ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌ పర్యటన ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 01 NOV 2025 9:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్ లో తన పర్యటన ముఖ్యాంశాలను పంచుకున్నారు.

నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో తన రోడ్‌షో సందర్భంగా ప్రజలు చూపిన ఆప్యాయత, ఉత్సాహానికి ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టుల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇలా పేర్కొన్నారు:

 "ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో జరిగిన రోడ్ షోలో నా కుటుంబ సభ్యులు ఆప్యాయత, ఉత్సాహంతో పాటు వారి సాంస్కృతిక సంప్రదాయాలతో నన్ను స్వాగతించిన తీరు అద్భుతం." 

 

నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభ నూతన భవనాన్ని ప్రారంభించే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ పంచుకున్నారు. హరిత భవనం భావనతో నిర్మించిన ఈ కొత్త భవన సముదాయం సౌరశక్తితో పని చేయడమే కాకుండా వర్షపు నీటినీ సంరక్షిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు:

"'అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గఢ్' దిశగా రాష్ట్ర ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడానికి నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర నూతన శాసనసభ భవనాన్ని ప్రారంభించే అదృష్టం నాకు లభించింది. హరిత భవనం భావనతో నిర్మించిన ఈ భవనం సౌరశక్తిని ఇంధనంగా ఉపయోగిస్తూ... వర్షపు నీటినీ సంరక్షిస్తుంది." 

 

నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ఇలా వ్యాఖ్యానించారు:

"ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు లభించింది. నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లోని ఈ విగ్రహం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ సమయంలో, 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా నేనూ మొక్కలు నాటాను."

  

నయా రాయ్‌పూర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో పిల్లలతో సంభాషణ చాలా ప్రత్యేకమైనదని, తన హృదయాన్ని ఉప్పొంగేలా చేసిందని ప్రధానమంత్రి పంచుకున్నారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను విజయవంతంగా అధిగమించిన పిల్లలను కలిసే అవకాశం తనకు లభించిందన్నారు. వారి ఉత్సాహం, సానుకూలత తనలో కొత్త శక్తిని నింపాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో ఆయన ఇలా పేర్కొన్నారు:

"ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో ఈరోజు పిల్లలతో జరిగిన సంభాషణ చాలా ప్రత్యేకమైనది, నా హృదయాన్ని కదిలించింది. శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో గుండె జబ్బులను అధిగమించిన ధైర్యవంతులైన పిల్లలతో మాట్లాడే భాగ్యం నాకు లభించింది. ఉత్సాహం, సానుకూల ధోరణి నిండిన వారి మాటలు నాలో నూతన శక్తిని నింపాయి."

 

నూతన శాసనసభ భవనం ప్రారంభోత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం పట్ల శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. వారి ఆనందం ఛత్తీస్‌గఢ్ అవతరణ దినోత్సవ 25వ వార్షికోత్సవ వైభవాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఈ సందర్భంలో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఛత్తీస్‌గఢ్ నూతన శాసనసభ భవన ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన నా కుటుంబ సభ్యుల ఆనందం రాష్ట్ర అవతరణ దినోత్సవ 25వ వార్షికోత్సవ వైభవాన్ని మరింత పెంచింది."

 

నయా రాయ్‌పూర్ అటల్ నగర్‌లో బ్రహ్మ కుమారీస్ ధ్యాన కేంద్రం 'శాంతి శిఖర్' ప్రారంభోత్సవం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. “ఈ కేంద్రం గొప్పతనం ఆధునికత, ఆధ్యాత్మికతలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుంది. ధ్యానం, స్వీయ-సాక్షాత్కారం, ప్రపంచ శాంతికి ఇది ఒక ముఖ్య కేంద్రంగా ఆవిర్భవిస్తుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో శ్రీ మోదీ ఇలా అన్నారు:

“నయా రాయపూర్ అటల్ నగర్‌లో బ్రహ్మకుమారి ధ్యాన కేంద్రం 'శాంతి శిఖర్' ప్రారంభించే భాగ్యం నాకు లభించింది. ఈ కేంద్రం గొప్పతనం దాని ఆధునిక, ఆధ్యాత్మిక స్వభావంలో ప్రతిబింబిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ఉద్యమం మర్రి చెట్టులా విస్తరించడాన్ని మనం చూశాం. ఈ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్యాత్మిక సాధన, స్వీయ-సాక్షాత్కారం, ప్రపంచ శాంతికి ప్రధాన కేంద్రంగా మారుతుందని నాకు నమ్మకం ఉంది.”

 

***


(Release ID: 2185511) Visitor Counter : 7