'ది బ్లూ ట్రైల్' తో ఉత్సాహభరితంగా ప్రారంభమైన 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
ఒక వృద్ధ మహిళ గురించిన ఈ చిత్రం జీవితం అర్థాన్ని తెలుసుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుందనే సందేశాన్ని ఇస్తుంది: గాబ్రియేల్ మస్కారో
ఇఫీ మరో రెండు,మూడేళ్లలో లక్ష మంది జనంతో కేన్స్ ఫెస్టివల్ స్థాయిని మించిపోతుంది: శేఖర్ కపూర్
గోవా తీర ప్రాంతంలో ఈ రోజు అట్టహాసంగా మొదలైన 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-ఐఎఫ్ఎఫ్ఐ) లో గాబ్రియేల్ మస్కారో రూపొందించిన డెస్టోపియన్ కథాచిత్రం 'ది బ్లూ ట్రైల్' (పోర్చుగీస్ భాషలో దీనిని 'ఓ ఆల్టిమో అజుల్' అని పిలుస్తారు)ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విస్తృత ప్రశంసలు అందుకోవడంతో పాటు సంభ్రమాశ్చర్యాలను రేకెత్తించింది.

చిత్ర ప్రదర్శనకు ముందు జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో నటీనటులు మారియా అలెజాండ్రా రొహాస్, ఆర్టురో సలాజార్ ఆర్‌బీ, క్లారిస్సా పినేరో, రోసా మాలగ్వేటా, దర్శకుడు గాబ్రియెల్ మస్కారో తదితరులు వేదికను అలంకరించారు. సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఐఎఫ్ఎఫ్ఐ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ చిత్రం గురించి శేఖర్ కపూర్ మాట్లాడుతూ, “ఈ ప్రారంభ చిత్రాన్ని నేను బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చూశాను. అక్కడ దీనికి సిల్వర్ బేర్ అవార్డు వచ్చింది, ఇది రెండవ అత్యుత్తమ పురస్కారం. ఇది చాలా కదిలించే చిత్రం. దీని గురించి మీతో మాట్లాడేందుకు నేను దర్శకుడికే అవకాశం ఇస్తాను” అన్నారు. దర్శకుడు గాబ్రియేల్ మస్కారో మాట్లాడుతూ, "ఒక వృద్ధ మహిళ గురించిన ఈ సినిమా మన జీవితానికి అర్థాన్ని వెతుక్కోవడంలో ఎప్పుడూ సమయం ఉంటుందనే సందేశాన్ని ఇస్తుంది” అని అన్నారు. ఐఎఫ్ఎఫ్ఐ భవిష్యత్ గురించి శేఖర్ కపూర్ మాట్లాడుతూ, "రెండు, మూడు సంవత్సరాలలో మన సందర్శకులు 100,000 మంది ఉంటారని నేను భావిస్తున్నాను. చాలా త్వరలోనే మనం కేన్స్ ఫెస్టివల్ స్థాయిని మించిపోతాం” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘ది బ్లూ ట్రైల్’ ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. జీవితంలోని సవాళ్లను హృదయాన్ని తాకేలా పరిచయం చేసిన తీరు, నిశ్శబ్ద ప్రతిఘటన, థెరిసా పాత్ర ధైర్యంగా ఆరంభించిన ప్రకాశవంతమైన స్వీయ అన్వేషణ ప్రయాణాన్ని ప్రేక్షకులు ప్రశంసించారు.
డెస్టోపియన్ డ్రామా
ఒక భయానకమైన డెస్టోపియన్ బ్రెజిల్ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన 'ది బ్లూ ట్రైల్' చిత్రం, ఉత్సాహం చెదరని 77 ఏళ్ల వృద్ధురాలు థెరిసా కథను చెబుతుంది. విధి ప్రతికూలతను, తనను ఒక వృద్ధుల కాలనీకి పరిమితం చేయాలనే ప్రభుత్వ ఒత్తిడిని ఆమె ధైర్యంగా ఎదిరిస్తుంది. సొంత కలలు, ఆత్మ నిబ్బరంతో ఆమె అమెజాన్ నది ప్రాంతంలో ఒక సాహసోపేతమైన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఆకాశాన్ని తాకి జీవితంలో మొదటిసారిగా ఎగరాలనే ఆమె తహతహతో సాధారణ మార్గాల ప్రయాణానికి అనుమతి దొరకకపోవడంతో, పడవలో రహస్యంగా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు అనేక విభిన్నమైన పాత్రలు తారసపడతాయి. తన ధైర్యాన్ని పరీక్షించే సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్కంఠ కలిగిస్తుంది. ప్రతి మలుపు, తడబాటు, క్షణకాల మాయతో థెరిసా ప్రయాణం వయస్సు పరంగా సమాజం నిర్దేశించిన సరిహద్దులకు చాలా దూరంగా, స్వేచ్ఛ, ధైర్యం, వ్యక్తిగత నిర్ణయాల ప్రకారం జీవించడంలోని అపార ఆనందానికి సాక్ష్యంగా మారుతుంది.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారతప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్, భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2192374
| Visitor Counter:
11