ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

వేల ఏళ్లుగా భారతదేశ చైతన్యంలో అంతర్భాగమైన గిరిజన ఆత్మగౌరవం... దేశ గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ ప్రమాదంలో పడినప్పుడల్లా ముందు నిలిచిన గిరిజన సమాజం: పీఎం

స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజన సమాజం అందించిన సహకారాన్ని మరువలేం: పీఎం

శ్రీ గోవింద్ గురు భాషా ప్రోత్సాహక కేంద్రం ప్రారంభం... భిల్, గామిత్, వసవ, గరాసియా, కొంకణి, సంథాల్, రాథ్వా, నాయక్, దబ్ల, చౌదరి, కోక్న, కుంభి, వర్లి, దోడియా వంటి గిరిజన తెగల మాండలికాలపై అధ్యయనం.. ఈ కేంద్రంలో భద్రపరచనున్న ఈ గిరిజన తెగల కథలు, పాటలు: పీఎం

అనాదిగా గిరిజన సమాజాలకు తీవ్రమైన ముప్పుగా పరిణమించిన సికిల్ సెల్ వ్యాధిని ఎదుర్కొనేందుకు, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యశాలలు, వైద్య కేంద్రాలు, ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెంపు... సికిల్ సెల్ వ్యాధిని సమూలంగా పరిష్కరించటానికి, నియంత్రించటానికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జాతీయ ప్రచారం: పీఎం

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా, సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ బలోపేతానికి ప్రతిజ్ఞ.. అభివృద్ధిలో ఎవరూ వెనుకబడిపోకూడదు, పురోగతికి ఎవరూ దూరమైపోకూడదు.. భూమిని ప్రేమించిన సుపుత్రుడు, ధర్తి ఆబాకు ఇదే మనం అర్పించే నిజమైన నివాళి: పీఎం

Posted On: 15 NOV 2025 5:28PM by PIB Hyderabad

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.


దేడియాపాడ, సగ్బారా ప్రాంతాలు సంత్ కబీర్ బోధనలతో ప్రభావితమయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. సంత్ కబీర్ జన్మభూమి వారణాసి నుంచి తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని, అందువల్ల ప్రధానమంత్రి జీవితంలో సంత్ కబీర్‌కు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. వేదికపై నుంచి సంత్ కబీర్‌కు కూడా గౌరవ వందనాలు సమర్పించారు.
జాతీయాభివృద్ధి, గిరిజన సంక్షేమానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభించామని, మరికొన్నింటికి శంకుస్థాపన చేశామని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. పీఎం-జన్‌మన్, ఇతర పథకాల ద్వారా ఈ ప్రాంతంలోని లక్ష కుటుంబాలకు పక్కా గృహాలను అందించినట్లు చెప్పారు. అధిక సంఖ్యలో ఏకలవ్య మోడల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించినట్లు, కొన్నింటికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయంలో శ్రీ గోవింద్ గురు పీఠాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఆరోగ్యం, రోడ్లు, రవాణాకు సంబంధించిన పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఈ అభివృద్ధి, సేవా కార్యక్రమాల పట్ల అందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
భగవాన్ బిర్సా ముండా జయంతిని అధికారికంగా 2021వ సంవత్సరంలో జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా గుర్తించినట్లు శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. వేల ఏళ్లుగా భారతదేశ చైతన్యంలో అంతర్భాగంగా గిరిజన ఆత్మగౌరవం ఉందని.. దేశ గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ ప్రమాదంలో పడినప్పుడల్లా గిరిజన సమాజం ముందుండి పోరాడిందని తెలిపారు. ఈ స్ఫూర్తికి భారత స్వాతంత్ర్య పోరాటమే అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు. గిరిజన సమాజం నుంచి ఎంతోమంది ధైర్యవంతులు, స్వాతంత్ర్య సమరాన్ని ముందుకు తీసుకువెళ్లారని.. తిల్కా మాంఝీ, రాణి గైడిన్ల్యూ, సిధో-కన్హో, భైరవ్ ముర్ము, బుద్ధు భగత్, అల్లూరి సీతారామరాజు పేర్లను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన తాంత్యా భిల్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీర్ నారాయణ్ సింగ్, జార్ఖండ్‌కు చెందిన తెలంగా ఖాడియా, అస్సాంకు చెందిన రూప్‌చంద్ కొన్వర్, ఒడిశాకు చెందిన లక్ష్మణ్ నాయక్ వంటి వీరులు దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. ఎన్నో తిరుగుబాట్లకు గిరిజన సమాజం నాయకత్వం వహించిందని, దేశ స్వేచ్ఛ కోసం తమ రక్తాన్ని చిందించిందని ఆయన స్పష్టం చేశారు.
ఎందరో పరాక్రమవంతులైన గిరిజన దేశభక్తులకు గుజరాత్ నిలయమని.. భగత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన గోవింద్ గురు, పంచమహల్‌లో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన రాజా రూప్‌సింగ్ నాయక్, ఏకి ఉద్యమాన్ని ప్రారంభించిన మోతీలాల్ తేజావత్, గాంధీజీ సిద్ధాంతాలను గిరిజన సమాజంలోకి తీసుకెళ్లిన దాష్రిబెన్ చౌదరి వంటి వీరుల పేర్లను ప్రధామమంత్రి ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాటంలో అసంఖ్యాకమైన అధ్యాయాలు గిరిజన గౌరవం, ధీరత్వంతో నిండి ఉన్నాయని వ్యాఖ్యానించారు.
స్వాతంత్ర్యోద్యమానికి గిరిజన సమాజం అందించిన సహకారాన్ని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకతను శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా అనేక గిరిజన మ్యూజియాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుజరాత్‌, రాజ్‌పిప్లాలో 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన గిరిజన మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొన్నిరోజుల క్రితం తాను ఛత్తీస్‌గఢ్‌ను సందర్శించి, అక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. అలాగే, బిర్సా ముండాను బంధించిన రాంచీలోని జైలును కూడా గిరిజన మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
గిరిజన భాషల అభివృద్ధి కేంద్రం కోసం శ్రీ గోవింద్ గురు పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ మోదీ ప్రకటించారు. భిల్, గమిత్, వాసవ, గరాసియా, కొంకని, సంథాల్, రథ్వా, నాయక్, దబ్లా, చౌధరి, కోక్నా,కుంభీ, వర్లి, దోడియా లాంటి గిరిజన వర్గాలకు చెందిన మాండలీకాలను ఈ కేంద్రం అధ్యయనం చేస్తుందన్నారు. ఈ తెగలతో ముడిపడి ఉన్న కథలు, పాటలను పరిరక్షిస్తుంది. వేల ఏళ్ల అనుభవం ద్వారా సాధించిన జ్ఞానం గిరిజన తెగల సొంతమని ప్రధానమంత్రి అన్నారు. వారి జీవన విధానంలో శాస్త్రీయత ఉందని, వారి కథలు తత్వశాస్త్రాన్ని ప్రతిబింబిస్తాయని, వారి భాషల్లో పర్యావరణం పట్ల అవగాహన నిండి ఉంటుందని ఆయన వివరించారు. ఈ సుసంపన్నమైన సంప్రదాయంతో యువతరాన్ని శ్రీ గోవింద్ గురు పీఠం అనుసంధానిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కోట్లాది గిరిజన సోదరీసోదరులకు జరిగిన అన్యాయాన్ని జనజాతీయ గౌరవ్ దివస్ మనకు గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశాన్ని ఆరు దశాబ్దాల పాటు పాలించిన ప్రతిపక్షం గిరిజన తెగలను విస్మరించిందన్నారు. పోషకాహార లోపం, వైద్య సేవలు లభించకపోవడం, నిరక్షరాస్యత, రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ లోపాలు.. గిరిజన ప్రాంతాలకు నిర్వచనాలుగా మారిపోయాయన్నారు. తమ పార్టీకి గిరిజన సంక్షేమమే అత్యున్నత ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ.. ఆ తెగలు ఎదుర్కొంటున్న అన్యాయాలను అంతం చేయడానికి, అభివృద్ధి ఫలాలను వారికి అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
శ్రీ అటల్ బిహారీ వాజపేయి హయాంలో తమ పార్టీ గిరిజన వ్యవహారాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని శ్రీ మోదీ తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన వారు ఈ మంత్రిత్వ శాఖను పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గిరిజన సంక్షేమం కోసం 2013లో అప్పటి ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. గిరిజన ప్రయోజనాల పట్ల అంకితభావాన్ని పునరుద్ధరించిందని, మంత్రిత్వ శాఖకు కేటాయించే బడ్జెట్‌ను కూడా పెంచిందని ప్రధాని స్పష్టం చేశారు. గిరిజన ప్రజల సంక్షేమానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేటాయించే బడ్జెట్ అనేక రెట్లు పెరిగిందని తెలిపారు.
గుజరాత్‌లో గిరిజన ప్రాంతాల పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న కాలం గురించి వివరిస్తూ.. అంబాజీ నుంచి ఉమర్గాం వరకు ఉన్న గిరిజన ప్రాంతంలో ఒక్క సైన్స్ స్కూల్ కూడా లేదని శ్రీ మోదీ అన్నారు. దేదియాపాడ, సగ్బారా లాంటి ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం విద్యార్థులకు ఉండేది కాదని తెలిపారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా తాను పని చేసిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. కన్యా కెలవాణి మహోత్సవాన్ని దేదియాపాడ నుంచే తాను ప్రారంభించానన్నారు. ఆ సమయంలో ఎంతో మంది చిన్నారులు తనతో ముచ్చటించేవారని, కొందరు వైద్యులు, మరింకొందరు ఇంజినీర్లు, ఇంకొందరు శాస్త్రవేత్తలు కావాలనే తమ కలల గురించి చెప్పేవారని వివరించారు. వారిని ముందుకు సాగమని ప్రోత్సహించేవాడినని, వారి లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు.
ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు అవిశ్రాంతమైన కృషి జరిగిందని, ఫలితంగా గుజరాత్‌లోని గిరిజన ప్రాంతంలో ఇప్పుడు 10,000కు పైగా పాఠశాలలు ఉన్నాయని శ్రీ మోదీ వివరించారు. గడచిన రెండు దశాబ్దాలుగా గిరిజన ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైన్సు, కామర్స్, ఆర్ట్స్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. గిరిజన బాలల కోసం తమ ప్రభుత్వం వందల సంఖ్యలో వసతి గృహాలను నిర్మించిందని, గుజరాత్లో రెండు గిరిజన విశ్వవిద్యాలయాలను నెలకొల్పిందని ఆయన తెలిపారు. ఈ తరహా ప్రయత్నాలు ఈ ప్రాంతంలో గణనీయమైన వృద్ధికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి అన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఎంతో మంది చిన్నారులు వైద్యులుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో తన వద్దకు వచ్చేవారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. వారిలో చాలా మంది వైద్యులుగా,ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా మారారు. గిరిజన చిన్నారులకు భద్రమైన, ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు తమ ప్రభుత్వం అహోరాత్రులు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలకు గడచిన అయిదారేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలను విద్యాసంస్థల్లో కల్పించారు. ఫలితంగా పాఠశాలల్లో చేరుతున్న గిరిజన బాలల సంఖ్య 60 శాతం మేర పెరిగింది’ అన్నారు.
గిరిజన యువతకు అవకాశాలను అందించినప్పుడే.. అన్ని రంగాల్లోనూ రాణించగలిగే సామర్థ్యాన్ని పొందుతారని, వారి సంస్కృతి నుంచి ధైర్యాన్ని, శ్రమించే తత్వాన్ని, శక్తిని వారసత్వంగా పొందారని శ్రీ మోదీ అన్నారు. నేటి క్రీడారంగం దీనికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని, అంతర్జాతీయంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు గిరిజన యువత గణనీయమైన కృషి చేస్తోందని వివరించారు. మేరీ కోమ్, తొనకల్ గోపి, ద్యుతి చంద్, భైచుంగ్ భూటియా పేర్లు అందరికీ సుపరిచతమైనప్పటికీ, ఇప్పుడు గిరిజన ప్రాంతాల నుంచి వస్తున్న క్రీడాకారులు ప్రతి ప్రధాన పోటీలోనూ కనిపిస్తున్నారన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవలే ప్రపంచ కప్ గెలుచుకుందని, ఈ విజయంలో గిరిజన తెగకు చెందిన ఓ అమ్మాయి కీలక పాత్ర పోషించిందని ప్రధాని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతిభావంతులను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో క్రీడా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా పరిగణించే నర్మదా జిల్లాను ఇందుకు ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి, ఆకాంక్షాత్మకమైన జిల్లాగా ప్రకటించడంతో నేడు ఈ ప్రాంతం వివిధ రకాలుగా  పురోగతి సాధించిందని వ్యాఖ్యానించారు. ఈ పరివర్తన స్థానిక గిరిజన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, అణగారిన వర్గాల కోసం కేంద్రప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఉచిత వైద్యం చికిత్స కోసం 2018లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ పథకాన్ని జార్ఖండ్‌లోని రాంచీ నుంచి మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది గిరిజన సోదర సోదరీమణులు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందుతున్నారని తెలిపారు. చత్తీస్‌గఢ్ నుంచి ప్రారంభించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్..గిరిజన జనాభాకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోందని ఆయన అన్నారు.
గిరిజన వర్గాల్లో అత్యంత వెనుకబడిన వారికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు, రహదారులు, ఆసుపత్రి సదుపాయాలు లేని ప్రాంతాలు దేశంలో ఇంకా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అలాంటి ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి పీఎం-జన్‌మన్‌ పథకాన్ని జార్ఖండ్‌లోని ఖుంటి నుంచి ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూ. 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ వెనుకబడిన గిరిజన గ్రామాల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 60,000కు పైగా గ్రామాలు ఈ కార్యక్రమంలో చేరినట్లు ఆయన వెల్లడించారు. వేలాది గ్రామాలకు మొదటిసారిగా పైపుల ద్వారా తాగునీరు అందుతుందని, వందలాది గ్రామాలు ఇప్పుడు టెలీమెడిసిన్ సేవలను పొందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం కింద గ్రామసభలను అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. గ్రామాల్లో ఆరోగ్యం, విద్య, పోషకాహారం, వ్యవసాయం, జీవనోపాధిపై దృష్టి సారించి సమాజ ఆధారిత ప్రణాళికలు రూపొందుతున్నాయని వివరించారు. దృఢ సంకల్పంతో ఉంటే, ఎంత అసాధ్యమైన లక్ష్యాలను కూడా సాధించవచ్చని ఈ ప్రచారం నిరూపిస్తుందని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
గిరిజనుల జీవితంలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సమగ్ర దృష్టితో పనిచేస్తోందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. చిన్న అటవీ ఉత్పత్తుల సంఖ్యను 20 నుంచి దాదాపు 100కు పెంచినట్లు, అటవీ ఉత్పత్తులపై కనిష్ట మద్దతు ధరను కూడా పెంచినట్లు ఆయన చెప్పారు. చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, సామల పెంపకాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందని, ఇది గిరిజన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. గుజరాత్‌లో ప్రారంభించిన వనబంధు కల్యాణ్ యోజన గిరిజనులకు భారీ ఆర్థిక బలాన్ని అందించిందని ఆయన గుర్తుచేశారు. దీని నుంచి స్పూర్తి పొంది..ఇప్పుడు గిరిజన కల్యాణ్ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
గిరిజన సమాజాలకు చాలా కాలంగా సికిల్ సెల్ వ్యాధి పెద్ద ప్రమాదంగా ఉన్న విషయాన్ని గుర్తుచేసిన ప్రధాని.. దీన్ని ఎదుర్కొనడానికి గిరిజన ప్రాంతాల్లో డిస్పెన్సరీలు, వైద్య కేంద్రాలు, ఆసుపత్రుల సంఖ్యను పెంచినట్లు వివరించారు. సికిల్ సెల్ వ్యాధిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరు కోట్ల గిరిజన సోదరసోదరీమణు ఇప్పటికే పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు.
విద్య గురించి మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం కింద స్థానిక భాషల్లో విద్య కోసం నిబంధనలు రూపొందించామని శ్రీ మోదీ తెలిపారు. భాషా అడ్డంకుల కారణంగా గతంలో వెనుకబడిన గిరిజన పిల్లలు ఇప్పుడు తమ స్థానిక భాషల్లో విద్యను పొందుతూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. దేశ అభివృద్ధికి మరింత చురుకుగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
గుజరాత్ గిరిజన సముదాయాల గొప్ప కళా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. వారి చిత్రలేఖనం, కళాకృతులు ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి తెలిపారు. ఈ కళా రూపాలను అభివృద్ధి చేసిన కళాకారుడు పారేశ్‌భాయి రాథ్వా గురించి మాట్లాడుతూ.. ఆయనను ప్రభుత్వం పద్మ పురస్కారంతో సన్మానించినట్లు కూడా చెప్పారు.
ఏ సమాజం అభివృద్ధి చెందాలన్నా ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామ్యం చాలా అవసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. గిరిజన సమాజానికి చెందిన ప్రజలు ఉన్నత స్థానాలకు ఎదిగి, దేశాన్ని నడిపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. నేడు భారత దేశ రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ అని ఆయన గర్వంగా గుర్తుచేశారు. తమ పార్టీ, కూటమి ఎల్లప్పుడూ గిరిజన నాయకులను ప్రభుత్వంలోని ఉన్నత పదవులకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ వచ్చిందని అన్నారు. చత్తీస్‌గఢ్‌లో శ్రీ విష్ణుదేవ్ సాయి, ఒడిశాలో శ్రీ మోహన్ చరణ్‌ మాఝీ, అరుణాచల్ ప్రదేశ్‌లో శ్రీ మెమా ఖాండూ, నాగాలాండ్‌లో శ్రీ నెఫ్యూ రియో వంటి నాయకులను ఉదాహరణగా చూపుతూ.. అనేక రాష్ట్రాల్లో గిరిజన నాయకులు ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారని పేర్కొన్నారు. అనేక రాష్ట్ర శాసనసభల్లో తమ పార్టీ గిరిజన స్పీకర్లను కూడా నియమించిందని చెప్పారు. గుజరాత్‌కు చెందిన శ్రీ మంగుభాయ్ పటేల్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారని తెలిపారు. అస్సాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇప్పుడు తమ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారని చెప్పారు. దేశ అభివృద్ధికి ఈ నాయకుల సేవ, సహకారం అసమానమైనదని, అసాధారణమైనవని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
నేడు దేశం ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్’ అనే మంత్ర శక్తిని కలిగి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ మంత్రం గత సంవత్సరాల్లో కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చేసిందని, జాతీయ ఐక్యతను బలోపేతం చేసిందని, దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన సమూహాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఈ మంత్రానికి తమ నిబద్ధతను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఎవరూ వెనుకబడకూడదని, ఇదే ధర్తీ ఆబాకు నిజమైన గౌరవమని పేర్కొన్నారు. మనమంతా కలసి పూర్తి నమ్మకంతో ముందుకు సాగితే వికసిత్‌ భారత్‌ కలను నెరవేర్చగలమని పేర్కొంటూ.. గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గిరిజన గౌరవ దినోత్సవం గిరిజన వర్గాలు తరతరాలుగా కాపాడుకుంటున్న సంప్రదాయాల సారాంశాన్ని కలిగి.. భవిష్యత్తు తరాల ఆకాంక్షలను కూడా ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తెలిపారు. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని గిరిజన గౌరవ దినోత్సవంగా జరుపుతున్నామని పేర్కొన్నారు. భారతీయతలో బలంగా పెనవేసుకొని కొత్త బలం, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగి, కీర్తిశిఖరాలను అధిరోహించాలి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్‌ పటేల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
గిరిజన సమాజాల అభ్యున్నతి కోసం, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా దెడియాపడాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు.
ప్రధానమంత్రి గిరిజన ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్‌మన్‌), ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏ-జేఏజీయూఏ) ద్వారా నిర్మించిన లక్ష ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుమారు రూ. 1,900 కోట్ల వ్యయంతో గిరిజన విద్యార్థుల కోసం నిర్మించిన 42 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రధానమంత్రి ప్రారంభించారు. సమాజ ఆధారిత కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేయడానికి 228 బహుళ ప్రయోజన కేంద్రాలు, అస్సాం మెడికల్ కళాశాలలోని (డిబ్రుగఢ్) సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్, గిరిజన సంస్కృతి, వారసత్వ పరిరక్షణ కోసం మణిపూర్‌ ఇంఫాల్‌లోని గిరిజన పరిశోధనా సంస్థ భవనాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గుజరాత్‌లోని 14 గిరిజన జిల్లాలకు 250 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
గిరిజన ప్రాంతాల్లో రవాణా అనుసంధానాన్ని పెంపొందించేందుకు 748 కి.మీ కొత్త రహదారుల నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే డీఏ-జేఏఈయూఏ కింద కమ్యూనిటీ హబ్‌లుగా పనిచేసే 14 గిరిజన బహుముఖ మార్కెటింగ్ కేంద్రాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. రూ. 2,320 కోట్లకు పైగా విలువైన 50 కొత్త ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.


(Release ID: 2190430) Visitor Counter : 3