ని గురించి ప్రతి ఒక్కరికీ బాగా తెలిసింది.
మన దేశంలో జి20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాల నాయకులెందరో భారత్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించి, ఆ వైభవాన్ని, ప్రజల శక్తిసామర్థ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. అదే సమయంలో భారత్ చరిత్రపై వారిలో ఆసక్తి, ఉత్సుకత కూడా పెరిగాయి. ఆ విధంగా మన దేశ శక్తిసామర్థ్యాలను యావత్ ప్రపంచం గమనిస్తోంది. దేశంలో ఇప్పుడు అసాధారణ వేగంతో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతోంది. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు... ఇలా ప్రతి రంగంలోనూ గుజరాత్ సహా దేశం నలుమూలలా పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. మిత్రులారా... కొన్నేళ్ల కిందట దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు!
దేశ చరిత్రలో అంతర్భాగం కాగల రీతిలో నేడు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఆ సంగతి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సోదరీసోదరులారా! మీకొక విషయం బాగా తెలుసు.. అదేమిటంటే- కొన్నేళ్లుగా తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, కీలక అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం. ఇదంతా సమర్థంగా, వేగంగా కొనసాగుతూ గుజరాత్ పురోగమనానికి దోహదం చేస్తోంది. ఈ దేశ ప్రధానమంత్రి ఇవాళ మన మధ్యకు వచ్చాడని కాకుండా, నరేంద్ర భాయ్ మనలో ఒకరని మీరు భావిస్తారు. ఇంతకన్నా నాకు కావాల్సింది మరేముంటుంది? నరేంద్ర భాయ్ మాట ఇచ్చాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిలబెట్టుకుంటాడు.
భారత్ వేగంగా పురోగమించడంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రశంసలతోపాటు దానిపై చర్చల గురించి మీకందరికీ తెలిసిందే. దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కోట్లాది జనబలమే దానికి మూల కారణం. అదేవిధంగా గుజరాత్‌లో ఆధిక్యం, ప్రభుత్వ స్థిరత్వం ఫలితంగానే వరుసగా మేమెన్నో కఠిన నిర్ణయాలు తీసుకోగలిగాం. వాటన్నిటి ద్వారా ఈ రాష్ట్రం ఎంతో ప్రయోజనం పొందింది. సహజ వనరుల కొరతగల ప్రాంతాల వారితో వియ్యానికి ఎవరైనా వంద సార్లు ఆలోచించే పరిస్థితులు ఒకనాడు ఇక్కడ ఉండేవి. అలా నీటి కొరతతో సతమతమైన ఈ ప్రాంతం, నేడు ప్రగతి పథంలో పరుగు తీస్తోంది. ఆ సామర్థ్యం ఈ ప్రాంత మూలాల్లోనే ఉంది. పాల ఉత్పత్తి తప్ప మరేమీ లేని దుస్థితిని ఒకనాడు మనం అనుభవించాం. కానీ, ఇప్పుడు మన చుట్టూ అభివృద్ధి అపారం. ఆనాడు సమస్య తాగునీటి కొరత ఓ తీవ్ర సమస్య కాగా, సాగునీటి సదుపాయం లేకపోవడం పెనుసవాలు. అంతేగాక ఉత్తర గుజరాత్‌లోని గణనీయ భాగం అంధకారంలో మగ్గుతూండేది. భూగర్భజల మట్టం దాదాపు వెయ్యి నుంచి 1200 అడుగుల దిగువన ఉండేది. గొట్టపు బావులు తరచూ వట్టిపోయి, మోటార్లు కాలిపోతూండేవి. ఇలా మనకు ఎదురైన సమస్యలు అన్నీఇన్నీ కావు. అయితే, ఆ కష్టాలన్నిటినీ ఈ రోజున అధిగమించాం.
ఇక్కడి రైతులు ఏడాదిలో ఒక పంట పండించానికి కూడా ఎంతో సంఘర్షణకు గురయ్యేవారు. అలాంటి స్థితినుంచి నేడు రెండుమూడు పంటలు కూడా పండించే స్థాయికి చేరారు. మిత్రులారా... ఒకనాటి దుస్థితిని కళ్లారా చూశాక, ఉత్తర గుజరాత్ ఉత్థానానికి దృఢ సంకల్పం పూనాం. ఈ ప్రాంత పునరుజ్జీవనంలో భాగంగా నదీ విస్తరణతోపాటు గిరిజన జీవనాల్లో వినూత్న మార్పులు తేవడంపై లక్ష్యనిర్దేశం చేసుకున్నాం. ఈ దిశగా కీలక చర్యలు చేపట్టడంతోపాటు అనుసంధానానికి ప్రాధాన్యం ఇచ్చాం. ప్రధానంగా తాగునీటి సరఫరా, సాగునీటి సౌకర్యం కల్పనపై శ్రద్ధ వహించాం. మా కృషి మొత్తాన్నీ వ్యవసాయ రంగం అభివృద్ధికి అంకితం చేశాం. దీంతో పారిశ్రామికంగానూ గుజరాత్ క్రమంగా పురోగమిస్తోంది.
ఉత్తర గుజరాత్ ప్రజలకు ఉపాధి కల్పనే మా ప్రధాన లక్ష్యం. నేను చదువుకునే రోజుల్లో, ఏదైనా గ్రామంలో మీరేం చేస్తుంటారని ఎవరినైనా అడిగితే- “నేనొక ఉపాధ్యాయుడిని” అని చెప్పేవారు. మరికొందర్ని ప్రశ్నిస్తే- “నేను కచ్‌లో పనిచేస్తున్నాను” అనేవారు. అనేక గ్రామాల్లో ఇద్దరి నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు గుజరాత్ సరిహద్దు రాష్ట్రాల్లో పనిచేస్తూండే వారు. అటువంటి పరిస్థితులను అధిగమించి నేడిక్కడ పారిశ్రామిక పతాకం రెపరెపలాడుతోంది. సముద్రంలో కలిసిపోయే నర్మదా నదీజలాలు ఇవాళ మన పొలాలను తడుపుతున్నాయి. నర్మదా మాత ప్రస్తావన పావన అనుభూతినిస్తుంది. తల్లి నర్మద నేడు ప్రతి ఇంటి దాహార్తినీ తీరుస్తోంది.
తల్లిదండ్రులు ఒకనాడు ఎదుర్కొన్న కష్టనష్టాల గురించి ఈ ప్రాంతంలోని నేటి పాతికేళ్ల యువతకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఎలాంటి కష్టాలూ ఎరుగని రాష్ట్రంగా గుజరాత్ రూపొందింది. ఎలాగంటే- మేం ‘సుజలాం-సుఫలాం’ పథకానికి శ్రీకారం చుట్టి, దాని కోసం భూ సేకరణకు సిద్ధమైనపుడు చట్టపరంగా ఎలాంటి వివాదాలకూ తావు లేకుండా ఆ కార్యక్రమం పూర్తయింది. ఈ మేరకు భూమిని విరాళంగా అప్పగించిన ఉత్తర గుజరాత్ రైతులకు పదేపదే నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి ఔదార్యంతో దాదాపు 500 కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మితమైంది. నర్మదా జలాల ప్రవాహంతో భూగర్భజల మట్టం పెరిగింది. ఇక సబర్మతి ప్రాంతానికి గరిష్ఠంగా నీరందేలా 6 బ్యారేజీలను నిర్మించగా, వాటిలో ఒకదాన్ని ఈ రోజు ప్రారంభించాం. దీని ద్వారా పొలాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీటి కొరత తీరిపోతుంది.
నా కుటుంబ సభ్యులారా!
ఈ నీటిపారుదల ప్రాజెక్టుల ప్రభావం నేడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గడచిన 20-22 ఏళ్లలో ఉత్తర గుజరాత్‌కు నీటిపారుదల సదుపాయం అనేక రెట్లు పెరిగింది. బిందుసేద్యం చేయాలని ఈ ప్రాంత రైతులకు చెప్పినప్పుడు, వారు అందుకు మొగ్గు చూపకపోగా, సందేహాలు వెలిబుచ్చారు. పైగా, “నా జుట్టు పట్టుకు లాగి, దానివల్ల మాకు ఒరిగేదేమిటి?” అన్నట్లు చూశారు. కానీ, ఉత్తర గుజరాత్‌లోని ప్రతి జిల్లాలో నేడు బిందు సేద్యం, సూక్ష్మ నీటిపారుదల సహా కొత్త పద్ధతులు అనుసరించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఈ పద్ధతి ఫలితంగా ఉత్తర గుజరాత్ రైతులు ఇవాళ వివిధ పంటలు పండించే అవకాశం లభించింది. మొత్తం మీద, బనస్కాంత రైతులలో దాదాపు 70 శాతం సూక్ష్మ నీటిపారుదల పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇలాంటి నీటిపారుదల సౌకర్యంతోపాటు కొత్త సాంకేతికత ప్రయోజనాలు గుజరాత్‌లోని కరువు పీడిత ప్రాంతాలకూ అందుతున్నాయి. ఏ పంటలూ పండని దుస్థితిలో రైతులు ఒకనాడు అష్టకష్టాలూ పడిన రైతులు ఇప్పుడు గోధుమ, ఆముదం, ముక్కుశనగ, వంటి అనేక రకాల కొత్త పంటలు పండిస్తున్నారు. రబీ పంటలతోపాటు సోంపు, జీలకర్ర, ‘ఇసాబ్‌గోల్’ వంటి వాణిజ్య పంటలను కూడా సాగు చేస్తున్నారు. ఇసాబ్‌గోల్ ప్రాచుర్యం మీకు బహుశా గుర్తుండే ఉంటుంది.
కోవిడ్ విజృంభణతో ప్రపంచం ప్రధానంగా మన దేశానికి సంబంధించిన రెండు అంశాలపై దృష్టి సారించింది. వాటిలో ఒకటి- పసుపు.. రెండోది- ఇసాబ్‌గోల్. అంతర్జాతీయంగా ఇసాబ్‌గోల్ ఉత్పత్తిలో 90 శాతం వాటా ఇవాళ ఉత్తర గుజరాత్‌దే. ఈ ప్రపంచవ్యాప్త గుర్తింపుతోపాటు దీని వినియోగం కూడా బాగా పెరుగుతోంది. అలాగే పండ్లు, కూరగాయలు.. ముఖ్యంగా బంగాళాదుంపల ఉత్పత్తిలో ఈ ప్రాంతం వేగంగా ముందుకెళ్తోంది. క్యారెట్ నుంచి మామిడి, ఉసిరి, దానిమ్మ, జామ, నిమ్మ వరకు ప్రతి పంట ఇక్కడ సాగవుతోంది. దీనికితోడు భావితరాలకు సుస్థిర భవిష్యత్తుకు భరోసా ఇస్తూ మేం అనేక పనులు చేపట్టాం. ఈ విధమైన బహుముఖ కృషి ఫలితంగా మనమంతా సుసంపన్నంగా జీవిస్తున్నాం. ఉత్తర గుజరాత్ బంగాళాదుంప ప్రపంచ ప్రసిద్ధం కావడం అందరూ గమనించాల్సిన వాస్తవం. నేను ఇక్కడ (ముఖ్యమంత్రిగా) ఉన్నప్పుడు, కేంద్ర కంపెనీలు బంగాళాదుంపలపై వాకబు చేసేవి. ఉత్తర గుజరాత్ నుంచి ఎగుమతి-నాణ్యతగల దుంపలు ఉత్పత్తి అవుతుండటమే అందుకు కారణం. వీటితో తయారుచేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. డీసా రకం బంగాళాదుంపకు డిమాండ్ పెరుగుతుండటంతో సేంద్రియ వ్యవసాయానికి వీటి సాగు కేంద్ర బిందువుగా మారింది. బనస్కాంతలో బంగాళాదుంపల భారీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇసుక నుంచి నూనె పిండవచ్చుననే నానుడికి భిన్నంగా ఇక్కడ బంగారం పిండగలిగేలా రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. మెహసానాలో ఒక ఆగ్రో ఫుడ్ పార్క్ ఏర్పాటు కాగా, బనస్కాంతలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నాం.
నా కుటుంబ సభ్యులారా!
ఈ ప్రాంతంలోని నా తల్లులు, అక్కచెల్లెళ్లు గుక్కెడు నీటికోసం నెత్తిన రెండుమూడు కుండలతో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి ఉండేది. ఆ బాధనుంచి వారికి విముక్తి కల్పిస్తూ ఇప్పుడు కొళాయిల ద్వారా వారి ఇళ్లకే నీరు సరఫరా అవుతోంది. అందుకే, వారందరి ఆశీస్సులు నాకు సదా లభిస్తున్నాయి. ఒక్క గుజరాత్‌లోనే కాదు... దేశం నలుమూలల నుంచి అందుతున్న వారి ఆశీర్వాదాలకు నేను సదా కృతజ్ఞుడిని. నీటి సరఫరా, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పన, జల సంరక్షణ కార్యక్రమం వంటివన్నీ అక్కచెల్లెళ్ల సారథ్యంలో పురోగమిస్తున్నాయి. ఇంటింటికీ నీటి సరఫరాతోపాటు జల సంరక్షణ కార్యక్రమాలపైనా మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం. తదనుగుణంగా గుజరాత్‌లో ప్రతి ఇంటికీ నీరందుతుండగా, దేశవ్యాప్తంగానూ ఈ దిశగా పనులు కొనసాగుతున్నాయి. ‘ఇంటింటికీ నీరు’ కార్యక్రమం గిరిజన, పర్వత ప్రాంతాలు సహా చిన్న గ్రామాలలో లక్షలాది మందికి జీవన సౌలభ్యం కల్పించింది.
నా ప్రియ కుటుంబ సభ్యులారా!
పాడి పరిశ్రమలో మన అక్కచెల్లెళ్ల భాగస్వామ్యం అపారం. గుజరాత్ డెయిరీల అద్భుత నిర్వహణ వారి కృషి ఫలితమేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాడి పరిశ్రమ పురోగమనం వల్ల ఇప్పుడు కుటుంబాల ఆదాయం స్థిరంగా ఉంటోంది. ఇందులో నా తల్లులు, అక్కచెల్లెళ్ల సహకారం గణనీయం. భారీ వ్యవస్థాపన సామర్థ్యం లేకపోయినా, రూ.50 లక్షల కోట్ల వ్యాపార నిర్వహణలో వారి సామర్థ్యం అసాధారణం. నిరుడు ఉత్తర గుజరాత్‌లో వందలాది కొత్త పశువైద్య శాలలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమ ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. పశుసంపద ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన సంరక్షణపై శ్రద్ధ వహిస్తూ, పశు సంవర్ధకం, పాడి ఉత్పత్తి లక్ష్యం సాధించాలని నిర్దేశించుకున్నాం. తద్వారా నాలుగు పశువులు ఇచ్చే పాలను రెండు పాడి పశువుల ద్వారా ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. గడచిన రెండు దశాబ్దాల్లోనే గుజరాత్‌లో బనస్, దూద్‌సాగర్, సబర్ వంటి డెయిరీల రూపంలో 800కుపైగా కొత్త సహకార పాల సంఘాలను ఏర్పాటు చేశాం. దేశవిదేశాల మన పాల సహకార సంఘాల పనితీరును అధ్యయనం చేసేందుకు ఎందరో వస్తున్నారు. పాడి రంగంలోనే కాకుండా ఇతరత్రా ఉత్పతుల విషయంలోనూ రైతులకు సహకరించేలా భారీ ప్రాసెసింగ్ కేంద్రాలను కూడా మేం ఏర్పాటు చేశాం.
నా కుటుంబ సభ్యులారా!
పశుగణం నుంచి తమకు ఎంత భారీ ప్రయోజనం ఉంటుందో పాడి పరిశ్రమలోని రైతులకు బాగా తెలుసు. కోవిడ్ సమయంలో మోదీ సాహెబ్ ఉచిత టీకాల సరఫరాతో అసంఖ్యాక ప్రాణాలను కాపాడిన తరహాలోనే, మీ కుమారుడు జంతువుల సంక్షేమం దిశగానూ టీకాల కార్యక్రమం నిర్వహించేలా కృషి చేశాడు. సుమారు రూ.15 వేల కోట్ల విలువైన టీకాలతో జంతు సంరక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తమ పశువులకు టీకాలు వేయించాలని ఇక్కడున్న రైతులు, పశుపోషకులందరికీ నా విన్నపం. ఇది వారి పశువుల ప్రాణరక్ష మాత్రమేగాక రైతులకూ ఎంతో ప్రయోజనకరం. పశువుల పాలతోనే కాదు... పేడతోనూ ఇప్పుడు వ్యాపారం చేయవచ్చు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మేం ‘గోబర్ ధన్’ కార్యక్రమం కింద చురుగ్గా కృషి చేస్తున్నాం. బనస్ డెయిరీలో గోమయంతో ‘సీఎన్‌జీ’ తయారీ ప్లాంటును కూడా ప్రారంభించాం. ఇక్కడే కాదు... ప్రతి చోటా ఇలాంటి ప్లాంట్ల ఏర్పాటుతో, బయో-గ్యాస్, బయో-సీఎన్‌జీ వినియోగంలోకి వస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా జీవ ఇంధనంపై కార్యక్రమం అమలవుతోంది. మన రైతుల పొలాల్లోని వ్యర్థాల నుంచి కూడా ఆదాయ సృష్టి సాగుతోంది. ఇందులో భాగంగా ఆవు పేడతో విద్యుదుత్పాదన దిశగానూ కృషి చేస్తున్నాం.
నా ప్రియ కుటుంబ సభ్యులారా!
ఉత్తర గుజరాత్ ప్రాంతంలో నేటి పురోగమనం అహర్నిశలూ చేస్తున్న కృషి ఫలితమే. కొన్ని దశాబ్దాల కిందట ఇక్కడ పారిశ్రామిక వృద్ధి అసాధ్యమనే భావన ఉండేది. కానీ, ఇవాళ విరామ్‌గామ్ నుంచి మండల్ దాకా, బహుచరాజీ నుంచి మెహసానా వరకూ పారిశ్రామిక వృద్ధికి ఆలవాలమైంది. ఇది ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి రంధన్‌పూర్ దిశగానూ పయనిస్తోంది. ముఖ్యంగా మండల్ నుంచి బహుచరాజీ వరకూ విస్తరించిన ఆటోమొబైల్ పరిశ్రమ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. లోగడ ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. దీనికి భిన్నంగా ఇవాళ ఇతర ప్రాంతాల వారు ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారు. పారిశ్రామికీకరణకు శ్రీకారం చుట్టాక కేవలం పదేళ్లలో ఈ గణనీయ మార్పు రావడంతో ప్రజల ఆదాయం రెట్టింపైంది. మెహసానాలోని ఔషధ, ఇంజనీరింగ్ పరిశ్రమలు కూడా వృద్ధి పథంలో పయనిస్తున్నాయి. బనస్కాంత, సబర్కాంత జిల్లాలు సిరామిక్స్ రంగంలో ముందడుగు వేస్తున్నాయి. పింగాణీ ఉత్పత్తుల కోసం సర్దార్‌పూర్ చుట్టూ మట్టి సేకరణ ఉండేదని నా చిన్నతనంలో విన్నాను. ఆ క్రమంలో అక్కడి భూమిని సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేస్తున్నాం.
నా ప్రియ కుటుంబ సభ్యులారా!
గ్రీన్ హైడ్రోజన్ ద్వారా దేశం వేగంగా పురోగమించనున్న నేపథ్యంలో ఉత్తర గుజరాత్ ఇందుకు గణనీయంగా సహకరిస్తుంది. ఈ ప్రాంతం సౌరశక్తికి నెలవుగా రూపొందుతున్నందున కొత్త ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మోధేరా పూర్తిస్థాయి సౌరశక్తి ఉత్పత్తి గ్రామంగా రూపొందటం మీరు చూశారు... అయితే, ఇప్పుడు ఉత్తర గుజరాత్ మొత్తం సౌరశక్తి తోడ్పాటుతో వేగంగా ముందుకెళ్తోంది. తొలుత పదానాలో, అటుపైన బనస్కాంతలో సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్మితం కాగా, మోధేరా మొత్తం ఇప్పుడు 24 గంటలూ సౌరశక్తిని వినియోగించుకుంటోంది. మరోవైపు ఇళ్లపై వ్యక్తిగత సౌర విద్యుదుత్పాదన వ్యవస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పైకప్పు మీద ఈ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఉచిత విద్యుత్తు పొందడమేగాక, మిగులును ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. ఇంతకుముందు ప్రజలు విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు తామే ఉత్పత్తి చేయడం ద్వారా ఉచితంగా వాడుకోవడమేగాక అదనపు ఆదాయం కూడా పొందగలుగుతారు.
మిత్రులారా!
రైల్వే రంగంలోనూ గణనీయ ముందడుగు పడటంతో రాష్ట్రానికి రూ.5,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు లభించాయి. ఇందులో మెహసానా-అహ్మదాబాద్ ప్రత్యేక కారిడార్ కాగా, ఈ భారీ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం కూడా చేశాం. దీని ద్వారా పిపవావ్, పోర్బందర్, జామ్‌నగర్ వంటి ఓడరేవులకు అనుసంధానం పెరగడమేగాక ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా గుజరాత్ ప్రగతి వేగం ఇనుమడించి, పరిశ్రమలతోపాటు రైతులు, పశుపోషకులకూ లబ్ధి కలుగుతుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమల విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి. ఉత్తర గుజరాత్‌లో రవాణా కూడళ్లు, భారీ నిల్వ కేంద్రాలు ఏర్పాటు కాగలవని, తద్వారా రవాణా రంగం గణనీయంగా బలోపేతం కాగలదని అంచనాలు చెబుతున్నాయి.
నా కుటుబ సభ్యులారా!
గడచిన తొమ్మిదేళ్లలో తూర్పు-పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ల నిర్మాణం దాదాపు 2,500 కిలోమీటర్ల మేర పూర్తయింది. వీటివల్ల ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ప్రయోజనం ఉంటుంది. ప్రయాణకుల లేదా సరకు రవాణా రైళ్లు, వాటిద్వారా ఒనగూడే ప్రయోజనాలు చిట్టచివరి స్టేషన్ వరకూ చేరేలా శ్రద్ధ తీసుకున్నాం. ముఖ్యంగా సరకు రవాణా కారిడార్ అత్యంత ప్రయోజనకరం... ఎందుకంటే- ట్రక్కులు, రవాణా వాహనాలు, ట్యాంకర్లు సాధారణ రహదారులలో గమ్యం చేరాలంటే ఎంతో సమయం పడుతుంది. అంతేగాక వ్యయం కూడా అధికంగా ఉంటుంది. అయితే, సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్ నిర్మాణంతో వేగం పెరగడమేగాక వస్తువులతో కూడిన పెద్ద ట్రక్కులను కూడా రైళ్లలో రవాణా చేయవచ్చు. ఇప్పటికే బనాస్ నుంచి గూడ్సురైళ్లపై పాల ట్యాంకర్ల రవాణాను మీరు చూసే ఉంటారు. దీనివల్ల సమయం ఆదాతోపాటు పాలు చెడిపోకుండా ఉంటాయి కాబట్టి, రైతుల ఆదాయం పెరుగుతుంది. కాబట్టే, ఇక్కడి నుంచి పాల ట్యాంకర్లు పాలన్‌పూర్, హర్యానా, రేవారీల వరకూ వెళ్తున్నాయి.
మిత్రులారా!
కడోసన్ రహదారి పరిధిలో విరామ్‌గామ్-సమాఖియాలి రైలు మార్గాన్ని రెండు వరుసలకు విస్తరించడంతో బహుచరాజీ రైలు మార్గంలో అనుసంధానం మెరుగుపడింది. దీనివల్ల వాహనాల రాకపోకల్లో వేగం పెరుగుతుంది. మిత్రులారా... పర్యాటకం పరంగానూ ఉత్తర గుజరాత్‌లో అవకాశాలు విస్తారం. కాశీ తరహాలో చారిత్రక ప్రాధాన్యంగల వడ్‌నగర్ ఒక శాశ్వత నగరంగా మారింది. కాశీ మాదిరిగానే ఈ నగరం కూడా ప్రతి యుగంలోనూ తన జనాభాను అక్కున చేర్చుకుంది. కాశీ తర్వాత ఎన్నడూ విధ్వంసానికి గురికాని నగరంగా వడ్‌నగర్ చరిత్రకెక్కింది. ఇక్కడ తవ్వకాల్లో గణనీయ చారిత్రక విశేషాలు వెల్లడయ్యాయి. అందువల్ల ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఇది ఆకర్షిస్తోంది. ఈ పరిణామం ద్వారా మనం పూర్తి ప్రయోజనం పొందాలి. ఈ నేపథ్యంలో తరంగా కొండ, అంబాజీ-అబు రోడ్ రైలు మార్గం ద్వారా రాజస్థాన్-గుజరాత్‌లను కలిపే రైలు మార్గం పర్యాటకాన్ని మలుపు తిప్పుతుంది. అంతేగాక మరింత విస్తరణ ద్వారా ఈ బ్రాడ్ గేజ్ లైన్ ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీతో.. ఒక విధంగా యావద్దేశంతో సంధానమవుతుంది. ఇది తరంగ, అంబాజీ, ధరోయ్ వంటి ప్రదేశాల్లో పర్యాటకాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ రైలుమార్గం వల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటకాభివృద్ధి జోరందుకుంటుంది. అంబాజీ వరకూ అద్భుత రైలు సదుపాయం కలుగుతుంది. ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా యాత్రికులకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది.
నా కుటుంబ సభ్యులారా!
నేనెప్పుడూ కచ్ గురించి ప్రస్తావిస్తుంటానని మీకందరికీ తెలిసిందే. ఒకనాడు ఈ ప్రాంతం పేరెత్తడానికే సంకోచించే పరిస్థితి ఉండేది. కానీ, ఇవాళ ‘రాన్ ఉత్సవ్’ ఫలితంగా కచ్ పేరు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది. ఇక ఉత్తమ గ్రామ పర్యాటకాన్ని ఇష్టపడే వారు మన ధోర్డోపై మక్కువ చూపుతారు. అలాగే, మన నాదబెట్ (ఇండో-పాక్ సరిహద్దు గ్రామం) కూడా ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో మనం అందుకు చేయూతనివ్వాలి. నా మనసులో మాట మీతో పంచుకుంటున్నాను. ఇవాళ నేను మీతో... ఇక్కడి నవతరంతో మమేకమయ్యాను. మనమంతా గుజరాత్ కోసమేగాక దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని గుర్తుచేస్తున్నాను. నేను పుట్టి పెరిగిన గుజరాత్ నేల ఆశీర్వాదం నుంచి లభించే కొత్త బలంతో ముందడుగు వేస్తాను. మీ ప్రేమ, ఆశీస్సులే నా కొండంత బలం కాబట్టి, మునుపటికన్నా చాలా వేగంగా, కష్టపడి పనిచేస్తాను. ఎందుకంటే- మనం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే నాటికి గుజరాత్ సహా భారతదేశం ప్రపంచంలోని అగ్రదేశాలతో భుజంకలిపి నిలబడాలన్నదే నా స్వప్నం. ఈ దిశగా ఇప్పటికే విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో ఇవాళ నేనిక్కడ గౌరవనీయులైన పెద్దలు, నా కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాను. మీ ఆశీర్వాదాల మహిమతో నా ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా పూర్తి నిబద్ధతతో మరిన్ని విజయాలు సాధించగలను ఈ ఆశాభావానికి మద్దతిస్తూ నాతో గళం కలపండి...
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి గుజరాతీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే!
***
(रिलीज़ आईडी: 2196734)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam