ప్రధాన మంత్రి కార్యాలయం
రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఇవాళ్టి నియామకాలు కేవలం ప్రభుత్వోద్యోగాలు మాత్రమే కాదు..
దేశ నిర్మాణానికి సహకరించేందుకు దొరికిన అవకాశాలు: పీఎం
యువత విజయమే, దేశాభివృద్ధి: పీఎం
రోజ్ గార్ మేళాల ద్వారా 11 లక్షలకు పైగా నియామక పత్రాలను అందించిన ప్రభుత్వం: పీఎం
దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో నమోదైన అమ్మకాలు, జీఎస్టీ పొదుపు ఉత్సవం కారణంగా
డిమాండ్, ఉత్పత్తి, ఉపాధి కల్పనలో ఉత్తేజం: పీఎం
యూపీఎస్సీ ప్రతిభావంతుల కృషి వృథా కాకుండా ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా తిరిగి దేశ నిర్మాణానికి వినియోగం: పీఎం
అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రయాణానికి యువ కర్మయోగుల నాయకత్వం: పీఎం
Posted On:
24 OCT 2025 12:27PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రోజ్ గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీపాల పండగ దీపావళి ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ప్రధానమంత్రి అన్నారు. పండగ సంబరాల సందర్భంగా శాశ్వత ఉద్యోగ నియామక పత్రాలను అందుకోవటం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఒకవైపు పండగ సంతోషం, మరోవైపు ఉపాధి విజయం రెండూ లభించాయి. దేశవ్యాప్తంగా ఇవాళ 51,000 వేల మందికి పైగా యువత సంతోషంగా ఉండటం వల్ల వారి కుటుంబాలు ఆనందంతో వెలిగిపోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందుకున్న వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వారి జీవితాల్లో నూతన ప్రారంభానికి శుభాకాంక్షలు చెప్పారు.
కొత్తగా నియామక పత్రాలను పొందిన యువతలో ఉత్సాహం, కష్టపడేతత్వం, కలలు నెరవేరటంతో కలిగిన ఆత్మవిశ్వాసానికి దేశానికి సేవ చేయాలనే తపన తోడైనప్పుడు కలిగే విజయం కేవలం వ్యక్తిగత విజయంగా కాక, దేశాభివృద్ధిగా మారుతుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇవాళ జరుగుతున్న నియామకాలు కేవలం ప్రభుత్వోద్యోగాలు కాదు.. దేశ నిర్మాణంలో సహకరించటానికి లభించిన అవకాశాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నూతనంగా నియమితులైన వారు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేయాలని.. భవిష్యత్తులో భారత్ కోసం మెరుగైన వ్యవస్థలను రూపొందించటంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 'నాగరిక దేవో భవ' అనే మంత్రాన్ని గుర్తుపెట్టుకుని సేవాభావం, అంకితభావంతో పనిచేయాలని కొత్తగా నియామక పత్రాలను అందుకున్న వారికి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
"అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించాలనే సంకల్పంతో 11 ఏళ్లుగా దేశం ముందుకు సాగుతుండగా, ఈ ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషిస్తోంది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. యువ సాధికారతే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. యువ భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చటంలో శక్తిమంతమైన వేదికలుగా రోజ్ గార్ మేళాలు మారినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ మేళాల ద్వారా 11 లక్షలకు పైగా నియామక పత్రాలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ ప్రయత్నాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాదనీ, 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 'పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన'ను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తున్నాయని, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి వేదికల ద్వారా నూతన అవకాశాల గురించి తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని యువత తెలుసుకున్నారని వెల్లడించారు.
యువత కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమం 'ప్రతిభా సేతు పోర్టల్'ను ప్రధానమంత్రి ప్రకటించారు. యూపీఎస్సీ తుది పరీక్షల వరకు చేరుకుని, ఎంపిక కాని అభ్యర్థులకు ఈ పోర్టల్ అవకాశాలను అందిస్తుంది. దీనివల్ల వారి కృషి వృథాగా పోదని ఆయన అన్నారు. ఈ పోర్టల్ ద్వారా ప్రతిభావంతులతో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తాయన్నారు. ఈ విధంగా యువ ప్రతిభను వినియోగించుకుని భారత యువ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
జీఎస్టీ పొదుపు ఉత్సవంతో పండగ వాతావరణం మరింతగా ఉత్సాహంగా మారిందని, దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించటం ఒక కీలకమైన సంస్కరణగా శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సంస్కరణల ప్రభావం కేవలం వినియోగదారుల పొదుపునకు మాత్రమే పరిమితం కాలేదని, భవిష్యత్ తరం జీఎస్టీ సంస్కరణలు... ఉద్యోగావకాశాలను పెంచుతున్నాయని చెప్పారు. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. గిరాకీ పెరిగితే ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్లో వేగం పుంజుకుంటుంది. ఉత్పత్తి పెరగటం నూతన ఉద్యోగావకాలను సృష్టిస్తుంది. కాబట్టి జీఎస్టీ పొదుపు ఉత్సవ్ ఉపాధి పండుగగా మారుతుంది. ధన త్రయోదశి, దీపావళి సమయంలో అమ్మకాలు రికార్డుల్ని బద్దలుకొట్టాయని ప్రధానమంత్రి వెల్లడించారు. పాత రికార్డులు అధిగమించి, కొత్త రికార్డులు నెలకొల్పటంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవటాన్ని జీఎస్టీ సంస్కరణలు నిరూపించాయని ఆయన వివరించారు. ఎంఎస్ఎంఈలు, రిటైల్ వ్యాపారంపై ఈ సంస్కరణల సానుకూల ప్రభావం పడిందని.. తయారీ, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, పంపిణీ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయని ఆయన అన్నారు.
"ప్రపంచంలో అత్యంత యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఉందని, యువత బలమే భారత్ కున్న గొప్ప ఆస్తుల్లో ఒకటి" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ నమ్మకం అన్ని రంగాల్లో, ముఖ్యంగా విదేశాంగ విధానంలో దేశ పురోగతికి మార్గనిర్దేశం చేస్తుందని, యువ భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విదేశాంగ విధానం రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దౌత్యపరమైన ఒప్పందాలు, ప్రపంచ దేశాలతో ఎంఓయూల్లో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు.
ఇటీవల యుకే ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఏఐ, ఫిన్ టెక్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులను పెంచేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. కొన్ని నెలల కిందట భారత్, యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా నూతన అవకాశాలను తీసుకువస్తుందని చెప్పారు. యూరోపియన్ దేశాలతో పెట్టుబడి భాగస్వామ్యాల ద్వారా వేలాదిగా కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. బ్రెజిల్, సింగపూర్, కొరియా, కెనడా వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు.. పెట్టుబడులను పెంచుతాయని, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలకు మద్దతునిస్తాయని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తాయని, ప్రపంచ ప్రాజెక్టుల్లో యువత పనిచేయటానికి కొత్త అవకాశాలు ఏర్పడుతాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఇవాళ మనం చర్చిస్తున్న విజయాలు, లక్ష్యాల కోసం కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత రాబోయే కాలంలో గణనీయంగా సహకరిస్తారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరముందని తెలిపారు. యువ కర్మయోగులు ఈ సంకల్పాన్ని నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో "ఐ-గాట్ కర్మయోగి వేదిక" ఉపయోగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇప్పటికే దాదాపుగా 1.5 కోట్ల మంది ప్రభుత్వోద్యోగులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకున్నారని తెలిపారు. కొత్త ఉద్యోగులు కూడా ఈ వేదికలో చేరాలని ప్రధానమంత్రి ప్రోత్సహించారు. తద్వారా నూతన పని సంస్కృతి, సుపరిపాలన స్ఫూర్తి పెంపొందుతుందన్నారు. కొత్తగా నియమితులైన వారి కృషి ద్వారానే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని, పౌరుల కలలు సాకారమవుతాయని చెప్పారు. నియామక పత్రాలు పొందిన వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ముగించారు.
***
MJPS/SR
(Release ID: 2182247)
Visitor Counter : 14
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam