ప్రధాన మంత్రి కార్యాలయం
“కేటీఎస్ 4.0 సాంస్కృతిక రథ సారథిగా జెన్ జెడ్”
తమిళనాడు - కాశీ ప్రయాణాన్ని ‘సాంస్కృతిక ఆనంద యాత్ర’గా మారుస్తున్న యువత
వీధి నాటకాల నుంచి రీల్ రూపొందించడం దాకా - కాశీ తమిళ సంగమ పురాతన సంబంధాలను తిరిగి బలోపేతం చేస్తున్న జెన్ జెడ్
प्रविष्टि तिथि:
30 NOV 2025 6:56PM by PIB Hyderabad
డిసెంబర్ 2న ప్రారంభమయ్యే కాశీ తమిళ సంగమం 4.0 కోసం జెన్ జెడ్ పూర్తి ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది. కాశీ-తమిళనాడు మధ్య గల పురాతన సాంస్కృతిక, భాషా సంబంధాలను శక్తిమంతమైన యువ తరంతో అనుసంధానించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
నవంబర్ 29న కన్యాకుమారి నుంచి ప్రత్యేక రైలులో కాశీ ప్రయాణాన్ని ప్రారంభించిన మొదటి ప్రతినిధి బృందంలో పెద్ద సంఖ్యలో జెన్ జెడ్ విద్యార్థులున్నారు. ఈ సుదీర్ఘ రైలు ప్రయాణం ఆటలు, సమూహ కార్యకలాపాలు, ఉత్సాహభరితమైన సంభాషణలు, సృజనాత్మక సహకారాలతో నిండిన సాంస్కృతిక ఆనంద ప్రయాణంగా మారింది. ఈ అనుభవాన్ని యువతకు చిరస్మరణీయంగా, అర్థవంతంగా మార్చింది.
ఈ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన అర్చన... కాశీ తమిళ సంగమం 4.0లో పాల్గొనడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకుంది. తన దేశంలోని గొప్ప దేవాలయాలను సందర్శించే ఈ అరుదైన అవకాశాన్ని భగవంతుని ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. కాశీ నగరంలోని గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని మొదటిసారి అనుభవించడానికి ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తిరుప్పూర్‌కు చెందిన మాలతి అనే మరో విద్యార్థిని యూపీఎస్‌సీకి సిద్ధమవుతోంది. తమిళనాడు-కాశీ మధ్య లోతైన ఆధ్యాత్మిక బంధం ఉందనీ, దీనిని మాణిక్కవాసగర్ వంటి సాధువులు శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమం ఆ బంధాన్ని ఆధునిక, శక్తిమంతమైన రూపంలో బలోపేతం చేస్తోందన్నారు. కాశీని సందర్శించడం తనకు గర్వకారణమని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాశీలోని ఘాట్‌లు, విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న ప్రీ-ఈవెంట్ కార్యకలాపాల్లో జెన్ జెడ్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రన్ ఫర్ కేటీఎస్ 4.0 వంటి కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో యువతను ఆకర్షించాయి. వారు ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడమే కాకుండా రాబోయే సాంస్కృతిక ఉత్సవం గురించి అవగాహనను వ్యాప్తి చేయడంలోనూ సఫలమయ్యారు.
విశ్వనాథ ఆలయ ప్రాంతంతో పాటు వివిధ ఘాట్‌ల వద్ద ప్రదర్శించిన వీధి నాటకాలు జెన్ జెడ్ సృజనాత్మక వ్యక్తీకరణను ప్రదర్శించాయి. కాశీ - తమిళనాడు మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాన్ని తాజాగా, కళాత్మకంగా వివరించాయి. యువ సృష్టికర్తలు సోషల్ మీడియాలో ఈ కార్యక్రమ సంగ్రహావలోకనాలను పంచుకునే రీల్ రూపకల్పన పోటీలు ఉత్సాహాన్ని మరింత పెంచాయి. దేశవ్యాప్తంగా యువతలో ఉత్సుకతను, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాయి.
ఈ సంవత్సరం కాశీ తమిళ సంగమం 4.0 ఇతివృత్తం "లర్న్ తమిళ్ - తమిళ్ కర్కలం". భాషను, సంస్కృతిని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో దీనిని రూపొందించారు. జెన్ జెడ్ క్రియాశీల భాగస్వామ్యం ఈ ఇతివృత్తాన్ని మరింత సందర్భోచితంగా, ప్రభావవంతంగా మారుస్తోంది.
***
(रिलीज़ आईडी: 2196729)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Manipuri
,
Gujarati
,
Malayalam
,
Urdu
,
Bengali
,
Assamese
,
Kannada
,
Marathi
,
Punjabi