ఎరువుల విభాగం
azadi ka amrit mahotsav

ప్రణాళిక, సమన్వయం ద్వారా 2025 ఖరీఫ్‌లో రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉంచిన ఎరువుల మంత్రిత్వ శాఖ


ప్రభుత్వం సకాలంలో చేపట్టిన చర్యలతో 2025-26 రబీ కోసం అందుబాటులో సరిపడా యూరియా బఫర్‌ నిల్వలు

మెరుగైన దేశీయ ఉత్పత్తి, అధిక దిగుమతులతో దేశవ్యాప్తంగా రైతులకు తగినంత యూరియా సరఫరాకు భరోసా

రైతుల కోసం పారదర్శకతను, సకాల మద్దతును ప్రోత్సహిస్తూ... అప్రమత్తమైన, సమర్థమైన యూరియా పంపిణీ కోసం వినూత్న విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు

प्रविष्टि तिथि: 03 NOV 2025 6:13PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ఎరువుల మంత్రిత్వ శాఖ 2025 ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా యూరియాతో పాటు అవసరమైన ఇతర ఎరువులు తగినంతగా అందుబాటులో ఉంచింది. సకాల ప్రణాళికల అమలుతో పాటు వివిధ విభాగాలతో అంటే భారతీయ రైల్వేలు, ఓడరేవులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎరువుల కంపెనీలతో సన్నిహిత సమన్వయం ద్వారా ఎలాంటి కొరత లేకుండా రైతులకు అవసరమైన మొత్తంలో యూరియాను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విజయవంతమైంది. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అంచనా వేసిన 185.39 లక్షల మెట్రిక్ టన్నుల అవసరానికి గానూ, 230.53 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు డీవోఎఫ్ నిర్ధారించింది. ఇది ఇప్పటివరకు జరిగిన 193.20 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాల కంటే చాలా ఎక్కువ. ఇది దేశవ్యాప్తంగా తగినంత పరిమాణంలో యూరియా లభ్యతను సూచిస్తుంది. 2024 ఖరీఫ్‌తో పోలిస్తే రైతులు 2025 ఖరీఫ్ కోసం దాదాపు 4.08 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా వినియోగించారు. మంచి వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో వేసిన పంటల కోసం తగినంత యూరియా అందుబాటులో ఉందని ఇది సూచిస్తుంది.

దిగుమతుల ద్వారా దేశీయ ఉత్పత్తి-వినియోగం మధ్య అంతరాన్ని తగ్గించడానికి డీవోఎఫ్ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. దేశీయ ఉత్పత్తి, పెరుగుతున్న డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి, దిగుమతులను పెంచడానికి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసింది. 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య భారత్ 58.62 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ-గ్రేడ్ యూరియాను దిగుమతి చేసుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో దిగుమతి చేసుకున్న యూరియా 24.76 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. దిగుమతుల్లో ఈ పెరుగుదల 2025 ఖరీఫ్ సమయంలో యూరియా కోసం పెరిగిన డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, రాబోయే రబీ సీజన్‌కు తగిన బఫర్ నిల్వలను సిద్ధం చేయడంలోనూ సహాయపడింది. ఫలితంగా, మొత్తం యూరియా నిల్వలు 2025, అక్టోబర్ 1 నాటికి ఉన్న 48.64 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి అక్టోబర్ 31 నాటికి 68.85 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఇది యూరియా నిల్వల్లో 20.21 లక్షల మెట్రిక్ టన్నుల వృద్ధిని ప్రతిబింబిస్తుంది. 2025 జూలై నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రాలకు అత్యధికంగా యూరియా సరఫరాలు (రేక్‌ల తరలింపు పరంగా) నమోదయ్యాయి. ఇది రైతుల ప్రయోజనాల దృష్ట్యా యూరియాను సకాలంలో సరఫరా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న చురుకైన ప్రయత్నాలను స్పష్టం చేస్తుంది.

దేశీయ యూరియా ఉత్పత్తి కూడా మెరుగుపడింది. 2025 అక్టోబరు నెలలో ఉత్పత్తి 26.88 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఇది 1.05 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ. ఏప్రిల్-అక్టోబర్ మధ్య సగటు నెలవారీ ఉత్పత్తి దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల కోసం సుమారు 17.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతులు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, ప్రపంచ స్థాయిలో సముచిత చర్యలు చేపట్టడం ద్వారా మరింత దిగుమతికి ఆస్కారం ఉంది.

దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అస్సాంలోని నమ్రూప్, ఒడిశాలోని తాల్చేర్‌లో గల యూరియా ప్లాంట్లు సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. యూరియా ఉత్పత్తిని పెంచడానికి అనేక ప్రతిపాదనలు అందగా, మరిన్ని పరిశీలనలో ఉన్నాయి. వీటిలో పలు ప్రతిపాదనలు ఆమోదం పొందితే... దేశం దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గనుంది. యూరియా ఉత్పత్తిలో స్వయం-సమృద్ధీ సాధ్యమవుతుంది.

వ్యవసాయ శాఖ, రాష్ట్ర వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి... మళ్లింపు, స్మగ్లింగ్, హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌తో పాటు యూరియా అధిక వినియోగాన్ని అరికట్టేందుకు సమర్థమైన చర్యలు చేపట్టేలా నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నారు. సబ్సిడీ యూరియా వినియోగంపై మెరుగైన నిఘా, అవగాహన కోసం అనేక రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టడంతో పాటు... వినూత్న విధానాల అమలును ప్రారంభించాయి.

ముందస్తు ప్రణాళిక, సమర్థ సరఫరా, సమన్వయంతో కూడిన చర్యల ద్వారా భారత వ్యవసాయ వృద్ధికి, ఆహార భద్రతకు కీలకమైన ఇన్‌పుట్‌గా ఉన్న యూరియాను ప్రతి రైతుకు సకాలంలో అందుబాటులో ఉంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

***


(रिलीज़ आईडी: 2186104) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Khasi , Urdu , हिन्दी , Nepali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam