మంత్రిమండలి
azadi ka amrit mahotsav

హరిత ఇంధనానికి కీలకమైన గ్రాఫైట్, సీసియం, రుబిడియం, జిర్కోనియం ఖనిజాల రాయల్టీ రేట్ల హేతుబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2025 8:26PM by PIB Hyderabad

సీసియం, గ్రాఫైట్, రుబిడియం, జిర్కోనియం ఖనిజాల రాయల్టీ రేటును నిర్ణయించడానికి/సవరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఖనిజం

రాయల్టీ రేట్

సీసియం

ఉత్పత్తి చేసిన ఖనిజంలోని సీసియం లోహ పరిమాణంపై, సీసియం లోహం సగటు విక్రయ ధర (ఏఎస్పీ)లో 2% 

గ్రాఫైట్

(i) ఎనభై శాతం లేదా అంతకంటే ఎక్కువ స్థిర కార్బన్‌తో

(ii) ఎనభై శాతం కంటే తక్కువ స్థిర కార్బన్‌తో

 

 విలువ (యాడ్ వాలోరమ్)  ప్రాతిపదికన  ఏఎస్పీలో 2% 

యాడ్ వాలోరమ్ ప్రాతిపదికన ఏఎస్పీ లో 4%

రుబిడియం

ఉత్పత్తి చేసిన ఖనిజంలోని రుబిడియం లోహ పరిమాణంపై రుబిడియం లోహం సగటు విక్రయ ధర (ఏఎస్పీ) లో 2% 

జిర్కోనియం

ఉత్పత్తి చేసిన ఖనిజంలోని జిర్కొనియం లోహ పరిమాణంపై, జిర్కొనియం లోహం సగటు విక్రయ ధర (ఏఎస్పీ)లో ఒకటి శాతం 

 

కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం సీసియం, రుబిడియం,  జిర్కోనియం ఉన్న ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఈ ఖనిజాలను మాత్రమే కాకుండా, వాటితో పాటు లభించే లిథియం, టంగ్‌స్టన్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈఎస్), నియోబియం వంటి అనుబంధ కీలక ఖనిజాలను కూడా వినియోగంలోకి తీసుకురావడానికి మార్గం సుగమం చేస్తుంది. గ్రాఫైట్‌కు విలువ ప్రాతిపదికన రాయల్టీ రేట్లు నిర్ణయించడం వల్ల వివిధ గ్రేడ్‌ల ఖనిజాల ధరలలో మార్పులను ఇది దామాషా ప్రకారం సూచిస్తుంది. దేశంలో ఈ ఖనిజాల ఉత్పత్తి పెరగడం వల్ల దిగుమతులు,  సరఫరా వ్యవస్థ పరంగా ఉన్న అస్థిరతలు తగ్గుతాయి. అంతేకాకుండా, దేశంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

గ్రాఫైట్, సీసియం, రుబిడియం, జిర్కోనియం ఖనిజాలు అధిక సాంకేతిక అన్వయానికీ,  ఇంధన మార్పునకూ ముఖ్యమైనవి. మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 1957 (ఎంఎండీఆర్) లో పేర్కొన్న 24 కీలకమైన,  వ్యూహాత్మక ఖనిజాలలో గ్రాఫైట్,  జిర్కోనియం కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) బ్యాటరీలలో గ్రాఫైట్ కీలకమైన భాగం. ఇది ప్రాథమికంగా యానోడ్ (ఎఎన్ఓడిఈ)గా పనిచేస్తుంది. ఇది అధిక వాహకత్వం, ఛార్జ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. భారత్ తన గ్రాఫైట్ అవసరాలలో 60% దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం, దేశంలో 9 గ్రాఫైట్ గనులు పనిచేస్తున్నాయి. అదనంగా, 27 బ్లాకులను విజయవంతంగా వేలం వేశారు. జీఎస్ఐ,  ఎమ్ఈసీఎల్ సంస్థలు మరో 20 గ్రాఫైట్ బ్లాకులను అప్పగించాయి. వీటిని త్వరలో వేలం వేయనున్నారు. మరో 26 బ్లాకులలో అన్వేషణ  జరుగుతోంది.

జిర్కోనియం ఒక బహుముఖ లోహం. దీని  అసాధారణమైన తుప్పు నిరోధకత, అధిక ఉష్ణోగ్రత స్థిరత్వం కారణంగా అణుశక్తి, ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి వివిధ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. సీసియంను ప్రధానంగా ఉన్నత సాంకేతిక ఎలక్ట్రానిక్ రంగంలో, ముఖ్యంగా అణు గడియారాలు, జీపీఎస్ వ్యవస్థలు, ఇతర అధిక కచ్చితత్వ పరికరాలు, క్యాన్సర్ చికిత్స వంటి వైద్య పరికరాలలో ఉపయోగిస్తారు. రుబిడియంను ఫైబర్ ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, నైట్ విజన్ పరికరాలలో ఉపయోగించే ప్రత్యేక అద్దాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 

కీలక ఖనిజ బ్లాకుల ఆరో విడత వేలం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల (సెప్టెంబర్ 16, 2025న) టెండర్ల కోసం నోటీసు ను జారీ చేసింది. ఇందులో 5 గ్రాఫైట్ బ్లాకులు, 2 రుబిడియం బ్లాకులు, ఒక్కొక్క సీసియం, జిర్కోనియం బ్లాకులు (వివరాలు అనుబంధంలో) ఉన్నాయి.  రాయల్టీ రేటుపై కేంద్ర మంత్రివర్గం నేడు తీసుకున్న నిర్ణయం వేలంలో పాల్గొనే బిడ్డర్లు తమ రేట్లను హేతుబద్ధంగా సమర్పించడానికి సహాయపడుతుంది.

గ్రాఫైట్ రాయల్టీ రేటును సెప్టెంబర్ 1, 2014 నుంచి టన్నుకు రూపాయలు ప్రాతిపదికన నిర్ణయించారు. కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాల జాబితాలో రాయల్టీ రేటును టన్ను ప్రాతిపదికన నిర్దేశించిన ఏకైక ఖనిజం ఇదే. అంతేకాకుండా, వివిధ గ్రేడ్‌లలో గ్రాఫైట్ ధరలలోని తేడాలను పరిగణనలోకి తీసుకుని, గ్రాఫైట్ రాయల్టీని ఇప్పుడు విలువ ప్రాతిపదికన వసూలు చేయాలని నిర్ణయించారు. తద్వారా వివిధ గ్రేడ్‌లలోని రాయల్టీ రాబడులు ఖనిజ ధరలలోని మార్పుల దామాషా ప్రకారం ఉంటాయి. ఇటీవలి సంవత్సరాలలో, అనేక కీలకమైన ఖనిజాల రాయల్టీ రేట్లు 2% నుంచి  4% మధ్య ఖరారయ్యాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2189485) సందర్శకుల సూచీ సంఖ్య : : 88