ఇఫి రాయబారుల రౌండ్‌టేబుల్ సమావేశంలో సహ-నిర్మాణ సామర్థ్యాన్ని ప్రదర్శించిన భారత్.. బలమైన సాంస్కృతిక, సాంకేతిక సమన్వయం కోసం పిలుపు
ప్రపంచ స్టూడియోగా ఎదగటానికి సిద్ధమైన భారత్: కేంద్ర సహాయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, కార్యదర్శి సంజయ్ జాజు
భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సహా-నిర్మాణ రంగంలో అవకాశాలను కొనియాడిన రాయబారులు
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా ఇవాళ డోనా పౌలాలోని తాజ్ సిడేడ్ డీ గోవా హోటల్‌లో రాయబారుల రౌండ్‌టేబుల్ సమావేశంలో దౌత్యవేత్తలు పాల్గొన్నారు. దృశ్య-శ్రవణ కార్యక్రమాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు నూతన మార్గాల అన్వేషణతో పాటు సహ-నిర్మాణ అవకాశాలు, సృజనాత్మక ఆర్థిక వృద్ధి, లోతైన సాంస్కృతిక మార్పిడిపై ఈ సమావేశం దృష్టి సారించింది.

భారత్, భాగస్వామ్య దేశాల మధ్య చర్చల కోసం నిర్వహించిన ఈ సమావేశంలో ప్రపంచ సృజనాత్మక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు చలనచిత్ర నిర్మాణ రంగంలో నూతన అవకాశాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, నియంత్రణ సమన్వయం వంటి అంశాలను కీలకంగా ప్రస్తావించారు. సహ-నిర్మాణ ఒప్పందాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందటం, సాంస్కృతిక, సాంకేతిక మార్పిడిని పెంపొందించటం, విదేశాల్లో చలనచిత్ర నిర్మాతలకున్న నియంత్రణ సవాళ్లను సులభతరం చేయటం, అనుసంధానంతో కూడిన సృజనాత్మక రంగ నిర్మాణంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.
భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న మీడియా వాతావరణం, నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా పెరుగుతున్న ఆదరణను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ప్రముఖంగా ప్రస్తావించారు.
"సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయటం, భాగస్వామ్యాలను మరింత పటిష్టం చేయటంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశం సహకరిస్తుంది" అని సంజయ్ జాజు అన్నారు. బహుళ భాషా ప్రతిభవంతులున్న, "ప్రపంచ స్టూడియోగా ఆవిర్భవిస్తున్న భారత్‌లో ప్రపంచ కథలను ఊహించి, నిర్మించి, ప్రదర్శించవచ్చు" అని తెలిపారు.

పలు రకాల షూటింగ్ ప్రదేశాల నుంచి అత్యాధునిక యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోల వరకు భారత్ బలాన్ని తెలియజేస్తూ.. ఐఎఫ్ఎఫ్ఐ వేదిక ద్వారా వేవ్స్ ఫిల్మ్ బజార్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించాలని ప్రతినిధులను ఆహ్వానించారు. భారత్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు చేరువ కావచ్చని, దీని ద్వారా మనం చెప్పే కథలు వివిధ సంస్కృతులు, మార్కెట్లలోకి త్వరగా వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. "దృశ్య-శ్రవణ సహకారాన్ని బలోపేతం చేయటానికి సహ-నిర్మాణం అత్యంత శక్తిమంతమైన మార్గం" అని తెలిపారు. 2025లో భారత మీడియా, వినోద రంగం 31.6 బిలియన్ డాలర్లకు చేరిందని.. వీఎఫ్ఎక్స్, యానిమేషన్, భవిష్యత్ తరం నిర్మాణ సాంకేతికతల్లో వస్తున్న వృద్ధి దీనికి ఇంధనంగా పనిచేస్తుందని ఆయన అన్నారు.
ద్వైపాక్షిక ఒప్పందాల పాత్రను ప్రస్తావిస్తూ.. సంయుక్త అభివృద్ధి సంస్థలు, సులభంగా అనుమతులు, ప్రతిభ, వనరుల మార్పిడి, చలనచిత్ర రూపకర్తలకు పెరిగిన సృజనాత్మక స్వేచ్ఛకు ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేస్తాయని డాక్టర్ మురుగన్ అన్నారు. పైరసీని అరికట్టేందుకు భారత్ తీసుకున్న పటిష్టమైన చర్యల గురించి మాట్లాడుతూ.. ఎంఈఐటీవై, ఎంహెచ్ఏ, న్యాయ మంత్రిత్వ శాఖతో అంతర్-మంత్రిత్వ శాఖ సహకారం ద్వారా ఈ చర్యలు సులభతరం చేశామని, ఇది ప్రపంచవ్యాప్తంగా చిత్ర నిర్మాణానికి సురక్షితమైన వ్యవస్థను ఏర్పరుస్తుందన్నారు.

భారత్‌లో అభివృద్ధి చెందుతున్న పైరసీ నిరోధక వ్యవస్థను రౌండ్‌టేబుల్ సమావేశానికి ముందు ఎన్‌ఎఫ్‌డీసీ కన్సల్టెంట్ శృతి రాజ్‌కుమార్ సమర్పించారు. డిజిటల్ లీకేజీని అరికట్టటానికి, కంటెంట్ యజమానుల రక్షణకు రూపొందించిన సాంకేతిక చర్యలు, వ్యవస్థాగత విధానాల గురించి ఇందులో వివరించారు.
క్యూబా, నేపాల్, దేశాల రాయబారులు ఇజ్రాయెల్, గయానా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, మొరాకో, టోగో, కోట్ డి ఐవోర్ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ దౌత్యవేత్తలు ఈ సమావేశంలో పాల్గొని.. వారి దేశాల్లోని చలనచిత్ర పరిశ్రమలపై కీలక అంశాలను పంచుకున్నారు.
భారత సృజనాత్మక శ్రామిక శక్తి, సాంకేతిక బలాన్ని వినియోగించుకోవటం, తమ చలనచిత్ర వ్యవస్థలను సుసంపన్నం చేయగల సహ-నిర్మాణ మార్గాలను అన్వేషించటం వంటి అంశాలపై గౌరవ అతిథులు సమిష్టిగా ఆశావాదం వ్యక్తం చేశారు.
సమావేశం ముగింపులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (ఎక్స్పీడీ) శ్రీ రాజేశ్ పరిహార్ ధన్యవాదాలు తెలియజేశారు. దౌత్యవేత్తల సహకారాన్ని అభినందించారు. సహకారాత్మక ప్రపంచ ఆడియో-విజువల్ వాతావరణాన్ని పెంపొందించటానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. బలమైన ద్వైపాక్షిక సంబంధాల నిర్మాణానికి, శక్తిమంతమైన మీడియా భాగస్వామ్యాలను పెంపొందించటానికి, కథనాల భవిష్యత్తుపై ఉమ్మడి దృష్టికి ఐఎఫ్ఎఫ్ఐ 2025లో జరిగిన రాయబారుల సమావేశం కీలక ముందడుగా నిలిచింది.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
దక్షిణాసియాలో అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలిచిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) 1952లో ప్రారంభమైంది. దీన్ని భారత ప్రభుత్వ జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో గొప్ప శక్తికేంద్రంగా ఎదిగిన ఈ ఉత్సవంలో పునరుద్ధరించిన క్లాసిక్ చిత్రాలు.. సాహసోపేతమైన ప్రయోగ చిత్రాలు ఒకే వేదికపై నిలుస్తాయి. పౌరాణిక సినీ దిగ్గజాలు, తొలిసారి దర్శక రంగంలోకి అడుగుపెట్టిన వారు కలిసే వేదిక ఇది. ఐఎఫ్ఎఫ్ఐకి ఇంత ఆదరణ పెరగటానికి కారణం దానిలోని ఉద్వేగభరిమైన సమ్మేళనం. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్ తరగతులు, కీర్తిప్రశంసలు, అత్యంత శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ లో ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలు ప్రారంభమై, వృద్ధిలోకి వస్తాయి. గోవాలోని తీర ప్రాంతంలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే 56వ చలనచిత్ర ఉత్సవం.. అనేక భాషలు, తరాలు, ఆవిష్కరణలు, సంగీత ప్రదర్శనల ద్వారా భారతదేశ సృజనాత్మక ప్రతిభను ప్రపంచస్థాయిలో చాటిచెబుతుంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఐఎఫ్ఎఫ్ఐ వైబ్‌సైట్: https://www.iffigoa.org/
ఐఎఫ్ఎఫ్ఐ పీఐబీ మైక్రోసైట్: https://www.pib.gov.in/iffi/56new/
పీఐబీ ఐఎఫ్ఎఫ్ఐవుడ్ ప్రసార ఛానెల్: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
ఎక్స్ హ్యాండిల్స్: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2193009
| Visitor Counter:
7