ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయోగానికి భారత్ సంసిద్ధత బలోపేతం లక్ష్యంగా బెంగళూరులో జరిగిన సీఎస్ఐర్-ఇస్రో అంతరిక్ష సమావేశం-2025


విలువైన అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్న భారత తొలి వ్యోమగామి వింగ్ కమాండర్ రాకేష్ శర్మ (రిటైర్డ్), జనరల్ కెప్టెన్ ప్రశాంత్ బి. నాయర్ (ఇస్రో వ్యోమగామి – గగన్‌యాత్రి)

Posted On: 17 NOV 2025 8:11PM by PIB Hyderabad

భారత మానవ సహిత అంతరిక్ష నౌక మిషన్ అవసరాల కోసం బహుళ విభాగ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, సంస్థాగత సహకారాన్ని సమన్వయం చేస్తూ శాస్త్రీయ-పారిశ్రామిక పరిశోధన పరిషత్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా బెంగళూరులో సీఎస్ఐఆర్-ఇస్రో స్పేస్ మీట్-2025ను నిర్వహించాయి. నోడల్ నిర్వహణ సంస్థ అయిన బెంగళూరులోని సీఎస్ఐఆర్–నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

డీఎస్ఐఆర్ కార్యదర్శి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి తన స్వాగత ప్రసంగంలో... భారత అంతరిక్ష సామర్థ్యాలను బలోపేతం చేయడంలో సీఎస్ఐఆర్ అందించిన శాస్త్రీయ, సాంకేతిక సహకారాన్ని వివరించారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యోమగాములు, అంతర్జాతీయ నిపుణులు తమ విజ్ఞానాన్ని పంచుకునే వేదికగా ఈ సమావేశం విలువైన ఫలితాలను అందిస్తుందని, ఈ రంగంలో ఉన్న అంతరాలను పరిష్కరిస్తుందని ఆమె పేర్కొన్నారు. దేశ శాస్త్రీయ, సాంకేతిక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో గౌరవనీయ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మార్గదర్శకత్వాన్ని ప్రశంసిస్తూనే... స్వదేశీ ఆవిష్కరణలు, సహకారాత్మక పరిశోధనాభివృద్ధి పట్ల భారత్ నిబద్ధతను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు.

అంతరిక్ష విభాగం కార్యదర్శి, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ... గగన్‌యాన్ అంతరిక్ష కార్యక్రమానికి వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశోధనాభివృద్ధి సంస్థలు, విద్యాసంస్థలు, భాగస్వామ్య సంస్థల సహకారం అవసరమన్నారు. సిబ్బంది కోసం తదుపరి తరం భద్రతా వ్యవస్థలు, అధునాతన లైఫ్-సపోర్ట్ సాంకేతికతలు, శాస్త్రీయ పేలోడ్ అభివృద్ధి సహా అభివృద్ధి చెందుతున్న మిషన్ ప్రాధాన్యాలను ఆయన వివరించారు. సీఎస్ఐఆర్, భారత జాతీయ పరిశోధనాభివృద్ధి వ్యవస్థల సహకారాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రునిపైకి భవిష్యత్తులో మానవ సహిత యాత్ర మిషన్, అంగారక గ్రహ అన్వేషణ, భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు సహా భారత దీర్ఘకాలిక లక్ష్యాలను ఆయన తెలియజేశారు.

సీఎస్ఐఆర్-ఎన్ఏఎల్ డైరెక్టర్ డాక్టర్ అభయ్ ఎ. పాశిల్కర్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన వారిని స్వాగతించారు. భారత అంతరిక్ష రంగానికి, మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయోగ లక్ష్యాలకు మద్దతునిచ్చే సాంకేతికతలు, మెటీరియల్ పరిశోధన, పరీక్షా సామర్థ్యాలను అభివృద్ధి చేయడం పట్ల ఎన్ఏఎల్ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈఎస్ఏ వ్యోమగామి (నాసా ఎస్‌టీఎస్-66, ఎస్‌టీఎస్ -84, ఎస్‌టీఎస్ -103) శ్రీ జీన్-ఫ్రాంకోయిస్ క్లెర్వాయ్ ప్రత్యేక వీడియో సందేశం ప్రపంచ దృక్పథాన్ని వివరించింది. మానవ సహిత అంతరిక్ష నౌక ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అంతర్జాతీయ సహకారం, సమష్టి శాస్త్రీయ అభ్యసన ప్రాముఖ్యాన్ని స్పష్టం చేసింది.

అనుభవాలను పంచుకునే సమావేశాల్లో భాగంగా ఇస్రో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బి. నాయర్... వ్యోమగామి శిక్షణ, మైక్రోగ్రావిటీ సిమ్యులేషన్స్, కార్యాచరణ సంసిద్ధత, పునరుద్ధరణ విధానాల గురించి తన అనుభవాలను అందించారు. భారత తొలి వ్యోమగామి వింగ్ కమాండర్ రాకేష్ శర్మ (రిటైర్డ్) తన 1984 సోయజ్ మిషన్ గురించి వివరించారు. అంతరిక్ష రంగంలో ఎన్ఏఎల్ దీర్ఘకాలిక సహకారాన్ని గుర్తించారు. శాంతియుత అన్వేషణ, మానవ కేంద్రిత పరిశోధనలు భారత మానవ సహిత అంతరిక్ష నౌక కార్యక్రమ లక్ష్యాలని ఇరువురు వ్యోమగాములు వివరించారు.

సాంకేతిక, థీమాటిక్ సమావేశాల్లో అంతర్జాతీయ, జాతీయ నిపుణుల ప్రదర్శనలు భాగంగా ఉన్నాయి. వీటిలో మానవ సహిత అంతరిక్ష నౌక ఫిజియాలజీ గురించి డాక్టర్ లూసియా రోకారో (ఈఎస్ఏ)... సహకార పరిశోధన దృక్పథాలపై డాక్టర్ అకికో ఒట్సుకా (జేఏఎక్స్ఏ)... మానవ-సాంకేతిక పరస్పర చర్య, సిబ్బందితో కూడిన మిషన్ల కోసం ఇంటర్‌ఫేస్ రూపకల్పనపై ప్రొఫెసర్ ప్రదీప్త బిశ్వాస్ (ఐఐఎస్‌సీ) ప్రజెంటేషన్ ఇచ్చారు.

వికసిత్ భారత్ జాతీయ దార్శనికతకు అనుగుణంగా భారత మానవ సహిత అంతరిక్ష నౌక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శాస్త్ర-సాంకేతికతల కలయిక, మిషన్-ఆధారిత పరిశోధనాభివృద్ధి, బహుళ-సంస్థల సహకారాన్ని బలోపేతం చేయాలనే సమష్టి సంకల్పంతో సీఎస్ఐఆర్-ఇస్రో స్పేస్ మీట్-2025 ముగిసింది.

 

***


(Release ID: 2191082) Visitor Counter : 2