ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: నయా రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ రజతోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
01 NOV 2025 7:31PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
దంతేశ్వరి దేవికి జై!
మహామాయా దేవికి జై!
బమ్లేశ్వరీ దేవికి జై!
ఛత్తీస్‌గఢ్ మహాతల్లికి జై!
గౌరవనీయులైన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ డేకా గారు, ప్రజాదరణ గల చైతన్యవంతమైన రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సీనియర్ సహచరులు జువల్ ఓరం గారు, దుర్గా దాస్ ఉయ్కే గారు, తోఖాన్ సాహు గారు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్ గారు.. ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో గారు, విజయ్ శర్మ జీ.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఛత్తీస్‌గఢ్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా…
జై జోహార్! ఛత్తీస్‌గఢ్‌లోని నా సోదరీసోదురులందిరకీ, పిల్లలకు, పెద్దలకు, తల్లులకు నమస్కరిస్తున్నాను!
సోదరీసోదరులరా,
ఈ రోజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలైంది. ఈ శుభ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నిర్వహించే రజతోత్సవంలో రాష్ట్ర ప్రజలతో కలిసి పాల్గొనటం అనేది నాకు గొప్ప విషయం. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న కాలాన్ని చూశాను. అప్పటి నుంచి ఈ రాష్ట్ర 25 ఏళ్ల ప్రయాణాన్ని కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే ఈ మహోన్నత క్షణంలో భాగం కావడం నాకు అద్భుతంగా అనిపిస్తోంది.
మిత్రులారా,
మనం 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాం. 25 సంవత్సరాల అధ్యాయం ముగిసింది. ఈ రోజు మనం తదుపరి 25 ఏళ్లు ఉదయించటాన్ని, ఒక కొత్త శకాన్ని చూస్తున్నాం. మీరంతా నా కోసం ఒక పని చేస్తారా? చెప్పండి.. చేస్తారా? చేస్తారు కదా!. దయచేసి మీ మొబైల్ ఫోన్‌లు తీసి ఫ్లాష్‌లైట్‌లు ఆన్ చేయండి. ఎందుకంటే తదుపరి 25 ఏళ్ల అరుణోదయం ప్రారంభమైంది! మీ చేతుల్లోని ప్రతి మొబైల్ ఫోన్‌కు ఫ్లాష్‌లైట్ ఆన్ చేయండి. నాకు అన్ని వైపులా కనిపిస్తుంది. కొత్త కలల సూర్యుడు మీ చేతుల్లో ఉదయిస్తున్నాడు. కొత్త సంకల్పాల కాంతిని మీ చేతుల్లో నేను చూడగలను. మీ కఠోర శ్రమతో ముడిపడి ఉన్న ఆ కాంతి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.
మిత్రులారా,
ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వాజ్‌పేయిా ప్రభుత్వం మీకు మీ కలల ఛత్తీస్‌గఢ్‌ను అప్పగించింది. అభివృద్ధిలో రాష్ట్రం కొత్త శిఖరాలను చేరుకోవాలని కూడా ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని నా సోదరీసోదరులంతా కలిసి అద్భుతమైన పురోగతిని సాధించారు. 25 ఏళ్ల క్రితం వేసిన ఆ విత్తనం ఇప్పుడు అభివృద్ధి అనే గొప్ప వృక్షంగా ఎదిగింది. ఛత్తీస్‌గఢ్ ఈ రోజు గొప్ప వేగంతో అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోంది. ఈ రోజు కూడా ఛత్తీస్‌గఢ్‌కు నవీన ప్రజాస్వామ్య దేవాలయమైన నూతన అసెంబ్లీ భవనం వచ్చింది. ఇక్కడికి రాకముందు గిరిజన మ్యూజియాన్ని కూడా ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఈ వేదిక నుంచే సుమారు రూ. 14,000 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వీటన్నింటికి సంబంధించి మీ అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
2000 సంవత్సరం నుంచి చూసుకుంటే ఒక తరం పూర్తిగా మారింది. ఈ రోజు ఇక్కడున్న యువతలో కొత్త తరం వారు ఉన్నారు. వీరు 2000 సంవత్సరానికి ముందు రోజులను చూడలేదు. ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పుడు గ్రామాలకు చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో అనేక గ్రామాల్లో రోడ్ల జాడ కూడా ఉండేది కాదు. కానీ ఈ రోజు రాష్ట్రంలోని గ్రామాలు 40,000 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానమయ్యాయి. గత పదకొండు ఏళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారులు భారీగా పెరిగాయి. కొత్త ఎక్స్‌ప్రెస్ రహదారులు ఇప్పుడు రాష్ట్రానికి గౌరవ చిహ్నాలుగా మారుతున్నాయి. గతంలో రాయ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్ వరకు ప్రయాణించడానికి చాలా గంటలు పట్టేది. ఇప్పుడు ఆ సమయం సగానికి తగ్గింది. ఇవాళ కూడా ఒక కొత్త నాలుగు వరుసల రహదారిని ప్రారంభించాను. ఈ రహదారి జార్ఖండ్‌తో ఛత్తీస్‌గఢ్ అనుసంధానతను మరింత మెరుగుపరుస్తుంది.
మిత్రులారా,
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రైలు, విమాన అనుసంధానత కూడా గణనీయంగా మెరుగుపడింది. ఈ రోజు రాష్ట్రంలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. రాయ్‌పూర్, బిలాస్‌పూర్, జగదల్‌పూర్ వంటి నగరాలు ఇప్పుడు ప్రత్యక్ష విమాన సేవలతో అనుసంధానమయ్యాయి. ఒకప్పుడు ఛత్తీస్‌గఢ్ కేవలం ముడిసరుకు ఎగుమతికి మాత్రమే ప్రసిద్ధి చెందింది. కానీ ఈ రోజు ఒక పారిశ్రామిక రాష్ట్రంగా మారుతోంది.
మిత్రులారా,
గత 25 సంవత్సరాలలో ఛత్తీస్‌గఢ్ సాధించిన విజయాల కోసం కృషి చేసిన ప్రతి ముఖ్యమంత్రిని, ప్రతి ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా సమస్యల సుడిగుండంలో ఛత్తీస్‌గఢ్‌ను ముందుండి నడిపించిన డాక్టర్ రమణ్ సింగ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజు ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా మార్గదర్శకత్వాన్ని కొనసాగించడం, విష్ణు దేవ్ సాయి గారి ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని గొప్ప వేగంతో ముందుకు తీసుకుపోవడం నాకు సంతోషంగా ఉంది.
మిత్రులారా,
మీకందరికీ నేను బాగా తెలుసు. ఈ రోజు కూడా నేను నా వాహనంలో వస్తున్నప్పుడు నాకు పరిచయం ఉన్న చాలా మంది కనిపించారు. దీనితో నా మనస్సు సంతృప్తితో నిండిపోయింది. బహుశా ఈ ప్రాంతంలో నేను వెళ్లని ఏ భాగం కూడా దాదాపుగా లేదనకుంటాను. అందుకే మీ అందరికీ నేను అంత బాగా తెలుసు.
మిత్రులారా,
నేను పేదరికాన్ని చాలా దగ్గరగా చూశాను. ఒక పేద వ్యక్తి ఆందోళనలు, నిస్సహాయత ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే దేశం నాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినప్పుడు.. నేను పేదల సంక్షేమాన్ని మా పనికి కేంద్ర బిందువుగా తీసుకున్నాను. పేదవారికి వైద్యం, జీవనోపాధి, విద్య, నీటిపారుదల అవసరాల కోసం మా ప్రభుత్వం పూర్తి దృష్టిని కేంద్రీకరించింది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను.
మిత్రులారా,
ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన ఛత్తీస్‌గఢ్‌లో ఒకే ఒక్క వైద్య కళాశాల ఉండేది. ఈ రోజు రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు ఉన్నాయి. మనకు రాయ్‌పూర్‌లో ఎయిమ్స్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమం సరైన విధంగా ఇక్కడే రాష్ట్రంలోనే ప్రారంభమైంది. అది నాకు ఇంకా గుర్తుంది. ఈ రోజు రాష్ట్రంలో 5,500 కంటే ఎక్కువ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు పనిచేస్తున్నాయి.
మిత్రులారా,
పేదవారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలని మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. మురికివాడలు, తాత్కాలిక గుడిసెల్లో పేదవారి జీవితం తరచుగా నిరాశ, నిస్సహాయతను తెచ్చిపెడుతుంది. అది పేదరికంపై పోరాడే వారి ధైర్యాన్ని దూరం చేస్తుంది. అందుకే మా ప్రభుత్వం ప్రతి పేదవారికి శాశ్వత గృహాన్ని అందించాలన్న ప్రతిజ్ఞ తీసుకుంది. గత పదకొండు ఏళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందాయి. ఇప్పుడు మేం మరో మూడు కోట్ల కొత్త ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు.. సరిగ్గా ఇవాళే ఛత్తీస్‌గఢ్‌లో 3.5 లక్షల కుటుంబాలు కొత్తగా గృహ ప్రవేశం చేస్తున్నాయి. సుమారు మూడు లక్షల కుటుంబాలకు రూ. 1,200 కోట్ల వాయిదా నిధులు కూడా అందాయి.
మిత్రులారా,
పేదలకు గృహాలను అందించేందుకు ఛత్తీస్‌గఢ్ భాజపా ప్రభుత్వం ఎంత తీవ్రంగా పనిచేస్తుందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది. కేవలం క్రితం ఒక్క ఏడాదిలోనే మన ఛత్తీస్‌గఢ్‌లో ఏడు లక్షల పక్కా ఇళ్లు నిర్మాణమయ్యాయి. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావు. ప్రతి ఇంటి వెనుక ఒక కుటుంబ కల, ఒక కుటుంబ ఆనందం దాగి ఉంది. ఇళ్లు పొందిన లబ్ధిదారుల కుటుంబాలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఛత్తీస్‌గఢ్ ప్రజల జీవితాన్ని సులభతరం చేసేందుకు, వారి దైనందిన జీవితంలోని కష్టాలను తగ్గించడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఉంది. ఒకప్పుడు విద్యుత్ అనేది కేవలం కలగా ఉండే ప్రాంతాలకు ఈ రోజు ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందింది. సాధారణ కుటుంబానికి వంటగ్యాస్ సిలిండర్, ఎల్‌పీజీ కనెక్షన్ అనేది ఒకప్పుడు అందని ద్రాక్షలా ఉండేది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటే.. వేరే వాళ్లు దూరం నుంచి చూసి ‘అది ఖచ్చితంగా ధనవంతుల ఇల్లు అయ్యి ఉంటుంది. మా ఇంటికి ఎప్పుడు వస్తుందో!’ అని అనుకునేవారు. నా వరకు పేదరికంతో పోరాడుతున్న ప్రతి కుటుంబం నా కుటుంబమే. అందుకే నేను ఉజ్వల గ్యాస్ సిలిండర్లు వారి ఇళ్లకు చేరేలా చూసుకున్నాను. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజన కుటుంబాల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పైపు ద్వారా నీరు, అందుబాటు ధరలో గ్యాస్ కూడా పైప్‌లైన్ల ద్వారా అందించాలన్నది మా తదుపరి లక్ష్యం. ఈ రోజు నాగ్‌పూర్–ఝార్సుగూడ గ్యాస్ పైప్‌లైన్‌ను దేశానికి అంకితం చేశాం. ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నేను ఛత్తీస్‌గఢ్ ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశ ‘విరాసత్’ (వారసత్వం), ‘వికాస్’కు (ప్రగతి) ఎంతో గొప్పగా దోహదపడిన గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఛత్తీస్‌గఢ్. మన గిరిజన సమాజాల కృషిని దేశంతో పాటు ప్రపంచం అంతటా గుర్తించేలా చేసేందుకు మేం నిరంతరంగా పని చేస్తున్నాం. గిరిజన స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన మ్యూజియంలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయటం, భగవాన్ బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా (గిరిజన గౌరవ దినోత్సవం)గా వంటి చర్యల ద్వారా గిరిజన సమాజం చేసిన కృషిని ఎప్పటికీ గౌరవించేలా మేం చర్యలు తీసుకున్నాం.
మిత్రులారా,
ఈ దిశగా ఈ రోజు మనం మరొక ముఖ్యమైన ముందడుగు వేశాం. దేశంలో ఇప్పుడు 'షహీద్ వీర్ నారాయణ్ సింగ్ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం' ఉంది. స్వాతంత్ర్యం రాకముందు 150 సంవత్సరాలకు పైగా గిరిజన సమాజం చేసిన పోరాటాలను ఈ మ్యూజియం దేశ ప్రజల ముందు పెడుతోంది. మన గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు దేశ స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడారో ఇది వివరంగా తెలిజేస్తోంది. ఈ మ్యూజియం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
ఒకవైపు మా ప్రభుత్వం గిరిజన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తోంది.. మరోవైపు, గిరిజన సమాజాల అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోంది. ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది గిరిజన గ్రామాలకు అభివృద్ధి అనే కొత్త వెలుగు వస్తోంది. ఇది సుమారు రూ. 80,000 కోట్ల విలువైన పథకం.. ఎనభై వేల కోట్లు! స్వతంత్ర భారత్‌లో గిరిజన ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో పని జరగడం ఇదే మొదటిసారి. అదేవిధంగా అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల అభివృద్ధి కోసం మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన జాతీయ పథకాన్ని రూపొందించాం. పీఎం- జన్మన్ కార్యక్రమం కింద ఈ వెనుకబడిన గిరిజనులకు చెందిన వేలాది తండాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
మిత్రులారా,
తరతరాలుగా గిరిజనలు సమాజాలు జీవనం కోసం అటవీ ఉత్పత్తులను సేకరిస్తున్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి వారికి మెరుగైన ఆదాయ అవకాశాలను కల్పించడానికి 'వన-ధన్ కేంద్రాలను' మా ప్రభుత్వమే ఏర్పాటుచేసింది. మేం టెండూ ఆకుల సేకరణకు సంబంధించిన వ్యవస్థను మెరుగుపరిచాం. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని టెండూ ఆకులను సేకరించేవారు గతంలో కంటే మెరుగైన ధరలను పొందుతున్నారు.
మిత్రులారా,
ఈ రోజు మన ఛత్తీస్‌గఢ్ నక్సల్-మావోయిస్ట్ తీవ్రవాదం అనే సంకెళ్ల నుంచి విముక్తి పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 50–55 సంవత్సరాలుగా నక్సలిజం కారణంగా మీరు బాధను అనుభవించారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని చూపించే వారు.. సామాజిక న్యాయం పేరుతో మొసలి కన్నీరు కార్చేవారు రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని దశాబ్దాలుగా అన్యాయానికి గురిచేశారు.
మిత్రులారా,
మావోయిస్ట్ తీవ్రవాదం కారణంగా ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలు చాలా కాలం పాటు రోడ్లను పొందలేకపోయాయి.. పిల్లలు బడికి వెళ్లలేకపోయారు.. అనారోగ్యంతో ఉన్న వారికి ఆసుపత్రులు అందుబాటులో లేకుండా పోయాయి.. ఆసుపత్రులు, పాఠశాలలు ఉన్న చోట్ల కూడా బాంబులు పేలాయి.. డాక్టర్లు, ఉపాధ్యాయులు హత్యకు గురయ్యారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన వారు ఏసీ గదుల్లో జీవితాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని మీ కర్మకు వదిలివేశారు.
మిత్రులారా,
ఈ హింసాచక్రంలో నాశనం అయ్యే విధంగా నా గిరిజన సోదరీసోదరులను మోదీ వదిలిపెట్టలేదు. పిల్లల కోసం కన్నీరు పెడుతున్న లక్షలాది తల్లులను, సోదరీమణులను నేను వదిలిపెట్టలేను. అందుకే 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేం భారతదేశాన్ని వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి చేయాలన్న సంకల్పం తీసుకున్నాం. ఈ రోజు దేశం దాని ఫలితాలను చూస్తోంది. పదకొండు సంవత్సరాల క్రితం దేశంలో సుమారు 125 జిల్లాలు మావోయిస్ట్ ఉగ్రవాదంలో చిక్కుకొని ఉన్నాయి. ఈ రోజు ఆ 125 జిల్లాల్లో కేవలం మూడు జిల్లాలు మాత్రమే ఈ జాబితాలో మిగిలిపోయాయి. అక్కడ మావోయిస్ట్ కార్యకలాపాలు ఇంకా ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మన ఛత్తీస్‌గఢ్.. మన భారతదేశం.. ఈ దేశంలోని ప్రతి మూల కూడా మావోయిస్టు తీవ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని నేను దేశానికి హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
ఛత్తీస్‌గఢ్‌లో ఒకప్పుడు హింస మార్గాన్ని ఎంచుకున్న వారు ఇప్పుడు ఉత్సాహంగా ఆయుధాలను పక్కన పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కాంకేర్‌లో 20 మందికి పైగా నక్సలైట్లు తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అంతకుముందు అక్టోబర్ 17న బస్తర్‌లో 200 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారు. గత కొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా మావోయిస్ట్ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న డజన్ల కొద్దీ మంది ఆయుధాలను వదిలేశారు. వీరిలో చాలా మందిపై ఒకప్పుడు లక్షలు, కోట్లలో కూడా నజరానాలు ఉండేవి. ఇప్పుడు వారు తుపాకులు, హింసను విడిచిపెట్టి రాజ్యాంగాన్ని స్వీకరించారు.
మిత్రులారా,
మావోయిస్ట్ తీవ్రవాదం అంతమవటం వలన ఒకప్పుడు అసాధ్యంగా అనిపించినది ఇప్పుడు వాస్తవంగా మారింది. ఒకప్పుడు బాంబులు, తుపాకుల భయంతో వణికిన ప్రాంతాలు పూర్తిగా పరివర్తన చెందాయి. బీజాపూర్లోని చిల్కపల్లి గ్రామానికి ఏడు దశాబ్దాల్లో మొట్టమొదటిసారిగా విద్యుత్ సౌకర్యం వచ్చింది. అబుజ్‌మాద్‌లోని రేకావాయా గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పాఠశాల నిర్మాణం మొదలైంది. ఒకప్పుడు ఉగ్రవాద ప్రాబల్య గ్రామంగా ఉన్న పూవర్తి.. ఈ రోజు అభివృద్ధి వేడుకను చేసుకుంటోంది. గతంలో ఎక్కడైతే ఎర్రజెండా ఎగిరేదో ఈ రోజు అక్కడ మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది. ఇప్పుడు బస్తర్ వంటి ప్రాంతాలలో భయం లేదు.. పండుగ వాతావరణం నెలకొంది. బస్తర్ పండుమ్, బస్తర్ ఒలింపిక్స్ వంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
మిత్రులారా,
ఒక్కసారి ఆలోచించండి! నక్సలిజం అనే సమస్య ఉన్నప్పటికీ మనం 25 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి సాధించగలిగామంటే.. ఈ సమస్యను పూర్తిగా తొలగించిన తర్వాత మన అభివృద్ధి ఎంత వేగంగా ముందుకు సాగుతుందో ఊహించండి.
మిత్రులారా,
రాబోయే సంవత్సరాలు ఛత్తీస్‌గఢ్‌కు చాలా ముఖ్యమైనవి. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) తయారుచేయాలంటే ఛత్తీస్‌గఢ్ కూడా అభివృద్ధి చెందడం అవసరం. రాష్ట్ర యువతకు నేను చెప్పేదేమిటంటే.. ఈ సమయం, ఈ శకం మీదే. మీరు సాధించలేని లక్ష్యం ఏదీ లేదు. నేను మీకు హామీ ఇస్తున్నాను.. ఇది మోదీ గ్యారంటీ. మీరు వేసే ప్రతి అడుగులో.. మీరు తీసుకునే ప్రతి సంకల్పంలో మోదీ మీతోనే ఉంటాడు. మనందరం కలిసి ఛత్తీస్‌గఢ్‌ను ముందుకు తీసుకెళ్దాం.. దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ నమ్మకంతో.. మరోసారి ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి సోదరుడికి, సోదరికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో మీ రెండు చేతులు పైకెత్తి నాతో పాటు ఇలా చెప్పండి- భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! ధన్యవాదాలు!
***
(Release ID: 2185573)
Visitor Counter : 7