అత్యుత్తమ ప్రదర్శనకు సిద్ధమైన ప్రతిభావంతులు!
సీఎమ్‌వోటీ-2025 ప్రారంభంతో భారత తదుపరి తరం సృష్టికర్తల రంగప్రవేశం
సీఎమ్‌వోటీ కేవలం సినిమా నిర్మాణం గురించినది కాదు... ఇది దేశ సృజనాత్మక భవిష్యత్తును రూపొందించడం గురించినది: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
దేశం కోసం భవిష్యత్ కథకులు... ప్రపంచ సాంస్కృతిక రాయబారులుగా మారనున్న సీఎమ్‌వోటీ పూర్వ విద్యార్థులు: ఎంఐబీ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు
ప్రతిభావంతులంతా తమ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు! దేశపు తదుపరి తరం సృష్టికర్తలు ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా ‘రేపటి సృజనాత్మక మేధస్సు-2025’ కార్యక్రమం ఐదో ఎడిషన్ ఈ రోజు గోవాలో ప్రారంభమైంది. దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన, వర్ధమాన యువ చిత్రరూపకర్తల కోసం గోవా అధునాతన రంగస్థలంగా సిద్ధమైంది.

125 మంది వర్ధమాన తారలు 48 గంటల చిత్ర రూపకల్పన సవాలు కోసం సిద్ధమై రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడ ఆలోచనలు... సృజనాత్మకత, సహకారం, సినిమాటిక్ మాయాజాలాల సుడిలో స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ దాకా పరుగెత్తుతాయి. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు... రేపటి దర్శకులు, నటులు, కథకులు వారి సొంత బ్లాక్‌బస్టర్ కథలను రూపొందించడాన్ని ప్రారంభించే అద్భుతమైన వేదిక ఇది.

కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ పోటీలను ప్రారంభించారు. పాల్గొనేవారి అభిరుచిని, సృజనాత్మకతనూ ప్రశంసించారు. 2021 నుంచి ఈ కార్యక్రమం నిరంతర వృద్ధిని ఆయన కొనియాడారు. యువ కథకులకు అంతర్జాతీయ వేదికను అందించినందుకు సీఎమ్‌వోటీని అభినందించారు. “ఈ వేదిక దేశంలోని వర్ధమాన సృజనకర్తలను ప్రపంచ నిర్మాతలు, సృజనాత్మక నెట్‌వర్క్‌లతో అనుసంధానిస్తోంది. ఇది కేవలం చలనచిత్ర నిర్మాణం గురించి మాత్రమే కాదు - ఇది దేశ సృజనాత్మక భవిష్యత్తును రూపొందించడం గురించినది” అని ఆయన అన్నారు.

"ఈ అధిక ఒత్తిడితో కూడిన అనుభవాలు మీ నైపుణ్యాలను మరింత పదును పెడతాయి... మీ అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీస్తాయి" అని స్పష్టం చేస్తూ... 48 గంటల చిత్ర రూపకల్పన సవాలును స్వీకరించాలని డాక్టర్ మురుగన్ పాల్గొనేవారిని ప్రోత్సహించారు. శక్తిమంతమైన, ఆవిష్కరణ-ఆధారితమైన సృజనాత్మక రంగం కోసం ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా... ప్రతిభను ప్రోత్సహించడానికి, దేశ సృజనాత్మక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు నడిపించడానికి ముంబయిలో కొత్తగా ప్రారంభించిన భారతీయ సృజనాత్మక సాంకేతికతల సంస్థ ఏర్పాటుతో పాటు ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాలనూ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ... ఈ పోటీలకు ఎంపికైన యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో వారి భాగస్వామ్యమూ ఒక ముఖ్యమైన విజయమేనని అభివర్ణించారు. వారి ఉత్సాహాన్ని ప్రశంసిస్తూ... గత సంవత్సరం పోటీలో రూపొందించి, ప్రదర్శించిన అసాధారణ చిత్రాలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఫైనల్‌లో ప్రదర్శనను "దాదాపు ఆస్కార్ లాంటిది"గా ఆయన అభివర్ణించారు. సీఎమ్‌వోటీ అరుదైన సహకారాన్ని పెంపొందిస్తుందన్నారు. ఎందరో కొత్తవారైన ప్రతిభావంతులు ఎంతో ఒత్తిడిలోనూ అద్భుతమైన కథలతో చిత్రాలను రూపొందించడం కోసం వస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. "మీలో చాలా మంది దేశానికి భవిష్యత్ కథకులు... ప్రపంచ సాంస్కృతిక రాయబారులుగా మారతారు" అని చెబుతూ... ఇటీవల జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న సీఎమ్‌వోటీ పూర్వ విద్యార్థి ఉదాహరణను ఆయన ఉటంకించారు.
షార్ట్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, సీఈవో కార్టర్ పిల్చర్ మాట్లాడుతూ... ఈ సంవత్సరం సీఎమ్‌వోటీని ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత ఉత్తేజకరమైన ఎడిషన్‌లలో ఒకటిగా అభివర్ణించారు. మరే ఇతర ప్రపంచ ఉత్సవంలోనూ కనిపించని గొప్ప వేదికను ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు. "మునుపటి ఎడిషన్‌లలో పాల్గొన్నవారు ఇప్పటికే కేన్స్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో కూడా చోటు సంపాదించారు" అని ఆయన అన్నారు. సంక్షిప్త రూపంలో కథ చెప్పడం ఇప్పుడు ప్రపంచ వినోదానికి కేంద్రంగా ఉందని పునరుద్ఘాటిస్తూ... నేర్చుకోవడానికి, సహకరించడానికి, సృజనాత్మక సరిహద్దులను అధిగమించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సృష్టికర్తలను పిల్చర్ కోరారు.
సంయుక్త కార్యదర్శి (సినిమాలు) డాక్టర్ అజయ్ నాగభూషణ్, ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దూమ్‌లూ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
రేపటి సృజనాత్మక మేధస్సు (సీఎమ్‌వోటీ) గురించి
‘రేపటి సృజనాత్మక మేధస్సు’ (క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో- సీఎంవోటీ) అనే కార్యక్రమం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లు ప్రారంభించిన ఒక దార్శనిక కార్యక్రమం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని వర్ధమాన ప్రతిభావంతులను కనుగొనడం, వారిని మరింత మెరుగుపరచడం, వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కేవలం ప్రతిభకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదు... ఇది దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు నడిపించే భవిష్యత్ కథకుల ప్రతిభను ప్రపంచానికి చాటే చక్కటి వేదిక.
వర్ధమాన ప్రతిభావంతుల అభిరుచిని ప్రతి సంవత్సరం సీఎమ్‌వోటీ సినిమాటిక్ ప్రతిభగా మారుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వర్ధమాన చిత్ర రూపకర్తలు ఆసియాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవాల్లో ఒకటైన ప్రపంచస్థాయి వేదికపై తమ నైపుణ్యాలను ప్రదర్శించడం కోసం ఒక అసాధారణ అవకాశాన్ని ఇది అందిస్తుంది.
భారత ప్రీమియర్ ఫిల్మ్ ఫెస్టివల్-ఐఎఫ్ఎఫ్ఐ సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమం నాలుగు ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఐదో ఎడిషన్‌లో... సీఎమ్‌వోటీ ద్వారా మరోసారి మొత్తం 13 చలనచిత్ర కళల్లో 125 మంది యువత తమ ప్రతిభను ప్రదర్శిస్తారు.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191768
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2075551
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2073892
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1978454
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1979776
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1856855
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
Release ID:
2192669
| Visitor Counter:
2