ప్రధాన మంత్రి కార్యాలయం
2025 వ సంవత్సరం అక్టోబర్ 26 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 127 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
26 OCT 2025 11:40AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోకి మీకు స్వాగతం. దేశం మొత్తం ప్రస్తుతం పండుగల ఆనందంలో ఉంది. కొన్ని రోజుల క్రితం మనమందరం దీపావళిని జరుపుకున్నాం. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు ఛత్ పూజతో తీరిక లేకుండా ఉన్నారు. ఇళ్లలో తేకువా ఆహారపదార్థాన్ని తయారు చేస్తున్నారు. ప్రతిచోటా నదీ తీరాలను, ఘాట్లను అలంకరిస్తున్నారు. మార్కెట్లు కార్యకలాపాలతో సందడిగా ఉన్నాయి. ప్రతిచోటా భక్తి, బంధాలు, సంప్రదాయాల సంగమం కనిపిస్తోంది. ఛత్ ఉపవాసం ఉండే మహిళలు అంకితభావంతో, నిష్టతో ఈ పండుగకు సిద్ధమయ్యేవిధానం నిజంగా స్ఫూర్తిదాయకం.
మిత్రులారా! మహాపర్వదినం ఛత్ సంస్కృతి, ప్రకృతి, సమాజాల మధ్య ప్రగాఢ ఐక్యతకు ప్రతిబింబం. ఛత్ పర్వదినం సందర్భంగా ఘాట్‌లపై సమాజంలోని ప్రతి వర్గం కలిసి నిలుస్తుంది. ఈ దృశ్యం భారతదేశ సామాజిక ఐక్యతకు అత్యంత సుందరమైన ఉదాహరణ. మీరు దేశంలో కానీ లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీకు అవకాశం లభిస్తే ఛత్ పర్వదిన వేడుకల్లో పాల్గొనండి. ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని మీరే స్వయంగా అనుభవించండి. ఛఠీ మాతకు నేను నమస్కరిస్తున్నాను. ఛత్ పర్వదిన వేడుకల శుభసందర్భంగా నా దేశస్థులందరికీ- ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, పూర్వాంచల్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! పండుగల సందర్భంగా నేను మీ అందరితో ఒక లేఖలో నా భావాలను పంచుకున్నాను. దేశం సాధించిన విజయాలు పండుగలను గతంలో కంటే మరింత ఉత్సాహంగా మార్చాయి. వాటి గురించి నేను నా లేఖలో ప్రస్తావించాను. నా లేఖకు ప్రతిస్పందనగా దేశంలోని చాలా మంది ప్రజలు నాకు తమ సందేశాలను పంపారు. వాస్తవానికి 'ఆపరేషన్ సిందూర్' ప్రతి భారతీయుడిని గర్వంతో నింపింది. ఒకప్పుడు మావోయిస్టు ఉగ్రవాదం చీకటిలో మగ్గిపోయిన ప్రాంతాలలో కూడా ఈసారి ఆనంద దీపాలు వెలిగాయి. తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన మావోయిస్టు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
జిఎస్‌టి పొదుపు పండుగ విషయంలో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి పండుగల సమయంలో గమనించిన మరో ఆహ్లాదకరమైన విషయం మార్కెట్లలో స్వదేశీ వస్తువుల కొనుగోలులో గణనీయమైన పెరుగుదల. తాము ఈసారి ఏ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేశారో ప్రజలు నాకు పంపిన సందేశాలలో తెలియజేశారు.
మిత్రులారా! వంట నూనెను 10 శాతం తగ్గించాలని కూడా నా లేఖలో కోరాను. ప్రజలు దీనికి కూడా చాలా సానుకూలంగా స్పందించారు.
మిత్రులారా! పరిశుభ్రత, పారిశుధ్య ప్రయత్నాల గురించి నాకు అనేక సందేశాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల నుండి స్ఫూర్తిదాయకమైన గాథలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడంపై ఒక ప్రత్యేకమైన చొరవ ప్రారంభమైంది. అంబికాపూర్‌లో గార్బేజ్ కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చే వారికి కడుపునిండా పూర్తి భోజనం అందించే కేఫ్ ఇది. ఒక కిలో ప్లాస్టిక్ తీసుకువచ్చే వారికి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం అందిస్తారు. అర కిలోగ్రాము తీసుకువచ్చే వారికి అల్పాహారం ఇస్తారు. ఈ కేఫ్‌ను అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
మిత్రులారా! ఇలాంటి ఘనతనే బెంగళూరులో ఇంజనీర్ కపిల్ శర్మ సాధించారు. బెంగళూరును సరస్సుల నగరం అని పిలుస్తారు. కపిల్ ఇక్కడి సరస్సులను పునరుద్ధరించడానికి ఒక చొరవను ప్రారంభించారు. కపిల్ బృందం బెంగళూరు నగరంలోనూ పరిసర ప్రాంతాలలోనూ 40 బావులు, ఆరు సరస్సులను పునరుద్ధరించింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కార్పొరేట్‌లను, స్థానిక ప్రజలను కపిల్ తన మిషన్‌లో చేర్చుకున్నారు. ఆయన సంస్థ చెట్ల పెంపకం ప్రచారాలలో కూడా పాల్గొంటుంది. మిత్రులారా! అంబికాపూర్, బెంగళూరులోని ఈ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు సంకల్పం దృఢంగా ఉంటే పరివర్తన అనివార్యమని నిరూపిస్తున్నాయి.
మిత్రులారా! పరివర్తన కోసం చేసిన ప్రయత్నానికి సంబంధించిన మరో ఉదాహరణను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పర్వతాలు, మైదానాలలోని మట్టితో కూడుకుని ఉన్న అడవులు ఉన్నట్టుగానే సముద్ర తీరంలో మడ అడవులు కూడా ఉంటాయని మీ అందరికీ తెలుసు. మడ అడవులు ఉప్పునీటి సముద్రపు నీరు, చిత్తడి నేలలలో పెరుగుతాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఇవి కీలకమైన భాగం. సునామీ లేదా తుఫాను వంటి విపత్తు సమయాల్లో ఈ మడ అడవులు చాలా సహాయకారిగా ఉంటాయని నిరూపితమైంది.
మిత్రులారా! మడ అడవుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గుజరాత్ అటవీ శాఖ ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఐదు సంవత్సరాల కిందట అహ్మదాబాద్ సమీపంలోని ధోలేరాలో అటవీ శాఖ బృందాలు మడ అడవులను నాటడం ప్రారంభించాయి. నేడు ధోలేరా తీరం వెంబడి మూడున్నర వేల హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవుల ప్రభావం ఈ ప్రాంతం అంతటా కనిపిస్తుంది. అక్కడి పర్యావరణ వ్యవస్థలో డాల్ఫిన్ల సంఖ్య పెరిగింది. పీతలు, ఇతర జలచరాలు కూడా పెరిగాయి. అంతే కాదు- వలస పక్షులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఇది పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, ధోలేరా చేపల పెంపకందారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది.
మిత్రులారా! ధోలేరాతో పాటు గుజరాత్‌లోని కచ్‌లో కూడా మడ అడవుల పెంపకం పూర్తి స్థాయిలో జరుగుతోంది. అక్కడి కోరి క్రీక్‌లో 'మడ అడవుల అధ్యయన కేంద్రం' కూడా ప్రారంభమైంది.
మిత్రులారా! మొక్కలు, చెట్ల ప్రత్యేక లక్షణమిదే. ఏ ప్రాంతంలో అయినా అవి సమస్త జీవుల శ్రేయస్సుకు దోహదం చేస్తాయి. అందుకే మన గ్రంథాలలో ఇలా పేర్కొన్నారు.–
ధన్యా మహీరుహా యేభ్యో,
నిరాశాం యాంతి నార్థినః ||
అంటే ఎవరినీ ఎప్పుడూ నిరాశపరచని వృక్షాలు, మొక్కలు ధన్యజీవులు. మనం ఏ ప్రాంతంలో నివశించినా అక్కడ మనం చెట్లను నాటాలి. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మనం చర్చించే అంశాల విషయంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చేది ఏమిటో మీకు తెలుసా? ‘మన్ కీ బాత్’లో మనం చర్చించే అంశాలు సమాజానికి ఏదైనా ఉత్తమమైన, వినూత్నమైన పని చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తాయని నేను చెప్తాను. ఈ కార్యక్రమం మన సంస్కృతికి, మన దేశానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తుంది.
మిత్రులారా! నేను ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాల కిందట భారతీయ జాతి శునకాల గురించి చర్చించానని మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మన దేశస్థులతో పాటు మన భద్రతా దళాలు కూడా భారతీయ జాతి కుక్కలను దత్తత తీసుకోవాలని కోరాను. ఎందుకంటే అవి మన పర్యావరణానికి, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ఈ దిశలో మన భద్రతా సంస్థలు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశాయని మీకు తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను. బి.ఎస్.ఎఫ్., సి.ఆర్.పి.ఎఫ్. తమ బృందాలలో భారతీయ జాతి శునకాల సంఖ్యను పెంచాయి. కుక్కల శిక్షణ కోసం బి.ఎస్.ఎఫ్. జాతీయ శిక్షణా కేంద్రం గ్వాలియర్‌లోని టెకాన్‌పూర్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ హౌండ్స్, కర్ణాటక,మహారాష్ట్రలోని ముధోల్ హౌండ్స్ జాతి శునకాలకు ఇక్కడ ప్రత్యేక దృష్టితో శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రంలో శిక్షకులు సాంకేతికత, ఆవిష్కరణల సహాయంతో కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. భారతీయ జాతి కుక్కల శిక్షణ మాన్యువల్‌లను వాటి ప్రత్యేక బలాలను ప్రస్తావిస్తూ తిరిగి రూపొందించారు. మొంగ్రెల్స్, ముధోల్ హౌండ్, కొంబాయి, పాండికోన వంటి భారతీయ జాతి శునకాలకు బెంగళూరులోని సి.ఆర్.పి.ఎఫ్. డాగ్ బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ ఇస్తున్నారు.
మిత్రులారా! గత ఏడాది అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లక్నోలో జరిగింది. ఆ సమయంలో రియా అనే కుక్క ప్రజల దృష్టిని ఆకర్షించింది. బీఎస్ఎఫ్ ద్వారా శిక్షణ పొందిన ముధోల్ హౌండ్ జాతి శునకమది. రియా ఆ పోలీస్ డ్యూటీ మీట్ లో అనేక విదేశీ జాతుల శునకాలను ఓడించి, మొదటి బహుమతిని గెలుచుకుంది.
మిత్రులారా! బి.ఎస్.ఎఫ్. ఇప్పుడు తన దళాల్లోని కుక్కలకు విదేశీ పేర్లకు బదులుగా భారతీయ పేర్లను ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించింది. మన స్వదేశీ కుక్కలు కూడా అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించాయి. గత సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అక్కడి సి.ఆర్.పి.ఎఫ్ దళానికి చెందిన శునకం 8 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను కనుగొంది. ఈ దిశలో బి.ఎస్.ఎఫ్., సి.ఆర్.పి.ఎఫ్. బలగాలు చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను. నేను అక్టోబర్ 31వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆరోజు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతి. గుజరాత్ ఏక్తా నగర్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఐక్యతా దినోత్సవ పెరేడ్ కూడా అక్కడ జరుగుతుంది. భారతీయ శునకాల సామర్థ్య ప్రదర్శన మరోసారి ఈ కవాతులో నిర్వహిస్తారు. మీరు కూడా దీన్ని చూసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా! సర్దార్ పటేల్ 150వ జయంతి మొత్తం దేశానికి చాలా ప్రత్యేకమైన సందర్భం. సర్దార్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు. ఆయన గొప్ప వ్యక్తిత్వంలో అనేక లక్షణాలు సమ్మిళితమై ఉన్నాయి. ఆయన చదువుకునే రోజుల్లో చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి. భారతదేశం, బ్రిటన్ రెండింటిలోనూ ఆయన తన చదువులో రాణించారు. ఆయన తన కాలంలో అత్యంత విజయవంతమైన న్యాయవాదులలో ఒకరు. ఆయన న్యాయవాద వృత్తిలో మరింత గుర్తింపు పొందగలిగేవారు. కానీ గాంధీజీ ప్రేరణతో స్వాతంత్ర్య ఉద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. ఖేడా సత్యాగ్రహం నుండి బోర్సద్ సత్యాగ్రహం వరకు అనేక ఉద్యమాల్లో ఆయన చేసిన కృషి నేటికీ గుర్తు చేసుకుంటాం. అహ్మదాబాద్ మునిసిపాలిటీ అధిపతిగా ఆయన పదవీకాలం కూడా చారిత్రాత్మకం. ఆయన పరిశుభ్రతకు, సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఆయన చేసిన సేవలకు మనం ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాం.
మిత్రులారా! సర్దార్ పటేల్ భారతదేశ అధికార వ్యవస్థకు బలమైన పునాది వేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన అద్వితీయ కృషి చేశారు. సర్దార్ సాహెబ్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీలో మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. అది కూడా ఒంటరిగా కాకుండా, అందరితో కలిసిసాగండి. ఒక విధంగా ఇది యువత అవగాహనకు అవకాశంగా మారాలి. రన్ ఫర్ యూనిటీ ఐక్యతను బలోపేతం చేస్తుంది. భారతదేశాన్ని ఏకం చేసిన ఆ గొప్ప వ్యక్తికి ఇదే మన నిజమైన నివాళి.
నా ప్రియమైన దేశప్రజలారా! టీతో నాకున్న సంబంధం మీ అందరికీ తెలుసు. కానీ “ఈరోజు 'మన్ కీ బాత్'లో కాఫీ గురించి ఎందుకు చర్చించకూడదు?” అని నేను అనుకున్నాను. గత సంవత్సరం 'మన్ కీ బాత్'లో అరకు కాఫీ గురించి చర్చించామని మీకు గుర్తుండవచ్చు. కొంతకాలం కిందట ఒడిషా నుండి చాలా మంది కోరాపుట్ కాఫీపై తమ భావాలను నాతో పంచుకున్నారు. 'మన్ కీ బాత్'లో కోరాపుట్ కాఫీ గురించి చర్చించాలని వారు నాకు రాసిన లేఖలో కోరారు.
మిత్రులారా! కోరాపుట్ కాఫీ రుచి అద్భుతంగా ఉంటుందని నాతో చెప్పారు. అంతే కాదు- కాఫీ సాగు కూడా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోంది. కోరాపుట్‌లో కొంతమంది తమ అభిరుచితో కాఫీని పండిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో వారికి మంచి ఉద్యోగాలు ఉండేవి. కానీ వారు కాఫీని ఎంతగానో ఇష్టపడి ఈ రంగంలోకి ప్రవేశించారు. ఇప్పుడు అందులో విజయవంతంగా పనిచేస్తున్నారు. కాఫీ ద్వారా జీవితాలు మారిపోయిన చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. కాఫీ వారికి గౌరవాన్ని, సమృద్ధిని - రెండింటినీ తెచ్చిపెట్టింది. కోరాపుట్ కాఫీ గురించి ఇలా చెప్తారు.:
కోరాపుట్ కాఫీ అత్యంత సుస్వాదు|
ఎహా ఒడిశార్ గౌరవ్|
(ఇంగ్లీష్ అనువాదం):
కోరాపుట్ కాఫీ ఈజ్ ట్రూలీ డిలిక్టెబుల్|
దిస్ ఇండీడ్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఒడిషా|
(తెలుగు అనువాదం):
కోరాపుట్ కాఫీ నిజంగా రుచికరం!
ఇది ఒడిషాకే గర్వకారణం!
మిత్రులారా! భారతీయ కాఫీ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. కర్ణాటకలోని చిక్‌మగళూరు, కూర్గ్, హసన్ అయినా; తమిళనాడులోని పులని, షెవరాయ్, నీలగిరి, అన్నామలై ప్రాంతాలు అయినా; కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని బిలిగిరి ప్రాంతం అయినా; లేదా కేరళలోని వయనాడ్, ట్రావెన్‌కోర్, మలబార్ ప్రాంతాలు అయినా - భారతదేశ కాఫీ వైవిధ్యం అద్భుతమైంది. మన ఈశాన్య ప్రాంతాలు కూడా కాఫీ సాగులో పురోగతి సాధిస్తున్నాయని నాకు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ కాఫీ గుర్తింపు మరింత దృఢంగా మారుతోంది. అందుకే కాఫీ ప్రియులు ఇలా అంటారు:
ఇండియాస్ కాఫీ ఈజ్ కాఫీ ఎట్ ఇట్స్ ఫైనెస్ట్
ఇట్ ఈజ్ బ్రూవ్డ్ ఇన్ ఇండియా అండ్ లవ్డ్ బై ద వరల్డ్
నా ప్రియమైన దేశప్రజలారా! ఇప్పుడు 'మన్ కీ బాత్'లో మనందరి హృదయాలకు చాలా దగ్గరగా ఉన్న ఒక అంశంపై మాట్లాడుకుందాం. ఈ అంశం మన జాతీయ గేయం. భారతదేశ జాతీయ గేయం 'వందే మాతరం' మొదటి పదం సైతం మన హృదయాలలో భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తుంది. ‘వందేమాతరం’ - ఈ ఒక్క పదంలో చాలా భావోద్వేగాలు, శక్తులు మిళితమై ఉంటాయి. ఈ గేయం సహజంగానే భరతమాత వాత్సల్యాన్ని మనం అనుభూతి చెందేలా చేస్తుంది. ఆమె పిల్లలుగా మన బాధ్యతలను కూడా మనకు గుర్తు చేస్తుంది. క్లిష్ట సమయాల్లో ‘వందేమాతరం’ జపించడం 140 కోట్ల మంది భారతీయులను ఐక్యతా శక్తితో నింపుతుంది.
మిత్రులారా! దేశభక్తి, భరతమాత పట్ల ప్రేమ మాటలకు అతీతమైన ఒక భావన అయితే, ‘వందేమాతరం’ ఆ అవ్యక్త భావనకు నిర్దిష్ట స్వరాన్ని ఇచ్చే పాట. శతాబ్దాల బానిసత్వంతో శిథిలమైన భారతదేశానికి కొత్త జీవితాన్ని, కొత్త ఊపిరిని అందించేందుకు బంకిం చంద్ర ఛటర్జీ దీన్ని స్వరపరిచారు. వందేమాతర గేయాన్ని 19వ శతాబ్దంలో రాసి ఉండవచ్చు. కానీ దాని ఆత్మ భారతదేశానికి చెందిన వేల సంవత్సరాల ప్రాచీన, అమర చైతన్యంతో ముడిపడి ఉంది. “మాతా భూమి: పుత్రో అహం పృథ్వీయ:” అంటే “భూమి తల్లి, నేను ఆమె బిడ్డను” అని చెప్పడం ద్వారా వేదాలు భారతీయ నాగరికతకు పునాది వేశాయి. బంకిం చంద్రజీ మాతృభూమికి, ఆమె పిల్లలకు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని భావోద్వేగాల ప్రపంచంలో 'వందేమాతరం' రాయడం ద్వారా ఒక మంత్రం రూపంలో బంధించారు.
మిత్రులారా! నేను అకస్మాత్తుగా వందేమాతరం గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నానో అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మరికొన్ని రోజుల్లో- నవంబర్ 7వ తేదీన మనం 'వందేమాతరం' 150వ సంవత్సర వేడుకల్లోకి ప్రవేశించబోతున్నాం. వందేమాతర గేయాన్ని 150 సంవత్సరాల కిందట కూర్చారు. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మొదటిసారిగా 1896లో పాడారు.
మిత్రులారా! కోట్లాది మంది దేశస్థులు ఎల్లప్పుడూ 'వందేమాతరం' పాడటంలో అపారమైన దేశభక్తి ప్రవాహాన్ని అనుభవించారు. మన తరాలు 'వందేమాతరం' పదాలలో భారతదేశ శక్తివంతమైన, అద్భుతమైన దృష్టిని చూశాయి.
సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం,
సస్యశ్యామలాం, మాతరం!
వందేమాతరం!
అటువంటి భారతదేశాన్ని మనం నిర్మించాలి. ఈ ప్రయత్నాలలో 'వందేమాతరం' ఎల్లప్పుడూ మనకు ప్రేరణగా ఉంటుంది. అందువల్ల 'వందేమాతరం' 150వ సంవత్సరాన్ని మనం చిరస్మరణీయంగా మార్చుకోవాలి. రాబోయే తరాల కోసం ఈ విలువల ప్రవాహాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. రాబోయే కాలంలో 'వందేమాతరం' గేయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. 'వందేమాతరం' గేయాన్ని పాడేందుకు మనమందరం దేశస్థులం స్వీయ ప్రేరణతో ప్రయత్నాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీ సూచనలను #వందేమాతరం150 అనే హ్యాష్ ట్యాగ్ తో నాకు పంపండి. #వందేమాతరం150. మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఈ సందర్భాన్ని చారిత్రాత్మకంగా మార్చడానికి మనమందరం కృషి చేద్దాం.
నా ప్రియమైన దేశవాసులారా! సంస్కృతం అనే పేరు వినగానే మన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, ప్రాచీన జ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం మన మనస్సులోకి వస్తాయి. కానీ ఒకప్పుడు వీటన్నిటితో పాటు సంస్కృతం కూడా సంభాషణ భాష. ఆ యుగంలో అధ్యయనాలు, పరిశోధనలు సంస్కృతంలో జరిగాయి. సంస్కృతంలో నాటకాలను కూడా ప్రదర్శించారు. కానీ దురదృష్టవశాత్తు బానిసత్వ కాలంలో, స్వాతంత్ర్యం తర్వాత కూడా సంస్కృతాన్ని నిరంతరం నిర్లక్ష్యం చేశారు. దీని కారణంగా యువ తరాలలో సంస్కృతం పట్ల ఆకర్షణ తగ్గడం ప్రారంభమైంది. కానీ, మిత్రులారా! ఇప్పుడు కాలం మారుతోంది. సంస్కృతం విషయంలో కూడా కాలం మారుతోంది. సంస్కృతి, సామాజిక మాధ్యమాల ప్రపంచం సంస్కృతానికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. ఈ రోజుల్లో చాలా మంది యువకులు సంస్కృతానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన పనులను చేస్తున్నారు. మీరు సామాజిక మాధ్యమాలు చూస్తే చాలా మంది యువకులు సంస్కృతంలో మాట్లాడడం, సంస్కృతం గురించి వివరించడం మీరు అనేక రీళ్లలో చూస్తారు. చాలా మంది తమ సామాజిక మాధ్యమ ఛానళ్ల ద్వారా సంస్కృతాన్ని కూడా బోధిస్తున్నారు. అలాంటి యువ కంటెంట్ సృష్టికర్తలలో ఒకరు యష్ సాలుండ్కే. యష్ ప్రత్యేక ప్రతిభ ఏమిటంటే ఆయన కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, క్రికెటర్ కూడా. సంస్కృతంలో మాట్లాడుతూ క్రికెట్ ఆడే ఆయన రీల్‌కు మంచి ఆదరణ లభించింది. దీన్ని వినండి:
(యష్ సంస్కృత వ్యాఖ్యానం ఆడియో బైట్)
మిత్రులారా! ఈ ఇద్దరు సోదరీమణులు కమల, జాహ్నవిల కృషి కూడా అద్భుతం. వారు ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, సంగీతంపై కంటెంట్ తయారు చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో యువకుడికి ‘సంస్కృత ఛాత్రోహం’ అనే ఛానెల్ ఉంది. ఈ ఛానెల్‌ను నిర్వహిస్తున్న యువకులు సంస్కృతం గురించి సమాచారాన్ని పంచుకోవడమే కాకుండా సంస్కృతంలో హాస్యభరితమైన వీడియోలను కూడా రూపొందిస్తారు. సంస్కృతంలోని ఈ వీడియోలను కూడా యువకులు ఆస్వాదిస్తారు. మీలో చాలా మంది సమష్టి రూపొందించిన వీడియోలను కూడా చూసి ఉండవచ్చు. సమష్టి తన పాటలను సంస్కృతంలో వివిధ మార్గాల్లో ప్రదర్శిస్తారు. మరొక యువకుడు భావేష్ భీమనాథని. భావేష్ సంస్కృత శ్లోకాలు, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం, సిద్ధాంతాలను చర్చిస్తారు.
మిత్రులారా! ఏ భాష అయినా నాగరికత విలువలు, సంప్రదాయాలతో కూడుకుని ఉంటుంది. వేల సంవత్సరాలుగా సంస్కృతం ఈ విధిని నెరవేర్చింది. కొంతమంది యువకులు ఇప్పుడు సంస్కృతం విషయంలో తమ విధిని నిర్వర్తిస్తున్నారని చూడటం సంతోషంగా ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా! నేను ఇప్పుడు మిమ్మల్ని గతకాలపు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాను. 20వ శతాబ్ద ప్రారంభాన్ని ఊహించుకోండి! అప్పుడు స్వాతంత్ర్యం వస్తుందనే ఆశ కనుచూపు మేరలో లేదు. బ్రిటిష్ వారు భారతదేశం అంతటా దోపిడీకి సంబంధించిన అన్ని పరిమితులనూ దాటారు. హైదరాబాద్ లోని దేశభక్తులైన ప్రజలకు అణచివేత కాలం మరింత భయంకరం. క్రూరమైన, నిర్దయుడైన నిజాం దురాగతాలను కూడా వారు భరించవలసి వచ్చింది. పేదలు, అణగారిన వర్గాలు, ఆదివాసీ వర్గాలపై దౌర్జన్యాలకు పరిమితి లేదు. వారి భూములను లాక్కున్నారు. భారీ పన్నులు కూడా విధించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారి చేతులను కూడా నరికివేశారు.
మిత్రులారా! అలాంటి క్లిష్ట సమయాల్లో ఇరవై ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ రోజు నేను ఆ యువకుడి గురించి చర్చించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ యువకుడి పేరు వెల్లడించే ముందు అతని ధైర్యం గురించి నేను మీకు చెబుతాను. మిత్రులారా! నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం కూడా నేరంగా పరిగణించే ఆ రోజుల్లో ఆ యువకుడు సిద్ధిఖీ అనే నిజాం అధికారిని బహిరంగంగా సవాలు చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి సిద్ధిఖీని నిజాం పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని చంపాడు. అతను అరెస్టు నుండి కూడా తప్పించుకోగలిగాడు. నిజాం ప్రభుత్వ పోలీసుల నుండి తప్పించుకుని ఆ యువకుడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాంకు చేరుకున్నాడు.
మిత్రులారా! నేను మాట్లాడుతున్న గొప్ప వ్యక్తి పేరు కొమురం భీమ్. ఆయన జన్మదినోత్సవం అక్టోబర్ 22న జరుపుకున్నాం. కొమురం భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ తన జీవితకాలంలో అసంఖ్యాక ప్రజల హృదయాలపై- ముఖ్యంగా ఆదివాసీ సమాజంపై చెరగని ముద్ర వేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో ఆయన కొత్త శక్తిని నింపారు. వ్యూహాత్మక నైపుణ్యాలకు కూడా ప్రఖ్యాతి చెందారు. నిజాం ప్రభుత్వానికి సవాలు విసిరారు. 1940లో ఆయనను నిజాం మనుషులు హత్య చేశారు. ఆయన గురించి వీలైనంత ఎక్కువ తెలుసుకోవాలని నేను యువతను కోరుతున్నాను.
కొమురం భీమ్ కు
నా వినమ్ర నివాళి.
ఆయన ప్రజల హృదయాల్లో...
ఎప్పటికీ నిలిచి ఉంటారు.
(ఆంగ్ల అనువాదం):
మై హంబుల్ ట్రిబ్యూట్స్ టు కొమురం భీమ్ జీ
హి రిమైన్స్ ఫర్ ఎవర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్
మిత్రులారా! వచ్చే నెల 15వ తేదీన మనం 'ఆదివాసీ గౌరవ దినోత్సవం' జరుపుకుంటాం. ఇది భగవాన్ బిర్సా ముండా గారి జయంతి శుభ సందర్భం. భగవాన్ బిర్సా ముండా గారికి నేను శ్రద్ధాపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. దేశ స్వాతంత్ర్యం కోసం, ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆయన చేసిన కృషి సాటిలేనిది. జార్ఖండ్‌లోని భగవాన్ బిర్సా ముండా గారి గ్రామం ఉలిహాతును సందర్శించే అవకాశం నాకు లభించింది. అక్కడి మట్టిని నా నుదిటిపై పూసుకుని నా నివాళులర్పించాను. భగవాన్ బిర్సా ముండాగారిలాగా, కొమురం భీమ్ గారి లాగా మన ఆదివాసీ సమాజాల నుండి ఇంకా చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారి గురించి చదవవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' కోసం మీ నుండి నాకు అనేక సందేశాలు వస్తున్నాయి. చాలా మంది ఈ సందేశాలలో తమ చుట్టూ ఉన్న ప్రతిభావంతులైన వ్యక్తుల గురించి చర్చిస్తారు. మన చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలలో కూడా వినూత్న ఆలోచనలు అమలు అవుతున్నాయని చదివి నేను సంతోషిస్తున్నాను. సేవా స్ఫూర్తితో సమాజాన్ని మార్చడంలో నిమగ్నమైన వ్యక్తులు లేదా సమూహాల గురించి మీకు తెలిస్తే, దయచేసి నాకు తెలియజేయండి. ఎప్పటిలాగే మీ సందేశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. వచ్చే నెలలో మరికొన్ని కొత్త అంశాలతో ‘మన్ కీ బాత్’ మరో ఎపిసోడ్ లో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీకు వీడ్కోలు పలుకుతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
***
(Release ID: 2182601)
Visitor Counter : 10
Read this release in:
Punjabi
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam