|
ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
15 NOV 2025 7:24PM by PIB Hyderabad
జై జోహార్! గుజరాత్ గవర్నర్ ఆచార్య శ్రీ దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, బీజేపీ గుజరాత్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ జగదీష్ విశ్వకర్మ, రాష్ట్ర మంత్రులు శ్రీ నరేష్‌భాయ్ పటేల్, శ్రీ జయరాంభాయ్ గమిత్, పార్లమెంటులో నా పాత సహచరులు శ్రీ మన్సుఖ్‌భాయ్ వాసవ, వేదికను అలంకరించిన భగవాన్ బిర్సా ముండా కుటుంబ సభ్యులు సహా దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా గిరిజన సోదరీ సోదరులు, ఇతర ప్రముఖులతోపాటు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాల నేపథ్యంలో సాంకేతికత మాధ్యమం ద్వారా మాతో అనుసంధానితులైన అనేక మంది వ్యక్తులకు అభివందనం చేస్తున్నాను. అలాగే...
గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
నేను ఇక్కడికి వచ్చినపుడు సాధారణంగా గుజరాతీ భాషలో మాట్లాడుతుంటాను. కానీ, ఈ రోజు దేశవ్యాప్తంగా అశేష సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో మీ అనుమతి, ఆశీస్సులతో హిందీలో ప్రసంగిస్తాను.
నర్మదా మాతకు నెలవైన ఈ పవిత్ర భూమి ఇవాళ మరోసారి ఓ చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలుస్తోంది. ఇంతకుముందు అక్టోబరు 31న మనమిక్కడ సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుక నిర్వహించుకున్నాం. ఆ విధంగా మన ఐక్యత, వైవిధ్యంపై గర్వించే జాతీయ ఉత్సవానికి నాంది పలికాం. ఇక నేడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి నేపథ్యంలో ఈ మహత్తర వేడుకలతో మరోసారి జాతీయ ఉత్సవాల నిండు వైభవాన్ని చూస్తున్నాం. ఈ పవిత్ర సందర్భంలో భగవాన్ బిర్సా ముండాకు శిరసాభివందనం చేస్తున్నాను. దేశ విముక్తి ఉద్యమ సమయాన గోవింద్ గురు వెలిగించిన స్వాతంత్ర్య జ్యోతి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా మొత్తం గిరిజన ప్రాంతంలో చైతన్యం రగిలించింది. అందుకే, ఈ వేదిక నుంచి గోవింద్ గురుకు కూడా వందనమాచరిస్తున్నాను. ఇక్కడికి వచ్చే ముందు దేవమోగ్ర మాతను దర్శించుకునే భాగ్యం నాకు లభించింది. అందుకుగాను మరోసారి ఆ తల్లి పాదాలకు ప్రణమిల్లుతున్నాను. కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాల్ కారిడార్, అయోధ్య రామాలయం, కేదార్‌నాథ్ క్షేత్రం గురించి ప్రజలు నేడు చర్చించుకుంటున్నారు. గడచిన దశాబ్ద కాలంలో ఇటువంటి అనేక ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దాం. అయితే, 2003లో బాలికల విద్యకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో రాలియా పటాన్‌కు వచ్చిన సందర్భంలోనూ అమ్మవారిని దర్శించుకున్న సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అప్పట్లో ఇక్కడ ఒక చిన్న పూరిల్లు లాంటి ప్రదేశంలో మాతకు పూజలు చేసేవారు. కానీ, నా జీవితంలో ఇప్పటిదాకా చేపట్టిన అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికింది మాత్రం దేవమోగ్ర మాత ఆలయ అభివృద్ధితోనేనని సగర్వంగా చెప్పగలను. ఈ నేపథ్యంలో లక్షలాదిగా ప్రజలు... ముఖ్యంగా మన గిరిజనం అపార భక్తిప్రపత్తులతో మాతను పూజిస్తుండటం చూసి నేనివాళ ఎనలేని సంతోషంతో పొంగిపోయాను.
మిత్రులారా!
దేడియాపడ, సాగ్బరా ప్రాంతం చిరకాలం నుంచీ సంత్ కబీర్ ప్రబోధాలతో స్ఫూర్తి పొందింది. నేనిప్పుడు బనారస్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇది సంత్ కబీర్ జన్మభూమి కావడం వల్ల నా జీవితంలో సహజంగానే ఆయనకో ప్రత్యేక స్థానం ఉంది. ఆ మేరకు ఈ వేదికపైనుంచి ఆ మహనీయుడికి భక్తితో వందనం చేస్తున్నాను.
మిత్రులారా!
దేశాభివృద్ధి, గిరిజన సంక్షేమం లక్ష్యంగా ఈ రోజు అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. ఇక ‘పీఎం-జన్మాన్’ తదితర పథకాల కింద ఇక్కడి లక్ష కుటుంబాలకు పక్కా ఇళ్లు సమకూరాయి. పెద్ద సంఖ్యలో ఏకలవ్య ఆదర్శ పాఠశాలలతోపాటు ఆశ్రమ పాఠశాలల ప్రారంభం సహా పునాదులు కూడా వేశాం. బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయంలో శ్రీ గోవింద్ గురు పీఠం ఏర్పాటైంది. ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాల్లో అనేక ప్రాజెక్టులు ప్రారంభించాం. ఈ అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నింటి నేపథ్యంలో మీకందరికీ... ముఖ్యంగా గుజరాత్ సహా దేశంలోని నా గిరిజన కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని 2021 నుంచి గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహించుకోవడం ప్రారంభించాం. వేల ఏళ్లుగా భారతీయ చైతన్యంలో గిరిజన స్వాభిమానం ఒక అంతర్భాగం. దేశ గౌరవం, ఆత్మాభిమానం, సార్వభౌమాదికారాలకు ముప్పు ఏర్పడిన ప్రతి సందర్భంలో జాతి పరిరక్షణకు మన గిరిజన సమాజం ముందు వరుసలో నిలిచింది. స్వాతంత్ర్య పోరాటమే దీనికి తిరుగులేని నిదర్శనం. తిల్కా మాంఝీ, రాణి గైడిన్లియు, సిధో-కన్హు, భైరవ్ ముర్ము, బుధు భగత్ వంటి అనేకమంది యోధులు, ధీరవనితలు సహా అల్లూరి సీతారామ రాజు వంటి స్ఫూర్తి ప్రదాతలు స్వేచ్ఛా జ్యోతి మలిగిపోకుండా ప్రాణాలొడ్డి పోరాడారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ వాస్తవ్యుడు తాంత్య భిల్, ఛత్తీస్‌గఢ్ నివాసి వీర నారాయణ్ సింగ్, జార్ఖండ్‌లో తెలంగా ఖరియా, అస్సాంలో రూప్‌చంద్ కన్వర్ ఒడిశాలో లక్ష్మణ్ నాయక్ వంటి ఎందరో సాహసులు స్వేచ్ఛ కోసం సాగించిన అవిశ్రాంత పోరాటం, చేసిన త్యాగాలు అనితరసాధ్యం. వారి శౌర్యపరాక్రమాలు బ్రిటిష్ పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అనేకానేక విప్లవాలను నడిపించిన గిరిజన సమాజం దేశ స్వాతంత్ర్యం కోసం రక్తతర్పణం చేసింది.
మిత్రులారా!
గుజరాత్‌లో గిరిజన సమాజం కూడా దేశభక్తులైన ఎందరో వీరపుత్రులకు జన్మనిచ్చింది. భగత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన గోవింద్ గురు, పంచమహల్‌లో బ్రిటిష్ సైన్యంతో సుదీర్ఘంగా పోరాడిన రాజా రూప్‌సింగ్ నాయక్, ఏకీ ఉద్యమ నేత మోతీలాల్ తేజావత్ అటువంటి వారిలో కొందర. సబర్కాంత జిల్లాలోని పాల్ చితారియాలో వందలాది గిరిజన అమరుల స్మారక చిహ్నం మనకు కనిపిస్తుంది. స్వాతంత్ర్య పోరాటం నాటి జలియన్‌వాలాబాగ్ తరహా సంఘటన ఈ ప్రాంతంలోనూ చోటుచేసుకుంది. అలాగే గాంధీజీ సిద్ధాంతాలకు గిరిజన సమాజంలో ప్రాచుర్యం కల్పించిన దష్రీబెన్ చౌదరిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేశ విముక్తి ఉద్యమంలోని చాలా అధ్యాయాలు గిరిజన శౌర్యప్రతిష్ఠలతో ముడిపడి ఉన్నవే.
సోదరీసోదరులారా!
స్వాతంత్ర్య ఉద్యమంలో చిరస్మరణీయ పాత్ర పోషించిన గిరిజన సమాజానికి ఆ తర్వాత దక్కాల్సినంత గౌరవం, గుర్తింపు లభించలేదు. కొన్ని కుటుంబాలకు మాత్రమే ఆ ఘనత దక్కాలనే స్వార్థమే అందుకు కారణం. ఫలితంగా నా గిరిజన సోదరీసోదరుల త్యాగం, కృషి, అంకితభావం విస్మరణకు గురయ్యాయి. దేశంలో 2014కు ముందు భగవాన్ బిర్సా ముండా జన్మించిన గ్రామ పరిసర ప్రాంతాలు మినహా ఏ ఒక్కరూ ఆయన త్యాగాన్ని తలచిన పాపాన పోలేదు. నా గిరిజన సోదరీసోదరులు తమవంతు కృషితో స్వేచ్ఛ రూపంలో మనకు ఎంతటి అమూల్య కానుకనిచ్చారో భవిష్యత్తరం తెలుసుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి, ఆ వారసత్వ పరిరక్షణతోపాటు యువతరం వారి త్యాగాలను గుర్తించే దిశగా దేశమంతటా అనేక గిరిజన ప్రదర్శనశాలలను నిర్మిస్తున్నాం. ఇందులో భాగంగా గుజరాత్‌లోని రాజ్‌పిప్లాలో 25 ఎకరాల విస్తీర్ణంతో భారీ గిరిజన మ్యూజియం సిద్ధమవుతోంది. కొన్ని రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ పర్యటించిన సందర్భంగా అక్కడ నేను షహీద్ వీర నారాయణ్ సింగ్ గిరిజన మ్యూజియంను కూడా ప్రారంభించాను. అలాగే రాంచీలో భగవాన్ బిర్సా ముండాను నిర్బంధించిన కారాగారాన్ని ఆయనకు, ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమానికి అంకితం చేస్తూ అద్భుతమైన ప్రదర్శనశాలగా మార్చాం.
మిత్రులారా!
గిరిజన భాషా ప్రోత్సాహక కేంద్రంగా నేడు శ్రీ గోవింద్ గురు పీఠం ఏర్పాటైంది. ఇక్కడ భిల్, గమిత్, వాసవ, గరాసియా, కోక్ని, సంథాల్, రత్వా, నాయక్, దాబ్లా, చౌదరి, కోక్నా, కుంబి, వార్లి, దోడియా వంటి వివిధ గిరిజన మాండలికాలపై అధ్యయనం నిర్వహిస్తారు. వారి కథలు, గాథలు, పాటలను పదిలం చేస్తారు. వేల ఏళ్లుగా గిరిజన సమాజం సముపార్జించిన అపార జ్ఞాన సంపదను కూడా పరిరక్షిస్తారు. శాస్త్రవిజ్ఞానం వారి జీవనశైలిలో అంతర్భాగం... తత్త్వశాస్త్రం వారి కథలలో అంతర్లీనం... పర్యావరణ చైతన్యం వారి భాషలో ఉట్టిపడుతుంది. ఇలాంటి సుసంపన్న సంప్రదాయాలతో నవతరాన్ని అనుసంధానించడంలో శ్రీ గోవింద్ గురు పీఠం తనవంతు కృషి చేస్తుంది.
మిత్రులారా!
దేశంలోని కోట్లాది గిరిజన సోదరీసోదరులకు వాటిల్లిన అన్యాయాన్ని కూడా గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం మనకు గుర్తుచేస్తుంది. ఆరు దశాబ్దాల పాటు దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ, గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో పోషకాహార లోపం, ఆరోగ్య భద్రత లేమి, విద్యావకాశాల కొరత, అనుసంధాన లేకపోవడం వంటి అనేక సమస్యలతో గిరిజన ప్రాంతాలు తల్లడిల్లుతూ వచ్చాయి. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించగా, ఈ లోపాలే గిరిజన ప్రాంతాలకు ప్రతీకగా మారిన దుస్థితి ఏర్పడింది.
అయితే, మిత్రులారా!
గిరిజన సంక్షేమానికి భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సదా అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చింది. గిరిజనానికి వాటిల్లిన అన్యాయాన్ని సరిదిద్ది, ప్రగతి ఫలాలను వారికి చేరువచేసే సంకల్పంతో ఆదినుంచీ మేం ముందడుగు వేశాం. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిందిగానీ, అనాదిగా రాముడితో ముడిపడిన గిరిజనం చరిత్ర అత్యంత ప్రాచీనం. ఇంతటి ఘనతగల గిరిజన సమాజ ప్రగతికి ఆరు దశాబ్దాల పరిపాలనలో ఆవగింజంత ప్రయత్నమైనా చేసింది లేదు.
మిత్రులారా!
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ అంటూ ఏదీ లేదు. తొలిసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రత్యేకంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను సృష్టించారు. కానీ, ఆ తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదేళ్లపాటు ఈ మంత్రిత్వ శాఖను పూర్తిగా విస్మరించింది. ఆ ప్రభుత్వం 2013 బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి కేటాయించింది కేవలం కొన్ని వేల కోట్ల రూపాయలు మాత్రమే కావడం ఇందుకు నిదర్శనం. ఒక జిల్లాలో పనులు చేయడానికైనా ఆ వెయ్యి కోట్లు ఏ మూలకూ చాలవు. అయితే, బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో కేటాయింపులను గణనీయంగా పెంచాం. గిరిజన ప్రయోజనాలపై శ్రద్ధ వహిస్తూ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ను విస్తరించాం. ఈ విధంగా కేటాయింపులు అనేక రెట్లు పెంచి, గిరిజన ప్రాంతాల అభివృద్ధి బాధ్యతను పూర్తిగా స్వీకరించాం. ఈ క్రమంలో విద్య, ఆరోగ్యం లేదా అనుసంధానం సహా ప్రతి రంగంలోనూ గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం.
మిత్రులారా!
గుజరాత్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఒకనాడు దుర్భర పరిస్థితులుండేవి. అంబాజీ నుండి ఉమర్‌గామ్ వరకు గిరిజన ప్రాంతాల్లో శాస్త్రవిజ్ఞాన విద్యకు అవకాశంగల విద్యాసంస్థ ఒక్కటి కూడా ఉండేది కాదు. దేడియాపడ, సగ్బారా వంటి ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కూడా మృగ్యమే. అటుపైన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నేను ‘కన్యా కేలవణి’ (బాలికా విద్య) మహోత్సవాన్ని దేడియాపడ నుంచే ప్రారంభించాను. ఆ సందర్భంగా చాలామంది గిరిజన బాలలు నా వద్దకు వచ్చి డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు కావాలన్న తమ కలల గురించి చెప్పారు. అందుకు చక్కగా చదువుకోవడమే మార్గమని వారికి వివరించాను. వారి స్వప్న సాకారంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తానని భరోసా ఇచ్చాను.
మిత్రులారా!
ఆనాటినుంచీ ప్రగతిశీల మార్పు దిశగా అహర్నిశలూ కృషి చేశాం. ఫలితంగా నేడు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 10,000కుపైగా పాఠశాలలు పనిచేస్తున్నాయి. నేను ముఖ్యమంత్రిని కాకముందు శాస్త్రవిజ్ఞాన పాఠశాల ఒక్కటి కూడా లేని స్థితి నుంచి గడచిన రెండు దశాబ్దాల కాలంలో వాణిజ్య, ఆర్ట్స్ కళాశాలలు సహా గిరిజన ప్రాంతాల్లో 24 శాస్త్రవిజ్ఞాన కళాశాలలు ఏర్పాటయ్యాయి. అలాగే గిరిజన బాలల కోసం బీజేపీ ప్రభుత్వం వందల సంఖ్యలో హాస్టళ్లు నిర్మించింది. మరోవైపు రాష్ట్రంలో మేం రెండు గిరిజన విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేశాం. ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వినూత్న మార్పులు వచ్చాయి. ఆనాడు.. అంటే- 20 ఏళ్ల కిందట తమ కలల గురించి నాకు వివరించిన బాలల్లో కొందరు ఇప్పుడు వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు.
మిత్రులారా!
గిరిజన బాలల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ మేమిప్పటికీ రేయింబవళ్లు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో కేవలం గత 5-6 ఏళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు రూ.18,000 కోట్లకు పైగా వెచ్చించింది. వీటన్నిటిలోనూ బాలికలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాం. దీంతో పాఠశాలల్లో చేరే గిరిజన బాలల సంఖ్య 60 శాతం పెరిగింది.
మిత్రులారా!
గిరిజన యువతరం ఏ రంగంలోనైనా రాణించగలరు... వారికి కావాల్సిందల్లా తగినన్ని అవకాశాలు మాత్రమే. తమ సంస్కృతి-సంప్రదాయాల నుంచి సాహసం, కృషి, ప్రతిభ వారసత్వంగా వారికి లభిస్తాయి. ఈ వాస్తవాన్ని నిరూపించే అనేక ఉదాహరణలను క్రీడా ప్రపంచంలో మనం చూడవచ్చు. గిరిజన పుత్రులు, పుత్రికలు భారత కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. ఇటీవలి కాలం దాకా మేరీ కోమ్, థోనకల్ గోపి, ద్యుతీచంద్, బైచుంగ్ భూటియా వంటి కొద్దిమంది క్రీడాకారుల పేర్లు మాత్రమే మనం విన్నాం. అయితే, ఇప్పుడు గిరిజన ప్రాంత నవతరం క్రీడాకారులు ప్రతి ప్రధాన క్రీడలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు కొద్దిరోజుల కిందటే తొలిసారి ప్రపంచ కప్ విజేతగా ఆవిర్భవించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో మన గిరిజన పుత్రిక ఒకరు కీలక పాత్ర పోషించడం గమనార్హం. గిరిజన ప్రాంతాల్లో క్రీడా సదుపాయాల కల్పనతోపాటు తరుణ ప్రాయంలోనే ప్రతిభావంతులను గుర్తించి, ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోంది.
మిత్రులారా!
అణగారిన వర్గాలకు ప్రాథమ్యం మా ప్రభుత్వ ధ్వేయం. నర్మదా జిల్లాయే ఇందుకు తిరుగులేని నిదర్శనం. ఇంతకుముందు భరూచ్, సూరత్ జిల్లాల్లో భాగమైన ఈ ప్రాంతం బాగా వెనుకబడినదిగా పరిగణనలో ఉండేది. అయితే, ఈప్రాంతానికి మా హయాంలో అధిక ప్రాధాన్యమిస్తూ దీన్నొక ఆకాంక్షాత్మక జిల్లాగా రూపుదిద్దాం. ఇవాళ నర్మదా జిల్లా అన్నిరకాల ప్రగతి పారామితుల పరంగా ఎంతో అభివృద్ధి సాధించింది. తద్వారా ఇక్కడి గిరిజనానికి ఎనలేని ప్రయోజనం కలిగింది. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాబల్యంగల రాష్ట్రాలకు, అణగారినవర్గాలకు ప్రత్యక్షంగా చేరువై అనేక పథకాలను ప్రారంభించడం మీరంతా గమనించే ఉంటారు. పేదలకు ఉచిత చికిత్సనందించే ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని 2018లో జార్ఖండ్‌లోని రాంచీ గిరిజన ప్రాంతం నుంచి మేం ప్రారంభించాం. దీనికింద దేశంలోని కోట్లాది గిరిజన సోదరీసోదరులకూ ఏటా రూ.5 లక్షల విలువైన ఆరోగ్య సంరక్షణ సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. అలాగే గిరిజనం అధికంగాగల ఛత్తీస్‌గఢ్ నుంచి మా ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ కార్యక్రమంతోనూ వారికి ఎంతో ప్రయోజనం చేకూరింది.
మిత్రులారా!
గిరిజనులలోనూ అత్యంత వెనుకబడిన వర్గాలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ఈ మేరకు స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాలపాటు విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఆస్పత్రులు వంటి కనీస సదుపాయాలు కరవైన ఈ ప్రాంతాల అభివృద్ధికి మేం అనేక చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా జార్ఖండ్‌లోని ఖుంటి గిరిజన ప్రాంతం నుంచి రూ.24,000 కోట్లతో ‘పీఎం-జన్మాన్ యోజన’కు శ్రీకారం చుట్టాం. భగవాన్ బిర్సా ముండా జన్మించిన ఆ గ్రామానికి స్వయంగా వెళ్లి, అక్కడి మట్టిని నుదుట తిలకంగా దిద్దుకుని, గిరిజన సంక్షేమంపై శపథం చేశాను. నాటినుంచీ నేటిదాకా ఆ నిబద్ధతను కొనసాగిస్తున్నాను. భగవాన్ బిర్సా ముండా గృహాన్ని సందర్శించిన తొలి ప్రధానమంత్రిని కూడా నేనే. తద్వారా ఆయన కుటుంబసభ్యులతో నా సన్నిహిత బంధం కొనసాగుతోంది.
మిత్రులారా!
ఇక ‘ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ కూడా వెనుకబడిన గిరిజన గ్రామాల ప్రగతి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తోంది. దేశవ్యాప్తంగా 60,000కు పైగా గ్రామాలు ఈ కార్యక్రమం కింద ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. వీటిలో వేలాది గ్రామాలకు తొలిసారి కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా మొదలైంది. వందలాది గ్రామాలకు దూర-వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలను ప్రగతి కేంద్రకంగా రూపొందించడంతో ఆరోగ్యం, విద్య, పోషకాహారం, వ్యవసాయం, జీవనోపాధిపై సామాజిక అవసరాల ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందుతున్నాయి. దృఢ సంకల్పం ఉంటే, అసాధ్యాలు కూడా సుసాధ్యం కాగలవని ఈ కార్యక్రమం రుజువు చేస్తోంది.
మిత్రులారా!
మా ప్రభుత్వం గిరిజన జీవనంలో ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుంటూ పనిచేస్తోంది. ఈ మేరకు ‘కనీస మద్దతు ధర’ (ఎంఎస్‌పీ) అర్హత గల చిన్న అటవీ ఉత్పత్తుల సంఖ్యను 20 నుంచి దాదాపు 100కు పెంచాం. అలాగే చిరుధాన్యాల (శ్రీ అన్న) సాగును ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నాం. దీంతో గిరిజన వ్యవసాయదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గుజరాత్‌లో మీ కోసం ప్రారంభించిన ‘వనబంధు కల్యాణ్ యోజన’ మీకందరికీ సరికొత్త ఆర్థిక సాధికారతనిచ్చింది. ఈ పథకాన్ని ప్రారంభించడంపై కృతజ్ఞతలు తెలిపి, నన్ను ఆశీర్వదించేందుకు అనేక గిరిజన ప్రాంతాల నుంచి ప్రజలు నెలల తరబడి రావడం నాకింకా గుర్తుంది. ప్రగతిశీల మార్పులు తెచ్చే ఈ పథకాన్ని ‘జన్‌జాతీయ కల్యాణ్ యోజన’ పేరిట ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ మరింత విస్తరించి అమలు చేస్తుండటం నాకెంతో సంతోషాన్నిస్తోంది.
సోదరీసోదరులారా!
మన గిరిజన సమాజాలకు ‘సికిల్ సెల్’ (కొడవలి కణ రక్తహీనత) వ్యాధి ఒక పెద్ద ముప్పు. దీని నిర్మూలన ధ్యేయంగా ఆ ప్రాంతాల్లో డిస్పెన్సరీలు, వైద్య కేంద్రాలు, ఆస్పత్రుల సంఖ్యను పెంచాం. దీంతోపాటు జాతీయ స్థాయి కార్యక్రమం చేపట్టి, ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది గిరిజన సోదరీసోదరులకు పరీక్షలు నిర్వహించారు.
మిత్రులారా!
కొత్త జాతీయ విద్యా విధానం కింద స్థానిక భాషల్లోనూ విద్యభ్యాసానికి వీలు కల్పించాం. భాష పరమైన అవరోధాలతో లోగడ గిరిజన బాలలు విద్యలో ఎంతో వెనుకబడ్డారు. ఇప్పుడు తమ మాతృభాషలో చదువుకుంటూ తమ ప్రగతికి స్వయంగా బాటలు వేసుకోవడమేగాక దేశాభివృద్ధికి మరింతగా తోడ్పడుతున్నారు.
మిత్రులారా!
గుజరాత్‌లోని మన గిరిజనానిది అసాధారణ, సుసంపన్న కళా వారసత్వం. వారి చేతిలో అందంగా రూపొందే చిత్రాలు, ఇతర కళాకృతులకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి కళాకారులలో ఒకరైన గిరిజన పుత్రిక చేతిలో కనిపిస్తున్న పెయింటింగ్ నా కోసమే తెచ్చినట్టుంది. దయచేసి, దాన్ని అందుకోవాల్సిందిగా నా రక్షణ సిబ్బందిని కోరుతున్నాను. ఇది వర్లీ చిత్రలేఖన రీతిని ప్రతిబింబిస్తోంది. ధన్యవాదాలు తల్లీ... నీ చిత్రం వెనుక చిరునామా ఉంటే- నా ప్రతిస్పందనను ఓ లేఖ ద్వారా తెలియజేస్తాను. మరొకసారి నీకు నా ధన్యవాదాలు! ఈ ప్రాంతంలో కళాత్మకత వ్యక్తీకరణ సహజాతి సహజం. ఈ కళారూపాలకు పరేష్‌భాయ్ రథ్వా వంటి మన కళాకారులు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఇందుకుగాను మా ప్రభుత్వం ఆయనను పద్మ అవార్డుతో సత్కరించడం నాకెంతో సంతృప్తినిచ్చింది.
మిత్రులారా!
ఏ సమాజ పురోగమనమైనా ప్రజాస్వామ్యంలో సముచిత భాగస్వామ్యంతోనే సాధ్యం. అందుకే మన గిరిజన సోదరీసోదరులు జాతీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగి, దేశాన్ని నడిపించేలా చూడాలని మేం లక్ష్యనిర్దేశం చేసుకున్నాం. ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎదగడం ఇందుకు ఒక ఉదాహరణ. అదేవిధంగా గిరిజన ప్రతిభావంతులు ఉన్నత స్థానాలు అలంకరించేలా బీజేపీ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు సదా తోడ్పడుతున్నాయి. ఈ క్రమంలోనే మన గిరిజన సోదరుడైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. అలాగే జగన్నాథుని ఆశీస్సులతో శ్రీ మోహన్ చరణ్ మాఝీ ఒడిశా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనూ పెమా ఖండు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగాలాండ్‌లోనూ గిరిజన సోదరుడు నిఫ్యూ రియో ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇలా అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా, శాసనసభ స్పీకర్లుగా గిరిజన దిగ్గజాలు తమ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు. గుజరాత్ గిరిజన నేత మంగూభాయ్ పటేల్ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కాగా, అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసిన సర్బానంద సోనోవాల్ నేడు కేంద్రంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు.
మిత్రులారా!
ఈ నాయకులందరూ దేశానికి చేసిన సేవ, దేశ ప్రగతి పయనంలో వారి కృషి అపూర్వం... అసాధారణం.
మిత్రులారా!
దేశం ఇవాళ “సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్” (అందరి కృషితో... అందరి అభివృద్ధి) తారకమంత్రంగా ముందడుగు వేస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో కోట్లాది ప్రజల జీవితాలను తీర్చదిద్దింది ఈ మంత్రమే! దేశ ఐక్యతను బలోపేతం చేసింది.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజనాన్ని ప్రధాన స్రవంతితో జోడించిందీ ఈ మంత్రమే. అంతేకాకుండా వారు ఏకోన్ముఖంగా సమాజాన్ని నడిపించే వీలు కల్పించింది. కాబట్టి, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సాక్షిగా ఈ మంత్రాన్ని మరింత శక్తిమంతం చేయడానికి మనం సంకల్పం పూనాలి. అభివృద్ధిలో ఎవరూ వెనుకబడరాదు... ఏ ఒక్కరూ నిర్లక్ష్యానికి గురికారాదన్నది మన ప్రతిన కావాలి. ‘ధర్తీ ఆబా’ (భగవాన్ బిర్సా ముండా)కు మనం అర్పించే నిజమైన నివాళి ఇదే. మనమంతా సమష్టిగా ‘వికసిత భారత్’ స్వప్నాన్ని సాకారం చేయగలమని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ సంకల్పంతో మరోసారి మీకందరికీ ‘గిరిజన ఆత్మగౌరవ దినోత్సవ’ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది మన మట్టి సుగంధాన్ని వెదజల్లే ఉత్సవమని దేశ పౌరులందరికీ చెబుతున్నాను. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించిన మన గిరిజన సంప్రదాయాలకు ఇది ప్రతిబింబిస్తుంది. వారి బలాన్ని, ధైర్యసాహసాలను, నవశకంలో వారి ఆకాంక్షలను ఇది మోసుకొస్తుంది. ఆ మేరకు ఏటా నవంబరు 15న భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని ‘గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం’గా దేశం నలుమూలలా ఘనంగా నిర్వహించుకోవాలి. మనం సదా కొత్త శక్తితో, విశ్వాసంతో ముందుకు సాగుతూ, సమున్నత శిఖరారోహణలోనూ భారత మూలాలతో ముడిపడి ఉండాలని ఆకాంక్షిస్తూ... ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్నదని మనందరికీ తెలిసిందే. భారతదేశ స్ఫూర్తికి, సుదీర్ఘ పయనానికి... పోరాటానికి ఈ గేయం ఒక ప్రతీక. వందేమాతరం ఒక నినాదంగానే కాకుండా ప్రతి భారతీయుడికీ ఓ తారకమంత్రంగా మారింది. మనం ఈ 150 ఏళ్ల వేడుకను నిర్వహించుకుంటున్న నేపథ్యంలో నాతో గళం కలిపి దేశమంతా ప్రతిధ్వనించేలా నినదించండి:-
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
అనేకానేక ధన్యవాదాలు...
***
(Release ID: 2191019)
|