ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని కోయంబత్తూరులో దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో రైతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
వ్యవసాయం, నవకల్పన, మానవ మనుగడల పట్ల రైతులకు ఉన్న మక్కువ ప్రశంసనీయం: ప్రధానమంత్రి
వరిసాగులో తమిళనాడు కృషి ప్రపంచ స్థాయిలో తిరుగులేనిది: ప్రధానమంత్రి
స్వచ్ఛ గ్రామాలు, సరైన పశు సంరక్షణ విషయాల్లో గుజరాత్ ‘క్యాటిల్ హాస్టల్’ నమూనాను ప్రస్తావించిన ప్రధానమంత్రి
Posted On:
20 NOV 2025 12:16PM by PIB Hyderabad
తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆయన అభివాదం చేస్తూ, అరటి పంట దిగుబడిని పరిశీలించారు. అరటి వ్యర్థాలను ఏం చేస్తారని ఆయన వారిని అడిగారు. దీనికి రైతు సమాధానమిస్తూ, ప్రదర్శనకు పెట్టినవన్నీ అరటి వ్యర్థాల్ని ఉపయోగించి తయారు చేసిన వస్తువులేనన్నారు. వారి ఉత్పాదనలను దేశమంతటా ఆన్‌లైన్లో అమ్ముతున్నారా అని ప్రధానమంత్రి అడిగారు. అవును, అమ్ముతున్నామని రైతు బదులిచ్చారు. తాము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓల)తో పాటు వ్యక్తిగతంగా కూడా పూర్తి తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఆ రైతు చెప్పారు. తమ ఉత్పాదనలను ఇంటర్నెట్ ద్వారా అమ్ముతున్నట్లు, ఎగుమతి చేస్తున్నట్లు, దేశవ్యాప్తంగా స్థానిక మార్కెట్లతో పాటు సూపర్‌మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఒక్కొక్క ఎఫ్‌పీఓలో ఎంత మంది కలిసి పనిచేస్తారని శ్రీ మోదీ అడిగారు. సుమారుగా ఒక వేయి మంది వరకు దీనిలో ఉంటారని రైతు జవాబిచ్చారు. అరటి సాగును ఒకే ప్రాంతంలో చేపడతారా, లేక ఇతర పంటలతో కలిపి సాగు చేస్తారా అని ప్రధాని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాలు వేరు వేరు విశిష్ట ఉత్పాదనలలో ప్రావీణ్యాన్ని సంపాదించాయని రైతు వివరణనిస్తూ, తమ వద్ద జీఐ ఉత్పాదనలు కూడా ఉన్నాయని తెలిపారు.
బ్లాక్ టీ, వైట్ టీ, ఊలోంగ్ టీ, గ్రీన్ టీ.. ఇలా టీ లో నాలుగు రకాలు ఉన్నాయని మరో మహిళా రైతు వివరించారు. ఊలోంగ్ టీ 40 శాతం పులియబెట్టిన రకమని ఆమె తెలిపారు. వైట్ టీకి ప్రస్తుతం విశేషమైన మార్కెట్ ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ మాటలతో రైతు ఏకీభవించారు. రైతులు వేర్వేరు రుతువుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వంకాయలు, మామిడి సహా వివిధ రకాల కాయగూరలను, పండ్లను ప్రదర్శనకు తెచ్చారు.
మునగాకును గురించి ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రస్తావించి, ఆ ఉత్పాదనకు ప్రస్తుతం ఆదరణ ఉందా అని అడిగారు. దీనికి రైతు అవును, ఉందని బదులిచ్చారు. ఈ ఆకును ఉపయోగించడమెలా అని శ్రీ మోదీ అడగ్గా, మునగాకును పొడిగా మార్చి ఎగుమతి చేస్తామని రైతు జవాబిచ్చారు. మునగాకు పొడికి ఈ రోజుల్లో గిరాకీ బాగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. దీనికి అవునంటూ రైతు ప్రతిస్పందించారు. ఏయే దేశాలు దీనిని ప్రధానంగా దిగుమతి చేసుకుంటాయని శ్రీ మోదీ అడిగారు. దీనికి రైతు సమాధానమిస్తూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాలు, జపాన్‌తో పాటు ఆగ్నేయ ఆసియా దేశాలు
దీనికి డిమాండు ఉందన్నారు.
పూర్తి ప్రదర్శనలో తమిళనాడుకు చెందిన జీఐ ఉత్పాదనలు కొలువుదీరాయనీ, వాటిలో కుంభకోణం తమలపాకులు, మదురై మల్లెలు సహా 25 ఉత్పత్తులు రైతు తెలిపారు. మార్కెట్ అందుబాటును గురించి శ్రీ మోదీ ఆరా తీయగా, ఈ ఉత్పాదనలు దేశమంతటా అందుబాటులో ఉన్నాయనీ, తమిళనాడులో ప్రతి కార్యక్రమంలోనూ ఇవి ప్రముఖంగా చోటుచేసుకుంటాయనీ రైతు జవాబిచ్చారు. వారణాసి ప్రజలు వారికి కావలసిన తమలపాకులను అందుకుంటున్నారా అని ప్రధానమంత్రి అడిగితే, అవునని రైతు బదులిచ్చారు.
ఉత్పాదనలో వృద్ధి విషయాన్ని గురించి శ్రీ మోదీ అడిగారు. దీనికి రైతు బదులిస్తూ, తమ వద్ద ప్రస్తుతం 100 కన్నా ఎక్కువ ఉత్పాదనలున్నాయనీ, వాటిలో తేనె ఒకటి అని వెల్లడించారు. మార్కెట్లో ఉన్న అవకాశాలను గురించి ప్రధానమంత్రి వాకబు చేశారు. డిమాండు చాలా ఎక్కువగా ఉందని రైతు చెప్తూ, తమ తేనె ఉత్పాదనలు ప్రపంచవ్యాప్త మార్కెట్లకు చేరుతున్నాయన్నారు.
తమ వద్ద సుమారు వరిలో ఒక వేయి సంప్రదాయక ధాన్యాలు ఉన్నాయనీ, వాటి పోషక విలువ చిరుధాన్యాలతో సమానంగా ఉంటుందనీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వరిసాగులో తమిళనాడు కృషి ప్రపంచ స్థాయిలోనే సాటి లేనిదంటూ శ్రీ మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మాటలకు రైతు తన అంగీకారాన్ని తెలుపుతూ ఎగుమతి చేస్తున్న ధాన్యం, బియ్యంతో పాటు విలువ జోడించిన ఇతర ఉత్పాదనలన్నిటినీ ప్రదర్శిస్తున్నామన్నారు.
మరో రైతును శ్రీ మోదీ పలకరిస్తూ, యువ రైతులు శిక్షణ పొందడానికి ముందుకు వస్తున్నారా అని అడిగారు. యువత పెద్ద సంఖ్యలో, చురుగ్గా పాలుపంచుకుంటున్నారని రైతు చెప్పారు. పీహెచ్డీ చదువుకున్న వాళ్లతో సహా ఉన్నత విద్యావంతులకు మొదట్లో ఈ పని తాలూకు విలువను అర్థం చేసుకోవడం కష్టమేమో, అయితే వాళ్లు దీన్లో ఉన్న ప్రయోజనాలను గ్రహించిన తరువాత దీన్ని ప్రశంసించడం మొదలుపెడతారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇదివరకు ఇలాంటి వాళ్లని పిచ్చోళ్లు అనుకునే వారనీ, అయితే ఇప్పుడు వాళ్లు ప్రతి నెలా 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అంతేకాదు.. వాళ్లను చూసి స్ఫూర్తిని కూడా పొందుతున్నారని రైతు వివరించారు. తాము ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా తమ మోడల్ పొలంలో 7,000 మంది రైతులతో పాటు 3,000 మంది కళాశాల విద్యార్థులకు శిక్షణనిచ్చినట్లు ఆ రైతు తెలిపారు. వారికి మార్కెట్టు లభ్యత సదుపాయం ఉందా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. రైతు జవాబిస్తూ, తాము నేరుగా ఇతర దేశాలకు అమ్మకం, ఎగుమతి చేయడమే కాకుండా తల నూనె, కొబ్బరి, సబ్బుల వంటి ఉత్పాదనల రూపంలో అదనపు విలువను కూడా జోడిస్తున్నామన్నారు.
గుజరాత్‌లో తాను అధికారంలో ఉండగా, ‘‘క్యాటిల్ హాస్టల్’’ను అమలుచేసినట్లు శ్రీ మోదీ తెలిపారు. గ్రామంలోని పశువులన్నిటికీ ఒకే చోట ఆశ్రయాన్ని కల్పించి, గ్రామం పరిశుభ్రంగా ఉండేటట్లు చూశామన్నారు. ఈ పశువుల సంరక్షణ బాధ్యతను ఒక డాక్టరు, నలుగురైదుగురు సహాయక సిబ్బంది చూసుకొనే వారని ఆయన వివరించారు. రైతు అవునంటూ, ఈ విధంగా జీవామృతం పెద్ద ఎత్తున తయారవుతోందనీ, దీనిని చుట్టుపక్కల రైతులకు ఇస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవితో పాటు కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 2192102)
Visitor Counter : 5
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam