అసలైన క్లయిమాక్స్ తో తిరిగి విడుదల కానున్న ప్రముఖ చిత్రం ‘షోలే’ ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా ప్రకటించిన దర్శకుడు రమేష్ సిప్పీ
ఐఎఫ్ఎఫ్ఐ- 2025 వేదికగా ఐకానిక్ చలన చిత్రం ‘షోలే’ 50వ వార్షికోత్సవ వేడుకలు
హిందీ సినిమాలోని అత్యుత్తమ విలన్లలో ఒకరైన గబ్బర్ సింగ్
ఎలా పుట్టాడో వివరించిన ప్రముఖ డైరెక్టర్ రమేష్ సిప్పీ
గుర్రపు స్వారీ సన్నివేశంలో సీటు జారిపోయి నటుడు కింద పడిపోయినట్లు
తెలిపిన డైరెక్టర్ దివంగత ధర్మేంద్ర నిబద్ధతను గుర్తు చేసిన డైరెక్టర్
హిందీ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల విషయంలో
భద్రతా ప్రోటోకాల్‌లకు 'షోలే' మార్గదర్శకత్వం వహించిందన్న కిరణ్ సిప్పీ
56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఐఎఫ్ఎఫ్ఐ) సినీ ప్రేమికులను ప్రముఖ హిందీ చిత్రం ‘షోలే’ డైరెక్టర్, పౌరాణిక చిత్ర రూపకర్త రమేష్ సిప్పీ 50 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారు. “షోలే సినిమాకు 50 సంవత్సరాలు: షోలే ఇప్పటికీ ఎందుకు ఆకట్టుకుంటోంది?” అనే శీర్షికతో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ చిత్రానికి సంబంధించిన ఉత్తేజకరమైన ప్రయాణం గురించి చెప్పారు.
ఆయన భార్య, నటి-నిర్మాత కిరణ్ సిప్పీ సమన్వయం చేసిన ఈ కార్యక్రమం.. జ్ఞాపకాలు, విశేషాలు, హృదయపూర్వక వాతావరణంతో నిండిపోయింది. సాంస్కృతిక మైలురాయిగా మారిన ఈ చిత్రం తయారీ గురించి డైరెక్టర్ వివరించారు.
అసలు ముగింపుతో 50 సంవత్సరాల తర్వాత తిరిగి విడుదల కానున్న షోలే
సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటనల్లో ఒకటైన ‘షోలే చిత్రాన్ని తిరిగి విడుదల చేయటం’ గురించి దర్శకుడు స్పష్టతనిచ్చారు. ఈసారి అసలైన ముగింపుతోనే విడుదల చేయనున్నట్లు రమేష్ సిప్పీ తెలిపారు.
1975లో అత్యవసర పరిస్థితి సమయంలో ఈ చిత్రం మొదటిసారి విడుదలైనప్పుడు అప్పటి సెన్సార్ బోర్డు.. ఠాకూర్ బల్దేవ్ సింగ్ బూట్లతో గబ్బర్ సింగ్‌ను చంపే క్లయిమాక్స్ కు అభ్యంతరం చెప్పింది. ఒక పోలీస్ అధికారి ప్రతీకారం తీర్చుకోవటం అనేది ఉండొద్దని బోర్డు పట్టుబట్టింది. ఇష్టం లేకపోయినా అప్పుడు క్లయిమాక్స్ ను మళ్లీ చిత్రీకరించాల్సి వచ్చింది.
"ఇప్పుడు మీరు అసలైన సినిమాను చూస్తారు" అని సంతోషంతో చెప్పిన సిప్పీ.. ఈ సృజనాత్మక పునరుద్ధరణ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందన్నారు.
కొత్త నేపథ్యం, భయంకరమైన విలన్
ఈ చిత్రానికి పూర్తిగా కొత్త విజువల్ పాలెట్‌ను అన్వేషించిన తీరును దర్శకుడు వివరించారు. హిందీ సినిమాలోని బందిపోటు డ్రామాలు ఎక్కువగా రాజస్థాన్, చంబల్ లోయలో చిత్రీకరణ అవుతున్న ఆ సమయంలో మైసూరు, బెంగళూరు సమీపంలోని రాతి శిలల భూభాగాన్ని వెతికి అక్కడ చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యం 'షోలే'కు భారతీయ సినిమాలో ఎప్పుడూ చూడని ఒక విలక్షణమైన రూపాన్ని ఇచ్చింది.
ఈ సెట్టింగ్ ఒక అసాధారణమైన వైరుధ్యాన్ని కూడా చిత్రానికి అందించింది. గరుకైన యూపీ యాసతో ఉన్న గబ్బర్ సింగ్ దక్షిణ భారత్‌లోని ఈ ప్రాంతంలో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశారు. అమ్జద్ ఖాన్ పోషించిన మరపురాని పాత్ర గురించి మాట్లాడుతూ ఈ పాత్ర కోసం మొదట మొదట డ్యానీ డెంజోంగ్పాను తీసుకోవాలని భావించినట్లు తెలిపారు. అయితే అప్పటికే ఒప్పుకున్న విదేశీ చిత్రీకరణల వల్ల ఆయన అందుబాటులో లేరని వెల్లడించారు. రచయితలు సలీం-జావేద్ సిఫార్సు చేసిన అమ్జద్ ఖాన్ నటనా నైపుణ్యంతో సిప్పీని ఆకట్టుకున్నారు. ఇంకా మిగతా అంతా సినీ చరిత్రలో భాగమైంది.
స్క్రీన్ రచయితల ద్వయం మొదట మన్‌మోహన్ దేశాయ్‌కి కేవలం రెండు పంక్తుల కాన్సెప్ట్‌ను ఇచ్చారని, అయితే దానిని ఆయన తిరస్కరించారని ఈ ఐకానిక్ చిత్ర దర్శకుడు తెలిపారు. కానీ సిప్పీల ద్వయం తండ్రీకొడుకులు జీ.పీ. సిప్పీ, రమేష్ సిప్పీ దాని సామర్థ్యాన్ని వెంటనే గుర్తించారు. ఒక్క నెలలోనే స్ర్కీన్ ప్లే పూర్తైంది. ప్రమాదకరమైన పాత్ర కావాలని సలీం-జావేద్‌తో సిప్పీ చెప్పినప్పుడు ఒక చంచలమైన విలన్ పుట్టాడు. ఈ విధంగా హిందీ సినిమాకు అన్ని కాలాలలోకెల్లా అత్యుత్తమ విలన్‌లలో ఒకరు దక్కారని 'షోలే' దర్శకుడు పేర్కొన్నారు.
దిగ్గజాలను గుర్తు చేసుకుంటూ....
కాలం వేగంగా గడిచిపోతున్న తీరును గుర్తు చేసిన దర్శకుడు రమేష్ సిప్పీ.. చిత్రంలోని దిగ్గజ నటులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం మన మధ్య లేని సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్.. ఇటీవల మరణించిన ధర్మేంద్రకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.
ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతూ.. దివంగత ధర్మేంద్ర ఒక గుర్రపు స్వారీ యాక్షన్ సన్నివేశంలో చూపించిన నిబద్ధతను రమేష్ సిప్పీ గుర్తు చేశారు. ఆ సమయంలో సీటు జారిపోయి నటుడు ధర్మేంద్ర కింద పడిపోయినట్లు ఆయన తెలిపారు. అప్పుడు ఒక్క క్షణం పాటు గుండె ఆగినంత పనైందని రమేష్ సిప్పీ తెలిపారు. కానీ ధర్మేంద్ర వెంటనే లేచి దుమ్ము దులుపుకుని మళ్లీ చిత్రీకరణకు సిద్ధమయ్యారని వెల్లడించారు. “ధర్మేంద్ర గారు ఎల్లప్పుడూ మరింత కష్టపడుతూ కొత్త విషయాలను ప్రయత్నించాలని కోరుకునేవారు” అని దర్శకుడు వ్యాఖ్యానించారు.
'షోలే' అసమానమైన కళా నైపుణ్యం:
అసాధారణమైన బృంద స్ఫూర్తి ఫలితమే 'షోలే' అని సిప్పీ చెప్పారు. ఈ చిత్రంలో మొదటి సారి చాలా కొత్త వాటిని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్న ఆయన.. బ్రిటన్ నుంచి ప్రొఫెషనల్ ఫైట్-సీక్వెన్స్ బృందాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన మొదటి భారతీయ చిత్రం ఇదేనని తెలిపారు. హిందీ సినిమాల యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇది భద్రతా ప్రోటోకాల్‌లకు మార్గదర్శకత్వం వహించిందని కిరణ్ సిప్పీ తెలియజేశారు.
ప్రేక్షకులతో మాట్లాడిన రమేష్ సిప్పీ.. సినిమాటోగ్రాఫర్ ద్వారకా దివేచా విజువల్ కథాకథనంతో కొత్త ప్రమాణాలను నెలకొల్పారని అన్నారు. తెర వెనుకనున్న ప్రొడక్షన్ మేనేజర్ అజీజ్ భాయ్ కూడా కీలక పాత్ర పోషించినట్లు ఆయన గుర్తు చేశారు.
సాయంత్రం పూట జరిగే జయ భాదురి దీపాలు వెలిగించే సన్నివేశంలో భావోద్వేగాన్ని నింపేందుకు అవసరమైన లైటింగ్ విషయంలో “మ్యాజిక్ అవర్” కోసం ప్రతి రోజు వేచి చూసినట్లు తెలిపారు. ఈ సన్నివేశం చిత్రీకరించేందుకు రోజులు పట్టిందని చిత్ర దర్శకుడు వెల్లడించారు.
ఆనంద్ బక్షి రచించి, ఆర్.డీ. బర్మన్ సంగీతం అందించిన “యే దోస్తీ హమ్ నహీ తోడేంగే” అనే చిరకాలం గుర్తిండిపోయే పాటను కూడా ఆయన ప్రస్తావించారు. తరాలు గడిచినప్పటికీ ఆ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉందన్నారు.
కొనసాగుతున్న వారసత్వం
ఈ సెషన్ ముగిసే సమయానికి.. ‘ షోలే కేవలం ఒక చిత్రం కాదు. ఇది చిత్ర రూపకర్తలను నిరంతరం ప్రేరేపిస్తూ, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ భారతీయ సినిమా సరిహద్దులను పునర్నిర్వచించే ఒక సజీవ వారసత్వం‘ అన్న విషయం స్పష్టమైంది.
ఐకానిక్ దర్శకుడు రమేష్ సిప్పీ అరవై సంవత్సరాల క్రితం ఊహించిన విధంగానే ‘50 ఏళ్ల వేడుక, అసలైన క్లైమాక్స్‌తో చాలా కాలం తర్వాత పెద్ద తెరకు రావటం’తో షోలే చిత్రం మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది.
'షోలే' 50వ వార్షికోత్సవానికి గుర్తుగా చిత్రంలోని ఐకానిక్ మోటారుసైకిల్‌ను చిత్రోత్సవ మైదానంలో ప్రదర్శించారు. సినీ ప్రేమికులు దీనిపై ఆసక్తిని కనబరిచారు.
***
रिलीज़ आईडी:
2196727
| Visitor Counter:
3