ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబరు 31న న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆర్యన్ శిఖరాగ్ర సమావేశం-2025.. పాల్గొననున్న ప్రధానమంత్రి
సమాజ సేవలో ఆర్య సమాజ్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్నీ,
మహర్షి దయానంద్ సరస్వతి జీ 200వ జయంతినీ స్మరించుకొనేందుకు నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి ఉత్సవంలో
ఈ శిఖరాగ్ర సమావేశం ఓ భాగం
శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకోనున్న దేశ విదేశాల ఆర్య సమాజ్ శాఖల ప్రతినిధులు
Posted On:
29 OCT 2025 10:57AM by PIB Hyderabad
న్యూఢిల్లీలో అక్టోబరు 31న నిర్వహించనున్న అంతర్జాతీయ ఆర్యన్ శిఖరాగ్ర సమావేశం-2025 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల 45 నిమిషాలకు పాల్గొంటారు. సమాజ సేవలో ఆర్య సమాజ్ 150 సంవత్సరాలను పూర్తి చేసుకోవడాన్నీ, మహర్షి దయానంద్ సరస్వతి జీ 200వ జయంతినీ స్మరించుకొనేందుకు నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి ఉత్సవంలో ఈ శిఖరాగ్ర సమావేశానిది కీలక పాత్ర. ఈ కార్యక్రమంలో ఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
శిఖరాగ్ర సమావేశం దేశ, విదేశాల్లోని ఆర్య సమాజ్ శాఖల ప్రతినిధులను ఒక చోటకు చేరుస్తోంది. ఈ సమావేశం మహర్షి దయానంద్ సంస్కరణ ప్రధాన ఆదర్శాలకు విశ్వవ్యాప్త ఉపయుక్తత ఉందని చాటడంతో పాటు, ఆర్య సమాజ్ సేవల్ని ప్రపంచం నలుమూలలకూ వ్యాప్తి చేయాలన్న భావనను ప్రతిబింబిస్తుంది. ‘‘సేవ చేయడంలో 150 సువర్ణ సంవత్సరాలు’’ పేరిట ఒక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విద్యకూ, సామాజిక సంస్కరణలకూ, ఆధ్యాత్మిక ఉన్నతికీ పాటుపడుతూ ఆర్య సమాజ్ ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్న పరివర్తన ప్రధాన ప్రస్థానాన్ని ఈ ప్రదర్శనలో చాటిచెబుతారు.
మహర్షి దయానంద్ సరస్వతి సంస్కరణలను, విద్యా రంగ సంబంధ ప్రస్థానాన్ని గౌరవించుకోడం, విద్య, సామాజిక సంస్కరణలతో పాటు దేశ నిర్మాణంలోనూ ఆర్య సమాజ్ అందిస్తున్న సేవలకు 150 సంవత్సరాలు పూర్తి కావడాన్ని గుర్తుకు తీసుకురావడంతొ పాటు 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అనుగుణంగా వైదిక సిద్ధాంతాలు, స్వదేశీ విలువలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహనను పెంచడం ఈ శిఖరాగ్ర సమావేశం ఉద్దేశాలు.
***
(Release ID: 2183735)
Visitor Counter : 9
Read this release in:
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam