ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబైలో జరిగిన మారిటైమ్ లీడర్స్ కాంక్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
29 OCT 2025 6:57PM by PIB Hyderabad
మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు సర్బానంద సోనోవాల్ జీ, శంతను ఠాకూర్ జీ, కీర్తి వర్ధన్ సింగ్ జీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే జీ, అజిత్ పవార్ జీ, షిప్పింగ్, ఇతర పరిశ్రమల నాయకులు, ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు,
మిత్రులారా,
గ్లోబల్ మారిటైమ్ లీడర్స్ కాంక్లేవ్‌కు మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. 2016లో ముంబైలో ప్రారంభమైన ఈ శిఖరాగ్ర సమావేశం ఇవాళ ప్రపంచవ్యాప్త కార్యక్రమంగా మారటం మనందరికీ గర్వకారణం. ఈ సమావేశంలో 85కి పైగా దేశాలు పాల్గొనటంతో శక్తిమంతమైన సందేశం వెళ్తుంది. షిప్పింగ్ దిగ్గజాల సీఈఓల నుంచి స్టార్టప్‌ల వరకు, విధాన రూపకర్తల నుంచి పెట్టుబడిదారుల వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడున్నారు. చిన్న ద్వీప దేశాల ప్రతినిధులూ హాజరయ్యారు. మీ అందరి దార్శనికత ఈ శిఖరాగ్ర సమావేశ సహకారాన్ని, శక్తిని పెంచింది.
మిత్రులారా,
షిప్పింగ్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ రంగంలో లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత సముద్ర వాణిజ్య సామర్థ్యంపై ప్రపంచానికున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమానికి మీరు హాజరవటంతో ఈ దార్శనికత పట్ల మనందరి ఉమ్మడి ప్రాధాన్యత స్పష్టమవుతుంది.
మిత్రులారా,
21వ శతాబ్దంలో భారత సముద్ర రవాణా రంగం అత్యంత వేగంతో, శక్తితో ముందుకు సాగుతోంది. దేశ సముద్ర వాణిజ్య పరిశ్రమకు 2025వ సంవత్సరం కీలకమైనది. ఈ ఏడాది సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. విజింజం పోర్టు వద్ద ఏర్పాటు చేసిన భారత మొదటి డీప్ వాటర్ అంతర్జాతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక ఇటీవలే అక్కడికి చేరుకోవటం ప్రతి భారతీయుడు గర్వపడే విషయం. భారతదేశంలోని ప్రధాన ఓడరేవులు 2024-25లో అత్యధిక సరకు రవాణా ద్వారా కొత్త రికార్డును నెలకొల్పాయి. మొదటిసారిగా మెగావాట్ స్థాయి దేశీయ గ్రీన్ హైడ్రోజన్ కేంద్రాన్ని ప్రారంభించి, కాండ్లా పోర్టు ఘనతను సాధించింది. జెఎన్‌పీటీ (జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్) లో మరో ప్రధాన అభివృద్ధి జరిగింది. భారత్-ముంబై కంటైనర్ టెర్మినల్ ఫేజ్-2 ప్రారంభంతో టెర్మినల్ నిర్వహణ సామర్థ్యం రెట్టింపై, భారత్‌లోనే అతిపెద్ద కంటైనర్ పోర్టుగా మారింది. భారతదేశ పోర్టు మౌలిక సదుపాయాల్లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ ద్వారా ఇది సాధ్యమైంది. ఇందుకోసం సింగపూర్ భాగస్వాములకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ ఏడాది నావికా రంగంలో భవిష్యత్ తరం సంస్కరణల దిశగా భారత్ చర్యలు తీసుకుంది. శతాబ్దానికి పైబడిన వలస పాలన నాటి షిప్పింగ్ చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో ఆధునికమైన, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 21వ శతాబ్దపు చట్టాలను తీసుకువచ్చాం. ఈ కొత్త చట్టాలు రాష్ట్ర నావికా బోర్డులకు అధికారమిస్తాయి. భద్రత, సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తాయి. ఓడరేవుల నిర్వహణ డిజిటలైజేషన్‌ను విస్తరిస్తాయి.
మిత్రులారా,
మర్చంట్ షిప్పింగ్ యాక్ట్ ద్వారా, భారత సముద్ర చట్టాలను అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చాం. దీని ద్వారా భద్రత హామీ బలోపేతమైంది. వ్యాపారం సులభతరం అవటంతో పాటు, ప్రభుత్వ జోక్యం తగ్గింది. మేము చేసే ఈ ప్రయత్నాలు పెట్టుబడిదారులు, వాటాదారులందరి విశ్వాసాన్ని మరింత పెంచుతాయని నమ్ముతున్నాం.
మిత్రులారా,
వాణిజ్యాన్ని సులభతరం చేయటానికి, సజావుగా సాగటానికి కోస్టల్ షిప్పింగ్ యాక్ట్‌ను రూపొందించారు. ఇది సరఫరా వ్యవస్థ భద్రతను పెంచుతుంది. దేశ తీర ప్రాంతమంతటా ఒకేలా అభివృద్ధి జరిగేలా చూస్తుంది. ఒకే దేశం - ఒకే పోర్ట్ విధానం ఓడరేవులకు సంబంధించిన ప్రక్రియలను ఒకే తీరుగా మారుస్తుంది. దస్త్రాల పనిని తగ్గిస్తుంది.
మిత్రులారా,
షిప్పింగ్ రంగంలోని ఈ సంస్కరణలు, మేము దశాబ్దాలుగా చేస్తున్న సంస్కరణలకు కొనసాగింపు. గత పది, పదకొండేళ్లుగా పరిశీలిస్తే, భారత సముద్ర రంగంలో జరిగిన పరివర్తన చారిత్రకమైనది. మారిటైమ్ ఇండియా విజన్ ద్వారా 150కి పైగా నూతన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వీటి ఫలితంగా, ప్రధాన పోర్టుల సామర్థ్యం రెట్టింపైంది. నౌకల రాకపోకల సమయం గణనీయంగా తగ్గింది. క్రూయిజ్ పర్యాటకం నూతనోత్తేజాన్ని సంతరించుకుంది. అంతర్గత జలమార్గాల్లో సరుకు రవాణా 700 శాతానికి పైగా పెరిగింది. కార్యకలాపాలు సాగించే జలమార్గాల సంఖ్య 3 నుంచి 32కి పెరిగింది. కేవలం పదేళ్లలో మన పోర్టుల నికర వార్షిక మిగులు తొమ్మిది రెట్లు పెరిగింది.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో అత్యంత సమర్థవంతమైన పోర్టులుగా భారతదేశ ఓడరేవులను పరిగణిస్తున్నారు. అనేక అంశాల్లో అభివృద్ధి చెందిన పోర్టుల కంటే మెరుగైన పనితీరుని కనబరచటం మనకు గర్వకారణం. కొన్ని గణాంకాలను నేను మీతో పంచుకుంటాను. భారత్‌లో కంటైనర్ వేచి ఉండే సగటు సమయం మూడు రోజుల కంటే తగ్గింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇది మెరుగైనది. ఓడ తిరిగి వెళ్లే సగటు సమయం 96 గంటల నుంచి కేవలం 48 గంటలకు తగ్గింది. ఈ మెరుగుదల కారణంగా ప్రపంచ షిప్పింగ్ సంస్థలకు భారత పోర్టులు పోటీగా, ఆకర్షణీయంగా మారాయి. ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచికలోనూ భారతదేశం మెరుగైన అభివృద్ధిని కనబరిచింది.
మిత్రులారా,
షిప్పింగ్ రంగంలో మానవ వనరుల విషయంలోనూ ప్రపంచ స్థాయిలో భారత్ తనదైన ముద్ర వేస్తోంది. దశాబ్ద కాలంలో భారతీయ నావికుల సంఖ్య 1.25 లక్షల నుంచి 3 లక్షలకు పైగా పెరిగింది. మీరు ప్రపంచంలో ఏ తీర ప్రాంతానికి వెళ్లినా నౌకల్లో భారతీయ నావికులు కనిపిస్తారు. నావికుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న మూడు దేశాల్లో భారత్ ఒకటి.
మిత్రులారా,
21వ శతాబ్దంలో ఇప్పటికే పావు భాగం గడిచిపోయింది. రాబోయే 25 సంవత్సరాలు మరింత కీలకం. ఈ నేపథ్యంలో బ్లూ ఎకానమీ, సుస్థిర తీరప్రాంత అభివృద్ధిపై మేం దృష్టి సారిస్తున్నాం. గ్రీన్ లాజిస్టిక్స్, పోర్టుల అనుసంధానం, తీర ప్రాంత పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
భారత అగ్ర ప్రాధాన్యతల్లో నౌకా నిర్మాణ రంగం కూడా ఉంది. ఒకప్పుడు ప్రపంచంలోని ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రాల్లో ఒకటిగా భారత్ ఉండేది. అజంతా గుహల్లో ఆరో శతాబ్దానికి చెందిన ఒక చిత్ర లేఖనంలో మూడు తెరచాపలున్న ఓడ నమూనా ఉంది. ఆరో శతాబ్దపు కళాఖండంలో ఇంత ఆధునికమైన నౌకా నమూనా ఉండటం ఆశ్చర్యకరం. అలాంటి నమూనా గల నౌకలను ఇతర దేశాలు చాలా శతాబ్దాల తర్వాత ఉపయోగించాయి. మనకి, వాళ్లకి చాలా సంవత్సరాల అంతరం ఉంది.
మిత్రులారా,
భారత్‌లో నిర్మించిన నౌకలు ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించాయి. తర్వాతి కాలంలో నౌకను విచ్ఛిన్నం చేసే రంగంలోనూ మనం పురోగతి సాధించాం. నౌకా నిర్మాణంలో మళ్లీ కొత్త శిఖరాలను చేరుకోవటానికి భారత్ ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. పెద్ద నౌకలను మౌలిక సదుపాయాల ఆస్తులుగా భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానం వల్ల ఇక్కడున్న నౌకా నిర్మాణ సంస్థలకు కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. వడ్డీ భారం తగ్గి, రుణ లభ్యత మెరుగుపడుతుంది.
మిత్రులారా,
ఈ సంస్కరణ వేగం పెంచేందుకు ప్రభుత్వం సుమారు రూ.70,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనితో దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యం పెరుగుతుంది. దీర్ఘకాల ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త షిప్ యార్డుల ఏర్పాటుతో పాటు, పాత వాటి అభివృద్ధి జరుగుతుంది. ఇది ఆధునిక సముద్రయాన నైపుణ్యాల పెంపుదలకు, యువతకు లక్షలాది ఉద్యోగావకాశాలను అందిస్తుంది. కొత్త పెట్టుబడి అవకాశాలను కల్పిస్తుంది.
మిత్రులారా,
ఇది ఛత్రపతి శివాజీ మహరాజ్ నడయాడిన నేల. ఛత్రపతి శివాజీ మహరాజ్.. సముద్ర భద్రతకు పునాది వేయటమే కాక, అరేబియా సముద్రంలోని వాణిజ్య మార్గాల్లో భారత శక్తిని చూపించారు. సముద్రాలు సరిహద్దులు మాత్రమే కాదని, అవకాశాలకు ద్వారాలని ఆయన దూరదృష్టి ద్వారా నేర్చుకున్నాం. అదే స్ఫూర్తి, దార్శనికతతో ఇవాళ భారత్ ముందుకు సాగుతోంది.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ స్థితిస్థాపకతను బలోపేతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచస్థాయి మెగా పోర్టులను మేం అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో భాగంగా, మహారాష్ట్రలోని వధావన్‌లో రూ.76,000 కోట్ల రూపాయల విలువైన నూతన పోర్టు నిర్మాణం జరుగుతుంది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచటానికి మేం కృషి చేస్తున్నాం. కంటైనర్లలో సరుకు రవాణాకు సంబంధించి భారత్ వాటాను పెంచాలని భావిస్తున్నాం. ఈ లక్ష్యాల సాధనలో మీరే మా కీలక భాగస్వాములు. మీ ఆలోచనలు, ఆవిష్కరణలు, పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. భారతదేశ పోర్టులు, షిప్పింగ్ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నాం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు వేగంగా పెరుగుతున్నాయి. "మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్" దార్శనికతతో వివిధ రకాల ప్రోత్సాహకాలను మేము అందిస్తున్నాం. పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నాం. భారత షిప్పింగ్ రంగ విస్తరణలో భాగమయ్యేందుకు, వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు ఇదే సరైన సమయం.
మిత్రులారా,
చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం, విశ్వసనీయత భారతదేశానికున్న బలాలు. ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు దారిచూపే లైట్ హౌస్ కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది. భారత్‌కున్న శక్తితో ఆ లైట్ హౌస్ పాత్రను పోషించగలదు. ప్రపంచ ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాలు, సరఫరా వ్యవస్థలో మార్పులున్నప్పటికీ, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, శాంతి, సమ్మిళిత వృద్ధికి చిహ్నంగా భారత్ నిలుస్తుంది. సముద్రయానం, వాణిజ్య కార్యక్రమాలు విజన్‌లో భాగమే. దీనికి ఒక మంచి ఉదాహరణగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పవచ్చు. ఇది ప్రపంచ వాణిజ్య మార్గాలను పునర్నిర్వచించటమే కాక క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ లాజిస్టిక్స్‌ను ప్రోత్సహిస్తుంది.
మిత్రులారా,
సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధికి అందరినీ కలుపుకుని పోవటంపై మేం దృష్టి సారిస్తున్నాం. సాంకేతికత, శిక్షణ, మౌలిక సదుపాయాల ద్వారా అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలు, పేద దేశాలు బలంగా మారినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వాతావరణ మార్పులు, సరఫరా వ్యవస్థలో అంతరాయం, ఆర్థిక అనిశ్చితి, సముద్ర భద్రత వంటి సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాలి.
మిత్రులారా,
శాంతి, అభివృద్ధితో మనమంతా ముందుకు సాగుతూ.. ప్రపంచం కోసం ఒక స్థిరమైన భవిష్యత్తును నిర్మిద్దాం. ఈ సదస్సులో భాగమైనందుకు మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
***
(रिलीज़ आईडी: 2184719)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam