గోవాలోని కళా అకాడమీలో నేడు 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి 2025) మాస్టర్‌క్లాస్ సిరీస్ ను సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ లోగనాథన్ మురుగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సంయుక్త కార్యద్శి డాక్టర్ అజయ్ నాగభూషణ్, ప్రముఖ దర్శకుడు శ్రీ ముజాఫర్ అలీ, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ముఖ్య అధికారి శ్రీ ప్రాష్ మాగ్దం, నిర్మాత శ్రీ రవి కోత్తరాకరా పాల్గొన్నారు.

ఈ ఏడాది తొలిసారి సాధారణ ప్రజల సమక్షంలో మాస్టర్‌క్లాస్ ప్రారంభోత్సవం నిర్వహించడం చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా, విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై చలనచిత్రోత్సవానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఈ సందర్భంగా శ్రీ లోగనాథన్ మురుగన్ మాట్లాడుతూ.. ఇఫి 2025లో 200కు పైగా సినిమాలు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా దేశంలో పెరుగుతున్న సినిమా ప్రభావాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ చిత్రోత్సవం వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంతో ముడిపడి ఉందని, సృజనాత్మక ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే భారత లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళా దర్శకుల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సంవత్సరం మహిళలు దర్శకత్వం వహించిన 50 సినిమాలను ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్ఫూర్తితో.. నారీ శక్తి, మహిళా సాధికారతపై ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.

ఇఫి 2025 మాస్టర్‌క్లాస్ సదస్సులో విస్తృతమైన జ్ఞాన భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాటిలో నిపుణుల చర్చలు, వర్క్‌షాప్‌లు, రౌండ్ టేబుల్ సమావేశం, ఇంటర్వ్యూ కార్యక్రమాలు, మాటా మంతీ, సంభాషణాత్మక వర్క్‌షాప్‌లు ఉండనున్నాయి. విధు వినోద్ చోప్రా, అనుపమ్ ఖేర్ ముజఫర్ అలీ, షాద్ అలీ, శేఖర్ కపూర్, రాజ్‌కుమార్ హిరాణీ, ఆమిర్ ఖాన్, విశాల్ భరద్వాజ్, సుహాసిని మణిరత్నం వంటి సినీ ప్రముఖులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు శ్రీ ముజాఫర్ అలీ మాస్టర్‌క్లాస్ సిరీస్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించి, భవిష్యత్తు సమావేశాల నిర్వహణకు తొలి అడుగు వేశారు.
ఈ ఏడాది మాస్టర్‌క్లాస్‌లలో సమకాలీన, భవిష్యత్తు దృష్టిగల అంశాలు కొత్తగా చర్చలోకి రానున్నాయి. వాటిలో కృత్రిమ మేధ, సుస్థిరత, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక వర్క్‌షాప్‌లు ప్రత్యేకంగా ఉండనున్నాయి. వీటితో పాటు థియేటర్ నటనపై ప్రముఖ పరిశ్రమ నిపుణులు నిర్వహించే మాస్టర్‌క్లాస్‌ల ప్రదర్శన కూడా ఉండనుంది.
ఈ ఏడాది ఇఫి వేడుకలకు ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, కెనడా దేశాల నుంచి హాజరయ్యారు. ఇది చలనచిత్రోత్సవ స్థానాన్ని ప్రపంచస్థాయి సినిమా వేదికపై మరింత బలోపేతం చేసింది.
ఇఫి వార్షిక సంప్రదాయంలో భాగంగా భారత సినీ రంగనికి అందించిన విశేషమైన సహకారాన్ని గౌరవిస్తూ.. ఈ ఏడాది భారత నైటింగేల్ లతా మంగేశ్కర్, సినిమా దిగ్గజం గురుదత్ లకు నివాళులు అర్పించారు.
***