రెండో ప్రపంచ యుద్ధం కథలు, విశేషాలకు జీవం పోసిన మణిపురి డాక్యుమెంటరీ చిత్రం ‘బ్యాటిల్‌ఫీల్డ్’
ముందు తరానికి సంబంధించిన తోడును తెలిపే కథ ‘హమ్సఫర్’
బలమైన, అర్ధవంతమైన సందేశాలను కలిగి ఉన్న వివిధ రకాల నాన్-ఫీచర్ చిత్రాలను 56వ ఐఎఫ్ఎఫ్ఐ ప్రదర్శిస్తూనే ఉంది. ఇవి సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తూ శక్తివంతమైన కథాకథనం ద్వారా ప్రపంచ సినిమాకు గణనీయంగా సహకరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఐఎఫ్ఎఫ్ఐలో ఆకర్షణీయ నాన్-ఫీచర్ చిత్రాలలో హమ్సఫర్(మరాఠీ), బ్యాటిల్‌ఫీల్డ్(మణిపురి) ప్రత్యేకంగా నిలిచాయి. ఈ రోజు జరిగిన పత్రికా సమావేశంలో ఈ చిత్రాల దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఈ చిత్రాల వెనుక ఉన్న కథలను పంచుకున్నారు. ఈ చిత్రాలు సమాజంలో సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ‘బ్యాటిల్‌ఫీల్డ్’ చిత్రం పూర్తి చేయడానికి దాదాపు పదేళ్లు పట్టిందని దర్శకుడు బోరున్ థోక్‌చోమ్ తెలిపారు. ప్రతి మణిపురి వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధం కథలను వింటూ పెరిగారన్న ఆయన.. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధక్షేత్రాలలో మణిపూర్ ఒకటి కావొచ్చు అని పేర్కొన్నారు. పుస్తకాలు, మీడియాలో సరైన రికార్డులు లేకపోవడంతో ఈ జ్ఞాపకాలను డాక్యుమెంట్ చేయాలనే సవాలును స్వీకరించాలన్న ఆలోచన ఏర్పడినట్లు తెలిపారు. ఈ ప్రాంత పూర్వీకుల కథను ప్రామాణికతతో పాటు గౌరవంగా చెప్పడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ యుద్ధకాల వారసత్వాన్ని ప్రతి మణిపురి వ్యక్తి మోస్తున్నందున కథలు, విశేషాలు, యుద్ధపాటలను ఆయన మళ్లీ అన్వేషించారు. వాటిని ఒకచోట చేర్చి ప్రపంచంతో పంచుకునేందుకు ఆయన డాక్యుమెంటరీ తీశారు.

సాధారణ మెటల్ డిటెక్టర్లతో రెండో ప్రపంచ యుద్ధం కథలు, విశేషాలకు జీవం పోసేందుకు ఒక మిషన్‌ను ప్రారంభించిన రామేశ్వర్, రాజేశ్వర్ వంటి వ్యక్తుల నుంచి ప్రేరణ పొందినట్లు తెలిపిన ఆయన.. దాదాపు పదేళ్ల క్రితం ఈ చిత్రం నిర్మాణం ప్రారంభమైందని తెలియజేశారు.

‘బ్యాటిల్‌ఫీల్డ్’ చిత్ర నిర్మాత,సహ-నిర్మాతలు అయిన మంజోయ్ లౌరెంబం, డాక్టర్ రాధేశ్యామ్ ఓనం మాట్లాడుతూ.. ఇంతటి శక్తివంతమైన, ప్రతిధ్వనించే ఇతివృత్తం ఉన్న చిత్రాన్ని ఎంపిక చేసినందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహక కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. ‘బ్యాటిల్‌ఫీల్డ్’ తనదైన ఒక ప్రాముఖ్యతను కలిగి ఉందని వారు పేర్కొన్నారు. సంబంధిత కథలను భవిష్యత్తు తరాలకు అందించడం, భద్రపరచడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నారు.

‘హమ్సఫర్’ చిత్ర దర్శకుడు అభిజిత్ అరవింద్ దాల్వీ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథకు తన సొంత ఇంటిలో బాల్యంలో జరిగిన సంఘటనే ప్రేరణ అని తెలిపారు. చిన్నతనంలో తన తాతగారు ఆ పరికరంతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకున్నట్లు భావించే ట్రాన్సిస్టర్ లేకుంటే ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకునేందుకు ఒకసారి ఆయన దానిని దాచిపెట్టారు. దీని మాయం వెనుక తాను ఉన్నట్లు తల్లికి కొన్ని రోజుల తర్వాత తెలిసింది. తల్లి శిక్షించిన అనంతరం చివరికి ఆ ట్రాన్సిస్టర్ తిరిగి తాతకు ఇచ్చారు. కొన్ని ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ అదే ట్రాన్సిస్టర్‌ను అనుకోకుండా చూశారు. ఈ సంఘటనే ఈ సినిమా ఆలోచనను పుట్టించింది.
సినిమాలో మాటలన్నీ కేవలం రేడియో ద్వారానే వినిపిస్తాయి. కథానాయకులలో ఎవరూ నేరుగా మాట్లాడరు. ఈ కథలో రేడియో ట్రాన్సిస్టర్‌కు ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని, కథన ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోంది. రేడియో ఒక మాధ్యమంగా, ఒక తోడుగా ఉండటానికి ఉన్న ప్రాముఖ్యత తాతగారు ట్రాన్సిస్టర్‌ను కోల్పోయిన అనుభవాన్ని తెలుసుకున్న తర్వాతే తెలిసివచ్చినట్లు ఆయన ప్రధానంగా పేర్కొన్నారు.
పాత్రికేయ సమావేశం లింక్:
ఐఎఫ్ఎప్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) దక్షిణాసియాలో అత్యంత ఎక్కువ చరిత్ర కలిగిన అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వంలోని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- ఎన్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించబడిన క్లాసిక్ సినిమాలు సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు ఒక వేదికపై నిలుస్తాయి. ప్రసిద్ధ దర్శక నిర్మాతలు, నిర్భయులైన తొలి దర్శకులతో వేదికను పంచుకుంటారు. ఇలా ఒక ప్రపంచ సినిమా కేంద్రంగా ఈ ఉత్సవం ఎదిగింది. ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు వేగాన్ని పొందే ఉత్తేజభరిత వేవ్స్ ఫిల్మ్ బజార్, మాస్టర్‌క్లాసులు, సమర్పణ చిత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అంతర్జాతీయ పోటీలు లాంటి సమ్మేళనంతో ఐఎఫ్ఎప్ఐ ప్రత్యేకంగా మారుతోంది. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలోని అద్భుతమైన తీరప్రాంతంలో నిర్వహించే ఐఎఫ్ఎప్ఐ.. భాషలు, విభాగాలు, ఆవిష్కరణలు, శ్రవణాల అద్భుతమైన కలయికను వీక్షకులకు అందించనుంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను తెలియజేసే ఒక ప్రత్యేక వేదికగా ఉంది.
మరింత సమాచారం కోసం, ఈ క్రింది లింక్‌లను సందర్శించండి:
* ఐఎఫ్ఎప్ఐ వెబ్‌సైట్: https://www.iffigoa.org/
* పీఐబీకి సంబంధించి ఐఎఫ్ఎఫ్ఐ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
* పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
* ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2194409
| Visitor Counter:
3