|
ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో 'శాంతిశిఖర్'- ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవంలో బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
· “రాష్ట్రాల ప్రగతి దేశ పురోగమనాన్ని వేగిరం చేస్తుందన్న మార్గదర్శక సూత్రం ప్రాతిపదికగా వికసిత భారత్ లక్ష్య సాధనకు మేం చురుగ్గా కృషి చేస్తున్నాం” · “ప్రపంచ శాంతి భావన భారతీయ ప్రాథమిక తాత్త్విక దృక్పథంలో అంతర్భాగం” · “మనం ప్రతి జీవిలో దైవత్వాన్ని… ఆత్మలో అనంతాన్ని దర్శించగల వాళ్లం · “మన దేశంలో ప్రతి ఆధ్యాత్మిక క్రతువు ప్రపంచ సంక్షేమం.. సకల జీవరాశి మధ్య సద్భావనను అభిలషిస్తూ సంకల్ప సహిత ప్రార్థనతో ముగుస్తుంది” · “ప్రపంచంలో ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి సంక్షోభం లేదా విపత్తు సంభవించినా తొలుత స్పందించి చేయూతనిచ్చే విశ్వసనీయ భాగస్వామి భారత్”
Posted On:
01 NOV 2025 12:40PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో ఆధునిక ఆధ్యాత్మిక జ్ఞాన, శాంతి-ధ్యాన కేంద్రం “శాంతిశిఖర్”ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్రహ్మకుమారీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 25 సంవత్సరాలు పూర్తయినందున ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ఇదే రోజున తమ 25వ అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాయని గుర్తుచేశారు. అంతేకాకుండా ఇదే రోజున ఆవిర్భవించిన దేశంలోని పలు రాష్ట్రాలు వేడుకలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్రాల ప్రగతి దేశ పురోగమనాన్ని వేగిరం చేస్తుందన్న మార్గదర్శక సూత్రం ప్రాతిపదికగా వికసిత భారత్ లక్ష్య సాధనకు మేం చురుగ్గా కృషి చేస్తున్నాం” అని ప్రధానమంత్రి స్పష్టీకరించారు.
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందడంలో ‘బ్రహ్మకుమారీ’ల వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇటువంటి సంస్థతో దశాబ్దాల అనుబంధం తనకు దక్కిన అదృష్టమని అభివర్ణించారు. ఈ ఆధ్యాత్మిక ఉద్యమం వటవృక్షంలా విస్తరించడం తాను చూస్తూనే వచ్చానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లో 2011నాటి ‘ఫ్యూచర్ ఆఫ్ పవర్’ కార్యక్రమాన్ని, 2012లో ఆ సంస్థ 75వ వార్షికోత్సవాన్ని, 2013లో ప్రయాగ్‌రాజ్ కార్యక్రమాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఢిల్లీకి వచ్చాక కూడా- “స్వాతంత్ర్య అమృత మహోత్సవం లేదా స్వచ్ఛ భారత్ లేదా జల్ జన్ అభియాన్” వంటి కార్యక్రమాలతో ముడిపడే సందర్భాల్లో వారితో సంభాషించినప్పుడల్లా వారి కృషిని, అంకితభావాన్ని సదా గమనిస్తూ వచ్చానన్నారు.
బ్రహ్మకుమారీ సంస్థతో తన సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దాదీ జానకి ప్రేమానురాగాలను, రాజయోగిని దాదీ హృదయ మోహిని మార్గదర్శకత్వాన్ని తన జీవితంలో విలువైన జ్ఞాపకాలుగా పదిలం చేసుకున్నానని తెలిపారు. ‘శాంతి శిఖర్- అకాడమీ ఫర్ ఎ పీస్‌ఫుల్ వరల్డ్’ రూపంలో వారి ఆలోచనలు సాకారం కావడాన్ని తానిప్పుడు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రపంచ శాంతి దిశగా అర్థవంతమైన కృషికి ఈ సంస్థ ఒక కూడలి కాగలదని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇటువంటి ప్రశంసనీయ కార్యక్రమానికి హాజరైన వారందరితోపాటు దేశవిదేశాల్లోని బ్రహ్మకుమారీ సంస్థ కుటుంబ సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఒక సంప్రదాయ నానుడిని ఉటంకిస్తూ- ధర్మం, త్యాగం, జ్ఞానం సహిత అత్యున్నత రూపమే ‘సచ్ఛీలం’ అని శ్రీ మోదీ వివరించారు. నైతిక వర్తనతో సాధించలేనిదంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. వాక్కును ఆచరణలోకి తెచ్చినపుడే వాస్తవ పరివర్తన సాధ్యమని, బ్రహ్మకుమారీ సంస్థ ఆధ్యాత్మిక శక్తికి మూలం ఇదేనని ఆయన విశదీకరించారు. ఈ సంస్థలో ప్రతి సోదరి, కఠిన తపస్సుతో కూడిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో, విశ్వంలో శాంతి స్థాపన కోసం ప్రార్థనతో ఈ సంస్థ గుర్తింపు ముడిపడి ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బ్రహ్మకుమారీ సంస్థ తొలి ప్రార్థన మంత్రం “ఓం శాంతి” అని ఆయన గుర్తుచేశారు. ‘ఓం’ అన్నది సృష్టికర్త బ్రహ్మను, యావత్ విశ్వాన్ని సూచిస్తే… మానవాళికి శాంతిపై ఆకాంక్షకు ‘శాంతి’ అనే పదం ప్రతీక అని తెలిపారు. అందుకే, బ్రహ్మకుమారీల ఆలోచన దృక్పథం ప్రతి వ్యక్తి అంతర చైతన్యంపై లోతైన ప్రభావం చూపుతుందన్నారు.
“ప్రపంచ శాంతి భావన భారతీయ ప్రాథమిక తాత్త్విక దృక్పథంలో అంతర్భాగం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మనది ప్రతి జీవిలో దైవత్వాన్ని, ఆత్మలో అనంతాన్ని దర్శించగల దేశమని పేర్కొన్నారు. మన దేశంలో ప్రతి ఆధ్యాత్మిక క్రతువు ప్రపంచ సంక్షేమం, సకల జీవరాశి మధ్య సద్భావనను అభిలషిస్తూ సంకల్ప సహిత ప్రార్థనతో ముగుస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. అటువంటి ఉదాత్త దృక్పథం, విశ్వాసంతోపాటు ప్రపంచ సంక్షేమ స్ఫూర్తి సహిత సమ్మేళనం భారతీయ నాగరికత లక్షణాల్లో అంతర్లీనంగా ఉంటుందని ఆయన వివరించారు. భారతీయ ఆధ్యాత్మికత శాంతి పాఠం బోధించడమేగాక అడుగడుగునా శాంతిమార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. స్వీయ నిగ్రహమే స్వీయ జ్ఞానానికి బాటలు వేసి, ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తుందని, తద్వారా అంతర్గత శాంతికి తోడ్పడుతుందని ఆయన విశదీకరించారు. ఈ మార్గాన్ని అనుసరించేదలిచే ‘శాంతి శిఖర్’ అకాడమీలోని శిక్షణార్థులు విశ్వ శాంతికి ఉపకరణాలు కాగలరని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచ శాంతి దిశగా కార్యాచరణలో మన కృషితోపాటు ఆలోచనలు, ఆచరణాత్మక విధానాలకూ అంతే ప్రాధాన్యం ఉంటుందని శ్రీ మోదీ స్పష్టీకరించారు. ఈ దిశగా తనవంతు కర్తవ్య నిర్వహణకు భారత్ హృదయపూర్వకంగా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. “ప్రపంచంలో ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి సంక్షోభం లేదా విపత్తు సంభవించినా తొలుత స్పందించి చేయూతనిచ్చే విశ్వసనీయ భాగస్వామి భారత్” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
నేటి పర్యావరణ సవాళ్ల నడుమ ప్రపంచమంతటా ప్రకృతి పరిరక్షణలో భారత్ ముందు వరుసలో ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రకృతి మనకు ప్రసాదించిన సంపదను సంరక్షించడం మాత్రమేగాక సుసంపన్నం చేయాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేశారు. ప్రకృతితో మమేకమై జీవించగలిగితేనే ఇది సాధ్యమవుతుందని, మన ఇతిహాసాలు, సృష్టికర్త మనకీ తత్త్వాన్ని ప్రబోధించారని శ్రీ మోదీ అన్నారు. నదులను తల్లులుగా, నీటిని దైవంగా మనం భావిస్తామని, వృక్షాల్లో దేవుని ఉనికిని గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రకృతిని, అది మనకిచ్చిన వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ఉన్నది తీసుకోవడంతో సరిపెట్టకుండా తిరిగి ఇవ్వాల్సిన కర్తవ్యాన్ని గుర్తించి, ఆ స్ఫూర్తితో జీవించే విధానమే ప్రపంచ సురక్షిత భవితకు విశ్వసనీయ మార్గం చూపగలదని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తుపై తన బాధ్యతలేమిటో భారత్ అర్థం చేసుకోవడమే కాకుండా, వాటిని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు “ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్” సహా “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” వంటి దార్శనిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. ఈ ఆలోచన దృక్పథంతో ప్రపంచం నేడు మమేకం అవుతున్నదని పేర్కొన్నారు. తదనుగుణంగా భారత్ తన భౌగోళిక, రాజకీయ సరిహద్దులను అధిగమిస్తూ, యావత్ మానవాళి సంక్షేమం కోసం ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
సమాజంలో నిరంతర చైతన్యం కొనసాగించడంలో బ్రహ్మకుమారీ వంటి సంస్థలకు కీలక పాత్ర ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ‘శాంతి శిఖర్’ వంటి సంస్థలు భారత్ కృషిలో నవ్యోత్తేజం నింపుతాయని చెప్పారు. ఈ సంస్థ నుంచి ఆవిర్భవించే శక్తి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజానీకాన్ని విశ్వశాంతి భావనతో జోడిస్తుందనంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. చివరగా “శాంతి శిఖర్ - అకాడమీ ఫర్ ఎ పీస్‌ఫుల్ వరల్డ్” ఏర్పాటుపై ప్రతి ఒక్కరికీ మరోసారి అభినందనులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రామెన్ డేకా, ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
***
(Release ID: 2185523)
|