సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆవిష్కరణలు, సమ్మిళితత్వాన్ని ప్రతిబింబిస్తూ... మహిళా చిత్రరూపకర్తలు, కొత్త ప్రతిభ, సినిమాల్లో సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా ఐఎఫ్ఎఫ్ఐ-2025:కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
న్యూఢిల్లీలో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంతో ప్రారంభమైన ఐఎఫ్ఎఫ్ఐ-2025 కౌంట్‌డౌన్
ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరిగే 56వ ఐఎఫ్ఎఫ్ఐ కర్టెన్ రైజర్
ఐఎఫ్ఎఫ్ఐ ముగింపు వేడుకల్లో... సినీ రంగంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్‌కు సత్కారం
13 ప్రపంచ ప్రీమియర్లు, 5 అంతర్జాతీయ ప్రీమియర్లు, 44 ఆసియా ప్రీమియర్లు సహా 81 దేశాలకు చెందిన 240కి పైగా సినిమాల ప్రదర్శన
5 ఖండాలకు చెందిన 32 చిత్రాలతో మూడు అత్యుత్తమ అంతర్జాతీయ పోటీలు
2025లో నిర్వహించిన ప్రపంచ ప్రముఖ చలన చిత్రోత్సవాల నుంచి పురస్కారం గెలుచుకున్న అగ్ర చిత్రాలు తొలిసారి భారత్‌లో ప్రదర్శన
9 క్యూరేటెడ్ విభాగాలు: డాక్యు-మాంటేజ్, ఫ్రమ్ ది ఫెస్టివల్స్, రైజింగ్ స్టార్స్, మిషన్ లైఫ్, ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్, రిస్టోర్డ్ క్లాసిక్స్, మకాబ్రే డ్రీమ్స్, యునిసెఫ్, సినిమా ఆఫ్ ది వరల్డ్
కంట్రీ ఆఫ్ ఫోకస్ జపాన్ - జపనీస్ సినిమాలు, సంస్థాగత సహకారాలు, సాంస్కృతిక ప్రదర్శనల క్యూరేటెడ్ ప్యాకేజీలు
ప్రత్యేక సినిమా ప్యాకేజీలు: భాగస్వామి దేశం స్పెయిన్... స్పాట్‌లైట్ ఆస్ట్రేలియా
శతాబ్దోత్సవాలు నిర్వహించనున్న ఐఎఫ్ఎఫ్ఐ-2025
రీస్టోర్డ్ క్లాసిక్స్ ద్వారా దిగ్గజ చిత్ర నిర్మాతలు, కళాకారులకు సత్కారం
Posted On:
07 NOV 2025 5:10PM by PIB Hyderabad
56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. ఐఎఫ్ఎఫ్ఐ కర్టెన్-రైజర్ కార్యక్రమం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. ఇది 81 దేశాల నుంచి 240 కి పైగా సినిమాలు, 13 ప్రపంచ ప్రీమియర్లు, 4 అంతర్జాతీయ ప్రీమియర్లు సహా 46 ఆసియా ప్రీమియర్లు కలిగిన విస్తృత, వైవిధ్య కార్యక్రంగా నిలవనుంది. ఈ ఉత్సవానికి 127 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,314 సబ్మిషన్స్ వచ్చాయి. ఇది గ్లోబల్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో ఐఎఫ్ఎఫ్ఐకి పెరుగుతున్న ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది.
ఈ సంవత్సరం ఆవిష్కరణలు, సమ్మిళితత్వాన్ని ప్రతిబింబించే అనేక కొత్త కార్యక్రమాలను ఐఎఫ్ఎఫ్ఐ ప్రవేశపెడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం 50 మందికి పైగా మహిళా దర్శకులు తమ చిత్రాలను ప్రదర్శించడం... సినీరంగంలో నారీ శక్తిని ప్రోత్సహించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. వెబ్, స్ట్రీమింగ్ కంటెంట్‌లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించడానికి ఈ సంవత్సరం ఓటీటీ పురస్కారాలు కొనసాగుతాయనీ ఆయన ప్రకటించారు. స్క్రీన్ రైటింగ్, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ వంటి రంగాల్లో కొత్త, వర్ధమాన ప్రతిభావంతులకు ఈ ఉత్సవం ఊతమిస్తోందని ఆయన అన్నారు. పైరసీ నిరోధక చట్టాలను బలోపేతం చేయడానికి, ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను సరళీకృతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బహు భాషా చిత్రాలకు సీబీఎఫ్‌సీ ద్వారా అందించనున్న ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ సర్టిఫికేట్ భారత సాంస్కృతిక ఐక్యతను మరింత ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూ... భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో బలమైన ప్రభావం చూపుతోందన్నారు. భారతీయ సినిమాలు ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ చిత్రాల కంటే మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఐఎఫ్ఎఫ్ఐకి జపాన్, స్పెయిన్, ఆస్ట్రేలియాలు కొత్త భాగస్వామ్యాలను తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థలు, రాష్ట్రాలు, సాంస్కృతిక సమూహాలతో గ్రాండ్ కార్నివాల్ కవాతు మరింత ఉత్సాహాన్ని జోడిస్తుందనీ... పెద్ద ఫిల్మ్ బజార్ అంతర్జాతీయ సహ-నిర్మాణాలను పెంపొందిస్తుందని ఆయన తెలిపారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు అనుబంధ కార్యక్రమమైన ఐఎఫ్ఎఫ్ఐఎస్టా ఒక ఉత్సాహభరితమైన వినోద, సాంస్కృతిక మహోత్సవం. ఈ ఐఎఫ్ఎఫ్ఐఎస్టా కార్యక్రమంలో సంగీతం, సంస్కృతి, వినోదాత్మక ప్రదర్శనలు భాగంగా ఉంటాయి. చలనచిత్రం, ఆహారం, కళలు, ఇంటరాక్టివ్ అనుభవాల సమ్మేళనం ద్వారా అన్ని సమాజాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యువత భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రధాన ఉత్సవం నిర్వహిస్తారు. జనరేటివ్ ఏఐ వినోద రంగానికి అంతరాయం కలిగిస్తున్నప్పటికీ... కథ చెప్పే విధాన భవిష్యత్తును రూపొందించే సృజనాత్మక సాధనంగా దీనిని స్వీకరించాలని శ్రీ జాజు స్పష్టం చేశారు.
ఐఎఫ్ఎఫ్ఐ-2025 ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ శేఖర్ కపూర్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ, చలనచిత్ర వీక్షణ దేశంగా భారత్ ఉందన్నారు. కథల పట్ల ప్రజల ప్రేమను ఇది ప్రదర్శిస్తుందని తెలిపారు. కథ చెప్పడం వివిధ సంస్కృతులలో అవగాహనను, శాంతిని పెంపొందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఫిల్మ్ బజార్‌ను ప్రధానంగా ప్రస్తావిస్తూ... దీనిని సాంకేతికత ద్వారా యువ సృష్టికర్తలకు సాధికారత కల్పించే ఉద్యమంగా ఆయన అభివర్ణించారు. కథకులు భారతదేశ కథలను ప్రపంచంతో పంచుకోవడానికి సహాయపడే సృజనాత్మక సాధనంగా కృత్రిమ మేధస్సును చూడాలని ఆయన అన్నారు.
ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజా... సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్... సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (సినిమాలు) డాక్టర్ అజయ్ నాగభూషణ్... ఇండియన్ పనోరమా జ్యూరీ (ఫీచర్) చైర్మన్ శ్రీ రాజా బుందేలా... ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్... ఇండియన్ పనోరమా జ్యూరీ (నాన్-ఫీచర్) చైర్మన్ శ్రీ ధరమ్ గులాటీ పాల్గొన్నారు.
56వ ఎడిషన్ ముఖ్యాంశాలు
ప్రారంభ సినిమా - గాలా ప్రీమియర్‌లు
● ఐఎఫ్ఎఫ్ఐ-2025లో ప్రారంభ చిత్రం బ్రెజిలియన్ రచయిత గాబ్రియేల్ మస్కారో రూపొందించిన ది బ్లూ ట్రయల్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ ఫీచర్. ఇది అమెజాన్ గుండా తిరుగుబాటు ప్రయాణం చేసిన 75 ఏళ్ల మహిళను అనుసరిస్తుంది. ఇది స్వేచ్ఛ, గౌరవం, కలలు కనే హక్కుపై నిశ్శబ్ద మ్యానిఫెస్టోగా మారుతుంది. ఈ చిత్రం బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2025లో సిల్వర్ బేర్ - గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది.
● గాలా ప్రీమియర్స్ విభాగంలో 13 వరల్డ్ ప్రీమియర్‌లు, 2 ఆసియా ప్రీమియర్‌లు, 1 ఇండియా ప్రీమియర్, 2 ప్రత్యేక ప్రదర్శనల స్క్రీనింగ్‌లు సహా 18 టైటిళ్లు ప్రదర్శించనున్నారు. కళాకారులు, చిత్రనిర్మాతలకు గౌరవపూర్వక రెడ్ కార్పెట్ స్వాగతం లభించనుంది.
కార్యక్రమ స్థాయి - ప్రీమియర్స్
● 81 దేశాలకు చెందిన 241కి పైగా చిత్రాలు
● 13 వరల్డ్ ప్రీమియర్స్ సహా అంతర్జాతీయ విభాగంలో 160 చిత్రాలు.
● అవార్డు గెలుచుకున్న 80కి పైగా ఫెస్టివల్ టైటిల్స్, అధికారికంగా ఆస్కార్‌కు నామినేట్ అయిన 21 సినిమాలు ఐఎఫ్ఎఫ్ఐ-2025లో ప్రదర్శిస్తారు.
● “సినిమా ఆఫ్ ది వరల్డ్” కింద 55కి పైగా సినిమాలు... ఫెస్టివల్ రౌండ్లలో ప్రదర్శించిన 133 అంతర్జాతీయ టైటిల్స్ గల క్యూరేటెడ్ ఎంపిక.
అంతర్జాతీయ ప్రోగ్రామింగ్‌లో క్యూరేటెడ్ విభాగాలు
● జపాన్: కంట్రీ ఆఫ్ ఫోకస్‌తో పాటు కొత్తగా జోడించిన రెండు విభాగాలు... భాగస్వామి దేశం: స్పెయిన్, స్పాట్‌లైట్ దేశం: ఆస్ట్రేలియా.
● మొత్తంగా ఈ ఉత్సవంలో అంతర్జాతీయ పోటీ, ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్, ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ మెడల్... మకాబ్రే డ్రీమ్స్, డాక్యు-మోంటేజ్, ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్, యునిసెఫ్, రీస్టోర్డ్ క్లాసిక్స్ వంటి ప్రత్యేక విభాగాలు సహా 15 కాంపిటీటివ్, క్యూరేటెడ్ విభాగాల ప్రదర్శన ఉంటుంది.
కంట్రీ ఫోకస్ - జపాన్
● ఐఎఫ్ఎఫ్ఐ-2025లో జపాన్ కంట్రీ ఆఫ్ ఫోకస్‌గా ఉంది. ఐఎఫ్ఎఫ్ఐ కంట్రీ ఫోకస్: జపాన్ ఈ రోజు జపనీస్ సినిమా విస్తృత దృశ్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర భాషను రూపొందిస్తున్న వర్ధమాన చిత్రనిర్మాతలు, ప్రముఖ రచయితల సృజనాత్మక శక్తిని ప్రదర్శిస్తుంది. జ్ఞాపకశక్తి, గుర్తింపుల ఇంటిమేట్ డ్రామాల నుంచి ఫెస్టివల్ పురస్కారాలు గెలుచుకున్న సైకో థ్రిల్లర్స్, లింగం-లైంగికతను భిన్నంగా చూపించే కథనాలు, యువత సైన్స్ ఫిక్షన్, కవితాత్మక, నాన్-లీనియర్ ప్రయోగాత్మక చిత్రాల వరకు ఆరు క్యూరేటెడ్ చిత్రాల విభాగం ఉంది.
శతాబ్ది నివాళులు
● ఐఎఫ్ఎఫ్ఐ-2025 శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటుంది. ప్రముఖ చలనచిత్ర నిర్మాతలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, పి. భానుమతి, భూపేన్ హజారికా, సలీల్ చౌదరిల కళాఖండాలను ప్రదర్శించడం ద్వారా వారిని సత్కరిస్తుంది.
సలీల్ చౌదరి... ముసాఫిర్, రిత్విక్ ఘటక్... సుబర్ణరేఖ చిత్రాలు ఐఎఫ్ఎఫ్ఐ-2025లో ప్రదర్శిస్తారు.
రజనీకాంత్ స్వర్ణోత్సవం
· సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ ప్రయాణంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐఎఫ్ఎఫ్ఐ ముగింపు వేడుకలో ఆయనను సత్కరిస్తారు.
ఇండియన్ పనోరమా – న్యూ హారిజన్స్
● ఇండియన్ పనోరమా 2025: 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు, 5 డెబ్యూ ఫీచర్ ఫిల్మ్‌లు.
● ప్రారంభ చిత్రం (ఇండియన్ పనోరమా ఫీచర్): అమరన్ (తమిళం), రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
● నాన్-ఫీచర్ ఫిల్మ్ ప్రారంభోత్సవం: కాకోరి.
● న్యూ హారిజన్స్: ఇండియన్ పనోరమా ఎంపిక వెలుపల ఐదు వరకు ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన ఫీచర్ ఫిల్మ్‌లు (ప్రపంచ, అంతర్జాతీయ, ఆసియా లేదా భారతదేశ ప్రీమియర్‌లు).
మహిళలు, తొలి గాత్రాలు, వర్ధమాన ప్రతిభ
● సినిమా రంగంలో మహిళలు: మహిళలు దర్శకత్వం వహించిన 50కి పైగా సినిమాలు. అరంగేట్ర చిత్రనిర్మాతల 50కి పైగా రచనలు, సమగ్రత, వర్ధమాన స్వరాలపై ఈ ఉత్సవం దృష్టిని ప్రతిబింబిస్తుంది (అంతర్జాతీయ విభాగం)
● భారతీయ చలనచిత్రంలో ఉత్తమ అరంగేట్ర దర్శకుడు: ఎంపిక చేసిన 5 అరంగేట్ర చిత్రాల ప్రదర్శన. ఈ అవార్డు దర్శకుడికి సర్టిఫికెట్, రూ. 5 లక్షల నగదు బహుమతిని కలిగి ఉంటుంది.
● ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ) అవార్డు: ఐదుగురు ఫైనలిస్టుల (30 సమర్పణల్లో ఎంపికైనవి) నుంచి విజేతగా నిలిచే ఒకరు సర్టిఫికెట్‌తో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతిని అందుకుంటారు. దీనిని క్రియేటర్స్, నిర్మాతలు పంచుకుంటారు.
క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎమ్‌వోటీ)
● 2025లో సీఎమ్‌వోటీ కోసం 799 ఎంట్రీలు వచ్చాయి. ఎంపికైన అభ్యర్థుల సంఖ్య 75 నుంచి 124కి పెరిగింది. ఈ సంవత్సరం మూడు కొత్త క్రాఫ్ట్‌లు సహా 13 ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్‌లను కవర్ చేసింది. ఈ కార్యక్రమంలో షార్ట్స్‌టీవీ సహకారంతో 48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ కూడా ఉంది.
వేవ్స్ ఫిల్మ్ బజార్
● వేవ్స్ ఫిల్మ్ బజార్ (19వ ఎడిషన్): స్క్రీన్ రైటర్స్ ల్యాబ్, మార్కెట్ స్క్రీనింగ్స్, వ్యూయింగ్ రూమ్ లైబ్రరీ, కో-ప్రొడక్షన్ మార్కెట్ ఫీచర్-డాక్యుమెంటరీ నుంచి 300కి పైగా ఫిల్మ్ ప్రాజెక్టులను నిర్మాణం, పంపిణీ, అమ్మకాల సహకారాల కోసం ప్రదర్శిస్తారు. బజార్ దక్షిణాసియాలో ఒక ప్రధాన ఫిల్మ్ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతూనే ఉంది.
● వేవ్స్ ఫిల్మ్ బజార్ కో-ప్రొడక్షన్ మార్కెట్: 22 ఫీచర్ ఫిల్మ్‌లు, 5 డాక్యుమెంటరీలను కలిగి ఉంటుంది. ముగ్గురు విజేతలకు మొత్తం 20,000 డాలర్ల నగదు గ్రాంట్‌లు అందిస్తారు (మొదటి బహుమతి: కో-ప్రొడక్షన్ మార్కెట్ ఫీచర్ - 10,000 డాలర్లు, 2వ బహుమతి: కో-ప్రొడక్షన్ మార్కెట్ ఫీచర్ - 5,000 డాలర్లు. కో-ప్రొడక్షన్ మార్కెట్ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక నగదు గ్రాంట్- 5000 డాలర్లు).
● ఈ సంవత్సరం వేవ్స్ ఫిల్మ్ బజార్ రికమెండ్స్ (డబ్ల్యూఎఫ్‌బీఆర్) విభాగంలో అనేక మంది అరంగేట్ర దర్శకులను వెలుగులోకి తెస్తూ 14 భాషలు, 4 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 షార్ట్ ఫిక్షన్ చిత్రాలు, 3 మిడ్-లెంగ్త్ డాక్యుమెంటరీలు, 16 ఫిక్షన్ ఫీచర్ ఫిల్మ్‌లతో కూడిన 22 చిత్రాలు ప్రదర్శిస్తారు.
● “నాలెడ్జ్ సిరీస్”లో పిచింగ్ సమావేశాలు, దేశం - రాష్ట్రాల ప్రదర్శనలు, నిర్మాణం - పంపిణీపై ఆచరణాత్మక సమావేశాలు ఉంటాయి.
● డబ్ల్యూఎఫ్‌బీ పెవిలియన్లు, స్టాల్స్ 7 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తాయి. 10కి పైగా భారతీయ రాష్ట్రాల ప్రోత్సాహకాలను ప్రదర్శిస్తాయి. ఐదు ప్రముఖ సాంకేతిక సంస్థలను కలిగి ఉన్న ప్రత్యేక టెక్ పెవిలియన్ కీలక పరిశ్రమ భాగస్వాముల సహకారంతో వీఎఫ్ఎక్స్, యానిమేషన్, సీజీఐ, ఇతర చలనచిత్ర నిర్మాణ సాంకేతికతల్లో అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంది.
మార్కెట్ ప్లేస్ & కో-ప్రొడక్షన్ అవకాశాలు: వేవ్స్ ఫిల్మ్ బజార్ నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లు చిత్రరూపకర్తలు, నిర్మాతలు, సేల్స్ ఏజెంట్లు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లు, పెట్టుబడిదారులను ఒకచోట చేర్చి సృజనాత్మక, ఆర్థిక సహకారాలను పెంపొందిస్తాయి.
మాస్టర్ క్లాసెస్, ప్యానెల్స్ & ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్
● సినీ ప్రియులు కళా అకాడమీలో 10 ఫార్మాట్లలో 21 మాస్టర్‌క్లాస్‌లు, ప్యానెల్ చర్చలను చూడవచ్చు. ఇందులో విధు వినోద్ చోప్రా, అనుపమ్ ఖేర్, క్రిస్టోఫర్ చార్లెస్ కార్బోల్డ్ ఓబీఈ, బాబీ డియోల్, ఆమిర్ ఖాన్, రవి వర్మన్, కుష్బూ సుందర్, సుహాసిని మణిరత్నం, పీట్ డ్రేపర్, శ్రీకర్ ప్రసాద్ సహా ఇతర ప్రముఖులు పాల్గొంటారు. డిజిటల్ యుగంలో ఎడిటింగ్, నటన నుంచి సుస్థిరత, థియేటర్ యాక్టింగ్, ఏఐ, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీల వరకు పలు అంశాలపై సమావేశాలు ఉంటాయి.
● శాంతిని ప్రోత్సహించడంలో సినిమా పాత్ర, చలనచిత్ర నిర్మాణంలో సవాళ్లను కొత్త ప్యానెల్స్ చర్చిస్తాయి. “నిర్మాణాత్మక చర్చా” సమావేశాల్లో పరిశ్రమలకు చెందిన ప్రముఖ కళాకారులు, చిత్రరూపకర్తలు పాల్గొంటారు. సాంకేతిక సమావేశాలు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్‌లను ఇవి హైలైట్ చేస్తాయి.
ఫెస్టివల్ వేదికలు - యాక్సెసిబిలిటీ
● ఐదు ప్రధాన వేదికల్లో సినిమాల ప్రదర్శనను, కార్యక్రమాలను నిర్వహిస్తారు: ఐనాక్స్ పంజిమ్, మాక్వినెజ్ ప్యాలెస్, ఐనాక్స్ పోర్వోరిమ్, జెడ్-స్క్వేర్ సామ్రాట్ అశోక్, రవీంద్ర భవన్, మడ్గావ్. అలాగే మిరామార్ బీచ్, రవీంద్ర భవన్ ఫటోర్డా, అంజునా బీచ్‌లలో బహిరంగ ప్రదర్శనలు జరుగుతాయి.
● సమ్మిళిత భాగస్వామ్యం పట్ల ఉత్సవ నిబద్ధతకు అనుగుణంగా అన్ని వేదికల్లో ఆడియో వివరణలు, సంజ్ఞా భాషా వివరణలు, బహుభాషా డబ్బింగ్ వంటి యాక్సెసిబిలిటీ ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి.
.
అంతర్జాతీయ పోటీకి జ్యూరీ - 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా
- ఛైర్‌పర్సన్: రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా (భారత్)
· సభ్యులు:
-
- గ్రేమ్ క్లిఫోర్డ్, ఎడిటర్ మరియు డైరెక్టర్ (ఆస్ట్రేలియా)
- రెమి అడెఫరాసిన్, సినిమాటోగ్రాఫర్ (ఇంగ్లాండ్)
- కాథరినా షుట్లర్, నటి (జర్మనీ)
- చంద్రన్ రుట్నం, చిత్రనిర్మాత (శ్రీలంక)
స్లేట్‌లో ప్రముఖ చలనచిత్ర లైనప్ & అవార్డు విజేతలు
● ఈ ఉత్సవంలో ప్రముఖ అంతర్జాతీయ అవార్డు విజేతలు... కేన్స్, బెర్లినేల్, లోకార్నో, వెనిస్‌లలో గెలిచిన టైటిల్స్‌తో సహా ఫెస్టివల్ ఫేవరెట్‌లను ప్రదర్శిస్తారు, ఇది అత్యుత్తమ సినిమాలకు ప్రపంచ సమావేశ కేంద్రంగా ఐఎఫ్ఎఫ్ఐ పాత్రను బలోపేతం చేస్తుంది. కొన్ని పేర్లలో ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ (పామ్ డి'ఓర్, కేన్స్), ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ (గోల్డెన్ లయన్, వెనిస్), డ్రీమ్స్ (సెక్స్ లవ్) (గోల్డెన్ బేర్, బెర్లిన్), సిరాట్ (గ్రాండ్ జ్యూరీ ప్రైజ్, కేన్స్), ది మెసేజ్ (సిల్వర్ బేర్, జ్యూరీ ప్రైజ్, బెర్లిన్), నో అదర్ ఛాయిస్ (పీపుల్స్ ఛాయిస్ అవార్డు, టీఐఎఫ్ఎఫ్), గ్లోమింగ్ ఇన్ లువోము (ఉత్తమ చిత్రం, బుసాన్), ఫియుమ్ ఓ మోర్టే! (టైగర్ అవార్డు, ఐఎఫ్ఎఫ్ఆర్), ఇతరాలు ఉన్నాయి.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)
1952లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది... సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా ప్రభుత్వం నిర్వహించే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర కార్యక్రమం. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాలను, ప్రతిభను ప్రోత్సహిస్తూనే ప్రపంచ సినిమాల్లోని అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించడం దీని లక్ష్యం. ప్రతి సంవత్సరం గోవాలో జరిగే ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమం.... సృజనాత్మకను పరస్పరం పంచుకోవడం, కొత్త స్వరాల ఆవిష్కరణ, సినిమా కళ ద్వారా సాంస్కృతిక అవగాహనను పెంపొందించడం కోసం ఒక చక్కని వేదికగా పనిచేస్తుంది.
నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ)
నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ. 1975లో ఏర్పాటు చేసిన ఎన్ఎఫ్‌డీసీ భారతీయ సినిమాను ప్రోత్సహించడంలో, స్వతంత్ర చిత్రరూపకర్తలకు మద్దతునివ్వడంలో, అంతర్జాతీయ భాగస్వాములతో సహ-నిర్మాణాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఫిల్మ్ బజార్ (ప్రస్తుత వేవ్స్ బజార్)ను కూడా నిర్వహిస్తుంది. ఇది భారతీయ సృష్టికర్తలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తుంది... భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ముందుకు నడిపిస్తుంది.
***
(Release ID: 2188168)
Visitor Counter : 2
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam